ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: రబీ సీజన్ ఆరంభంలోనే భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలను వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు తేల్చారు. ఖరీఫ్ పూర్తయి రబీ ప్రారంభంలోనే పై-లీన్ తుఫాన్ వచ్చింది. ఆ వెంటనే అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలు జిల్లాలోని 39 మండలాల్లో వేసిన పంటలను ముంచేశాయి. దీంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలు పూర్తిచేసి మొత్తం రూ 22 కోట్లుగా లెక్క తేల్చారు. పర్చూరు, చీరాల, దర్శి, అద్దంకి, మార్టూరు వ్యవసాయ సబ్‌డివిజన్లతో పాటు మరికొన్ని మండలాల్లో పంట నష్టం జరిగింది.
అధికారులు మొత్తం 37,977 మంది రైతులు సుమారు 23 వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు తేల్చారు. ఎక్కువగా వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి 7133 హెక్టార్లలో, పత్తి 12,900 హెక్టార్లలో, పొగాకు 1387 హెక్టార్లలో, అలసంద 729 హెక్టార్లలో, మొక్కజొన్న 311 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు తేల్చారు. వాటితో పాటు సజ్జ, వేరుశనగ, కందులు, మినుము, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం పంటలు కూడా అక్కడక్కడా దెబ్బతిన్నట్లు అంచనాల్లో చూపించారు.
2010 సంవత్సరం నుంచి మొత్తం 8 సార్లు జరిగిన విపత్తులకు రైతులకు నష్టపరిహారం రావాల్సి ఉంది. నాలుగేళ్లవుతున్నా అంచనాలు ప్రభుత్వానికి చేరాయే కానీ రైతుకు చిల్లిగవ్వ కూడా విదల్చలేదు. ఆ పాత పంట నష్టం బకాయిలు రూ 47.14 కోట్లు ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఇవి కాక అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల నష్టం రూ 22 కోట్లతో కలుపుకొని మొత్తం రూ 69.14 కోట్లు పంట నష్ట పరిహారం రైతులకు అందాల్సి ఉంది. మొత్తం బాధిత రైతులు లక్షా 63 వేల 53 మంది ఉన్నారు.
2010 నవంబర్‌లో వచ్చిన జల్ తుఫాన్‌కు జరిగిన నష్టానికి సంబంధించి ఇంకా 106 మంది రైతులకు రూ 3.58 లక్షలు రావాల్సి ఉంది.
2011లో వచ్చిన కరువు వల్ల 3,505 మంది రైతులకు రూ 1.04 కోట్ల పరిహారం ఇంకా అందలేదు.
2011 ఫిబ్రవరిలో వచ్చిన తుఫాన్ వల్ల నష్టపోయిన 28 మంది రైతులకు రూ 2.13 లక్షలు అందాల్సి ఉంది.
2011 ఏప్రిల్‌లో వచ్చిన కరువుకు 382 మంది రైతులు నష్టపోయిన పంటల పరిహారం రూ 11.47 లక్షలు ఇంకా అందలేదు.
2011 డిసెంబర్ ఆఖరివారంలో వచ్చిన థానే తుఫాన్‌కు 7,992 మంది రైతులు రూ 2.37 కోట్లు నష్టపోయారు.
2011-12లో వచ్చిన కరువు వల్ల జిల్లాలో 8,912 మంది రైతులు నష్టపోగా, నష్టం అంచనాలు రూ 21.24 కోట్లుగా తేల్చారు.
2012 జనవరిలో వచ్చిన భారీ వర్షాలకు 69,034 మంది రైతులు పంటలు నష్టపోగా..రూ 20.32 కోట్ల నష్టం వాటిల్లింది.
2013 ఫిబ్రవరిలో వచ్చిన భారీ వర్షాలకు 2,240 మంది రైతులు రూ 1.33 కోట్ల మేర పంటలు నష్టపోయారు. అయితే 2012 నవంబర్‌లో వచ్చిన నీలం తుఫాన్‌కు నష్టపోయిన రైతులకు కొంత మందికి నష్టపరిహారమిచ్చారు. ఇంకా 1315 మంది రైతులకు రూ 65.63 లక్షలు ఇవ్వాల్సి ఉంది.
నష్టం లెక్క తేలింది
Published Sat, Dec 21 2013 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement
Advertisement