తీరప్రాంత విద్యుత్ కష్టాలకు చెక్!
Published Tue, Oct 29 2013 3:29 AM | Last Updated on Wed, Sep 5 2018 4:10 PM
సాక్షి, విశాఖపట్నం :పై-లీన్ తుపానుతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. తుపాను వచ్చిన ప్రతిసారీ తీరప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నం కావడంపై దృష్టి సారించింది. భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే తుపాను ప్రభావిత తీర ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చుకాగల పనులకు ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపించింది. ఐదు జిల్లాలు.. 20 ప్రాంతాలు జాతీయ తుపాను విపత్తు నిర్వహణ కార్యక్రమంలో భాగంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వివిధ విభాగాలను హెచ్చరించింది.
భవిష్యత్‌లో తుపానులు సంభవిస్తే తట్టుకునేలా తీర ప్రాంతాల్లో నిర్మాణాలు, వివిధ వ్యవస్థలు ఆధునికీకరించుకోవాల్సిందిగా సూచించింది. ప్రపంచ బ్యాంకుకు చెందిన ఆర్థిక వ్యవ హారాల విభాగం అడాప్ట్‌బుల్ ప్రోగ్రాం లోన్ కింద నిధులు మంజూరుకు అంగీకరించింది. రాష్ట్రానికి రూ.1,496.71 కోట్లు ప్రతిపాదించగా.. ఇందులో ప్రపంచ బ్యాంకు రూ.1,198.44 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.298.27 కోట్లు భరించనున్నాయి. ఇందులో భాగంగా ఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 20 పట్టణ/మండల కేంద్రాల్లో భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఒక్కో ప్రాంతంలో రూ.2.50 కోట్ల వ్యయంతో 33/11 కేవీ భూగర్భ విద్యుత్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడి నుంచి తీర ప్రాంతాలకు 151 కిలోమీటర్ల మేర భూగర్భ కేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు.
డీపీఆర్ తర్వాత పనులు
ఢిల్లీలో ఉన్న జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు ఈపీడీసీఎల్ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారు. దీనిపై సమగ్ర నివేదిక తయారు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఓ జాతీయ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించేందుకు కేం ద్రం సన్నద్ధమైనట్టు అధికారులు చెప్తున్నారు. పై-లీన్ తుపాను అనంతరం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా మాట్లాడుతూ చాలా దేశాల్లోని తీర ప్రాంతాల్లో ఇప్పటికే భూగర్భ విద్యుత్ లైన్ల వ్యవస్థ అందుబాటులో ఉందని, ఇక్కడ కూడా ఆ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రానికి నివేదిస్తామన్నారు.
Advertisement
Advertisement