ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ఇతర ఉన్నత పాఠశాలల్లో మిగులుగా ఉన్న సబ్జెక్టు టీచర్లను వర్క్ అడ్జస్ట్‌మెంట్ (పని సర్దుబాటు) కింద నియమించేందుకు వీలుకల్పిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జి.వాణీమోహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సబ్జెక్టు టీచర్ల కొరత వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ప్రజాప్రతినిధులు, జిల్లా విద్యాశాఖాధికారులు, కలెక్టర్లు, విద్యాశాఖ కమిషనర్ దృష్టికి పలువురు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. మెజారిటీ జిల్లాల్లో వివిధ కారణాల వల్ల ఈ ఏడాది చెలరేగిన అలజడులు, ఆందోళనలు విద్యాబోధనపై తీవ్ర ప్రభావం చూపాయి.
ఈ నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్న పాఠశాలలకు మిగులు టీచర్లు ఉన్న పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. పని సర్దుబాటుపై ఇతర పాఠశాలల్లో పనిచేసేందుకు నియమించబడే ఉపాధ్యాయులు తమ మాతృ పాఠశాల నుంచే జీతాలు తీసుకుంటారు. వీరంతా సకాలంలో నిర్దేశిత విధానంలో సిలబస్ పూర్తిచేయాలి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా, తరగతి, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల కొరతను గుర్తించాలి. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏయే సబ్జెక్టులకు ఎంతమంది టీచర్లు అవసరమో గుర్తించి సంబంధిత ఉప విద్యాధికారులకు నివేదించాలి.
ఉప విద్యాధికారులు సబ్జెక్టు టీచర్ల కొరత వివరాలను జిల్లా విద్యాశాఖాధికారికి నివేదించాలి. జిల్లా విద్యాశాఖాధికారి కలెక్టర్ అనుమతితో పని సర్దుబాటుపై ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల్లో నియమించాలి. మిగులు ఉపాధ్యాయులను గుర్తించే విషయంలో ఆయా పాఠశాలల్లో బోధనకు ఇబ్బంది కలగకుండా కూడా చూడాలని డెరైక్టర్ ఆదేశించారు.
సర్దుబాటుకు మార్గదర్శకాలు ఇవీ...
= విద్యాహక్కు చట్టం 2009 నిర్దేశించిన ప్రకారం పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఉండేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాలలకు సబ్జెక్టు టీచర్ పోస్టులు మంజూరై ప్రస్తుతం ఖాళీగా ఉంటే వెంటనే ఆ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. పదోన్నతుల ద్వారా భర్తీ కాని సబ్జెక్టు టీచర్ పోస్టులను సర్దుబాటు ద్వారా భర్తీ చేయాలి. పాఠశాలల్లో రెండు కంటే ఎక్కువ పదో తరగతి సెక్షన్లు ఉంటే ఇద్దరు కంటే ఎక్కువ మంది సబ్జెక్టు టీచర్లు పనిచేస్తుంటే వారిలో ఒకరిని సర్దుబాటు చేయాలి. రెండు సెక్షన్లను కలిపివేసి ఒక సబ్జెక్టు టీచరును ఆ పాఠశాలలో కొనసాగించి రెండో టీచర్‌ను అవసరమున్న పాఠశాలకు సర్దుబాటు చేయాలి. పట్టణ ప్రాంతాల్లో, సక్సెస్‌స్కూళ్లలో మిగులు టీచర్లు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకు అవసరమైన వారి కంటే అదనంగా టీచర్లున్నారు.
ఈ పాఠశాలల నుంచి అవసరమున్న పాఠశాలలకు టీచర్లను సర్దుబాటు చేయాలి. ఒక పాఠశాలలో ఒక సబ్జెక్టు టీచర్ కూడా లేకపోతే ఆ మండలంలోనే పొరుగున ఉన్న పాఠశాలలో ఇద్దరు సబ్జెక్టు టీచర్లుంటే వారిలో పదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయుడిని అక్కడే ఉంచి రెండో ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేయాలి. జిల్లాలో కొత్తగా ప్రారంభించిన ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూళ్లు) కూడా ఖాళీగా ఉన్న సబ్జెక్టు టీచర్ పోస్టులను పని సర్దుబాటు చేసే విధానం ద్వారా భర్తీచేసి ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యేవరకు కొనసాగించాలి. ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా పాటించి ఈ నెల 20వ తేదీ నాటికి సబ్జెక్టు టీచర్ల కొరత తీర్చాలి.
కసరత్తు జరుగుతోంది : డీఈఓ రాజేశ్వరరావు
ఉపాధ్యాయుల పని సర్దుబాటు ఉత్తర్వులపై కసరత్తు జరుగుతోంది. ఈ నెల 19న ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఈ విషయం చర్చించి కలెక్టర్ అనుమతితో టీచర్లకు సర్దుబాటు ఉత్తర్వులు జారీ చేస్తాం.