
గుజరాత్‌లోని స్టేడియాలను పరిశీలిస్తున్న వాణి మోహన్, సిద్థార్థరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: క్రీడా రంగంలో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన, ప్రోత్సాహంతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యదర్శి వాణి మోహన్ అన్నారు. గుజరాత్‌లో జరుగుతున్న 36వ జాతీయ క్రీడలను శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎండీ ప్రభాకర్ రెడ్డితో కలిసి తిలకించారు. అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్ పట్టణాల్లో పర్యటించి క్రీడా మైదానాలు, గ్యాలరీల నిర్మాణం, మల్టీ పర్పస్ స్టేడియాలు, శిక్షణ కేంద్రాలను పరిశీలించారు.
మహాత్మ మందిర్‌లో జూడో, బాక్సింగ్, ఐఐటీ గాంధీనగర్‌లో జరిగిన సాఫ్ట్ బాల్, సబర్మతి రివర్ ఫోర్ట్‌లో జరిగిన కానాయింగ్, సాప్ట్ టెన్నిస్, మల్లకంబ్ క్రీడలను వీక్షించి, క్రీడాకారులను ప్రోత్సహించారు. ఏపీ ప్రభుత్వం క్రీడా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే ఏపీని అంతర్జాతీయ క్రీడా వేదికగా తీర్చిదిద్దుతామని తెలిపారు. శాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు స్పోర్ట్స్ క్లబ్‌లను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. పలువురు జాతీయ పోటీల విజేతలకు మెడల్స్ బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment