సాక్షి ప్రతినిధి, ఒంగోలు: యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించాల్సిన టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సన్మాన కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అడ్డు పడ్డారు. ఇది యాదవ సంఘం నేతలు.. ఎమ్మెల్యే జనార్దన్ మధ్య మరింత వివాదాన్ని పెంచింది. దామచర్ల తీరుపై యాదవులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే పట్టుబట్టి సన్మానం జరగకుండా అడ్డుపడ్డారని యాదవ సంఘం నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సన్మాన కార్యక్రమానికి రావద్దదంటూ ఎమ్మెల్యే సూచించడంతోనే టీటీడీ చైర్మన్ సన్మానం నిలిచి పోయిందని యాదవ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపెచ్చు వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉన్న యాదవ సంఘం నేతలు జడా బాలనాగేంద్రం, జమ్ము రత్తయ్య తదితరులు టీడీపీలో చేరితేనే టీటీడీ చైర్మన్ సన్మాన కార్యక్రమానికి అనుమతిస్తానని ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారని ఆ సంఘం నేతలు పేర్కొంటుండగా బాలనాగేంద్రం, రత్తయ్యలు కూడా నిర్ధారించడం గమనార్హం. టీటీడీ చైర్మన్‌గా ఎన్నికైన సుధాకర్ యాదవ్‌ను సన్మానించాలని జిల్లాకు చెందిన యాదవ సంఘం నేతలు సిద్ధమయ్యారు.
ఈ నెల 22వ తేదీ ఆదివారం సన్మాన కార్యక్రమాన్ని ఒంగోలులో ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా తిరిగి పార్టీలు, రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలను సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించారు. సన్మానాన్ని ఆర్భాటంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో టీటీడీ చైర్మన్ సన్మాన కార్యక్రమంలో ఎక్కువ శాతం మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఉన్నట్లు గుర్తించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కార్యక్రమం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరుగుతోందని, దానికి ఎలా వస్తారంటూ టీటీడీ ఛైర్మన్ సుధాకర్ యాదవ్‌ను ఎమ్మెల్యే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఒకే అంటేనే తాను సన్మానానికి వస్తానంటూ టీటీడీ చైర్మన్ యాదవ్ సంఘం నేతలకు స్పష్టం చేశారు. దీంతో యాదవ సంఘం నేతలు జడా బాలనాగేంద్రం, జమ్ము రత్తయ్య తదితరులు ఎమ్మెల్యే జనార్దన్‌ను సంప్రదించారు.
మీరు టీడీపీలో చేరితేనే కార్యక్రమాన్ని జరుపుదామని, ప్రస్తుతం ఈ సన్మాన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని ఎమ్మెల్యే సూచించినట్లు యాదవ సంఘం నేతలు తెలిపారు. అంతేకాకుండా సమావేశం టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిర్వహించాలని, సన్మాన కార్యక్రమానికి తానే అధ్యక్షత వహిస్తానని ఎమ్మెల్యే చెప్పినట్లు నేతలు చెబుతున్నారు. అయితే పార్టీలకతీతంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున ఎమ్మెల్యే హోదాలో మీరు అధ్యక్షత వహించడం కుదరదని, మొత్తం కార్యక్రమం యాదవ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుందని, మిగిలిన ప్రజా ప్రతినిధులు, నేతలు అతిథులుగానే వచ్చి వెళ్తారని యాదవ సంఘం నేతలు ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు. ఇందుకు ఎమ్మెల్యే ససేమిరా అన్నట్లు యాదవ సంఘం నేతలు ‘సాక్షి’కి తెలిపారు. దీంతో సన్మాన కార్యక్రమం నిలిచి పోయిందని, ఎమ్మెల్యే పట్టుబట్టి సన్మానాన్ని ఆపించారని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ సన్మాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడడం సరికాదని యాదవ సంఘ నాయకులు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment