ఒంగోలు శ్రీరాం కాలనీలోని పోలీసు సొసైటీకి చెందిన పార్కు
సాక్షి, ఒంగోలు టౌన్: పోలీసు కాలనీలో పార్కు కబ్జాకు గురైంది. పోలీసు కాలనీలో పార్కు కబ్జా చేసే ధైర్యం ఎవరికి ఉందా అనే కదా అనుమానం. పోలీసు పార్కును కబ్జాచేసే ధైర్యం పోలీసులకే ఉంటుంది. కొంతమంది పోలీసులు దీనిని అక్షరాలా నిజం చేశారు. పోలీసు పవర్‌ను ఉపయోగించి పార్కు స్థలానికి నకిలీ పత్రాలు పుట్టించారు. అంతటితో ఆగకుండా క్రయవిక్రయాలు కూడా జరిపించేశారు. తాజా మాజీ ఎమ్మెల్యే వారికి వత్తాసు పలకడంతో పోలీసు చక్రం తిప్పేశారు. ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా విలువైన పార్కు స్థలాన్ని యథేచ్ఛగా విక్రయించి తమను ఎవరూ అడ్డుకోలేరంటూ పరోక్ష సంకేతాలు పంపారు. ఇదేదో జిల్లా మారుమూల ప్రాంతంలో జరిగిందనుకుంటే పొరబడినట్టే. ఈ ఘటన సాక్షాత్తు జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో చోటు చేసుకుంది.
కన్ను పడింది కబ్జా చేశారు..
ఒంగోలు కర్నూలు రోడ్డు శ్రీరాం కాలనీలో పోలీసు కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కింద 1975వ సంవత్సరంలో 13.45 ఎకరాల భూమిని రైతుల నుంచి కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్నారు. 1280 రూపాయల చొప్పున ఒక్కో ప్లాటును సొసైటీలోని సభ్యులైన పోలీసులు కొనుగోలు చేశారు. అందులో 4 2సెంట్ల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. పోలీసు కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కింద ప్లాట్లు కొనుగోలు చేసినవారు నిదానంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. పోలీసు శాఖకు చెందిన కొంతమంది కన్ను పార్కు కోసం విడిచి పెట్టిన స్థలంపై కన్ను పడింది. పోలీస్.. మాకు అడ్డేముందంటూ పార్కు కోసం కేటాయిచిన స్థలాన్ని కబ్జా చేసేశారు.
పార్కు స్థలానికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లను పుట్టించి అడ్డగోలుగా విక్రయించేశారు. 42 సెంట్లలో సగానికిపైగా అక్రమ కట్టడాలు ఉన్నాయి. పోలీసు శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు, వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లోని ఒక కానిస్టేబుల్, తాలూకా పోలీసు స్టేషన్‌లోని ఒక ఏఎస్‌ఐ కబ్జా బాగోతాన్ని నడిపించారు. దీనంతటిలో ఒక డివిజనల్ పోలీసు అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక రిటైర్డు హెడ్ కానిస్టేబుల్ ఒక సొసైటీని పుట్టించి తాను దానికి ప్రెసిడెంట్‌నంటూ హవా కొనసాగించాడు. అంతేగాకుండా పార్కు స్థలంలో 11 మంది పేర్లు పుట్టించి, వారిలో నలుగురిచేత స్టేటస్ కో కూడా తెప్పించుకునేలా చక్రం తిప్పారు.
వత్తాసు పలికిన తాజా మాజీ ఎమ్మెల్యే..
పోలీసు పార్కు స్థలం అన్యాక్రాంతమైన సమయంలో తాజా మాజీ ఎమ్మెల్యే అక్రమార్కులకు వత్తాసు పలికారు. పది మందికి ఉపయోగపడే పార్కు అన్యాక్రాంతమైన విషయాన్ని అప్పటి ఎమ్మెల్యేగా వ్యవహరించిన దామచర్ల జనార్ధనరావు దృష్టికి తీసుకువెళితే ఆయన లైట్‌గా తీసుకోవడం కూడా అక్రమార్కులకు ఊతమిచ్చినట్లయిందని సొసైటీ సభ్యులు వాపోయారు. ఎక్కడైనా చిన్న స్థలం కబ్జాకు గురైతే ఆగమేఘాలమీద స్పందించి యంత్రాంగం రూ.8 కోట్లపైగా విలువైన స్థలం కబ్జాకు గురైతే సంబంధిత అధికారులు నోరు మెదపకపోవడం చూస్తుంటే నాటి అధికారపార్టీ ఏ స్థాయిలో వారికి అనుకూలంగా వ్యవహరించిందో అర్ధం చేసుకోవచ్చు. శ్రీరాం కాలనీకి చెందిన తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకుడు తమ ప్రాంతంలో అన్యాక్రాంతమైన పార్కు విషయమై తాజా మాజీ శాసనసభ్యుడి దృష్టికి తీసుకువస్తే ‘పోలీసుల విషయంలో జోక్యం ఎందుకంటూ’ హెచ్చరించడంతో ఆ పార్టీ డివిజన్ నాయకుడు విస్తుపోయాడు. రెండేళ్ల క్రితం తాలూకా పోలీసు స్టేషన్‌లో స్థానికంగా ఉండే రిటైర్డు పోలీసు ఫిర్యాదు చేస్తే దామచర్ల ఒత్తిడితో దానిని ఫాల్స్ కేస్‌గా పరిగణనలోకి తీసుకోవడం గమనార్హం.
పార్కు గేట్లతో ఆక్రమణ వెలుగులోకి..
పోలీసు హౌసింగ్ సొసైటీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పార్కు కోసం 42 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు నగర పాలక చుట్టూ ప్రహరీ నిర్మించి పార్కు గేట్లను వేసే సమయంలో ఆక్రమణ వెలుగులోకి వచ్చింది. పార్కు స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించే సమయంలో ఆక్రమణలకు గురైనట్లు నిర్ధారించుకున్నారు. పార్కు గేట్లు పెట్టే సమయంలో పార్కు వాస్తవ చిత్రం వెలుగులోకి వచ్చింది. అప్పటికే పార్కును ఆక్రమించుకున్నవారు మరొకరికి, అక్కడ నుంచి మరొకరికి విక్రయించడం జరిగింది. వాస్తవానికి పోలీసు పార్కు అభివృద్ధికి నగర పాలక సంస్థ 9 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. నిర్మాణ పనుల్లో భాగంగా గేట్లు ఏర్పాటు చేసే సమయంలో ఆక్రమణలు ఒకటొకటిగా వెలుగు చూస్తూ సగానికిపైగా కుచించుకుపోయింది.
పోలీసు బాస్‌ను పక్కదోవ పట్టించి..
పార్కు విషయంలో ఆక్రమణలకు ఆజ్యం పోసిన ఒక వర్గం పోలీసులు జిల్లా పోలీసు బాస్‌ను సైతం పక్కదోవ పట్టించడం గమనార్హం. పోలీసు హౌసింగ్ సొసైటీకి సంంధించి మామిడిపాలెంలోని సర్వే నంబర్ 122/10లో గత కొంతకాలంగా వివాదం నడుస్తూ పోలీసు శాఖకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎట్టకేలకు ఆ స్థల వివాదం సమసిపోయింది. అదే సమయంలో శ్రీరాంకాలనీలోని పోలీసు సొసైటీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 42 సెంట్లు పార్కు కోసం కేటాయించుకున్నారు. ఈ పార్కులో సగానికిపైగా ఆక్రమించుకున్న ఆక్రమణదారులు జిల్లా పోలీసు బాస్ వద్దకు ఈ పంచాయతీ వచ్చిన సమయంలో, శ్రీకారం కాలనీని కాకుండా మామిడిపాలెంలోని స్థల విషయాన్ని తెలియజేసి వివాదం సద్దుమణిగినట్లుగా జిల్లా పోలీసు బాస్‌నే ట్రాక్ తప్పించారు.
పార్కు స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ..
పార్కు ఆక్రమణలకు గురైన విషయాన్ని పోలీసు అధిఆరులను కలిసి నేరుగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపధ్యంలో అక్కడి పరిస్థితులను చూసి పార్కు ఏ స్థాయిలో ఆక్రమణలకు గురైందో నివేదిక అందించాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఏసీపీని ఆశ్రయించారు. ఈ నేపథ్యం ఏసీపీ గురువారం ఆక్రమణలకు గురైన పార్కు స్థలాన్ని పరిశీలించారు. దానికి సంబంధించి లే అవుట్‌ను కూడా గమనించారు. ఇందుకు సంబంధించిన నివేదికను నగర పాలక సంస్థ కమిషనర్‌కు అందించనున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆక్రమణలకు గురైన పార్కు స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి, స్థానిక శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకుంటారని, స్థానికుల అవసరాల కోసం లేఅవుట్ ప్రకారం పార్కు ఉండేలా చర్యలు తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment