Yadava community leaders
-
వైఎస్ జగన్‌ను కలిసిన యాదవ సంఘాల నాయకులు
-
ఎమ్మెల్యే vs యాదవ సంఘం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించాల్సిన టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సన్మాన కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అడ్డు పడ్డారు. ఇది యాదవ సంఘం నేతలు.. ఎమ్మెల్యే జనార్దన్ మధ్య మరింత వివాదాన్ని పెంచింది. దామచర్ల తీరుపై యాదవులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే పట్టుబట్టి సన్మానం జరగకుండా అడ్డుపడ్డారని యాదవ సంఘం నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సన్మాన కార్యక్రమానికి రావద్దదంటూ ఎమ్మెల్యే సూచించడంతోనే టీటీడీ చైర్మన్ సన్మానం నిలిచి పోయిందని యాదవ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపెచ్చు వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉన్న యాదవ సంఘం నేతలు జడా బాలనాగేంద్రం, జమ్ము రత్తయ్య తదితరులు టీడీపీలో చేరితేనే టీటీడీ చైర్మన్ సన్మాన కార్యక్రమానికి అనుమతిస్తానని ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారని ఆ సంఘం నేతలు పేర్కొంటుండగా బాలనాగేంద్రం, రత్తయ్యలు కూడా నిర్ధారించడం గమనార్హం. టీటీడీ చైర్మన్‌గా ఎన్నికైన సుధాకర్ యాదవ్‌ను సన్మానించాలని జిల్లాకు చెందిన యాదవ సంఘం నేతలు సిద్ధమయ్యారు. ఈ నెల 22వ తేదీ ఆదివారం సన్మాన కార్యక్రమాన్ని ఒంగోలులో ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా తిరిగి పార్టీలు, రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలను సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించారు. సన్మానాన్ని ఆర్భాటంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో టీటీడీ చైర్మన్ సన్మాన కార్యక్రమంలో ఎక్కువ శాతం మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఉన్నట్లు గుర్తించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కార్యక్రమం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరుగుతోందని, దానికి ఎలా వస్తారంటూ టీటీడీ ఛైర్మన్ సుధాకర్ యాదవ్‌ను ఎమ్మెల్యే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఒకే అంటేనే తాను సన్మానానికి వస్తానంటూ టీటీడీ చైర్మన్ యాదవ్ సంఘం నేతలకు స్పష్టం చేశారు. దీంతో యాదవ సంఘం నేతలు జడా బాలనాగేంద్రం, జమ్ము రత్తయ్య తదితరులు ఎమ్మెల్యే జనార్దన్‌ను సంప్రదించారు. మీరు టీడీపీలో చేరితేనే కార్యక్రమాన్ని జరుపుదామని, ప్రస్తుతం ఈ సన్మాన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని ఎమ్మెల్యే సూచించినట్లు యాదవ సంఘం నేతలు తెలిపారు. అంతేకాకుండా సమావేశం టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిర్వహించాలని, సన్మాన కార్యక్రమానికి తానే అధ్యక్షత వహిస్తానని ఎమ్మెల్యే చెప్పినట్లు నేతలు చెబుతున్నారు. అయితే పార్టీలకతీతంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున ఎమ్మెల్యే హోదాలో మీరు అధ్యక్షత వహించడం కుదరదని, మొత్తం కార్యక్రమం యాదవ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుందని, మిగిలిన ప్రజా ప్రతినిధులు, నేతలు అతిథులుగానే వచ్చి వెళ్తారని యాదవ సంఘం నేతలు ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు. ఇందుకు ఎమ్మెల్యే ససేమిరా అన్నట్లు యాదవ సంఘం నేతలు ‘సాక్షి’కి తెలిపారు. దీంతో సన్మాన కార్యక్రమం నిలిచి పోయిందని, ఎమ్మెల్యే పట్టుబట్టి సన్మానాన్ని ఆపించారని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ సన్మాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడడం సరికాదని యాదవ సంఘ నాయకులు విమర్శిస్తున్నారు. -
తిరుమలలో ‘మంట’పాలు
=టీటీడీకి బొప్పికడుతున్న మండపాల వ్యవహారం =ఇప్పటికే కూల్చివేసిన వేయికాళ్ల మండపం =గొల్ల మండపం కూల్చకపోతే ప్రమాదమంటున్న నిపుణులు =కూల్చితే అడ్డుకుంటామంటున్న యాదవ సంఘ నేతలు =అపోహలు నమ్మొద్దంటున్న టీటీడీ సాక్షి, తిరుమల: తిరుమలలో శతాబ్దాల చరిత్ర ఉన్న మండపాల వ్యవహారం టీటీడీకి తలనొప్పిగా మారింది. కూల్చివేసిన వేయికాళ్ల మండపం స్థానంలో నూరుకాళ్ల మండపం కట్టాలని కొందరు వాదిస్తున్నా.. కుదరదని టీటీడీ చెబుతోంది. ఇక శిథిలావస్థకు చేరుకున్న గొల్ల మండపం కూల్చకపోతే ప్రమాదమని నిపుణులు సూచిస్తుండగా.. కూల్చితే ఆందోళన తప్పదని యాదవ సామాజిక నేతలు హెచ్చరిస్తున్నారు. ఇదీ గొల్ల మండపం వ్యవహారం.. ఆలయ మహద్వారానికి పది మీటర్ల దూరంలో నిటారైన నాలుగు శిలలపై గొల్ల మండపం ఉంది. శాసనాధారం ప్రకారం కేవలం పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు 1464 లో సాళువ మల్లయ్య దొర వేయికాళ్ల మండపాన్ని నిర్మించారట. భక్తుల సౌకర్యార్థం మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ఈ పురాతన మండపాన్ని 2003లో తొలగించారు. అప్పట్లోనే గొల్ల మండపాన్నీ తొలగించాలని టీటీడీ ప్రయత్నించింది. తమ మనోభావాలకు విరుద్దంగా మండపం కూల్చడం సరికాదని యాదవ సంఘాలు భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టాయి. మరోవైపు కోర్టులో కేసులూ నడిచాయి. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు టీటీడీకే అనుకూలంగా వచ్చింది. అయినప్పటికీ మండపాన్ని తొలగించేందుకు టీటీడీ అధికారులు సాహసించలేకపోయారు. ‘గొల్ల మండపం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు’ అంటూ ఐఐటీ ప్రొఫెసర్ నరసింహరావు ఇటీవల హెచ్చరించడంతో దీనిపై సత్వర చర్యలు చేపట్టేందుకు టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇత్తడి గ్రిల్స్ (కటాంజనాల)తో రక్షణ చర్యలు తీసుకుంది. మరోవైపు మండపాన్ని కూల్చివేస్తారనే ప్రచారం సాగింది. దీనిపై టీటీడీ తిరుమల జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు ‘అపోహలొద్దు.. ప్రస్తుతానికి మండపం కూల్చే ప్రసక్తేలేదు’ అని బుధవారం వివరణ ఇచ్చారు. నలుగుతున్న నూరుకాళ్ల మండప వివాదం శ్రీవారి ఆలయం ముందున్న వేయికాళ్ల రాతి మండపాన్ని మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా టీటీడీ 2003లో కూల్చివేసింది. కూల్చివేతపై అప్పట్లో దేశవ్యాప్తంగా ఆందోళన రేగింది. మండపం కూల్చివేసిన తర్వాత ఆ ప్రాంతం చాలా విశాలమై బ్రహ్మోత్సవాలు, రద్దీ రోజుల్లో భక్తులకు అనువుగా మారింది. అయితే, చారిత్రక నేపథ్యం కలిగిన మండపం కూల్చివేత సరికాదంటూ త్రిదండి శ్రీమన్నారాయాణ చినజీయర్ పెద్ద స్థాయిలో ఉద్యమం చేశారు. అనేక వివాదాల తర్వాత కోర్టు కూడా కూల్చిన ప్రాంతంలోనే 100 అడుగుల వెడల్పు 200 అడుగుల పొడవుతో రాతి మండపాన్ని నిర్మించాలని తీర్పు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులకు టీటీడీ టెండర్ నిబంధనలు రూపొందించి రూ.10.7 కోట్ల అంచనాతో 2009లో పనులు చేపట్టింది. అయితే కేవలం 100కి 100 అడుగుల స్థలాన్ని మాత్రమే అప్పగించడంతో పనులు పునాదులకే పరిమితమయ్యాయి. ఈ స్థలంలోనే నిత్యం సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వేలాది మంది భక్తులను అలరించే నాదనీరాజనం వేదిక ఉంది. దీనిని తొలగించి రాతి మండపాన్ని విస్తరించేందుకు టీటీడీ సుముఖంగా లే దని తెలుస్తోంది. ఫలితంగా ప్రస్తుతం మండపం పనులు పునాదికే పరిమితమయ్యాయి. మండపం నిర్మాణ పనుల్ని టీటీడీ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందంటూ పలుమార్లు చినజీయర్ ఘాటుగా విమర్శించారు. మరోవైపు మండపం పనులను పార్లమెంట్ హోంశాఖ స్టాండింగ్ కమిటీకి టీటీడీ అధికారులు స్వయంగా చూపించి అడ్డంకులను వివరించారు. ఈ మండప నిర్మాణం లేకపోతే ఆలయ ప్రాంతం సువిశాలంగా ఉంటూ భక్తులకు అనువుగా ఉంటుందని వివరించారు. ఇక్కడే మండపం నిర్మించడం వల్ల భద్రతకు ఇబ్బందులుంటాయన్న నిఘా వర్గాల హెచ్చరికల్ని కూడా కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఇటీవల హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ వ్యవహారంపై టీటీడీ సీవీఎస్వో నేతృత్వంలో జేఈవో, ఇంజినీర్లు, ఇతర నిపుణులతో కమిటీ వేశారు.