పై-లీన్ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విద్యుత్ శాఖకు సుమారు 72 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సీఎండీ ఎం.శేషగిరిబాబు చెప్పారు
సోంపేట, న్యూస్‌లైన్:
పై-లీన్ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విద్యుత్ శాఖకు సుమారు 72 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సీఎండీ ఎం.శేషగిరిబాబు చెప్పారు. బుధవారం సోంపేటలో విలేకరులతో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం, టెక్కలి, విజయనగరం, బొబ్బిలి డివిజన్ల పరిధిలో విద్యుత్ వ్యవస్థకు తీవ్రనష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. భారీ గాలులకు వేలాది స్తంభాలు నేలకొరిగాయన్నారు.
126 కిలోమీటర్ల 33 కేవీ లైన్, 456 కిలోమీటర్ల 11 కేవీ లైన్, 2,348 కిలోమీటర్ల పరిధిలో ఎల్‌టీ లైన్ వ్యవస్థ దెబ్బతిన్నట్టు వివరించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 2057 గ్రామాల్లోని నీటి పథకాలకు విద్యుత్ సమస్య తలెత్తగా వారికిలో 1962 గ్రామాల్లోని రక్షిత పథకాలకు సరఫరాను పునరుద్ధరించామన్నారు. మరో రెండు రోజుల్లో పూర్తిగా సమస్యను పరిష్కరిస్తామి చెప్పారు. 40 సంవత్సరాలుగా ఉన్న విద్యుత్ వ్యవస్థ తుఫాన్ పడిన కారణంగా నాశనమైందన్నారు.
200 మంది అధికారులు, 1000 మంది సిబ్బంది యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారన్నారు. రెండు జిల్లాల పరిధిలోని నాలుగు డివిజన్లలో 8,19,556 సర్వీసులకు విద్యుత్ అంతరాయం కలిగిందన్నారు. వీటిలో 7,84,735 సర్వీసులకు సరఫరాను పునరుద్ధరించామన్నారు. ఆయన వెంట విద్యుత్ అధికారులు కేఎస్‌ఆర్ మూర్తి, డి. రమేష్, డివిజనల్ ఇంజినీర్ ప్రతాప్, సోంపేట మండల విద్యుత్ శాఖాధికారి కోటేశ్వరరావు ఉన్నారు.