Electrical works
-
కరెంటు మీటరులో ఏదైనా సమస్య ఉందా.. బహుశా మీక్కూడా ఇలా జరుగుతుందేమో..!?
సాక్షి, కరీంనగర్: విద్యుత్‌శాఖలో మీటర్ల దందా నడుస్తోంది. వినియోగదారులకు తెలియకుండానే మీటర్లను ఇతర ప్రాంతాలకు మార్చుతూ కనెక్షన్ ఇస్తూ లైన్మెన్లు మాయాజాలానికి పాల్పడుతున్నారు. ఇది తెలిసిన ఉన్నతాధికారులు మామూలుగా తీసుకుంటూ మెమోలతో సరిపెడుతున్నారు. ఇటీవల టీఎస్ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఆఫీసు పరిధిలోని చిగురుమామిడి సెక్షన్‌న్‌లో చోటు చేసుకున్న ఓ సంఘటన కరీంనగర్ రూరల్ డీఈకి వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిగురుమామిడి నివాసి అయిన సీహెచ్.రమేశ్‌కు చెందిన సర్వీసు నంబరు 3560ను అతని అనుమతి లేకుండానే అదే గ్రామంలో వేరొకచోట అమర్చారు. పంక్చర్ దుకాణానికి చెందిన కేటగిరి–2 మీటర్‌ను వేరే దుకాణంలో వినియోగదారుడి ప్రమేయం లేకుండా అమర్చడం వివాదాస్పదంగా మారింది. ఇది గమనించిన వినియోగదారుడు తన మీటర్‌ను ఇతరులకు ఎలా అమర్చారని లైన్మెన్పై కరీంనగర్ రూరల్ డీఈకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన డీఈ సదరు లైన్మెన్కు మెమోజారీ చేశారు. లైన్మెన్ సదరు వినియోగదారుడి మీటర్‌ను యధాస్థానంలో అమర్చేందుకు అంగీకరించాడు. ఇందుకుగాను అధికారులకు ఇచ్చిన ఫిర్యాదును వాపసు తీసుకోవాలంటూ వినియోగదారుడి నుంచి సంతకం తీసుకుని, మీటర్‌ను మార్చకుండా రేపు..మాపు అంటూ జాప్యం చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ సర్వీసుపై బిల్లు బకాయి ఉందని, కేసు చేయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇలాంటి మీటర్ల దందా సర్కిల్ పరిధిలో అనేక చోట్ల కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. కరీంనగర్లో సైతం విద్యుత్ మీటర్లు ఒకచోట..ఇంటి నంబర్లు మరోచోట ఉన్నట్లు సమాచారం. కొంతమంది లైన్మెన్లు చేస్తున్న తప్పిదాలతో విద్యుత్ శాఖలోని సిబ్బందికి అపవాదు వస్తోందని మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెమో జారీ చేశాం.. చిగురుమామిడికి చెందిన రమేశ్ బిల్లు కట్టకపోవడంతో లైన్మెన్ విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. అయితే ఈ సర్వీసును ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి షిఫ్ట్ చేశాడని వినియోగదారుడు కరీంనగర్ రూరల్ డీఈకి ఫిర్యాదు చేశాడు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా సర్వీసు వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేసినట్లు తేలింది. వినియోగదారుడి అనుమతి లేకుండా లైన్మెన్ సర్వీసును షిఫ్ట్ చేయడం తప్పుగా భావించి ఉన్నతాధికారుల సూచన మేరకు లైన్మెన్కు మెమో జారీ చేసి విచారణ చేపడుతున్నాం. అయినప్పటికీ లైన్మెన్, వినియోగదారుడు ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. – ప్రకాశ్, ఏఈ, చిగురుమామిడి -
వీరి సంపాదన నెలకు రూ.90 వేలకుపైనే.. భవిష్యత్తు స్కిల్ వర్కర్లదే..!
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలులోని మద్దూర్ నగర్‌కు చెందిన షఫీ 1997లో ఐటీఐ పూర్తి చేసి ఆ తర్వాత ఎలక్ట్రీషియన్‌గా స్థిరపడ్డాడు. అపార్ట్మెంట్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పెద్ద ఆస్పత్రులకు ఎలక్ట్రికల్ వర్క్ కాంట్రాక్టుకు తీసుకుని బాగానే సంపాదిస్తున్నాడు. తనవద్ద ఎలక్ట్రికల్ పని నేర్చుకున్న ఎంతోమంది కూడా సొంతంగా జీవనం సాగిస్తున్నారు. కానీ రెండు, మూడేళ్లుగా అతనికి ఎలక్ట్రీషియన్లు దొరకడం లేదు. ఉత్తరప్రదేశ్ నుంచి మూడు బ్యాచ్‌లుగా పిలిపించుకుని వారితో పనిచేయిస్తున్నాడు. కారణం పనిచేసేవారు మన వద్ద క్రమంగా తగ్గిపోతుండటమే. చదవండి: ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం! పట్టణీకరణ భారీగా పెరుగుతోంది. ఆస్పత్రులు, బ్యాంకులు, అపార్ట్మెంట్లు, రియల్ ఎస్టేట్‌తో పాటు నిర్మాణరంగంలో అభివృద్ధి జరుగుతోంది. కానీ వర్కర్ల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీంతో భవన నిర్మాణ కార్మికులతో పాటు ఎలక్ట్రీషియన్లు, శానిటేషన్ వర్కర్లను(ఫిట్టర్లు) కూడా బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్ నుంచి తెప్పించుకుని పనులు చేస్తున్నారు. పై రెండు ఉదాహరణలు పరిశీలిస్తే ‘స్కిల్డ్ వర్కర్ల’ కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎక్కువ శాతం మంది విద్యార్థులు సూపర్ విజన్ జాబ్‌ల దిశగా అడుగులేస్తూ పని నేర్చుకునే ఐటీఐని పక్కన పడేస్తుండటం ఆందోళనకరం. గమనించిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. నియోజకవర్గానికో స్కిల్హబ్ ఏర్పాటు చేసి, వృత్తివిద్య పూర్తిచేసిన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా తీసుకుంది. టెక్నాలజీ విప్లవం వచ్చిన తర్వాత అధిక శాతం మంది స్మార్ట్ లైఫ్‌కు అలవాటుపడ్డారు. శారరీక శ్రమ లేని ఉద్యోగాలే లక్ష్యంగా విద్యార్థులు కూడా కోర్సులు ఎంపిక చేసుకుంటున్నారు. ‘మేం కష్టపడ్డాం. మా పిల్లలు అలా కాకూడదు. సుఖంగా బతకాలి’ అనే ధోరణితో తల్లిదండ్రులు వారి పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది డిగ్రీలు, పీజీలు, బీటెక్‌లు, ఎంబీఏ, ఎంసీఏ లాంటి చదువులపై దృష్టి సారిస్తున్నారు. ఈ విభాగాల్లో ఉద్యోగాలు సాధించి స్థిరపడనివారు కొందరైతే, మంచి చదువులు అభ్యసించి ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నవారి సంఖ్య ఎక్కువే. దీనికి కారణం బీటెక్, ఎంబీఏ, ఎంసీఏలు ‘సూపర్వైజింగ్’ ఉద్యోగాలు. దేశంలో ప్రభుత్వరంగం కంటే ప్రైవేటురంగంలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ప్రైవేటు కంపెనీలు ‘స్కిల్డ్ వర్కర్ల’నే రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఐటీఐ, డిప్లొమో చదివిన వారివైపు మక్కువ చూపుతున్నాయి. దీనికి కారణం ఈ విభాగాల్లోని వారు శారీరక శ్రమతో పనిచేయాలి. ఐటీఐలో 71.08 శాతం తక్కువ అడ్మిషన్లు ఎలక్ట్రికల్, ఫిట్టర్, మెకానికల్ రంగాల్లో ఎక్కువగా ఐటీఐ చదివిన విద్యార్థులు ఉంటారు. కొంతకాలంగా ఐటీఐ చదివే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. దీనికి కారణం ఈ చదువులు చదివితే వర్కర్లుగా పనిచేయాలి. ఇంజినీరింగ్ లాంటి చదువులు చదివితే కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యోగం చేయొచ్చనే దృక్పథం విద్యార్థుల్లో ఉండటమే. గత ఐదేళ్ల ఐటీఐ అడ్మిషన్లు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 2018లో అందుబాటులో ఉన్న సీట్ల కంటే 23 శాతం తక్కువగా అడ్మిషన్లు నమోదైతే, 2019లో 28 శాతం, 2020లో 40.76 శాతం, 2021లో 39.76 శాతం తక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం 2022లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏకంగా 71.08 శాతం తక్కువగా నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలోని 17 ఐటీఐ కాలేజీల్లో 2012 సీట్లు ఉంటే కేవలం 713 మాత్రమే భర్తీ అయ్యాయి. నంద్యాల జిల్లాలో 21 కాలేజీల్లో 2,924 సీట్లు ఉంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 714 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే నంద్యాల జిల్లాలో 75.58 శాతం తక్కువ అడ్మిషన్లు నమోదయ్యాయి. దీన్నిబట్టే ఐటీఐ చదువులపై విద్యార్థులు మక్కువ చూపడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. భవిష్యత్తు స్కిల్ వర్కర్లదే.. ఐటీఐ, డిప్లొమో చదువులు పూర్తి చేసిన స్కిల్డ్ వర్కర్లకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆస్పత్రులు, బ్యాంకులు, రియల్ ఎస్టేట్‌తో పాటు నిర్మాణరంగంలో స్కిల్డ్ వర్కర్ల అవసరం భారీగా ఉండబోతోంది. ఎన్ఎస్డీసీ(నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోనే వచ్చే నాలుగేళ్లలో 41.41 లక్షల మంది స్కిల్డ్ వర్కర్ల అవసరం ఉండబోతోంది. అయితే ఏడాదికి 2.85 లక్షల మందే అందుబాటులో ఉంటున్నారు. దేశవ్యాప్తంగా కియా, హుండాయి, మారుతి, హరీ మోటార్స్ లాంటి ఆటోమొబైల్‌తో పాటు అన్ని రంగాల్లో కూడా ఫిట్టర్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో నిపుణులైన వారికి ఉద్యోగ అవకాశాలున్నాయి. కారు, బైక్ మెకానిక్, నిర్మాణరంగంలో ఫిట్టింగ్, ఎలక్ట్రికల్ విభాగాల్లో పనిచేసే వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. ఇటీవల ఈ రంగాల్లో పని నేర్చుకునే ఆసక్తి తగ్గుతోంది. మెకానిక్ నుంచి ఎలక్ట్రికల్, ఫిట్టర్ల వరకూ అసిస్టెంట్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒక ఎలక్ట్రిషియన్ ఒక ఇంటికి కరెంట్ పని చేస్తే 2–4 రోజుల్లో పూర్తవుతుంది. దీనికి రూ.15 వేల నుంచి రూ. 20 వేలు తీసుకుంటున్నారు. నెలలకు కనీసం 5 కొత్త ఇళ్లకు ఎలక్రికల్ పని చేస్తే రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు వస్తుంది. బైక్ మెకానిక్, ఫిట్టర్లు కూడా రోజూ కనీసం రూ.3వేలు తక్కువ లేకుండా సంపాదిస్తారు. అంటే వీరి సంపాదన కూడా నెలకు రూ.90 వేలకుపైనే. స్కిల్ డెవలప్మెంట్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి విద్యార్థుల్లో వృతినైపుణ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. జిల్లాలో స్కిల్‌డెవలప్‌మెంట్ కాలేజీ నిర్మిస్తోంది. రెండు జిల్లాల్లో 14 నియోజకవర్గాల్లో స్కిల్‌హబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 5 హబ్‌లు ఏర్పాటు చేశారు. పది, ఇంటర్, డిగ్రీ చదివిన నిరుద్యోగులకు 45 రోజుల నుంచి 60 రోజులు పలు విభాగాల్లో శిక్షణ ఇచ్చి కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో చదువు మధ్యలోనే ఆపేసినవారు, నిరుద్యోగులు ఇక్కడ ‘స్కిల్’ మెరుగుపరుచుకుని ఉద్యోగం సంపాదించొచ్చు. నియోజకవర్గానికి ఒక స్కిల్హబ్ ఏర్పాటు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కర్నూలు, ఎమ్మిగనూరులో రెండు సెంటర్లలో శిక్షణ ఇస్తున్నాం. డిగ్రీ, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు వేర్వేరుగా శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ తర్వాత వీరికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. 24/7, వెబ్బ్లెండర్స్ లాంటి కంపెనీలతో సంప్రదింపులు జరిపాం. శిక్షణ పూర్తికాగానే ప్లేస్మెంట్లు ఇస్తాం. – శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా మేనేజర్, స్కిల్‌డెవలప్‌మెంట్ -
Hyderabad Rains: సరిలేరు నీకెవ్వరూ!
సాక్షి, హైదరాబాద్: చలిగాలులు, చిటపట కురిసే వాన జల్లుల మధ్య ఎవరైనా గజగజ వణుకుతారు. ఇంటి పట్టున వెచ్చగా ఉండటమే మంచిదనుకుంటారు. కానీ.. ఈ విద్యుత్ సిబ్బంది మాత్రం తమ విధ్యుక్త ధర్మాన్ని తూచ తప్పకుండా నిర్వర్తించి ఔరా.. అనిపించారు. మంగళవారం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్‌లలో పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్–7లో స్తంభంపై మంటలు వస్తున్నాయంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో సిబ్బంది రెయిన్కోట్లు ధరించి వర్షంలోనే స్తంభంపైకి ఎక్కి మరమ్మతులు చేపట్టారు. జోరు వానలోనూ తమ కర్తవ్యాన్ని నిక్కచ్చిగా నిర్వర్తించిన సిబ్బందిని బస్తీవాసులు అభినందించారు. చదవండి: హైదరాబాద్ పరిధిలో 68% అధిక వర్షపాతం.. వరద నీరు ఇంకే దారేదీ? -
హమ్మ తొండా.. ఎంత పనిచేశావే!
వజ్రపుకొత్తూరు రూరల్: బుధవారం ఉదయం 8.30 గంటల సమయం.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని 15 గ్రామాలకు ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎండ వేడి ఓ వైపు.. ఉక్కపోత మరోవైపు.. వెంటనే పలువురు వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సమాచారమిచ్చారు. తమవైపు నుంచి ఎలాంటి సమస్య లేకపోవడంతో.. ఐదుగురు లైన్మెన్లు, సచివాలయ విద్యుత్ సిబ్బంది రంగంలోకి దిగి లైన్లను తనిఖీ చేయడం ప్రారంభించారు. గంట సమయం గడిచినా సమస్య ఏంటనేది మాత్రం తేలలేదు. కిడిసింగి గ్రామం నుంచి మొదలైన వీరి అన్వేషణ డోకులపాడు వరకు సాగింది. చివరకు రెండున్నర గంటల తర్వాత డోకులపాడులోని చర్చి వద్దనున్న స్తంభంపైన అసలు విషయం బయటపడింది. తీగల మధ్య ఓ తొండ చిక్కుకుపోవడాన్ని గుర్తించిన సిబ్బంది.. దాన్ని తొలగించి సరఫరాను పునరుద్ధరించారు. ఈ విషయం తెలసుకున్న స్థానికులు ‘హమ్మ తొండా.. ఎంత పని చేశావే!’ అంటూ నవ్వుకున్నారు. -
మన్నవరంలో సోలార్ ఉపకరణాల తయారీ
సాక్షి, అమరావతి: తిరుపతి జిల్లా మన్నవరంలో భారీ విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కలను నిజంచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్తో కలిసి 750 ఎకరాల్లో ఈ యూనిట్ ఏర్పాటుకు అంకురార్పణ చేయగా ఆయన మరణానంతరం అది అటకెక్కింది. కానీ, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సర్కార్ మన్నవరంలో సోలార్ వంటి పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించిన ఉపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధంచేస్తోంది. అలాగే, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పునరుత్పాదక ఇంధన ఉపకరణాల దిగుమతులను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు మాన్యుఫాక్చరింగ్ జోన్స్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందుకు ఇష్టమైన రాష్ట్రాలు, భాగస్వామ్య కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానిస్తూ తాజాగా టెండర్లను పిలిచింది. వీటిలో.. ఇప్పటికే ఉన్న రెండు విద్యుత్ ఉపకరణాల తయారీ కేంద్రాలను (బ్రౌన్‌ఫీల్డ్) సోలార్ ఉపకరణాల యూనిట్లుగా మార్చడంతోపాటు వీటికి అదనంగా మరో గ్రీన్‌ఫీల్డ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో.. బ్రౌన్‌ఫీల్డ్ విభాగంలో మన్నవరాన్ని అభివృద్ధిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. ఒక్కొక్కటి రూ.1,000 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈ యూనిట్లలో రూ.400 కోట్లు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ (సీఐఎఫ్), కామన్ టెస్టింగ్ ఫెసిలిటీ (సీటీఎఫ్)లకు గ్రాంట్ రూపంలో ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు కానీ, భాగస్వామ్య కంపెనీలుగానీ ముందుకు రావచ్చని, ఆసక్తి కలిగిన సంస్థలు మే 4లోగా బిడ్లు దాఖలు చేయాలని కోరింది. అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ.. ఇక మన్నవరంలో భారీ విద్యుత్ ఉపకరణాల తయారీ కేంద్రం కోసం నాటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి భూములను కేటాయించారు. 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. కానీ, ఒక్కసారిగా థర్మల్ విద్యుత్‌కు డిమాండ్ తగ్గడంతో ఈ కేంద్రం నామమాత్రంగా ఉండిపోయింది. అనంతరం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచి మన్నవరంలో భారీ ఉపకరణాల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేసే నిమిత్తం కేంద్రానికి పలు ప్రతిపాదనలు పంపారు. అలాగే, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నవంబర్ 11, 2021లో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌ను కలిసి పీఎల్ఐ (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) స్కీం కింద మన్నవరంలో విద్యుత్ ఉపకరణాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఈ ఏడాది జనవరిలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కలిసి ప్రతిపాదిత మూడు విద్యుత్ ఉపకరణ తయారీ కేంద్రాల్లో ఒకటిగా మన్నవరాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరారు. ఇక కేంద్ర ప్రభుత్వం మూడు పునరుత్పాదక విద్యుత్ పరికరాల యూనిట్లను ఏర్పాటుచేయడానికి ముందుకు వస్తుండటంతో ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోనుందని ఏపీఐఐసీ వీసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఈ భూమి ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్కు కేటాయించారని.. దీన్ని ఏ విధంగా భాగస్వామ్య కంపెనీగా ఏర్పాటు చేయాలన్న అంశాన్ని పరిశీలించి బిడ్డింగ్‌లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. -
విద్యుత్ సేవల్లో విఫలమైతే జరిమానా
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థలు ఇక నుంచి మరింత జవాబుదారీతనంతో వ్యవహరించనున్నాయి. వినియోగదారులకు ఏమాత్రం అసౌకర్యం కలిగించినా పరిహారం చెల్లించాల్సి ఉన్నందున బాధ్యతాయుతంగా మెలగనున్నాయి. వివరంగా చెప్పాలంటే తమ తప్పును ఒప్పుకుని మరీ వినియోగదారుడికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా చట్టానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఊపిరి పోసింది. విద్యుత్ వినియోగదారులకు బ్రహ్మాస్త్రం లాంటి ఈ సంస్కరణలను అధికారిక గెజిట్‌లో కూడా ప్రకటించినట్టు ఏపీఈఆర్సీ ఆదివారం మీడియాకు తెలిపింది. ఇది ఈ నెల 4వ తేదీ నుంచే అమలులోకి వచ్చిందని స్పష్టం చేసింది. మరో కీలక విషయం ఏమిటంటే దీనికి సంబంధించి సమగ్ర వివరాలతో నివేదికను ప్రతి మూడు నెలలకు ఒకసారి కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది. కనెక్షన్ తప్పుగా తొలగిస్తే.. నిజానికి విద్యుత్ వినియోగదారుల హక్కుల పరిరక్షణకు గతంలోనే చట్టాలొచ్చినా విద్యుత్ సంస్థలు పెడచెవిన పెట్టడంతో పరిహారం కోరే వారి సంఖ్య అతి తక్కువగా ఉంటోందని ఏపీఈఆర్సీ పేర్కొంది. ఈ నేపథ్యంలో పంపిణీ సంస్థల పనితీరు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని భావించిన కమిషన్ బలమైన చట్టాలకు పదును పెట్టినట్లు వెల్లడించింది. ► ఇక నుంచి విద్యుత్ సంస్థలకు సంబంధించి ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ అందుబాటులో ఉండాలి. దీనివల్ల కరెంట్ పోతే తక్షణమే ఫిర్యాదు చేసే వెసులుబాటు కలుగుతుంది. ఈ వ్యవస్థ ఇప్పటివరకూ సరిగా పనిచేయడం లేదనే ఫిర్యాదులున్నాయి. ► ఎవరైనా కొత్త కనెక్షన్, అదనపు లోడ్ కోరితే విద్యుత్ సంస్థలు తక్షణమే తగిన సమాచారం అందించాలి. నిర్ణీత గడువులోగా డిమాండ్‌ను నెరవేర్చాలి. ► సర్వీస్ కనెక్షన్‌ను తప్పుగా తొలగించినా, కనెక్షన్ తొలగించకుండా తిరిగి కనెక్షన్ చార్జీలు వసూలు చేసినా సర్వీసు వైఫల్యం కింద పరిగణించాలి. ఇది క్షమించరాని నేరంగా విద్యుత్ సంస్థలు గుర్తించి తక్షణమే వినియోగదారులకు పరిహారం చెల్లించాలి. ప్రతి మూడు నెలలకు నివేదిక.. విద్యుత్ సేవల్లో లోపం కారణంగా చెల్లించిన జరిమానా వివరాలను ఇక మీదట ఆంధ్రప్రదేశ్ నియంత్రణ మండలి స్వయంగా పరిశీలిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వివరాలను పంపాలని గెజిట్‌లో పేర్కొంది. వైఫల్యానికి కారణాలను కూడా కమిషన్‌కు వెల్లడించాలి. కారణాలు సహేతుకం కాదని భావిస్తే పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించే వీలుంది. విపత్తుల సమయంలోనూ.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్ సేవలకు అంతరాయాలు కలగడం సహజం. అయితే సేవల పునరుద్ధరణ ఏ తేదీన జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ పంపిణీ సంస్థలు బహిరంగ ప్రకటన జారీ చేయాలని కమిషన్ పేర్కొంది. చెప్పిన తేదీలోగా విద్యుత్ ఇవ్వకపోతే వినియోగదారులకు పరిహారం చెల్లించాలి. సేవలు కొనసాగించలేని స్థితిని సహేతుకమని కమిషన్ భావిస్తే పరిహారం చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వొచ్చు. విప్లవాత్మక సంస్కరణలు.. ‘ఇవి విప్లవాత్మక సంస్కరణలు. డిస్కమ్‌లు సేవలపై మరింత దృష్టి పెడతాయని ఆశిస్తున్నాం. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తేవాలని డిస్కమ్‌లను ఆదేశించాం. పంపిణీ సంస్థల పనితీరు సమాచారాన్ని కమిషన్ సమీక్షించి వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చే చర్యలు చేపట్టింది. మరింత మేలైన సేవలు అందించేందుకే ఈ ప్రయత్నం’’. – జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి,ఏపీఈఆర్సీ చైర్మన్ -
ఆ దీపాలన్నీ స్త్రీలవే.. ఆ దీపాలూ స్త్రీలే
తమిళనాడులో కరువు ఊరు అది. సరిగా భుక్తి లేదు. చేయడానికి స్త్రీలు చేయదగ్గ పని లేదు. భర్త ఎలక్ట్రీషియన్. నీ పనే నేను చేస్తాను అంది ధనలక్ష్మి. ‘కరెంటు పని నువ్వు చేయలేవు’ అన్నాడు భర్త. ఆమె వినలేదు. వెదురుపుల్లలతో కట్టిన బొమ్మలకు సీరియల్ సెట్లు అమర్చడం నేర్చుకుంది. జాతరలు, తిరునాళ్ళు, పండగలకు సీరియల్ సెట్ల వెదురుబొమ్మలు కావాలి. ఆ పనిలో విపరీతమైన నైపుణ్యం సంపాదించింది. మిగిలిన ఆడవాళ్లకు కూడా ఆ పని నేర్పించింది. నేడు ‘అరసర్కుళం’ అనే ఊరు సీరియల్సెట్ల బొమ్మలకు ప్రసిద్ధి. ఆ దీపాలన్నీ స్త్రీలవే. ఆ దీపాలూ స్త్రీలే. తమిళనాడు తిరునల్వేలి ప్రాంతంలోని ఎండను, కరువును భరించడం కష్టం. ఉన్నట్టుండి జలుబు చేసినట్టు కొన్ని మేఘాలు చీదుతాయి. వాటికి ఏమైనా పండితే పండినట్టు. అయినా ముక్కు కారితే పంటలు పండుతాయా? ‘మా ఊరి పేరు అరసర్కుళం. అది మారుమూల. పంటలు లేక చాలామంది వలస పోతుంటారు. ఉన్నవారికి పని ఉండదు. రోజూ పట్నానికి పోయి పని చేసుకురావడానికి బస్సులు కూడా తిరగవు’ అంటుంది ధనలక్ష్మి. ఆమె ఇప్పుడు ఆ ఊరిలోని ‘ధనలక్ష్మి వైరింగ్ వర్క్స్’కు అధిపతి. ఆమె దగ్గర 50 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఆమె వల్ల ఉపాధి మార్గం తెలుసుకొని మరో 500 మంది జీవిక పొందుతున్నారు. ఇది ఇప్పటి పరిస్థితి. పదేళ్ల క్రితం కాదు. పదేళ్ల క్రితం... ధనలక్ష్మిది అరసర్కుళం ఊరే. అక్కడే పుట్టి పెరిగింది. ‘మాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. కాని వానలు లేకపోతే ఏమిటి చేయడం. అదంతా ఉత్త మట్టిగడ్డే కదా’ అంటుంది. తండ్రి ఆమెకు ప్రాయం రాగానే అదే ఊళ్లో ఉన్న అశోక్ అనే ఎలక్ట్రీషియన్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. ముగ్గురు కూతుళ్లు పుట్టారు. ‘మా ఆయన ఎలక్ట్రీషియన్. ఏదైనా డెకరేషన్ వస్తే లైట్లు వేస్తాడు. కాని రెండు మూడు వేల కంటే ఎక్కువ సంపాదించేవాడు కాదు’ అంటుంది ధనలక్ష్మి. తెలుగులో ప్రసిద్ధ రచయిత శ్రీరమణ ‘ధనలక్ష్మి’ అనే కథ రాశారు. అందులో ధనలక్ష్మి అనే ఇల్లాలు భర్తకు ఉన్న నిర్వహణాలోపాలను గ్రహించి తోడు నిలిచి అతడు వ్యాపారంలో వృద్ధిలోకి రావడానికి సహకరిస్తుంది. సరిగ్గా ఈ ధనలక్ష్మి కూడా భర్త అశోక్‌కు అలాగే అండగా నిలిచింది. ‘ఊళ్లో ఏ పనీ లేదు. నీ పనే నేను చేస్తా’ అందామె. అశోక్ ఉలిక్కి పడ్డాడు. ఎందుకంటే ఎలక్ట్రికల్ పనంటే కరెంటుతో వ్యవహారం. అది ఏమరుపాటుగా ఉంటే ప్రమాదం. అందుకే వద్దు అన్నాడు. ‘కాని నేను పట్టుపట్టాను. సాధించాను’ అంటుంది ధనలక్ష్మి. ఊళ్లో జాతర వస్తే... సరిగ్గా ఆ సమయంలోనే ఊళ్లో జాతర వచ్చింది. జాతరకు ఆ ప్రాంతంలో భారీ ఎత్తున సీరియల్ సెట్లతో వెలిగించిన అలంకరణలు చేస్తారు. వెదురుపుల్లతో దేవతల బొమ్మలు, పూలు, జంతువులు, పార్టీ గుర్తులు, రాజకీయ నాయకుల ముఖాలు కట్టి వాటికి సీరియల్లైట్లు అమర్చి వెలిగిస్తారు. వెదురుపుల్ల కట్టడంలో అశోక్ పని మంతుడు. కాని వాటికి సీరియల్లైట్లు బిగించడం శ్రమతో, నైపుణ్యంతో, ఓపికతో కూడిన పని. సీరియల్ సెట్లలో మధ్యలో ఒక లైట్ కాలిపోయినా మిగిలిన సెట్ వెలగదు. ఆ లైట్‌ను కొత్తది వేయాలి. లేదా వైర్‌ను జాయింట్ చేయాలి. ‘ఆ పనంతా నేను నేర్చుకుని మొదలెట్టాను’ అంటుంది ధనలక్ష్మి. భర్త వెదురు ఫ్రేమ్స్ కడితే ధనలక్ష్మి చకచకా సీరియల్ సెట్లు అమర్చేది. వెలిగిస్తే వెదురు కటౌట్ మిలమిలమని బ్రహ్మాండంగా వెలిగేది. అశోక్ ఆ జాతరలో లైట్లు వెలిగించి పేరు సంపాదించాడు. ధనలక్ష్మి హస్తవాసి మంచిదని నిరూపితం అయ్యింది. అందరు మహిళల కోసం తిరునల్వేలి జిల్లాలో ఆ మాటకొస్తే తమిళనాడులో ప్రతి ఊళ్లో ఏదో ఒక ఉత్సవం వేడుక జరుగుతూనే ఉంటాయి. వాటికి వెదురుపుల్లల సీరియల్సెట్ల కటౌట్స్ అవసరం. అవి తయారు చేసే కార్ఖానా పెడదామని ధనలక్ష్మి భర్తకు సూచించింది. ఊళ్లో ఉన్న ఒక ట్రస్టు సాయంతో లోన్ పొంది పని మొదలెట్టింది. భర్త మరికొందు మగపని వారు ఫ్రేమ్స్ తయారు చేస్తుంటే తను మరికొంతమంది మహిళలతో ఆ ఫ్రేమ్స్‌కు లైట్లు బిగించడం మొదలుపెట్టింది. ధనలక్ష్మి దగ్గరకు వస్తే రెడిమేడ్‌గా కావలిసిన కరెంటు బొమ్మలు దొరుకుతాయనే పేరు వచ్చింది. ఆ తర్వాత ధనలక్ష్మి చెన్నై నుంచి లైట్లు టోకున కొనుక్కొచ్చి సీరియల్ సెట్లను తయారు చేయడం కూడా ఆడవాళ్లకు నేర్చింది. సీరియల్ లైట్లు తామే తయారు చేసుకుని తామే కటౌట్స్‌కు అమర్చి మొత్తం కటౌట్‌ను అమ్మడం వల్ల వారికి లాభం బాగా రావడం మొదలెట్టింది. ‘ఇవాళ మా ఊరు పెద్ద సీరియల్ సెట్ల కేంద్రమే అయ్యింది’ అంటుంది ధనలక్ష్మి. తన వద్ద పనిచేస్తున్న మహిళలతో ధనలక్ష్మి ధనలక్ష్మి ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కుమార్తెకు పెళ్లయ్యింది. ఆమె కంప్యూటర్ ద్వారా కావలసిన బొమ్మలు తీసి తల్లికి ఇస్తోంది. అల్లుడు ఊళ్లు తిరిగి ఆర్డర్లు తెస్తున్నాడు. ధనలక్ష్మి ధైర్యం లక్ష్మిని తెచ్చింది. మూడు వెలుగులు ఆరు కాంతులుగా ఆమె జీవితం వెలుగుతోంది. ఆరు వందల మంది స్త్రీలూ వెలుగుతున్నారు. చుట్టూ చీకటి కమ్ముకున్నప్పుడు కూడా వెలగొచ్చని వీరు చెబుతున్నారు – సాక్షి ఫ్యామిలీ -
లాక్డౌన్ నుంచి వీటికీ మినహాయింపు
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ నుంచి మరికొన్ని రంగాలకు మినహాయింపునిస్తూ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో ప్రకటించిన మినహాయింపులకు అదనంగా ఇవి ఉంటాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగానికి చెందిన నిర్మాణ పనులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల కార్యకలాపాలకు తాజాగా అనుమతినిచ్చింది. కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు, ప్రాసెసింగ్.. తదితరాలకు కూడా అనుమతినిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని నిర్మాణ పనుల్లో.. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు, టెలికం ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఏర్పాటు.. మొదలైనవి ఉన్నాయి. హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు కొద్దిపాటి సిబ్బందితో పనులు చేసుకోవచ్చు. వెదురు, కొబ్బరి, వక్క, కొకొవా తదితర ఉత్పత్తుల ప్లాంటేషన్, ప్యాకేజింగ్, అమ్మకం, మార్కెటింగ్ మొదలైన పనులను ఈ లాక్డౌన్ కాలంలో చేసుకోవచ్చు. -
మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు ప్రారంభం
-
విజయవాడలో బీసెంట్ రోడ్డులో అగ్ని ప్రమాదం
-
సీసీ కెమెరాలు అమర్చేందుకు వచ్చి..
శ్రీకాకుళం, టెక్కలి రూరల్: టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి మెళియాపుట్టి రహదారి సమీపంలో బొంగపోలమ్మ మోడరన్ రైస్ మిల్లులో గురువారం విద్యుదాఘాతానికి గురై గుమ్మడి అశోక్(36) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, మృతుడి తమ్ముడు ప్రశాంత్ తెలిపిన వివరాలు ప్రకారం... ఈ రైస్ మిల్లులో కొద్దిరోజుల క్రితం ధాన్యం బస్తాలు దొంగతనం జరిగింది. మరోసారి దొంగతనం జరగకుండా ఉండేందుకై మిల్లు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఒడిశా రాష్ట్రం కాశీనగర్ సమీపంలోని బొత్తవ గ్రామానికి చెందిన గుమ్మడి అశోక్, అతని సోదరుడు ప్రశాంత్‌లు మిల్లు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికై వచ్చారు. దీనిలో భాగంగా గురువారం మిల్లు పైకి ఎక్కి సీసీ కెమెరా వైర్లు బిగిస్తుండగా పక్కనుంచి వెళుతున్న 33 కేవీ విద్యుత్ తీగ అశోక్‌కు తగలటంతో ఒక్కసారిగా తుల్లిపోయాడు. సమీపంలోని గోడపై పడటంతో తలకు తీవ్రగాయం కాగా తన శరీరం కాలిపోయింది. అశోక్‌ను బతికించేందుకు తమ్ముడు ఎంతగానో ప్రయత్నించాడు, కానీ అప్పటికే తన సోదరుడు మృతిచెందాడు. వెంటనే స్పందించిన మిల్లు సిబ్బంది మిల్లుపైకి వెళ్లి మృతదేహాన్ని కిందకు తీసుకువచ్చారు. మృతుడికి షాక్ తగలగానే సమీపంలోని గోడపై పడడంతో తలకు తీవ్ర గాయమై, అధిక రక్తశ్రావం జరిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి చలించిపోయి కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి శవపంచనామా నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య గౌరి, రెండేళ్ల కుమారుడు సాత్విక్ ఉన్నారు. అశోక్ మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కబళించిన కరెంట్ తీగ
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరెంట్ కాటుకు వేర్వేరు ప్రాంతాల్లో ఒకే రోజు ఇద్దరు బలయ్యారు. ఫ్యూజ్ వైరు సరిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్‌నగర్‌కు చెందిన పర్శరాములు రెండేళ్లుగా విలేజీ ఎలక్ట్రికల్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం ట్రాన్స్ ఫార్మర్ ఫ్యూజ్ తెగిపోవడంతో సరిచేసేందుకు పైకి ఎక్కాడు. విద్యుత్ సరఫరా నిలిపివేసి ఫ్యూజు సరిచేస్తున్నాడు. కొంతదూరంలోని మైనర్ ఫీడర్ తీగ ట్రాన్స్ఫార్మర్కు అనుసంధానించిన తీగకు తాకింది. దీంతో విద్యుత్ సరఫరా జరిగి పర్శరాములు ట్రాన్స్‌ఫార్మర్‌పైనే దుర్మరణం చెందాడు. గాలిపల్లిలో: ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలో ట్రాన్స్ఫార్మర్కు రెండువైపులా విద్యుత్ లైన్లు ఉన్నాయి. అసిస్టెంట్ హెల్పర్ మిట్టపెల్లి తిరుపతిరెడ్డి (35) ఒకవైపు కరెంట్ సరఫరా బంద్ చేసి, ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కి ఫ్యూజు వైరు సరిచేస్తుండగా, మరోవైపు కరెంటు సరఫరా జరిగి విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. -
డబ్బులిస్తే అంతా ఓకే!
గ్రేటర్లో ఇటీవల బహుళ అంతస్తుల భవనాల్లో తరచుగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవి ఎక్కువగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల వల్లే జరుగుతున్నాయి. ఇందుకు కారణాలు అన్వేషిస్తే... చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ జనరల్(సీఈఐజీ) అధికారుల అవినీతి..నిర్లక్ష్యమనే ఆరోపణలు వెలువడుతున్నాయి. షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీలు, అపార్ట్మెంట్లు వంటి పెద్ద పెద్ద భవనాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే ముందు సీఈఐజీ అనుమతి తీసుకోవాలి. కేబుల్ లైన్లు, స్విచ్‌బోర్డులు, వైరింగ్, ప్లగ్గులు, ట్రాన్స్ఫార్మర్ లైన్ల వంటి పరికరాల నాణ్యతను పరిశీలించి..అన్నీ బాగున్నాయని నిర్ధారించుకున్న తర్వాతే అనుమతి ఇవ్వాలి. కానీ నగరంలో అలా జరగడం లేదు. సంబంధిత అధికారులకు లంచాలిస్తే ఎలాంటి తనిఖీలు లేకుండానే అనుమతులు జారీ చేస్తున్నారు. దీంతో ఆయా భవనాల్లో విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకుని కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించడమే కాకుండా...వందలాది మంది ప్రాణాలకు ముప్పు కలుగుతోంది. వాస్తవంగా పెద్ద భవనాల్లో ఎలాంటి విద్యుత్ పరికరాలు, వైర్లు వాడాలో స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. కానీ వీటిని ఎవ్వరూ పాటించడం లేదు. సాక్షి, సిటీబ్యూరో : అపార్ట్మెంట్లు, మాల్స్, ఫ్యాక్టరీలు వంటి పెద్దపెద్ద భవనాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే ముందు చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ జనరల్ (సీఈఐజీ)అనుమతి తప్పనిసరి. కేబుల్ లైన్లు, వైరింగ్, స్విచ్ బోర్డులు, ప్లగులు వంటి పరికరాల నాణ్యతను పరిశీలించి.. అన్ని సవ్యంగా ఉన్నాయని నిర్థారించుకున్న తర్వాత అనుమతి ఇవ్వాలి. కానీ కాస్త డబ్బులు ముట్టజెపితే చాలు సీఈఐజీ అధికారులు ఆయా కట్టడాలను, ఇందులోని విద్యుత్ పరికరాలను చూడకుండానే ధృవీకరణ పత్రం ఇచ్చేస్తున్నారు. అధికారుల అవినీతి దాహానికి విద్యుత్ ప్రమాదాల వల్ల రూ.కోట్ల రూపాల ఆస్తి బుగ్గిపాలవుతోంది. అనేక మంది అమాయకులు మృత్యు వాతప డుతున్నారు. ప్రస్తుతం నగరంలో సగానికిపైగా మాల్స్, అపార్టుమెంట్లలో విద్యుత్ వైరింగ్ నాశిరకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల నగరంలోని పలు అపార్ట్‌మెంట్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదాలకు ఇదే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాసిరకం వైరింగ్తో ప్రమాదం రీసైకిల్డ్ కాపర్(వాడేసిన రాగి లోహం)తో తయారు చేసిన వైర్లతో చేసే వైరింగ్ చాలా నాసిరకంగా ఉంటుంది. ఇలాంటి వాటిపై ఇన్సులేషన్‌గా వాడే ప్లాస్టిక్ పదార్థం వేడికి వెంటనే కరిగిపోయే ప్రమాదం ఉంది. అలాగే ప్రతి సర్క్యూట్‌కు కనీసç లోడు మాత్రమే పడే విధంగా చూడాలి. స్వచ్ఛమైన కాపర్ ఐఎస్–694 ప్రమాణాలకు సరిపోయే ఎలక్ట్రికల్ వైర్లనే వాడాలి. ప్రతి గదిలో తప్పనిసరిగా ఎంసీబీ ఉండాలి. గీజర్స్, ఏసీ వంటి వాటికి ఓ విడి న్యూట్రల్‌తో స్వతంత్ర సర్క్యూట్‌ను మెయిన్‌బోర్డు నుంచి తీసుకెళ్లాలి. లైట్లోడ్(బల్బు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్స్)కు 1.5 ఎస్క్యూ ఎంఎం కాపర్ క్రాస్సెక్షనల్ వైరింగ్‌ను, మీడియం లోడు (టీవీ, ఫ్రిజ్, కంప్యూటర్, మ్యూజిక్ సిస్టం)కు 2.5 ఎస్క్యూ ఎంఎం కాపర్ సెక్షనల్ వైర్‌ను, హెవీలోడ్(ఏసీలు, గ్రీజర్స్, గ్రైడింగ్, వాషింగ్ మెషీన్స్)కు 4.0 ఎస్క్యూ ఎంఎం వైర్లను వాడాలి. ఎర్త్‌కు ఆకుపచ్చ, న్యూట్రల్‌కు నలుపు, లైవ్(కరెంట్ సరఫరా చేసే) దానికి పసుపు, నీలం రంగు వైర్‌ను వాడాలి. ఒక వేళ త్రీఫేజ్ వైరింగ్‌పై విద్యుత్ సరఫరా చేయాల్సి వస్తే, సరఫరా భారం లైన్లపై సమానంగా ఉండేలా చూడాలి. డిమాం డ్కు సరిపడ్డ కేబుళ్లను వేయడంతో పాటు కేబుల్ కన్నా తక్కువ కెపాసిటీ గల ఫ్యూజ్లను ఏర్పాటు చేసుకోవాలి. కేబుల్ ఎంత పెద్దదైతే.. రెసిస్టెన్స్ అంత తక్కువ. దీనివల్ల ఉత్పత్తి అయ్యే వేడి వల్ల పెరిగే ఉష్ణోగ్రత నుంచి కాపాడుతుంది. ప్రతి బోర్డుపై మూడు పిన్నుల ప్లగ్గు విధిగా వాడటంతో పాటు వైర్ల మధ్య జాయింట్స్ తక్కువ ఉండేలా చూడాలి. ప్రతి 15 ఏళ్లకోసారి వైరింగ్ మార్చాలి. 10 కేవీఏ కన్నా ఎక్కువ లోడ్ ఉంటే ఎర్తింగ్ ఏర్పాటు చేయాలి. నగరంలో జరుగుతున్న నిర్మాణాలకు చాలావరకు ఈ స్థాయి ప్రమాణాలు పాటించడం లేదు. పైగా ఆయా ప్రమాణాలను పూర్తిస్థాయిలో సీఈఐజీ అధికారులు పరిశీలించనూ లేదు. దీంతో భవన నిర్మాణ దారులు కరెన్సీ నోట్లను ఎరవేసి అధికాలతో పనిచేయించుకుంటున్నారు. ఆనక ప్రమాదాలు జరిగితే సామాన్యులు మూల్యం చెల్లిస్తున్నారు. తనిఖీ చేయకుండానే అనుమతి గ్రేటర్ హైదరాబాద్‌లో 40 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో ఐదు లక్షలకు పైగా వాణిజ్య కనెక్షన్లు. చిన్న, భారీ, మధ్య తరహా పరిశ్రమలు మరో 45 వేలకు పైగా ఉన్నాయి. పది వేలకుపైగా అపార్ట్మెంట్లు ఉన్నాయి. దరఖాస్తు దారునికి సంబంధించిన అపార్ట్మెంట్స్, మాల్స్, కంపెనీలను సీఈఐజీ అధికారులు స్వయంగా సందర్శించి, ఆయా సంస్థల విద్యుత్ అవసరాలు, విద్యుత్ లైన్ల నిర్మాణం, సరఫరా కోసం వాడిన కేబుల్స్ సామర్థ్యం, ఎలక్ట్రీషియన్ అర్హతలు, అనుభవం, వంటి అంశాలను పూర్తిగా పరిశీలించాలి. అంతేకాదు అన్నీ సరిగా ఉన్నాయని తేలిన తర్వాతే కాంట్రాక్టర్లకు ఎ,బి,సి గ్రేడ్ లైసెన్స్ కూడా మంజూరు చేయాలి. కానీ సీఈఐజీ అధికారులు ఇవేవి పట్టించుకోకుండా డబ్బులు తీసుకుని అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఇటీవల షేక్‌పేట్ ట్రాన్స్‌కో ఇంజినీర్ ఇదే పేరుతో ఓ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఎవరికి వారు సొంతంగా కొంత మంది ఏజెంట్లను కూడా నియమించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
‘సిరిసిల్ల’పై విద్యుత్ పోటు!
సాక్షి, హైదరాబాద్: ‘సిరిసిల్ల గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ (సెస్)’పై విద్యుత్ చార్జీల పిడుగు పడింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సెస్‌కు సరఫరా చేస్తున్న విద్యుత్ చార్జీలు ఒక్కసారిగా నాలుగున్నర రెట్లు పెరిగిపోనున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) మంగళవారం జారీ చేసిన 2018–19 విద్యుత్ టారిఫ్ ఉత్తర్వుల్లో.. గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ (రెస్కో)ల విద్యుత్ చార్జీలను పెంచింది. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గృహాలు, చేనేత, పవర్‌లూమ్స్, వ్యవసాయం, పరిశ్రమల వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్న సెస్‌కు సరఫరా అవుతున్న బల్క్ విద్యుత్ ధర ఒక్కో యూనిట్‌కు రూ.1 నుంచి రూ.4.52కు పెరగనుంది. వచ్చే నెల 1 నుంచి ఈ టారిఫ్ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. పెరగని సాధారణ చార్జీలు గృహ, వాణిజ్య, పరిశ్రమలు, ఇతర కేటగిరీల వినియోగదారులకు ప్రస్తుతమున్న చార్జీలనే వచ్చే ఏడాది కూడా కొనసాగించాలని ఈఆర్సీ నిర్ణయించింది. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ చార్జీలను యూనిట్‌కు రూ.6.40 నుంచి రూ.5.80కు తగ్గించింది. సర్కారు స్పష్టత ఇవ్వకపోవడంతోనే..! ఈఆర్సీ పౌల్ట్రీ పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్ చార్జీలను యూనిట్‌కు రూ.4 నుంచి రూ.6కు పెంచింది. పౌల్ట్రీ పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్‌పై యూనిట్‌కు రూ.2 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని వచ్చే ఏడాది కొనసాగించే అంశంపై స్పష్టతివ్వకపోవడంతో చార్జీలు పెంచినట్లు ఈఆర్సీ తెలిపింది. ఏటా సెస్‌కు ఇస్తున్న విద్యుత్ రాయితీ కొనసాగింపు పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రెస్కో కేటగిరీ చార్జీలను పెంచినట్లు తెలుస్తోంది. ఓపెన్యాక్సెస్ విద్యుత్‌పై యూనిట్‌కు 0.52 పైసల చొప్పున అదనపు సర్‌చార్జీని.. హెచ్‌టీ కేటగిరీలో పరిశ్రమలపై రూ.1.30 నుంచి రూ.1.60 వరకు క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీలను ఈఆర్సీ విధించింది. ఆదాయ లోటు రూ.956.67 కోట్లు డిస్కంలు తమ వార్షిక వ్యయం 2018–19లో రూ.35,714 కోట్లుగా ఉండనుందని.. ప్రస్తుత చార్జీలను అమలు చేస్తే రూ.9,700 కోట్లు లోటు ఏర్పడుతుందని గతంలో ఈఆర్సీకి ఇచ్చి న నివేదికలో తెలిపాయి. ఈఆర్సీ తాజాగా ఆదాయ లోటును గణించి రూ.5,940.47 కోట్ల కు తగ్గించింది. ఇక డిస్కంలకు రూ.4,984.30 కోట్లు సబ్సిడీగా ఇస్తామని ప్రభుత్వం ఈఆర్సీకి తెలిపింది. దీంతో డిస్కంల ఆదాయ లోటు రూ.956.67 కోట్లకు తగ్గనుంది. -
పెరిగిన ‘విద్యుత్’ వ్యయం!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సరఫరా వ్యయం ఏటికేటికి పెరిగిపోతోంది. వచ్చే ఏడాది (2018–19) రాష్ట్రంలో విద్యుత్ సరఫరా కోసం రూ.35,714 కోట్లు అవసరమని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తాజాగా నివేదించాయి. ఇందులో విద్యుత్ కొనుగోళ్లకే రూ.27,903 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. శుక్రవారం 2018–19కి సంబంధించి వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్)ను డిస్కంలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. వచ్చేఏడాది రాష్ట్రంలో అమలు చేసే విద్యుత్ చార్జీల పట్టిక లేకుండా ఈ ప్రతిపాదనలు సమర్పించడంతో 2018–19లో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరుగుతాయా లేక యథాతథంగా ఉంటాయా అన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. గతేడాదిలాగే చార్జీల వివరాలను మరికొన్ని రోజుల తర్వాత ఈఆర్సీకి డిస్కంలు ప్రత్యేకంగా ప్రతిపాదించను న్నాయి. అప్పుడే చార్జీల పెంపుపై స్పష్టత రానుంది. 2019లో జరిగే ఎన్నికల నేపథ్యం లో విద్యుత్ చార్జీలు పెంచొద్దని సీఎం కేసీఆర్ డిస్కంలను ఆదేశించినా.. డిస్కంలు చార్జీల అంశాన్ని సస్పెన్స్‌లో పెట్టడం గమనార్హం. యూనిట్‌కు రూ.6.42 వ్యయం.. డిస్కంలు సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు సగటున యూనిట్‌కు రూ.6.42 వ్యయం కానుంది. 2018–19 కోసం డిస్కంలు 67,573 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఒప్పందాల రూపంలో ముందస్తుగా సమీకరించి పెట్టుకోగా.. వాస్తవ విద్యుత్ డిమాండ్ 64,291 మిలియన్ యూనిట్లే ఉండనుంది. -
క్రమబద్ధీకరణకు ఓకే..
విద్యుత్ బోర్డుల ఆమోదం ప్రతిపాదనలు సీఎంకు..నేడు ఉత్తర్వులు! 20,903 మంది ఔట్సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులు ఇక రెగ్యులర్ హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 20,903 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలనే ప్రతిపాదనలను విద్యుత్ సంస్థల బోర్డులు ఆమోదించాయి. తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో), దక్షిణ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్)ల బోర్డులు శుక్రవారం విద్యుత్‌సౌధలో సమావేశమయ్యాయి. ట్రాన్స్‌కోలో 4,197 మంది, జెన్కోలో 2,914 మంది, టీఎస్ఎస్పీ డీసీఎల్‌లో 9,459 మంది, టీఎస్ఎన్పీడీసీఎల్లో4,333 మందిని క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఆ వెంటనే ఈ నిర్ణయానికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించాయి. ముఖ్యమంత్రి నుంచి ఆమోదం లభించిన మరుక్షణమే విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యూలర్ ఉద్యోగులుగా విలీనం చేసుకుంటూ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. మొత్తం 23,667 మంది విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో 20,903 మంది అర్హులని దరఖాస్తుల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీలు నిర్ధారించాయి. తెలంగాణ స్థానికత కాకపోవడం, వయో పరిమితి మీరిపోవడం, ఉద్యోగాన్ని మధ్యలో మానేయడం, సరైన సమాచారం లేకుండా దరఖాస్తు చేసుకోవడం తదితర కారణాలతో మిగిలిన వారి దరఖాస్తులను తిరస్కరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 20,903 మంది ఉద్యోగుల్లో నైపుణ్యం లేని ఉద్యోగులు 3,199 మంది, స్వల్ప నైపుణ్యం గల ఉద్యోగులు 2,476 మంది, నైపుణ్యం గల ఉద్యోగులు 13,864 మంది, ఉన్నత నైపుణ్యం గల ఉద్యోగులు 1,364 మంది ఉన్నారు. -
21,000 మంది విద్యుత్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ!
నేడు విద్యుత్ బోర్డుల నిర్ణయం.. ఆ వెంటనే ఉత్తర్వుల జారీ! సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 21 వేల మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త. వారిని క్రమబద్ధీకరిస్తూ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నేడు కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ ట్రాన్స్‌కో, విద్యుదుత్పత్తి సంస్థ జెన్కో, దక్షిణ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు(టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్) శుక్రవారం బోర్డు సమావేశం నిర్వహించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను ఆమోదించనున్నాయి. ఇందుకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతుండటంతో విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల విలీనం (అబ్జార్ప్షన్) పేరిట ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. క్రమబద్ధీకరణను బోర్డులు ఆమోదిస్తే, ఆ మేరకు శనివారమే విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఉత్తర్వులు జారీ చేస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగుల క్రమబద్ధీకరణ విధివిధానాలు, మార్గదర్శకాలను విద్యుత్ సంస్థల బోర్డులు మే 29న సమావేశమై ఆమోదించాయి. నాలుగు విద్యుత్ సంస్థల్లో 23,667 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా, 21 వేల మందికి పైగా అర్హులని సిఫార్సు చేస్తూ అవి ఇటీవలే నివేదిక ఇచ్చాయి. ఏపీ విద్యుత్ సంస్థల్లో ప నిచేస్తున్న తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా తెలంగాణలో క్రమబద్ధీకరణ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపైనా శుక్రవారం బోర్డులు నిర్ణయం తీసుకోనున్నాయి. 1000 ఏఈ పోస్టుల భర్తీపై కూడా ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లలో 1,000 మందికి పైగా అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఉమ్మడి ప్రకటన జారీ చేయడంపైనా విద్యుత్ సంస్థల బోర్డులు శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నాయి. తర్వాత వారం రోజుల్లో నియామక నోటిఫికేషన్ రానుంది. విద్యుత్ సంస్థల్లో ఎన్నికలు వాయిదా వేయాలి కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్దీకరణ నేపథ్యంలో విద్యుత్ సంస్థల్లో గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం విజ్ఞప్తి చేసింది. అధ్యక్షుడు కేవీ జాన్సన్ నేతృత్వంలోని బృందం గురువారం ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకు వినతిపత్రం సమర్పించింది. కార్మికులందరిని క్రమబద్ధీకరించి వారికీ ఎన్నికల్లో పాల్గొనే అవకాశమివ్వాలని కోరగా సీఎండీ అంగీకరించారని అనంతరం నేతలు తెలిపారు. క్రమబద్ధీకరణకు సహకరించిన ఎంపీ కవిత, ట్రాన్స్‌కో, డిస్కంల సీఎండీలకు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రాణాలతో తిరిగి వెళ్తారనే నమ్మకం లేదు
మూడేళ్లలో 370 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు మృతి: టఫ్ సాక్షి, హైదరాబాద్: ఉదయం ఇంటి నుంచి వెళ్లిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలతో తిరిగి ఇళ్లకు చేరుతారనే నమ్మకం వారి కుటుంబ సభ్యులకు లేదని తెలంగాణ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ (టఫ్) ఆవేదన వ్యక్తం చేసింది. మూడేళ్లలో సుమారు 370 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు విధి నిర్వహణలో మృత్యువాత పడ్డారని పేర్కొంది. రెండేళ్ల పోరాటం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేసుకోవడానికి సిద్ధమైందని, అయితే కొందరు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారని తెలిపింది. విద్యుత్ కార్మికులకు మద్దతుగా టఫ్ అధ్యక్షుడు పద్మారెడ్డి, ఉపాధ్యక్షుడు ఎన్.కిరణ్, ప్రధాన కార్యదర్శి సాయిబాబ, సాయిలు, శ్రీధర్ తదితరులు శనివా రం ఇక్కడ విలేకరులతో మాట్లాడా రు. 23 వేల మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ల చేతిలో దోపిడీకి గురవుతున్నారని తెలి పారు. జడ్చర్లలో ఓ కాంట్రాక్టర్ కార్మికులకు సంబంధించిన రూ.60 లక్షల పీఎఫ్ నిధులను స్వాహా చేశాడని, మూడేళ్లు గడుస్తున్నా అతడి నుంచి ఆ డబ్బు రికవరీ చేయలేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులంతా సబ్ స్టేషన్ ఆపరేటర్, జేఎల్ఎం లాంటి తక్కువ కేడర్ ఉద్యోగులేనని, అంద రూ ఐటీఐ, పదో తరగతి విద్యార్హతలు ఉన్న వారేనని తెలిపారు. వీరి విలీనంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు నష్టం జరగదని తెలిపారు. -
వర్ద విలయం
ఊహించని రీతిలో వర్ద పెను ప్రళయ తాండవం చేసి వెళ్లింది. 192 కిమీ వేగంతో వీచిన గాలులు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో బీభత్సం సృష్టించాయి. ఎక్కడికక్కడ చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగాయి. విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. వర్ద తీరం దాటినా ఈదురు గాలుల ప్రభావం మరీ ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారాయి. సాక్షి, చెన్నై : డిసెంబరు నెల అంటే చాలు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం వాసుల్ని వణికి పోతున్నారు. గత ఏడాది వర్షం ఈశాన్య రుతు పవనాలతో పెను ప్రళయాన్ని చవి చూస్తే, ఈ ఏడాది వర్దరూపంలో కొన్ని గంటల పాటుగా ఊపిరి బిగ పెట్టుకుని ఉత్కంఠగా కలాన్ని గడపాల్సిన పరిస్థితి.వర్ద్ద తుపాన్ రూపంలో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలకు ముప్పు తప్పదన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో అధికార వర్గాలు అప్రమత్తం అయ్యాయి. పెను ›ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా ముందస్తు చర్యలు తీసుకున్నారు. తీర వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సోమవారం వేకువ జాము నుంచి చిరుజల్లులతో మొదలైన వర్షం క్రమంగా తీవ్ర రూపం దాల్చడం మొదలెట్టింది. దీంతో సరిగ్గా పన్నెండున్నర ఒంటి గంట సమయంలో ఎక్కడిక్కకడ వాహనాల రాకపోకల్ని నిలిపి వేశారు. జనం రోడ్ల మీదకు రాకుండా ఇళ్లకు పరిమితం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. చెన్నైలో ప్రధాన రోడ్లన్నీ మూత పడ్డట్టుగా నిర్మానుష్యం అయ్యాయి. ఎలక్ట్రిక్ రైళ్ల సేవల్ని నిలుపుదల చేశారు. చెన్నై నుంచి సూలూరు పేట వైపుగా వెళ్లే రైళ్లను రేణిగుంట వైపుగా దారి మళ్లించారు. క్రమంగా వర్షం తీవ్రత పెరగడంతో ఒంటి గంట సమయంలో చెన్నై విమానాశ్రయాన్ని సైతం మూసి వేస్తూ చర్యలు తీసుకున్నారు. నాలుగు గంటల ప్రళయం సరిగ్గా ఒంటి గంట సమయంలో వర్షం తీవ్రతతో పాటుగా ఈదురు గాలుల ప్రభావం పెరిగింది. ఎదురుగా ఎవ్వరున్నారో అన్నది కూడా తెలియని రీతిలో గాలుల బీభత్సం, వర్షం జోరు వెరసి జనం గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేశాయి. వర్ద చెన్నై హార్బర్ సమీపంలోకి దూసుకు వస్తున్న కొద్ది గాలుల తీవ్రత తాండవం చేసింది. ఎక్కడిక్కడ హోర్డింగ్‌లు, వృక్షాలు, చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు, తీగలు అనేక చోట్ల విరిగి పడ్డాయి. మూడు, నాలుగు అంతస్తుల్లోని డాబా లాంటి గృహాలకు వేసిన రేకులు గాల్లో ఎగిరాయి. ఇళ్ల మీదున్న ప్లాస్టిక్ వాటార్ ట్యాంక్‌లు గాల్లో ఎగిరాయి. అనేక చోట్ల హోర్డింగ్‌లు, పెట్రోల్ బంకుల షెడ్డులు గాలిలో తేలియాడాయి. మూడున్నర నాలుగు గంటల సమయంలో అయితే, తీవ్రత మరింత జఠిలం కావడంతో అర చేతిలో ప్రాణాల్ని పెట్టుకుని జనం బిక్కు బిక్కు మంటూ ఇళ్లల్లో గడిపారు. ఏమి జరుగుతుందో, ఎలాంటి ప్రళయాన్ని మళ్లీ ఎదుర్కొనాలో, మళ్లీ వరదలు వస్తాయో అన్నంత ఉత్కంఠతో కాలం గడిపినా, ఐదున్నర , ఆరు గంటలకు గాలి భీబత్సం, వర్షం విలయం తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయినా, గాలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో మళ్లీ వర్షం వస్తుందేమోనన్న ఆంధోళన తప్పలేదు.ఏ రోడ్డు చూసినా : చెన్నై మహానగరంలో ఏరోడ్డులో చూసినా విరిగిన చెట్టు కొమ్మలు , నేల కొరిగిన చెట్లే, రోడ్డుకు ఇరు వైపులా అనేక చోట్ల ఉండే దుకాణాల బోర్డులు, వివిధ సంస్థల బోర్డులన్నీ రోడ్ల మీద వచ్చి పడ్డాయి. దుకాణాలన్నీ ముందుగానే మూత పడటంతో ప్రాణ, వ్యక్తిగత ఆస్తినష్టాల నుంచి ఆయా యజమానులు బయట పడ్డారు. సముద్ర తీరం వెంబడి ఉన్న ఎన్నూరు, తిరువొత్తియూరు, పట్టినంబాక్కం, హార్బర్ పరిసరాల్లో అయితే, అలల తాకిడికి అడ్డుగా వేసిన రాళ్లు పెద్ద ఎత్తున రోడ్డ మీదకు వచ్చి పడ్డాయి. చెన్నై సైదా పేట నుంచి కోట్టూరు పురం వరకు రోడ్డుకు ఇరు వైపులా ఆహ్లాదకరంగా ఉ ండే చెట్లు ఇప్పుడు కానరాలేదు. అవన్నీ నేలకొరిగాయి. చెన్నైలో 224 రోడ్లను తాత్కాళికంగా మూసి వేశారు. దీన్ని బట్టి చూస్తే, ఇతర జిల్లాల్లో, శివారుల్లో పరిస్థితి ఏ మేరకు ఉంటుందో అన్న ఆందోళన తప్పదు. ఏ రోడ్లులో చూసినా ఏదో ఒక కారు లేదా ఆటో, మోటారు సైకిల్ చెట్ల శిథిలాల కింద నుజ్జు నుజ్జు కాక తప్పలేదు. ఇక, సముద్ర తీరాల్లోని వందలాది రేకుల ఇళ్ల పైకప్పులు గాల్లోకి ఎగరడంతో అక్కడి బాధితులను అధికార వర్గాలు ఆగమేఘాలపై సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుడిసె వాసుల వేతలు వర్ణణాతీతం. అనేక చోట్ల అధికారులు హెచ్చరించినా, ఖాతరు చేయని వాళ్లు , చివరకు గాలి వాన భీబత్సంలో చిక్కుకుని తల్లడిల్లక తప్పలేదు. యుద్ద ప్రాతిపదికన: ఆయా ప్రాంతాల్లో యువత, స్థానికులు స్వచ్చందంగా ముందుకు కదిలారు. రోడ్ల మీద పడ్డ కొమ్మల్ని తొలగించే పనిలో పడ్డారు. అయితే, అతి పెద్ద చెట్లను తొలగించేందుకు కష్టతరంగా మారాయి. అర్థరాత్రిలోపు వీటిని తొలగించేందుకు తగ్గట్టుగా ఇతర ప్రాంతాల నుంచి ఆగమేఘాలపై సిబ్బందిని రప్పించి ఉన్నారు. చెన్నై విమానాశ్రయం రన్ వేల్లోకి నీళ్లు చేరడం, కొన్ని చోట్ల దెబ్బ తినడం వెరసి విమానాల సేవలన్నీ అర్థరాత్రి వరకు రద్దు అయ్యాయి. అనేక లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరడంతో తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈదురుగాలులలకు, వర్షం తోడవడంతో ఆందోళన తప్పడం లేదు. వర్ష బీభత్సంలో నలుగురు మరణించినట్లు సమాచారం. ఆగమేఘాలపై పునరుద్ధరణ చర్యల అనంతరం అర్థరాత్రి తర్వాత సేవలను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఇక, చెన్నైలో తెగి పడ్డ విద్యుత్ తీగలను యుద్ద ప్రాతిపదికన సరి చేసే పనిలో సిబ్బంది నిమగ్నం అయ్యారు. అర్థరాత్రిలోపు చెన్నై నగరానికి, మంగళవారం సాయంత్రంలోపు చెన్నై శివారుల్లో విద్యుత్ సరఫరా పునరుద్దరిస్తామని ఆ శాఖ మంత్రి తంగమణి తెలిపారు. అంత వరకు అందకారంలో మునగాల్సిన పరిíస్థితి. ఇక, యుద్ద ప్రాతిపకన సాగుతున్న చర్యల్లో జాతీయ విపత్తుల నివారణ బందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఏ మేరకు నష్టం తీవ్ర అన్నది ఉంటుందో మంగళారం నాటికి తేలే అవకాశాలు ఉన్నాయి. ఇక, అధికారుల్ని సీఎం పన్నీరు సెల్వం అప్రమత్తం చేస్తూ, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యల్లో సిబ్బంది ఉన్నారని ప్రజలు సహకరించాలని కోరారు. రాజ్‌నాథ్ ఆరా : చెన్నై తీరాన్ని వార్ధా సమీపించినానంతరం కేంద్ర హోం శాఖ మంత్రి తమిళనాడు సీఎఎం పన్నీరు సెల్వంతో ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో కేంద్రం సహకారం అందిస్తుందని పన్నీరుకు ఆయన హామీ ఇచ్చారు. 22 ఏళ్ల అనంతరం : ప్రళయాలన్నీ చెన్నైను డిసెంబరు నెలలోనే వెంటాడుతున్నాయి. గతంలో అనేక తుఫాన్లు వచ్చినా, వాటి ప్రభావం తక్కువే. 1994లో వచ్చిన తుఫాన్ వంద కి.మీ వేగంతో చెన్నై వైపుగా దూసుకొచ్చి ప్రళయాన్ని సష్టించింది. తదుపరి గత ఏడాది వర్షాలతో వరద విలయం. ఈ ఏడాది గతంలో ఎ న్నడూ లేని రీతిలో తాండవం. వర్షం తీవ్ర కన్నా, గాలి ప్రభావం మరీ ఎక్కువగా ఉండటంతో జనం విల విలలాడాల్సి వచ్చింది. 192 కి.మీ వేగంతో గాలులు దూసుకొచ్చినట్టుగా వాతావరణ కేంద్రం ప్రకటించడం గమనార్హం. ఇక, మీనంబాక్కంలో నాలుగు గంటల పాటుగా అత్యధికంగా 18 సె.మీ వర్షం పడింది. -
నెల రోజుల్లో పరిష్కారం చూపిస్తాం
⇒ తెలుగు రాష్ట్రాల విద్యుత్ వివాదంపై షీలాబిడే కమిటీ సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య నెలకొన్న వివాదానికి మరో నెల రోజుల్లో పరిష్కారం చూపుతామని షీలాబిడే కమిటీ శుక్రవారం తెలిపింది. ఆస్తులు, ఉద్యోగుల విభజనకు సంబంధించి తుది నివేదికలు ఇవ్వాలని రెండు రాష్ట్రాల విద్యుత్ ఉన్నతాధికారులను కమిటీ ఆదేశించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల అప్పులు, ఉద్యోగుల విభజన సమస్యగా మారింది. రెండు రాష్ట్రాల అధికారులు పరస్పర విరుద్ధ వాదనలు విన్పిస్తూ వస్తున్నారు. ఉద్యోగుల విభజన విషయంలోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. ఏపీ స్థానికత ఆధారంగా తెలంగాణా విద్యుత్ సంస్థలు 1252 మంది ఉద్యోగులను తొలగించాయి. మరోవైపు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత గల ఉద్యోగులు స్వచ్ఛందంగా రిలీవ్ అయి, తెలంగాణ సంస్థల్లో చేరారు. ఉద్యోగుల ఆస్తుల విభజన కోసం నియమించిన షీలా బిడే కమిటీ అనేక పర్యాయాలు చర్చలు జరిపింది. స్థానికత మార్గదర్శకాలు రూపొందించే ప్రక్రియలో రెండు రాష్ట్రాల అధికారులు ఏకతాటిపైకి రాలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన సమావేశం కొంత సానుకూలంగా ఉన్నట్టు ఇరుపక్షాల అధికారులు చెబుతున్నారు. జనవరిలో నిర్ణయం వెల్లడి 2014 జనవరి ఒకటవ తేదీ నాటికి విద్యుత్ సంస్థల ఆడిట్ బ్యాలెన్స షీట్స్‌ను పరిగణలోనికి తీసుకోవాలని, దీని ఆధారంగా ఆస్తుల విభజన చేయాలని కమిటీ సూచించింది. రెండు రాష్ట్రాలు వీటిని అందించాలని పేర్కొంది. దీనిపై ఏపీ, తెలంగాణ సమగ్ర వివరాలతో ముసాయిదాలను రూపొందించాలని తెలిపింది. ఉద్యోగుల విభజనకు సంబంధించి డిసెంబర్ 15వ తేదీలోగా వాస్తవ పరిస్థితిని వివరించాలని కోరింది. ఉద్యోగుల విభజన చేపట్టడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఆర్థిక పరిస్థితిపై ఏ విధంగా ప్రభావం చూపుతుందనే విషయాన్ని రెండు రాష్ట్రాలు తమ నివేదికల్లో పేర్కొనాలని తెలిపింది. ఇరు పక్షాలు ఈ నివేదికలపై చర్చించుకుని డిసెంబర్ 30లోగా తమ అభ్యంతరాలు తెలపాలని కమిటీ సూచించింది. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని జనవరి మొదటి వారంలో రెండు రాష్ట్రాల అధికారుల సమక్షంలో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని షీలాబిడే కమిటీ పేర్కొంది. కమిటీ సమావేశానికి ఏపీ తరపున ట్రాన్సకో సీఎండీ విజయానంద్, జేఎండీ దినేష్ పరుచూరి, జెన్కో డెరైక్టర్ (ఫైనాన్స) ఆదినారాయణ తదితరులు హాజరయ్యారు. -
పిడుగుపాటుకు కాలిపోయిన పరికరాలు
హత్నూర: మండలంలోని దౌల్తాబాద్‌లో గురువారం రాత్రి పిడుగుపాటుకు ఒక్కసారిగా ఇళ్లలోని టీవీలు, ఫ్రిజ్‌లు, ఎలక్ట్రికల్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం ఒక్కసారిగా వర్షం, పిడుగుపాటుతో ఇళ్లలోని టీవీ, ఫ్రిజ్‌లు కాలిపోయి పొగలు వచ్చాయి. గ్రామంలో సుమారు 80శాతం ఎలక్ట్రికల్ పరికరాలు చెడిపోయినట్లు వారు తెలిపారు. -
అంధకారంలో వందకుపైగా గ్రామాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన గాలుల ధాటికి భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆదిలాబాద్‌లో కలెక్టరేట్ ప్రధాన ద్వారం, జిల్లా అగ్నిమాపక కార్యాలయం వద్ద భారీ వృక్షాలు నేలకొరి గారుు. పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాలకు విద్యుత్ సరఫరా చేసే లైన్ తెగిపోరుుంది. దీంతో జైనథ్ మండలంలో సుమారు 55 గ్రామాలు, బేల మండలంలో 65 గ్రామాలు, ఆదిలాబాద్ మండలంలో 70కిపైగా గ్రామా ల్లో అంధకారం నెలకొంది. తాంసి, తలమడుగు మండలాల్లో కూడా కొంత నష్టం వాటిల్లింది. విద్యుత్ సిబ్బంది, అధికారులు ఆదివారం ఉదయం నుంచే పునరుద్ధరణ పనులు చేపట్టారు. జిల్లాలోని నార్నూర్ మండలంలో శనివారం కురిసిన భారీ వర్షం, బలమైన గాలులకు 17 ఎకరాల్లో అరటితోటకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన 50 లక్షల రూపాయల విలువైన పంట నేలకొరిగింది. మెదక్ జిల్లాలో మహిళ దుర్మరణం జహీరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారంరాత్రి ఈదురు గాలులు బీభత్సాన్ని సృష్టించాయి. మన్నాపూర్‌లో ఓ ఇంటిపై ఉన్న కర్ర తలపై పడడంతో అమీనాబీ(35) అనే గృహిణి మరణించింది. ఏసప్ప, సిద్ధప్ప ఇళ్లపై భారీ మర్రి వృక్షం కూలడంతో వారి ఇళ్లు దెబ్బతిన్నాయి. నిద్రలో నుంచి తేరుకున్నవారు వెంటనే అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. -
రేణిగుంట ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో అగ్నిప్రమాదం
తిరుపతి: రేణిగుంట ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ వైర్లకు సంబంధించిన ఓ కార్మాగారంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సంఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మేత కోసం వస్తే.. కాటేసిన తీగలు
♦ 29 ఆవులు మృత్యువాత వైర్లు తెగిపడటంతో విద్యుదాఘాతం ♦ కరువు వేళ బతికించుకుందామని వస్తే.. బలైన వైనం ♦ అంతర్గాం, ఇబ్రహీంపూర్లో ఘటనలు పిడుగుపాటుకు ♦ మరో రెండు ఎడ్లు మృతి దుఃఖసాగరంలో బాధిత రైతులు ♦ ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోలు పరిహారమిస్తామన్న ట్రాన్స్‌కో ఎస్ఈ ఘోరం జరిగిపోయింది... పూడ్చలేని నష్టం ఏర్పడింది... యమపాశాలుగా మారిన విద్యుత్ తీగలకు అభం శుభం తెలియని 29మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. అస్తవ్యస్త తీగలు తెగిపడుతున్నాయి. ఫలితంగా విలువైన పశుసంపదకు తీవ్రనష్టం చేకూరుతుంది. తాజాగా జిల్లాలో రెండు చోట్ల విద్యుత్ తీగలు తెగి పడడంతో 29 ఆవులు, పిడుగు పడడంతో మరోచోట రెండు పశువులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలతో రైతాంగం దుఃఖసాగరంలో మునిగింది. కరువుతో పశువులను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతుంటే విద్యుత్ తీగలు వాటిని వెంటాడుతున్నాయి. కల్హేర్/న్యాల్కల్: కరెంటు కాటుకు వేర్వేరు చోట్ల 29 మూగజీవాలు నేలకొరిగాయి. పిడుగుపాటుకు ఇంకోచోట రెండు పశువులు ప్రాణా లు విడిచాయి. అకాల వర్షాల కారణంగా వీచిన ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగిపడడంతో పాడి పశువులు మృత్యువాత పడ్డాయి. రెండేళ్లుగా కరువు కాటకాలతో అష్టకష్టా లు పడుతున్న రైతన్నను తాజా ఘటనలు కోలుకోలేని దెబ్బతీశాయి. గ్రాసం, నీటికోసం కల్హేర్ మండలం అంతర్ గాంకు వలస వచ్చిన పశువులను విద్యుత్ వైరు రూపంలో మృత్యువు కబళించింది. ఆదివారం రాత్రి నిద్రిస్తున్న పశువుల మందపై 11కేవీ విద్యుత్ వైరు తెగిపడడంతో 23 మూగజీవాలు అక్కడికక్కడే ప్రాణాలు వది లాయి. కంగ్టి మండలానికి చెందిన ధూంసింగ్, గోవిం ద్, రమేష్ అనే రైతులు తమ కుటుంబాలతో కలిసి దాదాపు 300 పశువులను తీసుకుని వలస వచ్చారు. పగలంతా పశువులను మేపి రాత్రి పూట ఓ పొలం వద్ద పశువులను కట్టి ఉంచగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా సోమవారం మధ్యాహ్నం న్యాల్కల్ మండలం ఇబ్రహీంపూర్‌లోనూ విద్యుత్ వైరు తెగిపడడంతో ఆరు ఆవులు మరణించాయి. ఇక్కడా 11కేవీ విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో తీగ లు తెగి పశువులపై పడడంతో విద్యుదాఘాతం తో కన్నుమూశాయి. హత్నూర మండలం చింతల్‌చెరువు శివారులో ఆదివారం రాత్రి పిడుగుపడడంతో రెండు ఎడ్లు మరణించాయి. ఇలా పెద్ద సంఖ్యలో పశువులు మృతి చెందడం తో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈనెల ఒకటిన పెళ్లిబృందం లారీని విద్యుత్ తీగలు తగల డంతో విద్యుదాఘాతానికి గురై ఏడుగురు మరణించిన విషయం తెల్సిందే. ఈ ఘటనను మరచిపోకముందే 31 పశువులు మృత్యువాత పడడం అందరిని కలిచివేసింది. బోరున విలపించిన రైతులు... పశువులు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడడం తో కల్హేర్ మండలం అంతర్గాం, న్యాల్కల్ మండలం ఇబ్రహీంపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కంగ్టి మండలానికి చెందిన ధూంసింగ్, గోవింద్, రమేష్, ఇబ్రహీంపూర్‌కు చెందిన రైతులు నాగమ్మ, దేవేందర్, మానిక్, పి.దేవేందర్ కన్నీరుమున్నీరయ్యారు. ఓవైపు కరువు కాటేస్తే మరోవైపు పశువులను పోగొట్టుకున్నామంటూ తల్లడిల్లిపోయారు. అంతర్గాంలోనే ఖననం... మరణించిన పశువులకు అంతర్గాంలోనే వెట ర్నరీ వైద్యులు సయ్యద్ ముస్తాక్, నేతాజీ పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అక్కడే జేసీబీతో పెద్ద గోతి తవ్వి వాటిని ఒకేచోట ఖననం చేశారు. ఖననం సందర్భంగా అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత రైతులే కాకుండా స్థానికులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోరున విలపించారు. బతికించుకుందామని వస్తే... కరువు కారణంగా పశువులను బతికించుకునేందుకు కల్హేర్ వైపు వస్తే ఇలా జరిగిందంటూ కంగ్టి మండలం ముకుంద్నాయక్ తండాకు చెందిన ధూంసింగ్, సాధు తండాకు చెందిన గోవింద్, గాజుల్పాడుకు చెందిన రమేష్ కుటుంబీకులు వాపోయారు. నీటి జాడలున్నాయని పశువులను తీసుకుని వారం రోజుల క్రితం ఇటువైపు వస్తే ఈ దుర్ఘటన జరిగిందంటూ బోరుమన్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు. గిరిజనులకు తప్పిన ప్రమాదం అంతర్గాం ఘటనలో గిరిజన రైతులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. రైతులు ధూంసింగ్, గోవింద్ కుటుంబీకులు రామారావు, అశోక్, సుభాష్, కాలు, రమేష్, శివ, రాహుల్ తమ పశువుల మంద పక్కనే నిద్రించారు. వైరు తెగి పశువుల మీద పడిన సమయంలో వీరంతా పక్కనే నిద్రలో ఉన్నారు. పశువుల అరుపులకు వీరు లేచేసరికి ఘోరం జరిగిపోయింది. మరణించిన పశువుల విలువ దాదాపు రూ.10 లక్షలకుపైగా ఉంటుందని అంచన. ట్రాన్స్‌కో అధికారుల నిలదీత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే 23 పశువులు మృతి చెందాయని అంతర్గాం వాసులు ట్రాన్స్‌కో అధికారులను నిలదీశారు. ట్రాన్స్‌కో ఎస్ఈ సదాశివరెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఒక్కో పశువుకు రూ.40వేల చొప్పు న వారం రోజుల్లో పరిహారాన్ని అందజేస్తామని ఎస్ఈ ప్రకటించారు. ఘటనా స్థలాన్ని పశుసంవర్థక శాఖ జేడీ లక్ష్మారెడ్డి, ఖేడ్ సీఐ సైదానాయక్, ఆర్ఐ ఎండీ ఖాలీద్, వీఆర్ఓ సాయిలు, నాయకులు కృష్ణమూర్తి, రాంసింగ్, గుండు మోహన్, మహిపాల్‌రెడ్డి తదితరులు సందర్శించి బాధిత రైతులను పరామర్శించారు. పరిహారమిస్తామన్న తహసీల్దార్... న్యాల్కల్ మండలం ఇబ్రహీంపూర్ ఘటనలో బాధిత రైతులకు పరిహారమిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ దశరథ్‌సింగ్, హద్నూర్ ఎస్ఐ సుభాష్, పశువైద్యాధికారి అజింక్య, ట్రాన్స్‌కో ఏఈ రవీందర్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో ఆవుకు రూ.40 వేల చొప్పున మొత్తం రూ.2.40 లక్షల మేర పరిహారం వచ్చేలా కలెక్టర్‌కు నివేదిక పంపుతామని తహసీల్దార్ బాధిత రైతులకు హామీ ఇచ్చారు. విద్యుత్ అధికారులపై కేసు కల్హేర్: అంతర్గాం ఘటన నేపథ్యంలో ట్రాన్స్‌కో అధికారులపై కేసు నమోదు చేశామని సిర్గాపూర్ ఎస్హెచ్ఓ రవీందర్ సోమవారం తెలిపారు. నారాయణఖేడ్ సీఐ సైదానాయక్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యుత్ వైరు తెగిపడడంతో 22 ఆవులు, ఓ గేదె మరణించిందని ఎస్హెచ్ఓ రవీందర్ వెల్లడించారు. ట్రాన్స్‌కో అధికారులను బాధ్యులు చేస్తూ కేసు నమోదు చేశామన్నారు. ట్రాన్స్‌కో అధికారులు, లైన్‌మన్‌పై విచారణ జరుపుతామన్నారు. పిడుగుపాటుకు రెండు ఎడ్లు మృతి హత్నూర: చింతల్‌చెరువు శివారులో ఆదివా రం రాత్రి పిడుగుపాటుకు రెండు ఎడ్లు మృతి చెందాయి. ఫత్త్తే హైమద్ అనే రైతుకు చెందిన రెండు ఎడ్లు గ్రామ శివారులోని పొలం వద్ద ఆదివారం రాత్రి కట్టేశాడు. ఉరుములతో కూ డిన వర్షంతోపాటు పిడుగుపడడంతో రెండు ఎడ్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. సోమవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతుతు పరిస్థితిని చూసి బోరున విలపిం చారు. లక్ష రూపాయల విలువల గల రెండు ఎడ్లు మృతిచెందడంతో తీవ్రంగా నష్టపోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరారు. మేపడానికి తోలుకొస్తే.. తీవ్ర కరువుతో కంగ్టి మండలంలో గ్రాసం, నీరు దొరుకుతలేదు. పశువుల తిప్పలు చూడలేక నీళ్లు, గ్రాసం కోసం కల్హేర్ మండలం అంతర్గాం వైపు వచ్చాం. గ్రాసం ఎక్కడ దొరికితే అక్కడికి పశువుల మందతో వలస పోతుంటాం. కరెంట్ షాక్ తగిలి 23 పశువులు చనిపోయినయి. పశువులు లేకపోతే మేం రోడ్డున పడినట్టే. - ధూంసింగ్, బాధిత రైతు -
నీ అంతుచూస్తా..
నడిరోడ్డుపై ఉన్న కారును అడ్డుతీయమన్న కానిస్టేబుల్‌పై వీరంగం, స్థంభించిన ట్రాఫిక్ నెల్లూరు(క్రైమ్) : ఓ వ్యక్తి తన కారును నడిరోడ్డుపై నిలిపి పండ్లు కొంటున్న తరుణంలో ట్రాఫిక్ స్థంభించింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది కారును రోడ్డుపక్కగా పెట్టమని కోరినందుకు కారు డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న వారు కానిస్టేబుల్‌పై వీరంగం చేశారు. ‘నీకెంత ధైర్యం రా.. నా కారునే ఆపుతావా.. నీ అంతుచూస్తా.. ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా’ అంటూ దౌర్జన్యానికి పూనుకున్నారు. ఈసంఘటన సోమవారం రాత్రి ఏసీ కూరగాయలమార్కెట్ సమీపంలో చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు.. సౌత్‌ట్రాఫిక్ కానిస్టేబుల్ సందీప్ కూరగాయల మార్కెట్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. సింహపురి ఎలక్ట్రికల్స్ షాపు ఎదురుగా ఓ వ్యక్తి కారును నడిరోడ్డుపై ఆపాడు. అందులో ఉన్న మహిళలు పండ్లు కొంటుండగా ట్రాఫిక్ స్థంభించింది. ఈవిషయాన్ని గమనించిన సందీప్ ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోంది, అక్కడ నుంచి కారు తీయాలని డ్రైవర్‌కు సూచించాడు. అయినా అతడిని పట్టించుకోకపోవడంతో దగ్గరకు వెళ్లి కారును తీయమని గద్దించాడు. దీంతో కోపోద్రిక్తుడైన డ్రైవర్ కానిస్టేబుల్‌పై తిరగబడ్డాడు. ఇంతలో కారులో వచ్చిన మహిళ కానిస్టేబుల్ వద్దకు వచ్చి ఎంత ధైర్యముంటే నా డ్రైవర్‌నే తిడుతావా అంటూ కానిస్టేబుల్‌ను నానా దుర్భాషలాడింది. దీంతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ స్థంభించింది. కూరగాయల వ్యాపారులు, మార్కెట్‌కు వచ్చిన నగర వాసులు అక్కడకు చేరుకుని సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా శాంతించని సదరు మహిళ వారిని ఏకవచనంతో సంబోధించి నానా దుర్భాషలాడింది. అంతేకాకుండా సదరు కానిస్టేబుల్‌ను నీ అంతుచూస్తా? అంటూ తన బందువులకు ఫోనుచేసి అక్కడకు పిలిపించింది. దీంతో కానిస్టేబుల్ సైతం తన సహచరులను పిలిపించుకుని వివాదం విషయాన్ని ట్రాఫిక్ డీఎస్పీ రామారావు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకొనేలోపే కారుడ్రైవర్ కారువేగాన్ని పెంచి కానిస్టేబుల్స్‌ను తోసుకుంటూ అక్కడ నుంచి వె ళ్లిపోయారు. తమను నానా దుర్భాషలాడారని, ఇలాగైతే తాము ఉద్యోగం చేయలేమని బాధితుడితోపాటు అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది డీఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం జరిగిన విషయాన్ని బాధితుడు నేరుగా జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ దృష్టికి తీసుకెళ్లాడు. తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరాడు. ఇది ఇలా ఉంటే జరిగిన ఘటనను చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా, ఫొటోగ్రాఫర్లపై మహిళ, ఆమె తరపువారు తీవ్ర పదజాలంతో దూషించారు.