Phailin storm
-
విద్యుత్‌శాఖకు ‘పై-లీన్’ నష్టం రూ.72 కోట్లు: సీఎండీ
సోంపేట, న్యూస్‌లైన్: పై-లీన్ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విద్యుత్ శాఖకు సుమారు 72 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సీఎండీ ఎం.శేషగిరిబాబు చెప్పారు. బుధవారం సోంపేటలో విలేకరులతో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం, టెక్కలి, విజయనగరం, బొబ్బిలి డివిజన్ల పరిధిలో విద్యుత్ వ్యవస్థకు తీవ్రనష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. భారీ గాలులకు వేలాది స్తంభాలు నేలకొరిగాయన్నారు. 126 కిలోమీటర్ల 33 కేవీ లైన్, 456 కిలోమీటర్ల 11 కేవీ లైన్, 2,348 కిలోమీటర్ల పరిధిలో ఎల్టీ లైన్ వ్యవస్థ దెబ్బతిన్నట్టు వివరించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 2057 గ్రామాల్లోని నీటి పథకాలకు విద్యుత్ సమస్య తలెత్తగా వారికిలో 1962 గ్రామాల్లోని రక్షిత పథకాలకు సరఫరాను పునరుద్ధరించామన్నారు. మరో రెండు రోజుల్లో పూర్తిగా సమస్యను పరిష్కరిస్తామి చెప్పారు. 40 సంవత్సరాలుగా ఉన్న విద్యుత్ వ్యవస్థ తుఫాన్ పడిన కారణంగా నాశనమైందన్నారు. 200 మంది అధికారులు, 1000 మంది సిబ్బంది యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారన్నారు. రెండు జిల్లాల పరిధిలోని నాలుగు డివిజన్లలో 8,19,556 సర్వీసులకు విద్యుత్ అంతరాయం కలిగిందన్నారు. వీటిలో 7,84,735 సర్వీసులకు సరఫరాను పునరుద్ధరించామన్నారు. ఆయన వెంట విద్యుత్ అధికారులు కేఎస్ఆర్ మూర్తి, డి. రమేష్, డివిజనల్ ఇంజినీర్ ప్రతాప్, సోంపేట మండల విద్యుత్ శాఖాధికారి కోటేశ్వరరావు ఉన్నారు. -
శ్రీకాకుళం జిల్లాకు 243 కోట్ల సహాయాన్ని అందించండి: కృపారాణి
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం 243 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజిని అందించాలని యూపీఏ అధినేత్రి సోనియా గాంధీని కేంద్ర సమాచార శాఖ సహాయమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కోరారు. ఫైలీన్ తుఫాన్ కారణంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రజల జీవనం అస్తవ్యస్తం అయిందని సోనియాకు శ్రీకాకుళం ఎంపీ కృపారాణి తెలిపారు. సహాయ కార్యక్రమాల కోసం ప్రత్యేక ప్యాకేజి తో అవసరమైన ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని మీడియాకు కృపారాణి వెల్లడించారు. -
పొంచి ఉన్న వరద ముప్పు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాకు పై-లీన్ తుపాను ముప్పు తప్పినా వరద ముప్పు పొంచి ఉంది. ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నాగావళి, వంశధార నదుల్లో ఆదివారం సాయంత్రం నుంచి నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖాధికారులు తెలిపారు. ఇచ్ఛాపురం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో బాహుదా నదికి వరదలు వచ్చే ప్రమాదం ఉండడంతో ఇప్పటికే 15 గ్రామాలను ఖాళీ చేయించారు. మరిన్ని గ్రామాలను ఖాళీ చేయించాలని యోచిస్తున్నారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా శుక్రవారమే మడ్డువలస, తోటపల్లి, గొట్టాబ్యారేజ్లలో నీటిని దిగువకు వదిలారు. ఎప్పటినీరు అప్పుడు వెళ్లిపోయేందుకు వీలుగా తెరిచిన గేట్లను అలాగే ఉంచారు. దబారుసింగి, సైరిగాం, కళింగదళ్ రిజర్వాయర్లలో నీటిని దిగువకు వదిలారు. నదులకు అనుసంధానంగా ఉన్న పంట కాలువలను మూసివేశారు. దీంతో గ్రామాలకు ముంపు బాధ తప్పుతుందని అధికారులు భావిస్తున్నారు. నది ద్వారానే నీరు ప్రవహించి సముద్రంలో కలుస్తుందని అధికారుల యోచన. తుపాను కారణంగా సముద్రంలోని అలలు ఎగిసిపడుతుండడంతో నదులలోని నీరు సముద్రంలోనికి చేరేందుకు సమయం పడుతుంది. దీంతో వరద వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల వరద బెడద లేకపోయినప్పటికీ ఆదివారం కూడా వర్షాలు కురిస్తే వరద వచ్చే పరిస్థితి ఉంటుందని నీటిపారుదల శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. అటువంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. గొట్టా బ్యారేజీ 21 గేట్లు ఎత్తివేత పాతపట్నం : హిరమండలంలోని గొట్టాబ్యారేజీ 21 గేట్లను శనివారం రాత్రి 7 గంటలకు ఎత్తివేశారు. మొత్తం 21 గేట్లలో 11 గేట్లు మూడు మీటర్లు, 10 గేట్లు రెండు మీటర్ల ఎత్తున ఎత్తారు. బ్యారేజీలో 19 వేల క్యూసెక్కుల నీరు పారుతోంది. తోటపల్లి 8 గేట్లు ఎత్తివేత వీరఘట్టం: నాగావళి నదిపై తోటపల్లి ప్రాజెక్టు 8 గేట్లను శనివారం ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో 10 వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్టు ప్రాజెక్టు ఇంజనీర్ అప్పలనాయుడు తెలిపారు. అప్రమత్తంగా ఉండండి... నదీతీర ప్రాంతాల్లో ఉన్న కిమ్మి, చిదిమి, పాలమెట్ట, పనసనందివాడ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ ఎల్.గరికివాడు ప్రజలకు సూచించారు. స్థానిక కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. వీఆర్వోలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలన్నారు. మడ్డువలస గేట్లు మూసివేత వంగర: మండలంలోని మడ్డువలస ప్రాజెక్టు గేట్లను అధికారులు శనివారం మూసివేశారు. పై-లీన్ తుపాను కారణంగా ఇన్‌ఫ్లో ఎక్కువవుతుండడంతో ముందస్తు చర్యగా ప్రాజెక్టులోని మూడు మీటర్ల లెవల్ నీటిని ఇప్పటికే గేట్లద్వారా కిందకు విడిచిపెట్టారు. వర్షాలు ఎక్కువై ఇన్‌ఫ్లో పెరిగితే గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని డీఈ శ్యామసుందరరావు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద 62.2 మీటర్ల లెవెల్ నీటిమట్టం ఉందని తెలిపారు. మడ్డువలస ప్రాజెక్టు వద్ద పాడైన గురైన జనరేటర్‌ను ప్రాజెక్టు అధికారులు శనివారం మరమ్మతులు చేపట్టారు. టెక్కలి డివిజన్లో వర్షపాతం టెక్కలి: పై-లీన్ ప్రభావంతో టెక్కలి డివిజన్లో కురిసిన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. ఇచ్చాపురం: 46.6 మిల్లీమీటర్లు, కవిటి: 48.8, కంచిలి: 49.2, సోంపేట:35.2, మందస:24.2, పలాస: 21.2, వజ్రపుకొత్తూరు: 21.6, నందిగాం: 20, టెక్కలి 9.8, సంతబొమ్మాళి 14.2, కోటబొమ్మాళి: 15.4, జలుమూరు-5.2 మిల్లీమీటర్లుగా నమోదు చేశారు. -
గండం గడిచింది
ఏలూరు, న్యూస్‌లైన్ :పై-లీన్ తుపాను గండం నుంచి జిల్లా బయటపడింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఈదురు గాలులు మినహా వాతావరణం సాధారణంగానే ఉంది. జిల్లాలో ఎక్కడా వర్షం కురవకపోవడంతో రైతులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తుపాను తీరం దాటినా దాని ప్రభావం ఏడెనిమిది గంటలు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో అధికారులు, సహాయక సిబ్బంది రాత్రి వేళ కూడా తమకు కేటాయిం చిన ప్రాంతాల్లోనే మకాం వేసి ఉన్నారు. 175-185 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. ఊహించిన స్థాయిలో ఈదురుగాలులు వీయకపోవడం రైతులకు మేలు చేసింది. తుపాను విపత్తును తట్టుకునేందుకు కలెక్టర్ సిద్ధార్థజైన్ ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆరా తీస్తూ అధికారులను సన్నద్ధం చేశారు. జిల్లా ప్రత్యేకాధికారి సంజయ్‌జాజుతో కలసి పరిస్థితిని సమీక్షించారు. తుపాను తీవ్రత జిల్లాపై ఉండవచ్చనే అంచనాల నేపథ్యంలో వివిధ మండలాలకు 12 మంది ప్రత్యేకాధికారులను నియమించారు. అధికార యంత్రాంగం ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, డీపీవో ఎ.నాగ రాజు, జెడ్పీ సీఈవో నాగార్జునసాగర్, నరసాపురం ఆర్డీవో జె.వసంతరావు తీర ప్రాంతంలో పరిస్థితులను శనివారం పర్యవేక్షించారు. తుపాను తీరం దాటే సమయంలో ఏర్పడే విపత్తును ఎదుర్కొనేందుకు పేరుపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద 200 మంది వృద్ధులు, పిల్లలకు వసతి సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామని అక్కడే ఉన్న జేసీ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. నర్సాపురం బియ్యపుతిప్ప, పేరుపాలెం నార్త్, సౌత్ ప్రాంతాల్లోను అధికారులు ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి జిల్లా సురక్షితంగా ఉందని, రానున్న 8గంటల వరకు అన్ని ప్రాంతా ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. తుపాను తీరం దాటాక కూడా భారీ వర్షం, ఈదురుగాలులు వీయవచ్చన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మోహరింపు పై-లీన్‌ను ఎదుర్కొనేందుకు పోలవరం, నర్సాపురంలో జాతీ య విపత్తుల నివారణ సంస్థ (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బందిని 20 మంది చొప్పున అందుబాటులో ఉంచారు. జిల్లా కేంద్రంలో 230 మంది ఆర్మీ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ట్రాన్స్‌కో, ఆర్అండ్బీ, ఆర్డ బ్ల్యుఎస్, ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖల అధికారులను సంసిద్ధం చేశారు. వాగులు, కాలువల పరిశీలన మెట్ట ప్రాంతంలో జల్లేరు జలాశయం, బైనేరువాగులను అధికారులు పరిశీలించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. దెందులూరులో ప్రమాదకరంగా ఉన్న పెరుగ్గూడెం వాగును ఆర్డీవో శ్రీనివాస్, డీపీవో అల్లూరి నాగరాజువర్మ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ బి రమణ పరిశీలించారు. నిడదవోలు మండలం ఎర్ర కాల్వ ముంపునకు గురైన ప్రాంతాలను కొవ్వూరు ఆర్డీవో గోవిందరావు పరిశీలించారు. మండలంలో 2వేల ఎకరరాల వరిపంట నీట మునిగినట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా.