phailin storm
-
చుక్కల్లో ‘సన్నాలు’
ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. ప్రధానంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు సన్న బియ్యం కొనాలంటే బెంబేలెత్తిపోతున్నారు. పక్షం రోజుల్లో క్వింటాల్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు పెరిగాయి. పదిహేను రోజుల క్రితం బ్రాండేడ్ జై శ్రీరాం బియ్యం క్వింటాల్‌కు రూ.4,800 ఉండగా, ప్రస్తుతం రూ.5,800 చేరాయి. లోకల్ జైశ్రీరాం రూ.4,200 నుంచి రూ.5,200, బీపీటీ రూ.3,400 నుంచి రూ.4,000, హెచ్ఎంటీ రూ.4,000 నుంచి రూ.4,600 పెరిగాయి. స్వల్ప వ్యవధిలోనే బియ్యం ధరలు పెరగడంతో ప్రజలు జంకుతున్నారు. తుపాన్ ప్రభావం.. మిల్లర్ల మాయాజాలం ఇటీవల ఆంధ్ర ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన నీలం, పై-లీన్, హెలెన్ తుపాన్ల ప్రభావంతో తీవ్రంగా పంటల నష్టం వాటిల్లింది. చేతికొచ్చే దశలో వరి పంటలపై తుపాన్ తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఆంధ్రలో పంటలు నష్టపోవడంతో బియ్యం కొరత ఏర్పడింది. తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రాకు టన్నుల కొద్ది బియ్యం ఎగుమతి అవుతున్నాయి. దీనికి తోడు రైస్ మిల్లుర్లు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ధాన్యాన్ని నిల్వ ఉంచిన మిల్లర్లు అక్రమార్జన కోసం ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారు. ప్రభుత్వం బియ్యం ధరలు నియంత్రించక పోవడంతో ప్రజలు వ్యాపారులు చెప్పిన ధరలకే కొనాల్సి వస్తుంది. జిల్లాలో కూడా ఈఏడు అత్యధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో పంట దిగుబడి తగ్గింది. ఏటా ఆంధ్ర ప్రాంతం, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌తోపాటు మహారాష్ట్ర నుంచి బియ్యం దిగుమతి అయ్యేవి. కానీ, ఈసారి జిల్లా నుంచే ఎగుమతి చేయడంతో కొరత ఏర్పడి ధరలు భగ్గుమంటున్నాయి. -
నష్టం లెక్క తేలింది
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: రబీ సీజన్ ఆరంభంలోనే భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలను వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు తేల్చారు. ఖరీఫ్ పూర్తయి రబీ ప్రారంభంలోనే పై-లీన్ తుఫాన్ వచ్చింది. ఆ వెంటనే అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలు జిల్లాలోని 39 మండలాల్లో వేసిన పంటలను ముంచేశాయి. దీంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలు పూర్తిచేసి మొత్తం రూ 22 కోట్లుగా లెక్క తేల్చారు. పర్చూరు, చీరాల, దర్శి, అద్దంకి, మార్టూరు వ్యవసాయ సబ్డివిజన్లతో పాటు మరికొన్ని మండలాల్లో పంట నష్టం జరిగింది. అధికారులు మొత్తం 37,977 మంది రైతులు సుమారు 23 వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు తేల్చారు. ఎక్కువగా వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి 7133 హెక్టార్లలో, పత్తి 12,900 హెక్టార్లలో, పొగాకు 1387 హెక్టార్లలో, అలసంద 729 హెక్టార్లలో, మొక్కజొన్న 311 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు తేల్చారు. వాటితో పాటు సజ్జ, వేరుశనగ, కందులు, మినుము, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం పంటలు కూడా అక్కడక్కడా దెబ్బతిన్నట్లు అంచనాల్లో చూపించారు. 2010 సంవత్సరం నుంచి మొత్తం 8 సార్లు జరిగిన విపత్తులకు రైతులకు నష్టపరిహారం రావాల్సి ఉంది. నాలుగేళ్లవుతున్నా అంచనాలు ప్రభుత్వానికి చేరాయే కానీ రైతుకు చిల్లిగవ్వ కూడా విదల్చలేదు. ఆ పాత పంట నష్టం బకాయిలు రూ 47.14 కోట్లు ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఇవి కాక అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల నష్టం రూ 22 కోట్లతో కలుపుకొని మొత్తం రూ 69.14 కోట్లు పంట నష్ట పరిహారం రైతులకు అందాల్సి ఉంది. మొత్తం బాధిత రైతులు లక్షా 63 వేల 53 మంది ఉన్నారు. 2010 నవంబర్‌లో వచ్చిన జల్ తుఫాన్‌కు జరిగిన నష్టానికి సంబంధించి ఇంకా 106 మంది రైతులకు రూ 3.58 లక్షలు రావాల్సి ఉంది. 2011లో వచ్చిన కరువు వల్ల 3,505 మంది రైతులకు రూ 1.04 కోట్ల పరిహారం ఇంకా అందలేదు. 2011 ఫిబ్రవరిలో వచ్చిన తుఫాన్ వల్ల నష్టపోయిన 28 మంది రైతులకు రూ 2.13 లక్షలు అందాల్సి ఉంది. 2011 ఏప్రిల్‌లో వచ్చిన కరువుకు 382 మంది రైతులు నష్టపోయిన పంటల పరిహారం రూ 11.47 లక్షలు ఇంకా అందలేదు. 2011 డిసెంబర్ ఆఖరివారంలో వచ్చిన థానే తుఫాన్‌కు 7,992 మంది రైతులు రూ 2.37 కోట్లు నష్టపోయారు. 2011-12లో వచ్చిన కరువు వల్ల జిల్లాలో 8,912 మంది రైతులు నష్టపోగా, నష్టం అంచనాలు రూ 21.24 కోట్లుగా తేల్చారు. 2012 జనవరిలో వచ్చిన భారీ వర్షాలకు 69,034 మంది రైతులు పంటలు నష్టపోగా..రూ 20.32 కోట్ల నష్టం వాటిల్లింది. 2013 ఫిబ్రవరిలో వచ్చిన భారీ వర్షాలకు 2,240 మంది రైతులు రూ 1.33 కోట్ల మేర పంటలు నష్టపోయారు. అయితే 2012 నవంబర్‌లో వచ్చిన నీలం తుఫాన్‌కు నష్టపోయిన రైతులకు కొంత మందికి నష్టపరిహారమిచ్చారు. ఇంకా 1315 మంది రైతులకు రూ 65.63 లక్షలు ఇవ్వాల్సి ఉంది. -
ఈసారి.. లెహర్
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: లెహర్ తుపాను టై పుట్టిస్తోంది. పై-లీన్ కంటే తీవ్రంగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. బుధవారం సాయంత్రానికి మచిలీపట్నంలోని బందరువైపు తుపాను దిశ మారింది. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తీరం దాటుతుందని, ఆ సమయంలో కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. అధికార యంత్రాంగం తుపానును ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ తీసుకుంటోంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ (08592 28144)ను ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నం(1077)ను కూడా సిద్ధంగా ఉంచారు. ఒంగోలు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, కందుకూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలతోపాటు తీర ప్రాంతాల్లోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లాకు నియమించిన స్పెషల్ ఆఫీసర్ ఎంటీ కృష్ణబాబు గురువారం ఒంగోలు వస్తున్నారు. తీర ప్రాంతాలకు స్పెషల్ ఆఫీసర్లు.. లెహర్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని 11 తీర ప్రాంతాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన మండలాలకు చేరుకున్నారు. బుధవారం రాత్రి అక్కడే బస చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్యకార గ్రామాల్లోని పెద్దలతో మాట్లాడి మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సెలవులు రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కడున్నా వెంటనే తాము పనిచేసే ప్రాంతాలకు చేరుకొని అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జిల్లాలోని 95 తీర ప్రాంతాల్లో లక్షా 840 మంది జనాభా నివశిస్తున్నారు. తుపాను తీవ్రతను బట్టి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు గ్రామానికి ఒకటి చొప్పున 95 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. 320 టన్నుల బియ్యం, లక్షా 36 వేల లీటర్ల కిరోసిన్ సిద్ధంగా ఉంచారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరికలు రావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకొంది. రాత్రివేళల్లో ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని జిల్లా యంత్రాంగం ప్రజలను కోరింది. విపత్తు బృందాలు.. హెలికాప్టర్లు లెహర్ తుపాను వల్ల అతి భారీ వర్షాలు కురిస్తే యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు అందించేందుకు జాతీయ విపత్తుల నివారణ సంస్థ నుంచి రెండు ప్రత్యేక బృందాలను పంపించాలని జిల్లా యంత్రాంగం కోరింది. అదేవిధంగా ఒక హెలికాప్టర్‌ను కూడా సిద్ధంగా ఉంచాలని సూచించింది. తుపాను ప్రభావం కృష్ణా, గుంటూరులపై ఎక్కువగా ఉండే అవకాశాలుండటంతో అక్కడ బృందాలను, హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచుతామని, తుపాను తీవ్రత ప్రకాశం జిల్లాపై ఉంటే వెంటనే వచ్చేలా వాటిని సిద్ధం చేసినట్లు జిల్లాకు సమాచారం అందింది. వాడరేవులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చీరాల, న్యూస్‌లైన్: లెహర్ తుపాను నేపథ్యంలో మండలంలోని వాడరేవులో బుధవారం మూడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. చీరాలలో చిరుజల్లులు కురిశాయి. సముద్రంలో అలల తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. వాడరేవు, తదితర ప్రాంతాల్లోని బోట్లను జెట్టి వద్ద నిలిపి వలలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మండలంలోని వాడరేవు, చినబరప, పాకల, విజయలక్ష్మీపురం, తదితర ప్రాంతాల్లో వేటకు వెళ్లిన మత్స్యకారులు తుపాను కారణంగా ఇంటికి వచ్చేందుకు పయనమవుతున్నారు. -
ఇన్పుట్ సబ్సిడీ నిధుల పక్కదారి!
శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : వ్యవసాయశాఖ అధికారి హెచ్చరిక, ఆ శాఖ జేడీ వివరణను బట్టి.. నీలం తుపాను కారణంగా జిల్లాలో పంట నష్టపోయిన రైతుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన ఇన్పుట్ సబ్సిడీ నిధులు పక్కదారి పట్టినట్టు స్పష్టమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రైవేట్ బ్యాంకులో పెద్దమొత్తంలో నిధులు డిపాజిట్ చేసినట్టు వెల్లడైంది. వివరాలు.. నీలం తుపాను బాధిత రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు కొన్ని నెలల క్రితం నిధులు విడుదలయ్యాయి. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఈ నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయలేకపోయారు. జిల్లాకు ఇటీవల వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ ఇన్‌ఫుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో త్వరలోనే జమ అవుతుందని ప్రకటించారు. దీంతో జిల్లా అధికారులు కొద్దిరోజుల నుంచి ఆ పనిలో పడ్డారు. అయితే సొమ్ము జమలో అనేక పొరపాట్లు జరిగినట్టు వెల్లడవటంతో బుధవారం ఉదయం పలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ హడావుడి చేశారు. ఓ ప్రైవేట్ బ్యాంక్ సిబ్బందిని బ్యాంకు వేళలకు ముందుగానే పిలిపించి చర్చించారు. ఎందుకు ఇలా చేశారనేది గోప్యంగా ఉంచినప్పటికీ పెద్ద మొత్తంలో నిధులకు లెక్కలు దొరకలేదని, ఒకరి ఖాతాకు బదులు వేరొకరి ఖాతాల్లోకి సొమ్ము జమ అయిందని సమాచారం. ఎవరికీ తెలియదనే ధీమాతో.. నీలం తుపాను వచ్చి ఏడాది దాటింది. తమకు ఎంత ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందనేది చాలామంది రైతులకు తెలియదు. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. అధికారుల హడావుడి కారణంగా బ్యాంకుల్లో సాధారణ లావాదేవీలకు విఘాతం కలగటంతో కొందరు ఖాతాదారులు బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించారు. వారు అసలు విషయం చెప్పటంతో సమాచారం బయటకు పొక్కింది. నిబంధనలకు విరుద్ధంగా.. జిల్లాకు విడుదలయ్యే ప్రభుత్వ నిధులను ఏదో ఒక జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయడం పరిపాటి. వ్యవసాయశాఖ ఇందుకు విరుద్ధంగా ఓ ప్రైవేట్ బ్యాంకులో రూ.10 కోట్లకు పైగా జమ చేసింది. జాతీయ బ్యాంకులకు గ్రామీణ ప్రాంతాల్లో సైతం శాఖలు ఉంటాయి. జిల్లాలో ఎస్బీఐ శాఖలు ఎక్కువగా ఉండగా ఆంధ్రాబ్యాంకు, ఏపీజీవీబీ శాఖలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటిని విస్మరించి జిల్లా మొత్తమ్మీద ఒకటి, రెండు శాఖలున్న ప్రైవేట్ బ్యాంకులో నిధులు జమ చేయడం గమనార్హం. నిధులు డిపాజిట్ చేయించేందుకు ప్రైవేట్ బ్యాంకులవారు అధికారులకు భారీ బహుమతులను ఎరగా వేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలా జరగటం గమనార్హం. అధికారుల తీరు కారణంగా రైతులు నష్టపోనున్నారు. ఎందుకంటే.. వేరొక బ్యాంకు ఖాతాకు నిధులు బదిలీ చేసేందుకు ప్రతి బ్యాంకు కొంత కమీషన్‌ను ఖాతాదారు నుంచి వసూలు చేస్తుంది. ఇంతటి ఆగితే కొంతలో కొంత నయం. అదే అసలుకే ఎసరు పెడితే ఇప్పటికే నడ్డి విరిగిన రైతన్నకు దిక్కెవరు? -
తుపాను బాధిత ప్రాంతాల్లో నత్తనడకన సహాయ చర్యలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పై-లీన్ తుపాను తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ చర్యలు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో బాధితులు అల్లాడిపోతున్నారు. తుపాను తీరం దాటి ఆరు రోజులవుతున్నా వందకు పైగా గ్రామాలు ఇప్పటికీ చీకట్లో మగ్గుతున్నాయి. చాలా గ్రామాలకు నేటికీ తాగునీరు అందడం లేదు. వ్యాధులు ప్రబలే అవకాశం పలు చోట్ల చెట్లు విరిగిపోవడం, పశువులు చనిపోవడం, వ్యర్థ పదార్థాలు బయట ఉండటంతో వ్యాధు లు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వీరికి పూట గడవడం కూడా కష్టంగా ఉంది. కుటుంబానికి పది కేజీల చొప్పున బియ్యం ఇస్తామని అధికారులు చెప్పారు. కానీ కొన్ని చోట్ల బియ్యం బస్తాలు తీసుకు వ చ్చి పక్కన పడేశారు. దీన్నిబట్టి అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందని వైద్యసేవలు తీర ప్రాంతంలోని 11 మండలాల్లోనూ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యాల వల్ల చాలా గ్రామాలకు ఇప్పటికీ తాగునీరు అందటం లేదు. పారిశుధ్య, వైద్యసేవలు, సమాచార వ్యవస్థల పునరుద్ధరణ జరగలేదు, ఇక సర్వేల పేరిట బృందాలు రావ టం తప్ప తక్షణ సహాయ చర్యలు తీసుకోవటం లేదు. దీంతో బాధిత గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాగునీటి పథకాలు నడవడం లేదు. 47 తాగునీటి పథకాలకుగాను 15 పథకాల పునరుద్ధరణ జరగలేదు. 887 తీరప్రాంత గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా ఇప్పటికీ 108 గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి. 448 గ్రామాల్లో తాగునీటి వసతులు దెబ్బతినగా వంద గ్రామాలకు ఇంకా తాగునీరు అందటం లేదు. 380 ఇళ్లు పూర్తిగాను, 862 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని బాధితులు వాపోతున్నా రు. అలాగే ఆహార పంటలు 7783 హెక్టార్లు, ఉద్యాన పం టలు 5140 హెక్టార్లతో దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు. నష్టం మరింత అధికంగా ఉంటుందని, పొలాల నుంచి నీరు బయటకు వెళితే పూర్తి పరిస్థితి తెలుస్తుందని బాధిత రైతులు చెబుతున్నారు. సర్వే బృందాలు పాతలెక్కలతో సరిపెట్టేసేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. ఉద్దానంలో 3219 హెక్టార్లలో కొబ్బరి పంటకు నష్టం వాటిల్లినట్టు ఆధికారులు లెక్కలు వేశారు. అయితే వంగిన, విరిగిన, పొట్టలు దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిగణనలోకి తీసుకొలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలాల వారీగా పరిస్థితి ఇలా ఉంది. కవిటి మండలంలో తాగునీరు సరఫరా కావ టం లేదు, గురువారం సాయంత్రం పనులు చేపట్టారు. 28 పంచాయతీలకు విద్యుత్ సరఫరా లేదు. ఇప్పటికీ పారిశుద్ధ్య పనులు చేపట్టలేదు. బాధితుల పునరావాసానికి సామగ్రి అందజేయలేదు. మండల కేంద్రం కంచిలి మినహా మిగిలిన 30 పంచాయితీల్లో విద్యుత్ సరఫరా లేదు. తాగునీరు అందటం లేదు. పారిశుద్ధ్య చర్యలు లేవు. ఇచ్ఛాపురం మండలంలో 50 గ్రామాలు ఇంకా అంధకారంలో ఉన్నాయి. పారిశుద్ధ్య పనులు చేపట్టలేదు. మందస మండలంలో 30 పంచాయతీలు ఉండగా కేవలం 4 పంచాయీతీల్లోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పారిశుద్ధ్య పనులు గురువారం ప్రారంభించారు. సోంపేట, పోలాకి తదితర తీర మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. -
‘విజయమ్మకు ఘన స్వాగతం పలుకుదాం
సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లాలో పై-లీన్ తుపాను కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ బుధవారం నగరానికి రానున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఉదయం 7.30 గంటలకు విజయమ్మకు ఘనస్వాగతం పలికేందుకు నగరంలోని పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావాల్సిందిగా పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆమె రోడ్డు మార్గంలో శ్రీకాకుళం చేరుకుని తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారన్నారు.ఆటో ర్యాలీని విజయవంతం చేయండి: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా కృషి చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు గురువారం ఉదయ ఆటో ర్యాలీ నిర్వహించనున్నట్టు నగర కన్వీనర్ తెలిపారు. నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తల ఆధ్వర్యంలో వార్డుల వారీ పార్టీ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొంటాయన్నారు. -
పై-లీన్ తుపాను జిల్లాను అతలాకుతలం చేసింది
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను జిల్లాను అతలాకుతలం చేసింది. ఏ విధమైన ప్రాణనష్టం జరగకపోయినా అపార ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. వంశధార, నాగావళి నదులు ఆదివారం నుంచి పొంగిపొర్లే ప్రమాదం ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. చిరుపొట్ట, పొట్టదశలో ఉన్న వరి పంటలకు వరదలు, గాలులతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు భయపడుతున్నారు. ఇచ్ఛాపురంలో 50పైగా చెట్లు కూలిపోయాయి. అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణ, టెంట్లు ధ్వంసమయ్యాయి. గిలాయి వీధిలో చెట్లు పడడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. కండ్రవీధి జీఐసీ కాలనీలో విద్యుత్ స్తంభం నేలకొరిగింది. ఈదురుగాలులకు విద్యుత్ లైన్లపై చెట్టు కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో కవిటి మండలంలో వందకుపైగా గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాగునీటికి అవస్థలు ఎదురవుతున్నాయి. కుత్తుం, కొక్కిలిపుట్టుగ, కొన్నాయిపుట్టుగ, తలతంపర గ్రామాల ప్రజలను పునరావాసకేంద్రాలకు తరలించారు. సంతబొమ్మాళి మండలంలో భావనపాడు, కొత్తపేట, ఎమ్.సున్నాపల్లి, లింగూడు, గద్దలపాడు, పాత మేఘవరం, డి.మరువాడ, ఎమ్.మరువాడ, సూరాడవానిపేట, చొక్కరవానిపేట, టెంకూరు తదితర 31 గ్రామాల్లో తుపాను ప్రభావం కనిపించింది. భావనపాడులో వలలతో పాటు మూడు తెప్పలు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. భావనపాడు, కొత్తపేట, వాడపేట, రెడ్డిలపేట, గద్దలపాడు, ఎమ్.సున్నాపల్లి తదితర గ్రామాల సమీపానికి సముద్రపు నీరు చేరింది. కొత్తపేటకు వెళ్ల్లే రహదారితో పాటు భావనపాడు రోడ్ కూడా కొంత మేరకు కోతకు గురైంది. పలాస మండలం లొద్దభద్ర, అల్లుకోల రోడ్డుకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. లొద్దభద్ర, తర్లాకోట, కొత్తవూరు జంక్షన్లలో విద్యుత్ తీగలు తెగిపడిపోయాయి. బ్రాహ్మణతర్లా గ్రామంలో పొందర్లు పండిస్తున్న కూరగాయల మొక్కలు నేలకొరిగాయి. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు, గుణుపల్లి తదితర తుఫాను ప్రభావిత గ్రామాలకు చెంది 8 వేల మందిని సురక్షిత కేంద్రాలకు తరలించారు. వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ, మంచినీళ్లపేట గ్రామాల్లో సముద్ర తీరం సుమారు 200 మీటర్లు ముందుకు వచ్చింది. మందస మండలంలో ఈదురుగాలులు భీభత్సం సృష్టించడంతో విద్యుత్ స్థంబాలు, కొబ్బరి, మామిడి, జీడి తదితర చెట్లు నేలకొరిగాయి. ఎచ్చెర్ల మండలంలో ముప్పు ఎక్కువ ఉన్న గ్రామాలుగా గుర్తించిన డి.మత్స్యలేశం,బడివాని పేట,బుడగుట్ల పాలేంలలో శనివారం సముద్రం 30 మీటర్లు ముందుకు వచ్చింది. సాయంత్రం మరో ఐదడుగులు ముందుకు వచ్చింది. డి.మత్స్యలేం పంచాయతీ రాళ్లపేట,శివాజీ దిబ్బల పాలెం,కొత్త దిబ్బల పాలేం,కొత్త మత్య్స లేశం గ్రామాలను అనుకొని సముద్రం నీరు చొచ్చుకు వచ్చింది. నరసన్నపేట మండలంలో కొబగాం, వెంకటాపురం, గెడ్డవానిపేట, కామేశ్వరిపేట తదితర ప్రాంతాలకు వంశధార నీరు ప్రవేశించే ప్రమాదం ఉండడంతో పరిస్థితిని తహశీల్దార్ సమీక్షిస్తున్నారు. మహేంద్రగిరిలో కురిసిన భారీ వర్షాలకు మహేంద్ర తనయ నీటి మట్టం పెరిగే అవకాశం ఉండడంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం తహశీల్దార్ సూచించారు. తుఫాను కారణంగా భారీగా ఈదురు గాలులు వీయడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జలుమూరు మండలంలో ఈదురుగాలులు వీయడంతో అల్లాడ, పర్లాం, కొమనాపల్లి,సైరిగాం, అచ్చుతాపురం తదితర గ్రామాల్లో వరిచేలు నేలమట్టమయ్యాయి. యలమంచిలి అల్లాడ, కరవంజి, గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. సారవకోట మండలంలో ఈదురు గాలులతో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. -
రైళ్లకు పై-లీన్ బ్రేక్
ఆమదాలవలస, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను తాకిడితో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో రైల్వే లైన్లు దెబ్బతినడంతో శనివారం రావాల్సిన రైళ్లన్నీ రద్దయ్యాయి. పలాస-విశాఖపట్నం పాసింజర్ సర్వీసు (78531/78532), (58525/58526), (67293/67294)లను రద్దు చేశారు. భువనేశ్వర్-హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్, హౌరా-సికింద్రాబాద్ ఈస్ట్‌కోస్ట్, హౌరా-చెన్నై కోరమండల్, హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా, భువనేశ్వర్-ముంబాయి కోణార్క్ ఎక్స్‌ప్రెస్, పూరీ-అహ్మదాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (18411/18412)ను, భువనేశ్వర్-తిరుపతి వెళ్లే (12879)వీక్లీ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ నుంచి బెంగుళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (67293) రద్దు చేసినట్లు శ్రీకాకుళం రోడ్ స్టేషన్ రైల్వే అధికారులు తెలిపారు.పై-లీన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వే శాఖాధికారులు శుక్రవారం నుంచే రైళ్ల సర్వీసులను క్రమబద్ధీకరించారు. సికింద్రాబాద్-భువనేశ్వర్ (17015/16) విశాఖఎక్స్ప్రెస్ను విజయనగరం నుంచి నడుపుతున్నట్లు ప్రకటించి రద్దు చేశారు. పాట్నా-ఎర్నాకుళం (16310) వీక్లీ ట్రైన్ 3 గంటలు ఆలస్యంగా నడిచింది. గూడ్స్ ైరె ళ్లను శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వే స్టేషన్లోనే నిలిపివేశారు. ప్రయాణికుల ఇక్కట్లు ైరె ళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్లాట్‌ఫారంపై అంధకారం అలముకుంది. రైల్వే బుకింగ్ వద్ద కూడా విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయంవైపు దృష్టి సారించారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికుల సందడి లేక ప్లాట్ఫారం బోసిపోయింది. పట్టాలపై చెట్లు పలాస :పై-లీన్ తుఫాను ప్రభావంతో రైలు పట్టాలపై చెట్లు విరిగిపడడంతో రైల్వే అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్ రైలును శనివారం ఉదయం 9 గంటలకు పలాస స్టేషన్లో నిలిపేశారు. ఒడిశా తీరంలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండడంతో అటు వైపు వెళ్లే రైళ్లు నిలిపివేసినట్లు పలాస రైల్వే స్టేషన్ మాష్టారు ఎం.శ్యామలరావు తెలిపారు. ఉదయం భువనేశ్వర్- బెంగుళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ 9.30 గంటలకు పలాస నుంచి బయలుదేరిందన్నారు. హౌరా-చెన్నై మెయిల్ 11.40 గంటలకు, పాట్నా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు 01.40 గంటలకు పలాస నుంచి బయలుదేరినట్లు ఆయన తెలిపారు. -
తుపాను ప్రభావంపై విజయమ్మ, జగన్‌ల ఆరా
శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : జిల్లాలో పై-లీన్ తుపాను ప్రభావంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ, అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. శనివారం నరసన్నపేట శాసనసభ్యుడు, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్‌తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సహాయ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పార్టీ నాయకులను సమన్వయ పరుచుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సూచిం చారు. పార్టీ నేత ఎం.వి.మైసూరారెడ్డి కూడా కృష్ణదాస్‌తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అగ్రనేతల ఆదేశాల మేరకు జిల్లా నాయకులతో కృష్ణదాస్ పరిస్థితిని సమీక్షించి తగిన సూచనలిచ్చారు. పార్టీ నేతల సహాయ కార్యక్రమాలు ఇచ్ఛాపురంలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఎం.వి.కృష్ణారావు, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి పిరియా సాయిరాజ్‌లు, పలాస నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్తలు వజ్జబాబూరావు, కణితి విశ్వనాథంలు బాధితులకు భోజన సౌకర్యం కల్పిం చారు. ఉదయం అల్పాహారం, బిస్కెట్ ప్య్యాకెట్లు పంపిణీ చేశారు. టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తలు వై.వి.సూర్యనారాయణ, వరుదు కల్యాణి, ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బల్లాడ హేమమాలినీరెడ్డి, మాజీ ఎంపీపీ బల్లాడ జనార్దనరెడ్డి లు ఆయా నియోజకవర్గాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పునరావాస కేంద్రాల్లోని బాధితులను పరామర్శించారు. ఏ సహాయం కావాలన్నా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. వీరితోపాటు పార్టీ కార్యకర్తలు కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. -
సైనికుల్లా పనిచేయండి
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తుపాను సమయంలో సైనికుల్లా పనిచేసి ప్రజలను కాపాడాలని, ఒక్కరి ప్రాణం కూడా పోకుం డా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఆస్తినష్టాన్ని తగ్గించటానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అధికారులను కోరారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పై-లీన్ తుపాను 1996 తర్వాత వచ్చిన అతిపెద్ద తుపానని అభివర్ణించారు. దీని ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయన్నారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో ఉన్నవారిని ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశిం చారు. ఈ కేంద్రాల్లో ఉన్నవారికి భోజనం, పిల్లలకు పాలు, తాగునీరు, విద్యుత్తుకు అంతరాయం లేకుండా ఉండేందుకు జనరేటర్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లబోమని చెప్పేవారిని బలవంతంగా తరలించే అధికారం కలెక్టర్‌కు ఉందన్నారు. నౌకాదళం, ఆర్మీ, ఎన్ఆర్డీఎఫ్, కోస్టుగార్డు సిబ్బంది ఇప్పటికే సహాయ చర్యలు చేపడుతున్నారన్నారు. సమైక్యాంధ్ర కోసం నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులకు హాజరై సహాయ చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. నిధుల కొరత లేనందున జిల్లా యంత్రాం గం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుని నష్టాన్ని నివారించాలని ఆదేశించారు. రెండురోజులపాటు నిద్రాహారాలు మాని పని చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కోండ్రు మురళి, జిల్లా ప్రత్యేకాధికారి జి.వెంకట్రామిరెడ్డి, ఎస్పీ నవీన్ గులాఠీ, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సహాయ, పునరావాస చర్యలపై సంతృప్తి శ్రీకాకుళం రూరల్: జిల్లాలో తుపాను సహాయ, పునరావాస చర్యలపై మంత్రి రఘువీరారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో సమీక్ష అనంతరం శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలి గ్రామ పాఠశాలలో ఏర్పాటుచ చేసిన పునరావాస కేంద్రా న్ని మంత్రి కోండ్రు మురళి, కలెక్టర్ సౌరభ్‌గౌర్, ఎస్పీ నవీన్గులాఠీలతో కలిసి సందర్శించారు. పునరావాస కేంద్రంలో నాలుగు రోజులకు సరిపడా ఆహార సామగ్రి, తాగునీటి ప్యాకెట్లు, జనరేటర్ ఉండటం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేంద్రంలో ఉన్న కుందువానిపేట గ్రామస్తులు 600 మంది కోసం తయారు చేస్తున్న వంటలను పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ఇంకా ఉండిపోయినవారిని పునరావాస కేంద్రానికి తీసుకురావాలని యువతను కోరారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రధాన లక్ష్యం కావాలని అధికారులు, యువతకు స్పష్టం చేశారు. 86,500 మంది తరలింపు శనివారం మధ్యాహ్నం నాటికి జిల్లాలోని 52 పునరావాస కేంద్రాలకు 61,500 మందిని, తుపాను రక్షిత కేంద్రాలకు మరో 25 వేల మందిని తరలించామని కలెక్టర్ సౌరభ్ గౌర్ మంత్రికి వివరించారు. కనీసం లక్ష మందిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. పకడ్బందీ ఏర్పాట్లతో నష్టం పరిమితం శ్రీకాకుళం కలెక్టరేట్ : తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేయటంతో నష్టం పరిమితంగా ఉంటుందని భావిస్తున్నట్టు రాష్ట్ర వైద్య విద్య శాఖమంత్రి కోండ్రు మురళి చెప్పారు. శనివారం ఆయన కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కనీసం లక్ష మందిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టామని, అవసరమైతే పోలీసుల సహాయంతో బలవంతంగా తరలిస్తామని చెప్పారు. ఇప్పటివరకు అధికారులు చేసిన కృషిని ప్రశసించారు. కలెక్టర్ సౌరభ్‌గౌర్ జిల్లాలో చేపట్టిన చర్యలను వివరించారు. వంశధార ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీర్ బి.రాంబాబు మాట్లాడుతూ నీటిపారుదలశాఖ కాల్వల్లో నీరు లేకుండా చేశామని చెప్పారు. జిల్లాలోని ప్రాజెక్టుల్లో 3 లక్షల క్యూసెక్కుల నీటిని నిల్వ చేసేందుకు అవకాశముందని తెలిపారు. అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శ్యామల మాట్లాడుతూ తీరప్రాంత మండలాల్లో వైద్య సేవలందించేందుకు వైద్య బృందాలు, మందులను సిద్ధం చేశామని చెప్పారు. వ్యవసాయ శాఖ జేడీ ఎస్.మురళీకృష్ణారావు మాట్లాడుతూ 11 తీరప్రాంత మండలాల్లోని 50 వేల హెక్టార్లలో పంటలు వేశారని, వరికి నష్టం వాటిల్లే అవకాశం లేదని, పత్తి తదితర పంటలకు కొంతమేర నష్టం వాటిల్లవచ్చని వివరించారు. సమావేశంలో ఎస్పీ నవీన్‌గులాఠీ, డీఆర్వో నూర్భాషా ఖాసీం తదితరులు పాల్గొన్నారు. యువత సేవలను వినియోగించుకోవాలి తుపాను ప్రభావిత గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు యువత సేవల ను వినియోగించుకోవాలని మంత్రి కోండ్రు సూచించారు. ఉదయం కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రజలకు తుపాను తీవ్రత తెలియజేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. జిల్లా ప్రత్యేకాధికారి జి.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ప్రాణనష్టం జరగకుండా ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ పునరావాస కేంద్రాలకు రామనేవారిని బలవంతంగా తరలించాలని ఆదేశించారు. ఎస్పీ నవీన్‌గులాఠీ మాట్లాడుతూ రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నియమించిన 8 బృం దాలు పూర్తి స్థాయిలో పని చేయాలన్నారు. జనరేటర్లు, మెకానిక్‌లను సిద్ధం చేయాలన్నారు. జిల్లాకు 2 గ్రేహౌండ్స్ దళాలు, 6 ఏపీఎస్పీ దళాలు వస్తున్నాయని చెప్పారు. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటే ఇబ్బందులు ఎదుర్కొనకుండా శాటిలైట్ ఫోన్లను సిద్ధం చేశామని చెప్పారు. -
హమ్మయ్య... తప్పిన గండం
విజయనగరం కలెక్టరేట్ /కంటోన్మెంట్, న్యూస్‌లైన్: పై-లీన్ ప్రభావం జిల్లాపై పెద్దగా లేకపోవడంతో జిల్లా అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల హెచ్చరికల నేప థ్యం, సముద్రం పోటెత్తి అలలు విరుచుకుపడుతూ తీరానికి దూసుకురావడంతో తీరప్రాం త ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్రం గా ఉంటుందని, అందులో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ కావడం, వాతావరణంలో క్రమేపీ వచ్చిన మార్పులతో రెండు రోజుల పాటు ఏం జరుగుతుందో ఏమోనని వణికిపోయిన జిల్లా వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. అయితే భయపడినంతంగా పై-లీన్ ప్రభావం చూపకపోవడంతో ఊరట చెందారు. శనివారం రాత్రి జిల్లా ప్రత్యేక అధికారి జిల్లా అధికారులతో సమావేశమై పై-లీన్ ప్రభావం, తుఫాన్ వల్ల జరిగిన నష్టం పై సమీక్షించారు. శుక్రవారం సాయంత్రం నుంచి ఉద్ధృతంగా గాలులు వీచాయి. శనివారం ఉదయం సముద్రంలో అలజడి పెరిగింది. కెరటాలు పెద్ద ఎత్తున పైకి లేస్తూ మత్స్యకార గ్రామాల్లోకి దూసుకువచ్చాయి. దీంతో కొన్ని గ్రామాల ప్రజలు ఇళ్లను విడిచి పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. అధికారులు ఎంత చెప్పినా చాలా మంది మత్స్యకారులు ఇళ్లను విడిచి వేరే చోటికి వెళ్లేందుకు అంగీకరించలేదు. జిల్లా యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేసినప్పటికీ ఎప్పుడు ఎటువంటి అవాంఛనీయ వార్తలు వినాల్సి వస్తుందోనన్న ఆందోళన జిల్లా యంత్రాంగంలో... ప్రజల్లో నెలకొంది. భారీ ఈదురుగాలులు... చెదురుమదురు వర్షాలు మినహా అంతా ప్రశాంతంగా ఉంది. తీర ప్రాంతంలో ఉన్న పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో కాస్త ఉద్రిక్తత నెలకొంది. పూసపాటిరేగ మండలంలోని పతివాడ బర్రిపేట, తిప్పలవలస, కోనాడ, చింతపల్లి గ్రామాలలో సముద్రం సుమారు 40 అడుగులు ముందుకు రావడంతో పాటు ఒడ్డును చేర్చిన పడవలులోకి నీరు చేరడంతో మత్య్సకారులు పరుగులు తీశారు. భోగాపురం మండలం తీరప్రాంతంలో ఉన్న ముక్కాం గ్రామంలో సముద్రపు అలలు తీరప్రాంతంలో ఉన్న ఇళ్లను తాకాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అప్పటికే అప్రమత్తమైన జిల్లా అధికారులు వారిని పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ చాలా వరకు స్థానికులు అక్కడే ఉండి పరిస్థితిని గమనించారు. పై-లీన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. కురుపాంలో రోడ్డుపై భారీ చెట్టు నేలకొరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే నెల్లిమర్ల, చీపురుపల్లి, పార్వతీపురం మండలాల్లో చెట్లు నేలకు ఒరిగాయి. పార్వతీపురం మండలం కోరి గ్రామంలో చెట్టు కూలి ట్రాన్స్ఫార్మర్పై పడడంతో పది గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విజయనగరంలో పట్టణంలో బలంగా వీచిన ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. ప్రధానంగా బాబామెట్ట ప్రాంతలోని కాటవీధి వద్ద పట్టణంలోని అధిక ప్రాంతాలకు విద్యుత్ సరఫారా చేసే 11కెవి లైన్ విద్యుత్ స్తంభం ఒరిగిపోయింది. దీంతో మొత్తం ఆరు ట్రాన్సఫార్మర్ల పరిధిలో ఉదయం 11 గంటల నుంచి సరఫరా నిలిచిపోయింది. మండలంలోని వేణుగోపాలపురంలో రెండు విద్యుత్ స్తంభాలు ఒరిగిపోగా... ఇందిరానగర్, గాజులరేగ, డెంకాడలకు విద్యుత్ సరఫరా అయ్యే ప్రధాన విద్యుత్ లైన్లపై చెట్లు విరిగిపడ్డాయి. ఏజెన్సీప్రాంతంలో ఉన్న కురుపాం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, సాలూరు మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. ముక్కాంలో తీరప్రాంత ఇళ్లను తాకిన అలలు.. తుఫాన్ ప్రభావంతో భోగాపురం మండలం తీరప్రాంతంలో ఉన్న ముక్కాం గ్రామంలో సముద్రం అలలు తీరప్రాంతంలో ఉన్న ఇళ్లను తాకడంతో మత్స్యకారులు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం కన్నా శనివారం సముద్రం మరింత ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం నాడు తీరం 50 అడుగుల దూరంలో ఉన్న ఒడ్డును తాకిన కెరటాలు శనివారం ఏకంగా 70 అడుగుల దూరంలో తీరానికి ఆనుకుని ఉన్న ఇళ్లని సైతం తాకాయి. ఈ సంఘటనలో మత్స్యకార కుటుంబాల మరుగుదొడ్లు నేలమట్టమయ్యాయి. మామూలుగా తీర ప్రాంతం గట్టున లంగరు వేసి ఉంచే పడవలను ఏకంగా గ్రామంలోకి తరలించారు. పునరావాస కేంద్రాలకు 15,670 మంది తరలింపు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుందన్న వాతావరణ శాఖ అధికారులు ముందస్తు ప్రకటనతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 15670 మందిని పునరావాస కేంద్రాలకు తరలించింది. తుఫాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విజయనగరం డివిజన్లోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా.. పార్వతీపురం డివిజన్లో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, సాలూరు, జియ్యమ్మవలస మండలాల్లో 22 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే పునరావాస కేంద్రాలకు రావటానికి మత్స్య కారులు నిరాకరించారు. మా ఆస్తులు నష్టపోయి మీరు పెట్టే పులిహోరా మెతుకులకు మేము రామంటూ ఎదురు తిరిగారు. దీంతో విధిలేని పరిస్థితిలో అధికారులు రాత్రి వరకూ బలవంతంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. గంగమ్మా శాంతించు అంటూ సముద్రం వైపు దండం పెడుతూ కేంద్రాల వద్దకు వచ్చారు. తరలి వచ్చిన కేంద్ర బలగాలు... పై-లీన్ బీభత్సం సృష్టిస్తున్న హెచ్చరికల నేపథ్యంలో జిల్లాకు కేంద్ర బలగాలు తరలివచ్చాయి. 40 మంది జాతీయ విపత్తుల బృందంతో పాటూ సహాయక చర్యల కోసం 250 మంది ఆర్మీ జవాన్లు వచ్చారు. వీరిని ఏడు మండలాలకు అధికారులు సర్దుబాటు చేశారు. అలాగే 30 మంది గజ ఈతగాళ్లతో పాటూ 50 మంది అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. అంతేకాకుండా 200 మంది వరకూ పోలీసులు సైతం తీర ప్రాంతాల్లో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకాధికారులతో పాటూ సహాయక బృందాలు ఆయా ప్రాంతాల్లోనే కలియ దిరిగాయి. అవసరమైన వాటర్ ప్యాకెట్లను సైతం అందుబాటులో ఉంచారు. పౌరసరఫరాల శాఖ నిత్యావసర సరుకులతో పాటూ కిరోసిన్ సరఫరా చేసింది. -
పై-లీన్ ఎఫెక్ట్‌తో పలు రైళ్ల రద్దు
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన పై-లీన్ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మీదుగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్‌లను, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. శనివారం 18048 వాస్కోడిగామా- హౌరా ఎక్స్‌ప్రెస్, విశాఖ - భువనేశ్వర్ ఇంటర్‌సిటీతో పాటూ పలు ఎక్స్‌ప్రెస్‌లు రద్దయినట్లు అధికారులు తెలిపారు. 17016 సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను విజయనగరం రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు తిరిగి విజయనగరం నుంచి సికిం ద్రాబాద్ వెళ్లిపోతుంది. రైల్వే విచారణ కేంద్రాల వద్ద హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటుచేశారు. ప్రయాణికులు 08922 - 224240, 225510 నంబర్ల ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చని చెప్పారు. రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులకు రీఫండ్ ఇచ్చేందు కు రైల్వే శాఖ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. -
తుపాను ప్రభావంపై వైఎస్ జగన్ ఆరా
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :జిల్లాలో పై-లీన్ తుపాను ప్రభా వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజుతో శనివారం మధ్యాహ్నం ఫోన్లో మాట్లాడిన ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో తుపాను ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఏఏ మండలాలు, గ్రామాలు తుపాను తాకిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గేవరకు వైఎస్సార్ సీపీ నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎక్కడైనా తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లో అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని డెల్టా ప్రాంతం, మెట్ట ప్రాంతాల్లో తుపాను వల్ల పంట నష్టం జరిగిందా అని వాకబు చేశారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో మాట్లాడి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని జగన్ చెప్పినట్టు బాలరాజు చెప్పారు. జిల్లాలోని వైఎస్సార్ సీపీ నాయకులంతా తుపాను పరిస్థితులపై జాగ్రత్త వహించాలని కోరారు. దసరా శుభాకాంక్షలు దసరా పండుగను జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ కోరారు. -
‘పై-లీన్’పై అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, కాకినాడ : పై-లీన్ తుపాను ముప్పు నుంచి ప్రజలును గట్టెక్కించేందుకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ప్రత్యేకాధికారి ముద్దాడ రవిచంద్ర అన్నారు. శనివారం కలెక్టరేట్ కోర్టు హాల్లో కలెక్టర్ నీతూ ప్రసాద్‌తో కలసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, ట్రెయినీ కలెక్టర్ కర్ణన్, జిల్లా ఎస్పీ శివశంకరరెడ్డి పాల్గొన్నారు. తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఏర్పా ట్లు చేపట్టామన్నారు. ముందు జాగ్రత్త చర్యగా కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే బీచ్ రోడ్డును శనివారం సాయంత్రం నుంచి మూసి వేస్తున్న ట్టు చెప్పారు. హెచ్చరిక చర్యలు ఉపసంహరించుకునేంత వరకూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరు అశ్రద్ధ చేసినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. 25 వేల మంది తరలింపు కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ తుపాను కారణంగా లక్షా యాభై వేల మంది జనాభాకు ఇబ్బందులు ఎదురు కావచ్చన్నారు. ముంపు ప్రాంతాల నుంచి భద్రత కోసం దాదాపు 25 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. గత నీలం తుపానును దృష్టిలో పెట్టుకుని అన్నవరం పంపా రిజర్వాయర్ పొంగి పొర్లితే ఎదురయ్యే ప్రమాదం నేపథ్యంలో జాతీయ రహదారిపై భారీ వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖ ఇన్చార్జి జేడీ విజయకుమార్ మాట్లాడుతూ జిల్లాలో 2.25 లక్షల హెక్టార్లలో వరి పంట ఉందని, దీనిలో 1.64 లక్షల హెక్టార్ల పంట అంకుర దశలో ఉందన్నారు. పంటకు ప్రస్తుతం ఐదు సెంటీ మీటర్ల నీరు పెట్టి ఉందన్నారు. భారీ వర్షాలు పడితే 15 సెంటీ మీటర్ల ఎత్తున నీరు పారి నష్టం సంభవించనున్న క్రమంలో ముందుగానే పెట్టిన నీటిని వదిలి వేయాలని సూచించామన్నారు. మత్స్య శాఖ అధికారి నందయ్య మాట్లాడుతూ ఎలాంటి విపత్తు ఎదురైనా 5వేలకు పైబడి బోట్లు ఉన్నాయని, వీటిలో 579 మెకనైజ్డ్ , 1746 మోటార్ బోట్లు, 2758 కంట్రీ బోట్లు ఉన్నాయన్నారు. వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్, పోలీస్ ఉన్నతాధికారులతో ప్రత్యేకాధికారి రవిచంద్ర సమీక్షించారు. అనంతరం 12 తీర ప్రాంత మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. -
పై-లీన్ తుపాను సహాయక చర్యలపై రఘువీరా సమీక్ష
విశాఖ : రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి శనివారం ఉదయం విశాఖ చేరుకున్నారు. పై-లీన్ తుపాను నేపథ్యంలో ఆయన సహాయక చర్యలు పర్యవేక్షించనున్నారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ తీరప్రాంతాల్లో ఇప్పటికే ఆర్మీ, మిలటరీ, నేవీ దళాలు గస్తీ నిర్వహిస్తున్నాయన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 64వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. మూడు రోజుల పాటు రఘువీరారెడ్డి విశాఖలోనే ఉండి తుపాను సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
ఫైలిన్ కలవరం.. అధికారులు అప్రమత్తం
పడగెత్తిన పెను తుపాను సాగర కెరటాల మాటు నుంచి భీకరంగా బుస కొడుతూ ఉండడంతో జిల్లా గజగజ వణుకుతోంది. మేఘాల మార్గంలో దూసుకు వస్తున్న ఝంఝామారుతాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక విలవిలలాడుతోంది. ముంచుకొచ్చే ముప్పుకు ముందస్తు సంకేతంగా గురువారం అక్కడక్కడా కురిసిన కుండపోత వర్షాలతో అస్తవ్యస్త పరిస్థితి నెలకొంది. ‘అల’జడి పొంచి ఉందని అధికారులు జారీ చేస్తున్న హెచ్చరికలతో తీరప్రాంత గ్రామాల్లో ఆందోళన ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. అల్లకల్లోలంగా ఉన్న కడలికి మత్స్యకారులు దూరంగా ఉండాలన్న ప్రకటనలతో గంగపుత్రుల్లో గుబులు పెరుగుతోంది. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి కలెక్టర్ నేతృత్వంలో అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. మరోవైపున వివిధ నదులు పొంగిపొర్లుతూ ఉండడంతో పంటలను ముంపు భయం వెంటాడుతోంది. యలమంచిలి, న్యూస్‌లైన్ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ పెను తుఫాన్ జిల్లా తీర ప్రాంతాల్లో కలవరం సృష్టిస్తోంది. ఫైలిన్ విరుచుకు పడనుందన్న హెచ్చరికలతో నలుదిశలా అలజడి నెలకొంది. ముఖ్యంగా తుఫాన్ కారణంగా మత్స్యకారులకు, తీర ప్రాంత గ్రామాలకు ముప్పు ఎదురు కానుందని హెచ్చరికలు వెలువడ్డ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పెను తుఫాన్ ప్రభావం విశాఖపై అధికంగా ఉండవచ్చన్న ఆందోళనతో పాలనా వ్యవస్థ విపత్తును ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధమైంది. బుధవారం సాయంత్రం తుఫాన్ హెచ్చరికలు జారీకావడంతో మత్స్యకార గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తెల్లవారుజామునే చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల పరిస్థితిపై కలవరం నెలకొంది. సముద్రంలో అలల ఉధృతి క్రమేణా పెరుగుతోంది. తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలతో ఆందోళన నెలకొంది. తుఫాన్ హెచ్చరికలతో గురువారం చేపలవేట నిలిచి పోయింది. ఒడ్డున ఉన్న తెప్పలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వలలు, ఇం జన్లను గ్రామాలకు తరలించారు. తీర గ్రామాల్లో తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్ అప్రమత్తం చేశారు. వీఆర్వోలు ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉండాల నితహశీల్దార్లు ఆదేశించారు. అచ్యుతాపు రం మండలం, పూడిమడక గ్రామ మత్స్యకారులు ఫైలిన్ తుఫాన్ హెచ్చరికలతో ఆందోళనకు గురవుతున్నారు. సముద్రపు నీరు ఇళ్ల ను ముంచెత్తవచ్చని భయపడుతున్నారు. శు క్రవారం ఉదయానికి ఫైలిన్ తుఫాన్ తీవ్రత పెరగవచ్చన్న హెచ్చరికలతో తీరంలో తా టాకు పాకల్లో నివసిస్తున్న మత్స్యకారులను తరలించడానికి సమాయత్తమవుతున్నారు. అప్రమత్తత అవసరం ఎస్.రాయవరం : విపత్తుల సమయంలో తీర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని చింతపల్లి డిఎస్పీ రమేశ్ చెప్పారు. గురువారం సముద్ర తీర ప్రాంతాలయిన బంగారమ్మపాలెం ,రేవుపోలవరం గ్రామాల్లో పర్యటించి అప్రమత్తంగా ఉండాలని మత్యకారులకు చెప్పారు. వరాహ నదీ పరివాహక ప్రాంతాల వారు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. డీఎప్పీ వెంట ఎస్ఐ కె అప్పలనాయుడు, సిబ్బంది ఉన్నారు. ఎగసిపడుతున్న కెరటాలు రాంబిల్లి : ఫైలిన్ తుపాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. గురువారం వాడపాలెం, కొత్తపట్నం, వాడనర్సాపురం తీరాల్లో సముద్రపు అలల ఉధృతి పెరిగింది. మరోపక్క మేజర్, మైనర్ శారద నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. నారాయణపురం వద్ద మైనర్ శారద వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది. దీంతో గట్లకు గండ్లు పడే ప్రమాదం వుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.