ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా ఉంది జిల్లాలోని పేద విద్యార్థుల దుస్థితి. విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు పంపిణీ చేసేందుకు ఏడాదిన్నర క్రితం నిధులు మంజూరైనా నేటికీ ఆ నిధులు పాఠశాలల ఖాతాలకు జమ కాలేదు. రాజీవ్ విద్యామిషన్ నిర్వాకంతో జిల్లాలో 2012-13 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూనిఫాంల పంపిణీ వ్యవహారం నేటికీ ఒక కొలిక్కిరాలేదు. ఇప్పటికీ ఇంకా జిల్లాలో 444 పాఠశాలలకు అసలు యూనిఫాం వస్త్రం కొనుగోలుకు సంబంధించిన నిధులు రాజీవ్ విద్యామిషన్ నుంచి విడుదల కాలేదు. అంటే సుమారు 39 వేల మంది విద్యార్థులకు రూ 1,23,33,675 నేటికీ చేరలేదు.
అదేవిధంగా 13 మండల్లాలోని 315 పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాంలు కుట్టుకూలి చార్జీలు రూ 22,44,000 ఇప్పటికీ పాఠశాల జీతాల ఖాతాలకు జమ కాలేదు. తాజా అంచనా ప్రకారం జిల్లాలో ఇప్పటికీ ఇంకా సుమారు 39 వేల మందికి యూనిఫాంలు అందలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తేటతెల్లమవుతోంది.
ప్రభుత్వ రంగ పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రభుత్వం 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు రెండు జతల యూనిఫాంలు ఉచితంగా పంపిణీ చేయాలని సంకల్పించి ఆ మేరకు నిధులు విడుదల చేస్తోంది. ఒక్కో యూనిఫాంరూ 200 చొప్పున ప్రతి విద్యార్థికి రెండు జతల కోసం రూ 400 విడుదల చేస్తోంది. ఈ మొత్తంలో వస్త్రం కొనుగోలుకు రూ 160, యూనిఫాం కుట్టినందుకు రూ 40 కుట్టుకూలి కింద విడుదల చేస్తున్నారు.
అయితే ఏ ముహూర్తాన యూనిఫాంలు ఉచితంగా పంపిణీ చేయడానికి నిర్ణయించారో గానీ విద్యార్థులకు ఏనాడూ విద్యా సంవత్సరం ఆరంభంలో పంపిణీ చేసిన దాఖలాలేదు. అధికారుల కాసుల కక్కుర్తి విద్యార్థులకు శాపంగా మారింది. విద్యార్థులకు క్షేత్రస్థాయిలో పాఠశాలల యాజమాన్య కమిటీలు వస్త్రం కొనుగోలు చేసి యూనిఫాంలు కుట్టించాల్సి ఉండగా వారు పట్టించుకోకపోవడంతో రాష్ట్రస్థాయిలోనే లాలూచి వ్యవహారాలు మొదలయ్యాయి. ప్రభుత్వ పెద్దలే వివిధ సంస్థలతో లాలూచి పడి ఆ సంస్థల నుంచే యూనిఫాంలు కొనుగోలు చేయాలని తీర్మానాలు జారీ చేస్తుండడంతో విద్యార్థులకు నాణ్యతలేని యూనిఫాంలే దిక్కవుతున్నాయి.
గత ఏడాది జరిగిందిదీ..
జిల్లాలో 2012-13 విద్యా సంవత్సరంలో 2,56,151 మందికి 10.24 కోట్ల రూపాయలతో రెండు జతల యూనిఫాంలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ యూనిఫాంలు ఇస్తారు. ఎస్సీ బాలురు 42,564 మంది, ఎస్టీ బాలురు 8,654, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలురు 6,976 మందికి యూనిఫాంలు అందించాలని నిర్ణయించారు. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం లభించింది. అయితే అన్ని పాఠశాలలకు యూనిఫాంల నిధులు విడుదల కాలేదు.
గత సంవత్సరం పాఠశాలలకు నిధుల విడుదల బాధ్యత జిల్లా ప్రాజెక్టు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ కార్యాలయం స్వీకరించింది. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలోని పాఠశాలల యాజమాన్య కమిటీల బ్యాంకు ఖాతాల వివరాలను రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ కార్యాలయానికి పంపించారు. హైదరాబాద్‌లోని రాజీవ్ విద్యామిషన్ ఎస్‌పీడీ కార్యాలయం నిధుల విడుదలలో జరిగిన జాప్యంతో 444 పాఠశాలల విద్యార్థులకు నేటికీ యూనిఫాంలు అందలేదు. ఈ పాఠశాలల్లో మొత్తం సుమారు 39 వేల మందికి రూ 1,23,33,635 నేటికీ విడుదల కాలేదు. యూనిఫాంల కోసం ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు నిరాశే మిగిలింది.
కుట్టుకూలి చార్జీలు కూడా..
జిల్లాలోని 444 పాఠశాలలకు యూనిఫాం వస్త్రం కొనుగోలుకు నిధులు విడుదల చేయకుండా తమ చేతకానితనాన్ని బయట పెట్టుకున్న అధికారులు 315 పాఠశాలల్లోని 28,046 మంది విద్యార్థులకు కుట్టుకూలి చార్జీలు కూడా విడుదల చేయలేదు. దొనకొండ మండలంలోని 69 పాఠశాలలకు రూ 4.27 లక్షలు, సంతమాగులూరు మండలంలోని 52 స్కూళ్లకు రూ 4.60 లక్షలు, చినగంజాం మండలంలోని 18 పాఠశాలలకు రూ 1.51 లక్షలు, వేటపాలెంలోని 48 పాఠశాలలకు రూ 3.99 లక్షలు, త్రిపురాంతకంలోని 11 పాఠశాలలకు రూ 1.22 లక్షలు, యర్రగొండపాలెంలోని 25 పాఠశాలలకు రూ 33,440, పెద్దారవీడు మండలంలోని 4 పాఠశాలలకు రూ 58,640, హనుమంతునిపాడు, కనిగిరి, మద్దిపాడు, మార్కాపురం తదితర మండలాలకు ఒక్కోదానికి 10 వేల రూపాయలలోపు విడుదల చేయాల్సి ఉంది. అధికారులు ఇప్పటికైనా పాఠశాలలకు యూనిఫాం నిధులు విడుదల చేసి పేద పిల్లలకు యూనిఫాంలు అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.