Ongole Town
-
సీఎం అంశంపై టీడీపీ, జనసేన మధ్య బయటపడ్డ విభేదాలు
ఒంగోలు టౌన్: అంగన్వాడీ కార్యకర్తల సాక్షిగా టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. చంద్రబాబు సీఎం అయ్యాక అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అవుతాయని టీడీపీ నేతలు పేర్కొనగా.. జనసేన నాయకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నాయకులు ముందుగానే చంద్రబాబు సీఎం అని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. పవన్‌కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జనసేన నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారని స్పష్టంచేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు మద్దతు తెలిపేందుకు టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ సోమవారం దీక్షా శిబిరం వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా బాలాజీ ప్రసంగిస్తూ.. రానున్న ఎన్నికల తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని, అంగన్వాడీల సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళతానని చెప్పారు. చంద్రబాబే ముఖ్యమంత్రి అని ఎలా చెబుతారు? ఆ తరువాత జనసేన నాయకుడు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికల తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ చెప్పడాన్ని తప్పుపట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఇప్పుడే ఎలా చెబుతారని, ఎన్నికల తరువాత కూటమిలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే వారే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టంచేశారు. 2014లో పవన్ కళ్యాణ్ మద్దతుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చాలా తప్పులు చేశారని, ఇప్పుడు కూడా ఆయన అలాగే తప్పులు చేస్తే పవన్ కళ్యాణ్ సహించరని హెచ్చరించారు. కాగా.. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణమ్మ కూడా నూకసాని బాలాజీ వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు. అంగన్వాడీలకు ఎంత జీతం ఇస్తారో అంకెలతో సహా టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొనాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించడం తాము మరిచిపోలేదని కొందరు అంగన్వాడీలు చెప్పుకోవడం కనిపించింది. జనసేనలో ఆధిపత్య పోరు ఇదే సందర్భంలో జనసేన పార్టీలో ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. అంగన్వాడీలకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మధ్య పోరు మరోసారి రచ్చకెక్కింది. తొలుత జనసేన తరఫున ప్రసంగించడానికి అరుణకు మైకు ఇచ్చారు. అయితే.. ఆమె నుంచి మైకు లాక్కుని రియాజ్‌ను ప్రసంగించాల్సిందిగా కొందరు కార్యకర్తలు కోరారు. రియాజ్ ప్రసంగించిన తరువాత తన అనుచరులతో కలిసి వెళ్లిపోయారు. కాగా.. ఇటీవల ఒంగోలు గద్దలగుంటలో జరిగిన కార్యక్రమంలోనూ రియాజ్, అరుణ వర్గాల మధ్య వివాదం జరిగింది. -
అభాసుపాలైన టీడీపీ
ఒంగోలు సబర్బన్: విధి నిర్వహణలో ఉన్న వీడియోగ్రాఫర్ కం రిపోర్టర్ హఠాన్మరణం చెందిన అంశాన్ని అమరావతి రాజధాని వివాదంలోకి లాగాలని టీడీపీ నాయకులు చేసిన పథక రచన ఆ పార్టీని, నాయకులను అభాసుపాల్జేసింది. సొంత పార్టీ నేతల నుంచే ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు పర్యటనను మొక్కుబడిగా ముగించుకుని తిరుగుముఖం పట్టారు. వివరాల్లోకి వెళ్తే.. టీవీ లైవ్ ప్రోగ్రాం కోసం గురువారం వీడియో తీస్తున్న ఈటీవీ ఒంగోలు టౌన్ విలేకరి వీరగంధం సందీప్ (31) ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు. ఈ ఘటన రాజధాని అమరావతి కోసం చేస్తున్న ర్యాలీలో చోటుచేసుకోవడంతో టీడీపీ తమ్ముళ్లు దీనిని తమ ఉద్యమానికి అనుకూలంగా మలుచుకుందామని స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా ఆగమేఘాల మీద చినబాబు నారా లోకేశ్‌ను శుక్రవారం పిలిపించారు. ఆయనతో పాటు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు కూడా వచ్చారు. రాజధాని ఉద్యమంలో భాగంగా తోపులాట, తొక్కిసలాటలో ఈ దుర్ఘటన జరిగిందని కలరింగ్ ఇచ్చేందుకు యత్నించారు. కానీ, సొంత పార్టీ నేతల నుంచే ఎలాంటి స్పందన లేకపోవటంతో విలేకరి స్వగ్రామం కొప్పోలు వెళ్లి అతనికి నివాళులర్పించారు. అక్కడ మీడియాతో లోకేశ్ మాట్లాడుతూ.. శాంతియుతంగా అమరావతి సాధన జేఏసీ ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులకు, జేఏసీ ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగిందన్నారు. దీంతో విలేకరి సందీప్ ఊపిరాడక మృత్యువాత పడ్డారని చెప్పుకొచ్చారు. ఈ అంశాన్ని లోకేశ్ రాజధాని వివాదంలోకి లాగడం చూసి స్థానికులు, టీడీపీ నేతలు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. కానీ, ఏ విధంగానూ జనస్పందన లేకపోవడంతో వారు అమరావతి సాధన సమితి దీక్షా శిబిరం వద్దకు చేరుకుని సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేసి తిరుగుముఖం పట్టారు. తొక్కిసలాటవల్ల కాదు.. సందీప్ గురువారం వీడియో తీస్తూనే కుప్పకూలిపోయాడని.. అక్కడ ఎలాంటి తోపులాట, తొక్కిసలాట జరగలేదని అదే కార్యక్రమం కవరేజీలో ఉన్న ఇతర మీడియా సహచర రిపోర్టర్లు స్పష్టంచేశారు. సమాచార సేకరణలో భాగంగా ఉదయం నుంచి పలు కార్యక్రమాలను కవర్ చేస్తూనే ఉన్నాడని, సాయంత్రం అమరావతి సాధన సమితి చేపట్టిన ర్యాలీని వీడియో తీస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు వారు చెప్పారు. వెంటనే తాము ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కానీ, అప్పటికే సందీప్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు. -
కంచే చేను మేసింది
సాక్షి, ఒంగోలు టౌన్: పోలీసు కాలనీలో పార్కు కబ్జాకు గురైంది. పోలీసు కాలనీలో పార్కు కబ్జా చేసే ధైర్యం ఎవరికి ఉందా అనే కదా అనుమానం. పోలీసు పార్కును కబ్జాచేసే ధైర్యం పోలీసులకే ఉంటుంది. కొంతమంది పోలీసులు దీనిని అక్షరాలా నిజం చేశారు. పోలీసు పవర్‌ను ఉపయోగించి పార్కు స్థలానికి నకిలీ పత్రాలు పుట్టించారు. అంతటితో ఆగకుండా క్రయవిక్రయాలు కూడా జరిపించేశారు. తాజా మాజీ ఎమ్మెల్యే వారికి వత్తాసు పలకడంతో పోలీసు చక్రం తిప్పేశారు. ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా విలువైన పార్కు స్థలాన్ని యథేచ్ఛగా విక్రయించి తమను ఎవరూ అడ్డుకోలేరంటూ పరోక్ష సంకేతాలు పంపారు. ఇదేదో జిల్లా మారుమూల ప్రాంతంలో జరిగిందనుకుంటే పొరబడినట్టే. ఈ ఘటన సాక్షాత్తు జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో చోటు చేసుకుంది. కన్ను పడింది కబ్జా చేశారు.. ఒంగోలు కర్నూలు రోడ్డు శ్రీరాం కాలనీలో పోలీసు కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కింద 1975వ సంవత్సరంలో 13.45 ఎకరాల భూమిని రైతుల నుంచి కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్నారు. 1280 రూపాయల చొప్పున ఒక్కో ప్లాటును సొసైటీలోని సభ్యులైన పోలీసులు కొనుగోలు చేశారు. అందులో 4 2సెంట్ల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. పోలీసు కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కింద ప్లాట్లు కొనుగోలు చేసినవారు నిదానంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. పోలీసు శాఖకు చెందిన కొంతమంది కన్ను పార్కు కోసం విడిచి పెట్టిన స్థలంపై కన్ను పడింది. పోలీస్.. మాకు అడ్డేముందంటూ పార్కు కోసం కేటాయిచిన స్థలాన్ని కబ్జా చేసేశారు. పార్కు స్థలానికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లను పుట్టించి అడ్డగోలుగా విక్రయించేశారు. 42 సెంట్లలో సగానికిపైగా అక్రమ కట్టడాలు ఉన్నాయి. పోలీసు శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు, వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లోని ఒక కానిస్టేబుల్, తాలూకా పోలీసు స్టేషన్‌లోని ఒక ఏఎస్ఐ కబ్జా బాగోతాన్ని నడిపించారు. దీనంతటిలో ఒక డివిజనల్ పోలీసు అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక రిటైర్డు హెడ్ కానిస్టేబుల్ ఒక సొసైటీని పుట్టించి తాను దానికి ప్రెసిడెంట్‌నంటూ హవా కొనసాగించాడు. అంతేగాకుండా పార్కు స్థలంలో 11 మంది పేర్లు పుట్టించి, వారిలో నలుగురిచేత స్టేటస్ కో కూడా తెప్పించుకునేలా చక్రం తిప్పారు. వత్తాసు పలికిన తాజా మాజీ ఎమ్మెల్యే.. పోలీసు పార్కు స్థలం అన్యాక్రాంతమైన సమయంలో తాజా మాజీ ఎమ్మెల్యే అక్రమార్కులకు వత్తాసు పలికారు. పది మందికి ఉపయోగపడే పార్కు అన్యాక్రాంతమైన విషయాన్ని అప్పటి ఎమ్మెల్యేగా వ్యవహరించిన దామచర్ల జనార్ధనరావు దృష్టికి తీసుకువెళితే ఆయన లైట్‌గా తీసుకోవడం కూడా అక్రమార్కులకు ఊతమిచ్చినట్లయిందని సొసైటీ సభ్యులు వాపోయారు. ఎక్కడైనా చిన్న స్థలం కబ్జాకు గురైతే ఆగమేఘాలమీద స్పందించి యంత్రాంగం రూ.8 కోట్లపైగా విలువైన స్థలం కబ్జాకు గురైతే సంబంధిత అధికారులు నోరు మెదపకపోవడం చూస్తుంటే నాటి అధికారపార్టీ ఏ స్థాయిలో వారికి అనుకూలంగా వ్యవహరించిందో అర్ధం చేసుకోవచ్చు. శ్రీరాం కాలనీకి చెందిన తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకుడు తమ ప్రాంతంలో అన్యాక్రాంతమైన పార్కు విషయమై తాజా మాజీ శాసనసభ్యుడి దృష్టికి తీసుకువస్తే ‘పోలీసుల విషయంలో జోక్యం ఎందుకంటూ’ హెచ్చరించడంతో ఆ పార్టీ డివిజన్ నాయకుడు విస్తుపోయాడు. రెండేళ్ల క్రితం తాలూకా పోలీసు స్టేషన్లో స్థానికంగా ఉండే రిటైర్డు పోలీసు ఫిర్యాదు చేస్తే దామచర్ల ఒత్తిడితో దానిని ఫాల్స్ కేస్‌గా పరిగణనలోకి తీసుకోవడం గమనార్హం. పార్కు గేట్లతో ఆక్రమణ వెలుగులోకి.. పోలీసు హౌసింగ్ సొసైటీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పార్కు కోసం 42 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు నగర పాలక చుట్టూ ప్రహరీ నిర్మించి పార్కు గేట్లను వేసే సమయంలో ఆక్రమణ వెలుగులోకి వచ్చింది. పార్కు స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించే సమయంలో ఆక్రమణలకు గురైనట్లు నిర్ధారించుకున్నారు. పార్కు గేట్లు పెట్టే సమయంలో పార్కు వాస్తవ చిత్రం వెలుగులోకి వచ్చింది. అప్పటికే పార్కును ఆక్రమించుకున్నవారు మరొకరికి, అక్కడ నుంచి మరొకరికి విక్రయించడం జరిగింది. వాస్తవానికి పోలీసు పార్కు అభివృద్ధికి నగర పాలక సంస్థ 9 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. నిర్మాణ పనుల్లో భాగంగా గేట్లు ఏర్పాటు చేసే సమయంలో ఆక్రమణలు ఒకటొకటిగా వెలుగు చూస్తూ సగానికిపైగా కుచించుకుపోయింది. పోలీసు బాస్‌ను పక్కదోవ పట్టించి.. పార్కు విషయంలో ఆక్రమణలకు ఆజ్యం పోసిన ఒక వర్గం పోలీసులు జిల్లా పోలీసు బాస్‌ను సైతం పక్కదోవ పట్టించడం గమనార్హం. పోలీసు హౌసింగ్ సొసైటీకి సంంధించి మామిడిపాలెంలోని సర్వే నంబర్ 122/10లో గత కొంతకాలంగా వివాదం నడుస్తూ పోలీసు శాఖకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎట్టకేలకు ఆ స్థల వివాదం సమసిపోయింది. అదే సమయంలో శ్రీరాంకాలనీలోని పోలీసు సొసైటీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 42 సెంట్లు పార్కు కోసం కేటాయించుకున్నారు. ఈ పార్కులో సగానికిపైగా ఆక్రమించుకున్న ఆక్రమణదారులు జిల్లా పోలీసు బాస్ వద్దకు ఈ పంచాయతీ వచ్చిన సమయంలో, శ్రీకారం కాలనీని కాకుండా మామిడిపాలెంలోని స్థల విషయాన్ని తెలియజేసి వివాదం సద్దుమణిగినట్లుగా జిల్లా పోలీసు బాస్‌నే ట్రాక్ తప్పించారు. పార్కు స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ.. పార్కు ఆక్రమణలకు గురైన విషయాన్ని పోలీసు అధిఆరులను కలిసి నేరుగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపధ్యంలో అక్కడి పరిస్థితులను చూసి పార్కు ఏ స్థాయిలో ఆక్రమణలకు గురైందో నివేదిక అందించాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఏసీపీని ఆశ్రయించారు. ఈ నేపథ్యం ఏసీపీ గురువారం ఆక్రమణలకు గురైన పార్కు స్థలాన్ని పరిశీలించారు. దానికి సంబంధించి లే అవుట్‌ను కూడా గమనించారు. ఇందుకు సంబంధించిన నివేదికను నగర పాలక సంస్థ కమిషనర్‌కు అందించనున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆక్రమణలకు గురైన పార్కు స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి, స్థానిక శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకుంటారని, స్థానికుల అవసరాల కోసం లేఅవుట్ ప్రకారం పార్కు ఉండేలా చర్యలు తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. -
'చంద్రబాబు పచ్చి నియంత'
ఒంగోలు టౌన్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పచ్చి నియంతలా వ్యవహరిస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫూర్ ధ్వజమెత్తారు. తన పార్టీ వారి పట్ల ఒకరకంగా, ప్రతిపక్ష పార్టీలతో ఇంకోలా వ్యవహరిస్తూ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఒంగోలులో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు హాజరైన ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాసనమండలి ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తూ చేయి పట్టుకునే సమయంలో 'డోంట్ టచ్ మీ' అన్నందుకు అట్రాసిటీ కేసు నమోదు చేశారని, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన ముసునూరు తహ శీల్దార్ వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో పాటు అతడి అనుచరులు దాడిచేస్తే, ఆయనపై చర్యలు తీసుకోకపోగా.. ఇసుక అక్రమ రవాణా వద్దకు ఎందుకు వెళ్లావంటూ చంద్రబాబు తహశీల్దార్‌ను ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలపై రోడ్డెక్కితే తొక్కేస్తా అంటూ చంద్రబాబు పదేపదే బెదిరిస్తున్నారని, రాజకీయాల్లో ఉపయోగించని భాషను మాట్లాడుతూ.. భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. గతంలో దేశాన్ని పాలించిన బ్రిటిష్ వాళ్లు ఎన్నడూ తొక్కేస్తానంటూ బెదిరించిన దాఖలాలు లేవని గపూర్ మీడియాతో వివరించారు. -
ఎమ్మెల్సీ స్థానానికి ద్విముఖ పోటీ
నామినేషన్ ఉపసంహరించుకున్న స్వతంత్ర అభ్యర్థి ఒంగోలు టౌన్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ద్విముఖ పోటీ నెలకొంది. జిల్లాలోని ఒక స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుఫున అట్ల చినవెంకటరెడ్డి, తెలుగుదేశం పార్టీ తరుఫున మాగుంట శ్రీనివాసులరెడ్డిలతోపాటు స్వతంత్ర అభ్యర్థిగా అట్ల పెద శ్రీనివాసరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. స్వతంత్ర అభ్యర్థి అట్ల పెద శ్రీనివాసరెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ హరిజవహర్‌లాల్ ప్రకటించారు. జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి 992 మంది ఓటర్లు ఉన్నారు. మునిసిపల్ వార్డు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కో ఆప్షన్ సభ్యులతో కలుపుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం 496 మంది కాగా తెలుగుదేశం పార్టీకి 457 మంది మద్దతు ఉంది. అవసరమైన బలం లేకపోయినా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో టీడీపీ అభ్యర్థిని నిలిపింది. అభ్యర్థులు ఇద్దరూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. -
నష్టం లెక్క తేలింది
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: రబీ సీజన్ ఆరంభంలోనే భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలను వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు తేల్చారు. ఖరీఫ్ పూర్తయి రబీ ప్రారంభంలోనే పై-లీన్ తుఫాన్ వచ్చింది. ఆ వెంటనే అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలు జిల్లాలోని 39 మండలాల్లో వేసిన పంటలను ముంచేశాయి. దీంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలు పూర్తిచేసి మొత్తం రూ 22 కోట్లుగా లెక్క తేల్చారు. పర్చూరు, చీరాల, దర్శి, అద్దంకి, మార్టూరు వ్యవసాయ సబ్డివిజన్లతో పాటు మరికొన్ని మండలాల్లో పంట నష్టం జరిగింది. అధికారులు మొత్తం 37,977 మంది రైతులు సుమారు 23 వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు తేల్చారు. ఎక్కువగా వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి 7133 హెక్టార్లలో, పత్తి 12,900 హెక్టార్లలో, పొగాకు 1387 హెక్టార్లలో, అలసంద 729 హెక్టార్లలో, మొక్కజొన్న 311 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు తేల్చారు. వాటితో పాటు సజ్జ, వేరుశనగ, కందులు, మినుము, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం పంటలు కూడా అక్కడక్కడా దెబ్బతిన్నట్లు అంచనాల్లో చూపించారు. 2010 సంవత్సరం నుంచి మొత్తం 8 సార్లు జరిగిన విపత్తులకు రైతులకు నష్టపరిహారం రావాల్సి ఉంది. నాలుగేళ్లవుతున్నా అంచనాలు ప్రభుత్వానికి చేరాయే కానీ రైతుకు చిల్లిగవ్వ కూడా విదల్చలేదు. ఆ పాత పంట నష్టం బకాయిలు రూ 47.14 కోట్లు ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఇవి కాక అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల నష్టం రూ 22 కోట్లతో కలుపుకొని మొత్తం రూ 69.14 కోట్లు పంట నష్ట పరిహారం రైతులకు అందాల్సి ఉంది. మొత్తం బాధిత రైతులు లక్షా 63 వేల 53 మంది ఉన్నారు. 2010 నవంబర్‌లో వచ్చిన జల్ తుఫాన్‌కు జరిగిన నష్టానికి సంబంధించి ఇంకా 106 మంది రైతులకు రూ 3.58 లక్షలు రావాల్సి ఉంది. 2011లో వచ్చిన కరువు వల్ల 3,505 మంది రైతులకు రూ 1.04 కోట్ల పరిహారం ఇంకా అందలేదు. 2011 ఫిబ్రవరిలో వచ్చిన తుఫాన్ వల్ల నష్టపోయిన 28 మంది రైతులకు రూ 2.13 లక్షలు అందాల్సి ఉంది. 2011 ఏప్రిల్‌లో వచ్చిన కరువుకు 382 మంది రైతులు నష్టపోయిన పంటల పరిహారం రూ 11.47 లక్షలు ఇంకా అందలేదు. 2011 డిసెంబర్ ఆఖరివారంలో వచ్చిన థానే తుఫాన్‌కు 7,992 మంది రైతులు రూ 2.37 కోట్లు నష్టపోయారు. 2011-12లో వచ్చిన కరువు వల్ల జిల్లాలో 8,912 మంది రైతులు నష్టపోగా, నష్టం అంచనాలు రూ 21.24 కోట్లుగా తేల్చారు. 2012 జనవరిలో వచ్చిన భారీ వర్షాలకు 69,034 మంది రైతులు పంటలు నష్టపోగా..రూ 20.32 కోట్ల నష్టం వాటిల్లింది. 2013 ఫిబ్రవరిలో వచ్చిన భారీ వర్షాలకు 2,240 మంది రైతులు రూ 1.33 కోట్ల మేర పంటలు నష్టపోయారు. అయితే 2012 నవంబర్‌లో వచ్చిన నీలం తుఫాన్‌కు నష్టపోయిన రైతులకు కొంత మందికి నష్టపరిహారమిచ్చారు. ఇంకా 1315 మంది రైతులకు రూ 65.63 లక్షలు ఇవ్వాల్సి ఉంది. -
ఎదురుచూపులు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా ఉంది జిల్లాలోని పేద విద్యార్థుల దుస్థితి. విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు పంపిణీ చేసేందుకు ఏడాదిన్నర క్రితం నిధులు మంజూరైనా నేటికీ ఆ నిధులు పాఠశాలల ఖాతాలకు జమ కాలేదు. రాజీవ్ విద్యామిషన్ నిర్వాకంతో జిల్లాలో 2012-13 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూనిఫాంల పంపిణీ వ్యవహారం నేటికీ ఒక కొలిక్కిరాలేదు. ఇప్పటికీ ఇంకా జిల్లాలో 444 పాఠశాలలకు అసలు యూనిఫాం వస్త్రం కొనుగోలుకు సంబంధించిన నిధులు రాజీవ్ విద్యామిషన్ నుంచి విడుదల కాలేదు. అంటే సుమారు 39 వేల మంది విద్యార్థులకు రూ 1,23,33,675 నేటికీ చేరలేదు. అదేవిధంగా 13 మండల్లాలోని 315 పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాంలు కుట్టుకూలి చార్జీలు రూ 22,44,000 ఇప్పటికీ పాఠశాల జీతాల ఖాతాలకు జమ కాలేదు. తాజా అంచనా ప్రకారం జిల్లాలో ఇప్పటికీ ఇంకా సుమారు 39 వేల మందికి యూనిఫాంలు అందలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తేటతెల్లమవుతోంది. ప్రభుత్వ రంగ పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రభుత్వం 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు రెండు జతల యూనిఫాంలు ఉచితంగా పంపిణీ చేయాలని సంకల్పించి ఆ మేరకు నిధులు విడుదల చేస్తోంది. ఒక్కో యూనిఫాంరూ 200 చొప్పున ప్రతి విద్యార్థికి రెండు జతల కోసం రూ 400 విడుదల చేస్తోంది. ఈ మొత్తంలో వస్త్రం కొనుగోలుకు రూ 160, యూనిఫాం కుట్టినందుకు రూ 40 కుట్టుకూలి కింద విడుదల చేస్తున్నారు. అయితే ఏ ముహూర్తాన యూనిఫాంలు ఉచితంగా పంపిణీ చేయడానికి నిర్ణయించారో గానీ విద్యార్థులకు ఏనాడూ విద్యా సంవత్సరం ఆరంభంలో పంపిణీ చేసిన దాఖలాలేదు. అధికారుల కాసుల కక్కుర్తి విద్యార్థులకు శాపంగా మారింది. విద్యార్థులకు క్షేత్రస్థాయిలో పాఠశాలల యాజమాన్య కమిటీలు వస్త్రం కొనుగోలు చేసి యూనిఫాంలు కుట్టించాల్సి ఉండగా వారు పట్టించుకోకపోవడంతో రాష్ట్రస్థాయిలోనే లాలూచి వ్యవహారాలు మొదలయ్యాయి. ప్రభుత్వ పెద్దలే వివిధ సంస్థలతో లాలూచి పడి ఆ సంస్థల నుంచే యూనిఫాంలు కొనుగోలు చేయాలని తీర్మానాలు జారీ చేస్తుండడంతో విద్యార్థులకు నాణ్యతలేని యూనిఫాంలే దిక్కవుతున్నాయి. గత ఏడాది జరిగిందిదీ.. జిల్లాలో 2012-13 విద్యా సంవత్సరంలో 2,56,151 మందికి 10.24 కోట్ల రూపాయలతో రెండు జతల యూనిఫాంలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ యూనిఫాంలు ఇస్తారు. ఎస్సీ బాలురు 42,564 మంది, ఎస్టీ బాలురు 8,654, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలురు 6,976 మందికి యూనిఫాంలు అందించాలని నిర్ణయించారు. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం లభించింది. అయితే అన్ని పాఠశాలలకు యూనిఫాంల నిధులు విడుదల కాలేదు. గత సంవత్సరం పాఠశాలలకు నిధుల విడుదల బాధ్యత జిల్లా ప్రాజెక్టు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ కార్యాలయం స్వీకరించింది. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలోని పాఠశాలల యాజమాన్య కమిటీల బ్యాంకు ఖాతాల వివరాలను రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ కార్యాలయానికి పంపించారు. హైదరాబాద్‌లోని రాజీవ్ విద్యామిషన్ ఎస్పీడీ కార్యాలయం నిధుల విడుదలలో జరిగిన జాప్యంతో 444 పాఠశాలల విద్యార్థులకు నేటికీ యూనిఫాంలు అందలేదు. ఈ పాఠశాలల్లో మొత్తం సుమారు 39 వేల మందికి రూ 1,23,33,635 నేటికీ విడుదల కాలేదు. యూనిఫాంల కోసం ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు నిరాశే మిగిలింది. కుట్టుకూలి చార్జీలు కూడా.. జిల్లాలోని 444 పాఠశాలలకు యూనిఫాం వస్త్రం కొనుగోలుకు నిధులు విడుదల చేయకుండా తమ చేతకానితనాన్ని బయట పెట్టుకున్న అధికారులు 315 పాఠశాలల్లోని 28,046 మంది విద్యార్థులకు కుట్టుకూలి చార్జీలు కూడా విడుదల చేయలేదు. దొనకొండ మండలంలోని 69 పాఠశాలలకు రూ 4.27 లక్షలు, సంతమాగులూరు మండలంలోని 52 స్కూళ్లకు రూ 4.60 లక్షలు, చినగంజాం మండలంలోని 18 పాఠశాలలకు రూ 1.51 లక్షలు, వేటపాలెంలోని 48 పాఠశాలలకు రూ 3.99 లక్షలు, త్రిపురాంతకంలోని 11 పాఠశాలలకు రూ 1.22 లక్షలు, యర్రగొండపాలెంలోని 25 పాఠశాలలకు రూ 33,440, పెద్దారవీడు మండలంలోని 4 పాఠశాలలకు రూ 58,640, హనుమంతునిపాడు, కనిగిరి, మద్దిపాడు, మార్కాపురం తదితర మండలాలకు ఒక్కోదానికి 10 వేల రూపాయలలోపు విడుదల చేయాల్సి ఉంది. అధికారులు ఇప్పటికైనా పాఠశాలలకు యూనిఫాం నిధులు విడుదల చేసి పేద పిల్లలకు యూనిఫాంలు అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
తీరనున్న సబ్జెక్టు టీచర్ల కొరత
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ఇతర ఉన్నత పాఠశాలల్లో మిగులుగా ఉన్న సబ్జెక్టు టీచర్లను వర్క్ అడ్జస్ట్మెంట్ (పని సర్దుబాటు) కింద నియమించేందుకు వీలుకల్పిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జి.వాణీమోహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సబ్జెక్టు టీచర్ల కొరత వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ప్రజాప్రతినిధులు, జిల్లా విద్యాశాఖాధికారులు, కలెక్టర్లు, విద్యాశాఖ కమిషనర్ దృష్టికి పలువురు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. మెజారిటీ జిల్లాల్లో వివిధ కారణాల వల్ల ఈ ఏడాది చెలరేగిన అలజడులు, ఆందోళనలు విద్యాబోధనపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్న పాఠశాలలకు మిగులు టీచర్లు ఉన్న పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. పని సర్దుబాటుపై ఇతర పాఠశాలల్లో పనిచేసేందుకు నియమించబడే ఉపాధ్యాయులు తమ మాతృ పాఠశాల నుంచే జీతాలు తీసుకుంటారు. వీరంతా సకాలంలో నిర్దేశిత విధానంలో సిలబస్ పూర్తిచేయాలి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా, తరగతి, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల కొరతను గుర్తించాలి. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏయే సబ్జెక్టులకు ఎంతమంది టీచర్లు అవసరమో గుర్తించి సంబంధిత ఉప విద్యాధికారులకు నివేదించాలి. ఉప విద్యాధికారులు సబ్జెక్టు టీచర్ల కొరత వివరాలను జిల్లా విద్యాశాఖాధికారికి నివేదించాలి. జిల్లా విద్యాశాఖాధికారి కలెక్టర్ అనుమతితో పని సర్దుబాటుపై ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల్లో నియమించాలి. మిగులు ఉపాధ్యాయులను గుర్తించే విషయంలో ఆయా పాఠశాలల్లో బోధనకు ఇబ్బంది కలగకుండా కూడా చూడాలని డెరైక్టర్ ఆదేశించారు. సర్దుబాటుకు మార్గదర్శకాలు ఇవీ... = విద్యాహక్కు చట్టం 2009 నిర్దేశించిన ప్రకారం పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఉండేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాలలకు సబ్జెక్టు టీచర్ పోస్టులు మంజూరై ప్రస్తుతం ఖాళీగా ఉంటే వెంటనే ఆ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. పదోన్నతుల ద్వారా భర్తీ కాని సబ్జెక్టు టీచర్ పోస్టులను సర్దుబాటు ద్వారా భర్తీ చేయాలి. పాఠశాలల్లో రెండు కంటే ఎక్కువ పదో తరగతి సెక్షన్లు ఉంటే ఇద్దరు కంటే ఎక్కువ మంది సబ్జెక్టు టీచర్లు పనిచేస్తుంటే వారిలో ఒకరిని సర్దుబాటు చేయాలి. రెండు సెక్షన్లను కలిపివేసి ఒక సబ్జెక్టు టీచరును ఆ పాఠశాలలో కొనసాగించి రెండో టీచర్‌ను అవసరమున్న పాఠశాలకు సర్దుబాటు చేయాలి. పట్టణ ప్రాంతాల్లో, సక్సెస్‌స్కూళ్లలో మిగులు టీచర్లు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకు అవసరమైన వారి కంటే అదనంగా టీచర్లున్నారు. ఈ పాఠశాలల నుంచి అవసరమున్న పాఠశాలలకు టీచర్లను సర్దుబాటు చేయాలి. ఒక పాఠశాలలో ఒక సబ్జెక్టు టీచర్ కూడా లేకపోతే ఆ మండలంలోనే పొరుగున ఉన్న పాఠశాలలో ఇద్దరు సబ్జెక్టు టీచర్లుంటే వారిలో పదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయుడిని అక్కడే ఉంచి రెండో ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేయాలి. జిల్లాలో కొత్తగా ప్రారంభించిన ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూళ్లు) కూడా ఖాళీగా ఉన్న సబ్జెక్టు టీచర్ పోస్టులను పని సర్దుబాటు చేసే విధానం ద్వారా భర్తీచేసి ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యేవరకు కొనసాగించాలి. ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా పాటించి ఈ నెల 20వ తేదీ నాటికి సబ్జెక్టు టీచర్ల కొరత తీర్చాలి. కసరత్తు జరుగుతోంది : డీఈఓ రాజేశ్వరరావు ఉపాధ్యాయుల పని సర్దుబాటు ఉత్తర్వులపై కసరత్తు జరుగుతోంది. ఈ నెల 19న ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఈ విషయం చర్చించి కలెక్టర్ అనుమతితో టీచర్లకు సర్దుబాటు ఉత్తర్వులు జారీ చేస్తాం. -
పట్టు వదలం.. 71వ రోజుకు చేరిన ఉద్యమం
జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ హోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఉద్యమం ప్రారంభమై 71 రోజులు గడిచినా రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ముందుకు సాగుతున్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మె ఆపేది లేదని, వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం కూడా ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. ఉద్యోగులు వరుసగా రెండో రోజు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌ల కార్యకలాపాలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఎన్జీఓ ఉద్యమ కార్యాచరణలో భాగంగా వరుసగా రెండో రోజు ఒంగోలు నగరంలో బీఎస్ఎన్ఎల్, పోస్టాఫీసులు, ఎల్ఐసీ, బ్యాంక్శాఖలను మూయించారు. ఉద్యోగులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక స్థానిక కలెక్టరేట్ వద్ద టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా... అద్దంకిలో రెండో రోజూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూత పడ్డాయి. ఈ సందర్భంగా ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ వ్యవహరించిన తీరుకు నిరసనగా ఉద్యోగులు బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలో టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పంగులూరులో జేఏసీ నాయకులు కేంద్రప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. చీరాలలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు, మున్సిపల్ ఉద్యోగులు రిలే దీక్షలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న నిరవధిక దీక్షకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు సాగుతున్నాయి. వేటపాలెంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. కారంచేడులో ఎన్జీఓల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. దర్శిలోనూ రెండో రోజు కేంద్ర కార్యాలయాలు, బ్యాంక్‌లను అడ్డుకున్నారు. ఈ సంద ర్భంగా ఉద్యోగులు అంబేద్కర్, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. గిద్దలూరులో రాష్ట్ర విభజన నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జగన్మోహన్రెడ్డి దీక్షలకు మద్దతుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు 5వ రోజుకు చేరాయి. పట్టణంలోని ముస్లింలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జేఏసీ దీక్షా శిబిరంలో శ్రీసాయిశ్రీ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు రిలే నిరాహార దీక్షలు చేశారు. 23 మంది విద్యార్థినులు దీక్షల్లో కూర్చున్నారు. అంతకు ముందు వైఎస్సార్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి నిరసనలు తెలిపారు. కంభంలో వైఎస్సార్ సీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాచర్లలో భవన నిర్మాణ కార్మికులు రాస్తారోకో చేశారు. మెడకు ఉరితాళ్లతో నిరసన కనిగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మెడకు ఉరితాళ్లు వేసుకొని నిరసన తెలిపారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వైద్యశాఖ ఉద్యోగులు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. మార్కాపురంలోనూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లను మూయించారు. ఉద్యోగులు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించి గొడుగులతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. యర్రగొండపాలెంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి, మానవహారం ఏర్పాటు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తామని ఉద్యోగులు తేల్చి చెప్తున్నారు.