తుపాను బాధిత ప్రాంతాల్లో నత్తనడకన సహాయ చర్యలు | Hurricane affected areas, slowing relief efforts | Sakshi
Sakshi News home page

తుపాను బాధిత ప్రాంతాల్లో నత్తనడకన సహాయ చర్యలు

Published Fri, Oct 18 2013 2:23 AM | Last Updated on Wed, Sep 5 2018 4:10 PM

Hurricane affected areas, slowing relief efforts

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
 పై-లీన్ తుపాను తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ చర్యలు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో బాధితులు అల్లాడిపోతున్నారు. తుపాను తీరం దాటి ఆరు రోజులవుతున్నా వందకు పైగా గ్రామాలు ఇప్పటికీ చీకట్లో మగ్గుతున్నాయి. చాలా గ్రామాలకు నేటికీ తాగునీరు అందడం లేదు.
 
 వ్యాధులు ప్రబలే అవకాశం
 పలు చోట్ల చెట్లు విరిగిపోవడం, పశువులు చనిపోవడం, వ్యర్థ పదార్థాలు బయట ఉండటంతో వ్యాధు లు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వీరికి పూట గడవడం కూడా కష్టంగా ఉంది. కుటుంబానికి పది కేజీల చొప్పున బియ్యం ఇస్తామని అధికారులు చెప్పారు. కానీ కొన్ని చోట్ల బియ్యం బస్తాలు తీసుకు వ చ్చి పక్కన పడేశారు. దీన్నిబట్టి అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
 అందని వైద్యసేవలు
 తీర ప్రాంతంలోని 11 మండలాల్లోనూ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యాల వల్ల చాలా గ్రామాలకు ఇప్పటికీ తాగునీరు అందటం లేదు. పారిశుధ్య, వైద్యసేవలు, సమాచార వ్యవస్థల పునరుద్ధరణ జరగలేదు, ఇక సర్వేల పేరిట బృందాలు రావ టం తప్ప తక్షణ సహాయ చర్యలు తీసుకోవటం లేదు. దీంతో బాధిత గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
 
     విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాగునీటి పథకాలు నడవడం లేదు. 47 తాగునీటి పథకాలకుగాను 15 పథకాల పునరుద్ధరణ జరగలేదు. 887 తీరప్రాంత గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా ఇప్పటికీ 108 గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి. 448 గ్రామాల్లో తాగునీటి వసతులు దెబ్బతినగా వంద గ్రామాలకు ఇంకా తాగునీరు అందటం లేదు. 380 ఇళ్లు పూర్తిగాను, 862 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని బాధితులు వాపోతున్నా రు. అలాగే ఆహార పంటలు 7783 హెక్టార్లు, ఉద్యాన పం టలు 5140 హెక్టార్లతో దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు. నష్టం మరింత అధికంగా ఉంటుందని, పొలాల నుంచి నీరు బయటకు వెళితే పూర్తి పరిస్థితి తెలుస్తుందని బాధిత రైతులు చెబుతున్నారు. సర్వే బృందాలు పాతలెక్కలతో సరిపెట్టేసేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. ఉద్దానంలో 3219 హెక్టార్లలో కొబ్బరి పంటకు నష్టం వాటిల్లినట్టు ఆధికారులు లెక్కలు వేశారు. అయితే వంగిన, విరిగిన, పొట్టలు దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిగణనలోకి తీసుకొలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలాల వారీగా పరిస్థితి ఇలా ఉంది.
 
   కవిటి మండలంలో తాగునీరు సరఫరా కావ టం లేదు, గురువారం సాయంత్రం పనులు చేపట్టారు. 28 పంచాయతీలకు విద్యుత్ సరఫరా లేదు. ఇప్పటికీ పారిశుద్ధ్య పనులు చేపట్టలేదు. బాధితుల పునరావాసానికి సామగ్రి అందజేయలేదు.
 
   మండల కేంద్రం కంచిలి మినహా మిగిలిన 30 పంచాయితీల్లో విద్యుత్ సరఫరా లేదు. తాగునీరు అందటం లేదు. పారిశుద్ధ్య చర్యలు లేవు.
 
   ఇచ్ఛాపురం మండలంలో 50 గ్రామాలు ఇంకా అంధకారంలో ఉన్నాయి. పారిశుద్ధ్య పనులు చేపట్టలేదు.
 
   మందస మండలంలో 30 పంచాయతీలు ఉండగా కేవలం 4 పంచాయీతీల్లోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పారిశుద్ధ్య పనులు గురువారం ప్రారంభించారు. సోంపేట, పోలాకి తదితర తీర మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement