=టీటీడీకి బొప్పికడుతున్న మండపాల వ్యవహారం
=ఇప్పటికే కూల్చివేసిన వేయికాళ్ల మండపం
=గొల్ల మండపం కూల్చకపోతే ప్రమాదమంటున్న నిపుణులు
=కూల్చితే అడ్డుకుంటామంటున్న యాదవ సంఘ నేతలు
=అపోహలు నమ్మొద్దంటున్న టీటీడీ
సాక్షి, తిరుమల: తిరుమలలో శతాబ్దాల చరిత్ర ఉన్న మండపాల వ్యవహారం టీటీడీకి తలనొప్పిగా మారింది. కూల్చివేసిన వేయికాళ్ల మండపం స్థానంలో నూరుకాళ్ల మండపం కట్టాలని కొందరు వాదిస్తున్నా.. కుదరదని టీటీడీ చెబుతోంది. ఇక శిథిలావస్థకు చేరుకున్న గొల్ల మండపం కూల్చకపోతే ప్రమాదమని నిపుణులు సూచిస్తుండగా.. కూల్చితే ఆందోళన తప్పదని యాదవ సామాజిక నేతలు హెచ్చరిస్తున్నారు.
ఇదీ గొల్ల మండపం వ్యవహారం..
ఆలయ మహద్వారానికి పది మీటర్ల దూరంలో నిటారైన నాలుగు శిలలపై గొల్ల మండపం ఉంది. శాసనాధారం ప్రకారం కేవలం పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు 1464 లో సాళువ మల్లయ్య దొర వేయికాళ్ల మండపాన్ని నిర్మించారట. భక్తుల సౌకర్యార్థం మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ఈ పురాతన మండపాన్ని 2003లో తొలగించారు. అప్పట్లోనే గొల్ల మండపాన్నీ తొలగించాలని టీటీడీ ప్రయత్నించింది.
తమ మనోభావాలకు విరుద్దంగా మండపం కూల్చడం సరికాదని యాదవ సంఘాలు భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టాయి. మరోవైపు కోర్టులో కేసులూ నడిచాయి. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు టీటీడీకే అనుకూలంగా వచ్చింది. అయినప్పటికీ మండపాన్ని తొలగించేందుకు టీటీడీ అధికారులు సాహసించలేకపోయారు. ‘గొల్ల మండపం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు’ అంటూ ఐఐటీ ప్రొఫెసర్ నరసింహరావు ఇటీవల హెచ్చరించడంతో దీనిపై సత్వర చర్యలు చేపట్టేందుకు టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది.
ఇందులో భాగంగా ఇత్తడి గ్రిల్స్ (కటాంజనాల)తో రక్షణ చర్యలు తీసుకుంది. మరోవైపు మండపాన్ని కూల్చివేస్తారనే ప్రచారం సాగింది. దీనిపై టీటీడీ తిరుమల జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు ‘అపోహలొద్దు.. ప్రస్తుతానికి మండపం కూల్చే ప్రసక్తేలేదు’ అని బుధవారం వివరణ ఇచ్చారు.
నలుగుతున్న నూరుకాళ్ల మండప వివాదం
శ్రీవారి ఆలయం ముందున్న వేయికాళ్ల రాతి మండపాన్ని మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా టీటీడీ 2003లో కూల్చివేసింది. కూల్చివేతపై అప్పట్లో దేశవ్యాప్తంగా ఆందోళన రేగింది. మండపం కూల్చివేసిన తర్వాత ఆ ప్రాంతం చాలా విశాలమై బ్రహ్మోత్సవాలు, రద్దీ రోజుల్లో భక్తులకు అనువుగా మారింది. అయితే, చారిత్రక నేపథ్యం కలిగిన మండపం కూల్చివేత సరికాదంటూ త్రిదండి శ్రీమన్నారాయాణ చినజీయర్ పెద్ద స్థాయిలో ఉద్యమం చేశారు. అనేక వివాదాల తర్వాత కోర్టు కూడా కూల్చిన ప్రాంతంలోనే 100 అడుగుల వెడల్పు 200 అడుగుల పొడవుతో రాతి మండపాన్ని నిర్మించాలని తీర్పు ఇచ్చింది.
కోర్టు ఉత్తర్వులకు టీటీడీ టెండర్ నిబంధనలు రూపొందించి రూ.10.7 కోట్ల అంచనాతో 2009లో పనులు చేపట్టింది. అయితే కేవలం 100కి 100 అడుగుల స్థలాన్ని మాత్రమే అప్పగించడంతో పనులు పునాదులకే పరిమితమయ్యాయి. ఈ స్థలంలోనే నిత్యం సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వేలాది మంది భక్తులను అలరించే నాదనీరాజనం వేదిక ఉంది. దీనిని తొలగించి రాతి మండపాన్ని విస్తరించేందుకు టీటీడీ సుముఖంగా లే దని తెలుస్తోంది. ఫలితంగా ప్రస్తుతం మండపం పనులు పునాదికే పరిమితమయ్యాయి.
మండపం నిర్మాణ పనుల్ని టీటీడీ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందంటూ పలుమార్లు చినజీయర్ ఘాటుగా విమర్శించారు. మరోవైపు మండపం పనులను పార్లమెంట్ హోంశాఖ స్టాండింగ్ కమిటీకి టీటీడీ అధికారులు స్వయంగా చూపించి అడ్డంకులను వివరించారు. ఈ మండప నిర్మాణం లేకపోతే ఆలయ ప్రాంతం సువిశాలంగా ఉంటూ భక్తులకు అనువుగా ఉంటుందని వివరించారు. ఇక్కడే మండపం నిర్మించడం వల్ల భద్రతకు ఇబ్బందులుంటాయన్న నిఘా వర్గాల హెచ్చరికల్ని కూడా కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఇటీవల హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ వ్యవహారంపై టీటీడీ సీవీఎస్‌వో నేతృత్వంలో జేఈవో, ఇంజినీర్లు, ఇతర నిపుణులతో కమిటీ వేశారు.
తిరుమలలో ‘మంట’పాలు
Published Thu, Nov 28 2013 4:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
Advertisement
Advertisement