పొంచి ఉన్న వరద ముప్పు
Published Sun, Oct 13 2013 4:00 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాకు పై-లీన్ తుపాను ముప్పు తప్పినా వరద ముప్పు పొంచి ఉంది. ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నాగావళి, వంశధార నదుల్లో ఆదివారం సాయంత్రం నుంచి నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖాధికారులు తెలిపారు. ఇచ్ఛాపురం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో బాహుదా నదికి వరదలు వచ్చే ప్రమాదం ఉండడంతో ఇప్పటికే 15 గ్రామాలను ఖాళీ చేయించారు. మరిన్ని గ్రామాలను ఖాళీ చేయించాలని యోచిస్తున్నారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా శుక్రవారమే మడ్డువలస, తోటపల్లి, గొట్టాబ్యారేజ్‌లలో నీటిని దిగువకు వదిలారు. ఎప్పటినీరు అప్పుడు వెళ్లిపోయేందుకు వీలుగా తెరిచిన గేట్లను అలాగే ఉంచారు.
దబారుసింగి, సైరిగాం, కళింగదళ్ రిజర్వాయర్లలో నీటిని దిగువకు వదిలారు. నదులకు అనుసంధానంగా ఉన్న పంట కాలువలను మూసివేశారు. దీంతో గ్రామాలకు ముంపు బాధ తప్పుతుందని అధికారులు భావిస్తున్నారు. నది ద్వారానే నీరు ప్రవహించి సముద్రంలో కలుస్తుందని అధికారుల యోచన. తుపాను కారణంగా సముద్రంలోని అలలు ఎగిసిపడుతుండడంతో నదులలోని నీరు సముద్రంలోనికి చేరేందుకు సమయం పడుతుంది. దీంతో వరద వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల వరద బెడద లేకపోయినప్పటికీ ఆదివారం కూడా వర్షాలు కురిస్తే వరద వచ్చే పరిస్థితి ఉంటుందని నీటిపారుదల శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. అటువంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
గొట్టా బ్యారేజీ 21 గేట్లు ఎత్తివేత పాతపట్నం : హిరమండలంలోని గొట్టాబ్యారేజీ 21 గేట్లను శనివారం రాత్రి 7 గంటలకు ఎత్తివేశారు. మొత్తం 21 గేట్లలో 11 గేట్లు మూడు మీటర్లు, 10 గేట్లు రెండు మీటర్ల ఎత్తున ఎత్తారు. బ్యారేజీలో 19 వేల క్యూసెక్కుల నీరు పారుతోంది.
తోటపల్లి 8 గేట్లు ఎత్తివేత
వీరఘట్టం: నాగావళి నదిపై తోటపల్లి ప్రాజెక్టు 8 గేట్లను శనివారం ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో 10 వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్టు ప్రాజెక్టు ఇంజనీర్ అప్పలనాయుడు తెలిపారు.
అప్రమత్తంగా ఉండండి...
నదీతీర ప్రాంతాల్లో ఉన్న కిమ్మి, చిదిమి, పాలమెట్ట, పనసనందివాడ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ ఎల్.గరికివాడు ప్రజలకు సూచించారు. స్థానిక కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. వీఆర్‌వోలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలన్నారు.
మడ్డువలస గేట్లు మూసివేత
వంగర: మండలంలోని మడ్డువలస ప్రాజెక్టు గేట్లను అధికారులు శనివారం మూసివేశారు. పై-లీన్ తుపాను కారణంగా ఇన్‌ఫ్లో ఎక్కువవుతుండడంతో ముందస్తు చర్యగా ప్రాజెక్టులోని మూడు మీటర్ల లెవల్ నీటిని ఇప్పటికే గేట్లద్వారా కిందకు విడిచిపెట్టారు. వర్షాలు ఎక్కువై ఇన్‌ఫ్లో పెరిగితే గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని డీఈ శ్యామసుందరరావు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద 62.2 మీటర్ల లెవెల్ నీటిమట్టం ఉందని తెలిపారు. మడ్డువలస ప్రాజెక్టు వద్ద పాడైన గురైన జనరేటర్‌ను ప్రాజెక్టు అధికారులు శనివారం మరమ్మతులు చేపట్టారు.
టెక్కలి డివిజన్‌లో వర్షపాతం
టెక్కలి: పై-లీన్ ప్రభావంతో టెక్కలి డివిజన్‌లో కురిసిన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి.
ఇచ్చాపురం: 46.6 మిల్లీమీటర్లు, కవిటి: 48.8, కంచిలి: 49.2, సోంపేట:35.2, మందస:24.2, పలాస: 21.2, వజ్రపుకొత్తూరు: 21.6, నందిగాం: 20, టెక్కలి 9.8, సంతబొమ్మాళి 14.2, కోటబొమ్మాళి: 15.4, జలుమూరు-5.2 మిల్లీమీటర్లుగా నమోదు చేశారు.
Advertisement
Advertisement