గండం గడిచింది
Published Sun, Oct 13 2013 1:19 AM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM
ఏలూరు, న్యూస్‌లైన్ :పై-లీన్ తుపాను గండం నుంచి జిల్లా బయటపడింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఈదురు గాలులు మినహా వాతావరణం సాధారణంగానే ఉంది. జిల్లాలో ఎక్కడా వర్షం కురవకపోవడంతో రైతులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తుపాను తీరం దాటినా దాని ప్రభావం ఏడెనిమిది గంటలు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో అధికారులు, సహాయక సిబ్బంది రాత్రి వేళ కూడా తమకు కేటాయిం చిన ప్రాంతాల్లోనే మకాం వేసి ఉన్నారు. 175-185 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. ఊహించిన స్థాయిలో ఈదురుగాలులు వీయకపోవడం రైతులకు మేలు చేసింది. తుపాను విపత్తును తట్టుకునేందుకు కలెక్టర్ సిద్ధార్థజైన్ ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆరా తీస్తూ అధికారులను సన్నద్ధం చేశారు. జిల్లా ప్రత్యేకాధికారి సంజయ్‌జాజుతో కలసి పరిస్థితిని సమీక్షించారు.
తుపాను తీవ్రత జిల్లాపై ఉండవచ్చనే అంచనాల నేపథ్యంలో వివిధ మండలాలకు 12 మంది ప్రత్యేకాధికారులను నియమించారు. అధికార యంత్రాంగం ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, డీపీవో ఎ.నాగ రాజు, జెడ్పీ సీఈవో నాగార్జునసాగర్, నరసాపురం ఆర్డీవో జె.వసంతరావు తీర ప్రాంతంలో పరిస్థితులను శనివారం పర్యవేక్షించారు. తుపాను తీరం దాటే సమయంలో ఏర్పడే విపత్తును ఎదుర్కొనేందుకు పేరుపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద 200 మంది వృద్ధులు, పిల్లలకు వసతి సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామని అక్కడే ఉన్న జేసీ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
నర్సాపురం బియ్యపుతిప్ప, పేరుపాలెం నార్త్, సౌత్ ప్రాంతాల్లోను అధికారులు ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి జిల్లా సురక్షితంగా ఉందని, రానున్న 8గంటల వరకు అన్ని ప్రాంతా ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. తుపాను తీరం దాటాక కూడా భారీ వర్షం, ఈదురుగాలులు వీయవచ్చన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది మోహరింపు పై-లీన్‌ను ఎదుర్కొనేందుకు పోలవరం, నర్సాపురంలో జాతీ య విపత్తుల నివారణ సంస్థ (ఎన్‌డీఆర్‌ఎఫ్) సిబ్బందిని 20 మంది చొప్పున అందుబాటులో ఉంచారు. జిల్లా కేంద్రంలో 230 మంది ఆర్మీ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ట్రాన్స్‌కో, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డ బ్ల్యుఎస్, ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖల అధికారులను సంసిద్ధం చేశారు.
వాగులు, కాలువల పరిశీలన
మెట్ట ప్రాంతంలో జల్లేరు జలాశయం, బైనేరువాగులను అధికారులు పరిశీలించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. దెందులూరులో ప్రమాదకరంగా ఉన్న పెరుగ్గూడెం వాగును ఆర్డీవో శ్రీనివాస్, డీపీవో అల్లూరి నాగరాజువర్మ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ బి రమణ పరిశీలించారు. నిడదవోలు మండలం ఎర్ర కాల్వ ముంపునకు గురైన ప్రాంతాలను కొవ్వూరు ఆర్డీవో గోవిందరావు పరిశీలించారు. మండలంలో 2వేల ఎకరరాల వరిపంట నీట మునిగినట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా.
Advertisement
Advertisement