Cylone
-
కారుపై ప్రేమతో
-
రైతులకు ధైర్యాన్నిచ్చిన విజయమ్మ
-
రైతులకు ధైర్యాన్నిచ్చిన విజయమ్మ
దొంగరావిపాలెం (పెనుగొండ రూరల్), న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి పంట నష్టపోయిన రైతుల్లో ఆత్మస్థైరాన్ని నింపారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. విజయమ్మ జిల్లా పర్యటన ముగిసిన అనంతరం దొంగరావిపాలెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో విజయమ్మ నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించారని, అడుగడుగునా రైతులు ఆమె వద్ద గోడు వెళ్లబోసుకున్నారని చెప్పారు. పెట్టుబడులు నష్టపోయి నిండా మునిగి పోయామని ఆమె వద్ద రైతులు ఆవేదన చెందినట్టు తెలిపారు. రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. తూతూమంత్రం చర్యలతో ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని ఆరోపించారు. వారం రోజులుగా చేలల్లో నీరు నిలిచి పనలు కుళ్లిపోతున్నా.. అధికారులు నష్టం అంచనాలకు సమాయత్తం కాకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు అధిక నష్టపరిహారం ఇప్పించేందుకు, రుణమాఫీ చేసేందుకు విజయమ్మ పోరాటం చేస్తానని చెప్పారన్నారు. కౌలు రైతులకు రుణాలను రీషెడ్యూల్ చేయాలని, సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలని, ఇన్పుట్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని బాలరాజు డిమాండ్ చేశారు. డెల్టా ఆధునికీకరణను వేగవంతం చేయాలని విజయమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారన్నారు. మహానేత వైఎస్సార్ హయాంలో రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రైతులకు పూర్తిన్యాయం జరుగుతుందని బాలరాజు పేర్కొన్నారు. వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, ఆచంట, చింతలపూడి సమన్వయకర్తలు కండిబోయిన శ్రీనివాసు, కర్రా రాజారావు, జిల్లా అధికార ప్రతినిధి ఊదరగొండి చంద్రమౌళి, పెనుగొండ సర్పంచ్ యాదాల ఆశాజ్యోతి, ఆచంట మాజీ జెడ్పీటీసీ సభ్యు డు ముప్పాళ వెంకటేశ్వరరావు, వైసీపీ ఆచంట, పెనుగొండ మండల కన్వీనర్లు గుడాల విజయబాబు, యాదాల రవిచంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు పిల్లి వెంకట సత్తిరాజు, యాదాల నాగరాజు, ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ మీడియా కార్యదర్శి గుత్తుల సాల్మన్ దొర, మాజీ ఎంపీపీ మట్టా ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తీరప్రాంత విద్యుత్ కష్టాలకు చెక్!
సాక్షి, విశాఖపట్నం :పై-లీన్ తుపానుతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. తుపాను వచ్చిన ప్రతిసారీ తీరప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నం కావడంపై దృష్టి సారించింది. భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే తుపాను ప్రభావిత తీర ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చుకాగల పనులకు ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపించింది. ఐదు జిల్లాలు.. 20 ప్రాంతాలు జాతీయ తుపాను విపత్తు నిర్వహణ కార్యక్రమంలో భాగంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వివిధ విభాగాలను హెచ్చరించింది. భవిష్యత్‌లో తుపానులు సంభవిస్తే తట్టుకునేలా తీర ప్రాంతాల్లో నిర్మాణాలు, వివిధ వ్యవస్థలు ఆధునికీకరించుకోవాల్సిందిగా సూచించింది. ప్రపంచ బ్యాంకుకు చెందిన ఆర్థిక వ్యవ హారాల విభాగం అడాప్ట్బుల్ ప్రోగ్రాం లోన్ కింద నిధులు మంజూరుకు అంగీకరించింది. రాష్ట్రానికి రూ.1,496.71 కోట్లు ప్రతిపాదించగా.. ఇందులో ప్రపంచ బ్యాంకు రూ.1,198.44 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.298.27 కోట్లు భరించనున్నాయి. ఇందులో భాగంగా ఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 20 పట్టణ/మండల కేంద్రాల్లో భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఒక్కో ప్రాంతంలో రూ.2.50 కోట్ల వ్యయంతో 33/11 కేవీ భూగర్భ విద్యుత్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడి నుంచి తీర ప్రాంతాలకు 151 కిలోమీటర్ల మేర భూగర్భ కేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. డీపీఆర్ తర్వాత పనులు ఢిల్లీలో ఉన్న జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు ఈపీడీసీఎల్ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారు. దీనిపై సమగ్ర నివేదిక తయారు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఓ జాతీయ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించేందుకు కేం ద్రం సన్నద్ధమైనట్టు అధికారులు చెప్తున్నారు. పై-లీన్ తుపాను అనంతరం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా మాట్లాడుతూ చాలా దేశాల్లోని తీర ప్రాంతాల్లో ఇప్పటికే భూగర్భ విద్యుత్ లైన్ల వ్యవస్థ అందుబాటులో ఉందని, ఇక్కడ కూడా ఆ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రానికి నివేదిస్తామన్నారు. -
ధైర్యంగా ఉండండి
‘అమ్మా.. ఈ పాలకులకు కనికరం లేదు. నష్టాల్లో కూరుపోయి.. కష్టాల్లో చిక్కుకున్న మమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడు. ఓటేసి గెలిపించిన ప్రజాప్రతినిధులెవరూ వచ్చింది లేదు. మాటమాత్రంగానైనా మమ్మల్ని పలకరించింది లేదు. రైతు ఏమైపోతున్నాడోనన్న ఆలోచన వాళ్లెవరికీ లేదు. ఇదిగోండమ్మా మేం పండించిన పంట. ఇదిగో ఇలా నీటిపాలైంది. అక్కడ చూడండి ధాన్యం మొలకొచ్చేస్తోంది. దీన్ని చూడండమ్మా.. ఈ చేను పొట్ట దశలో ఉంది. నీళ్లల్లో మునిగిపోవడంతో గింజలు దక్కే పరిస్థితి లేదు. ఇదేదో మా ఊరోళ్ల కష్టం మాత్రమే కాదమ్మా.. జిల్లాలో అన్ని పంటలూ మునిగిపోయూయి. రైతులంతా పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. మమ్మల్ని ఆదుకోమని ఈ ప్రభుత్వమోళ్లకు మా ఆత్మబంధువైన మీరు గట్టిగా చెప్పండమ్మా...’ అంటూ వైఎస్ విజయమ్మ ఎదుట రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలను స్వయంగా చూసిన ఆ తల్లి గుండె చలించిపోయింది. ‘మీ రాజన్నే ఉంటే మీకు ఈ కష్టాలు వచ్చేవి కాదు. వ్యవసాయం పండగలా మారి ఉండేది. అధైర్యపడకండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మీకొచ్చిన కష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి మిమ్మల్ని ఆదుకోమని గట్టిగా నిలదీస్తాం. ఆరు నెలలు ఓపిక పట్టండి. జగన్‌బాబు అధికారంలోకి వస్తాడు. మీ కష్టాలను కడతేరుస్తాడు’ అంటూ రైతన్నలకు విజయమ్మ భరోసా ఇచ్చారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : భారీ వర్షాలు రైతులను మరోసారి తీవ్రంగా కుంగదీశాయని.. వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ భరోసా ఇచ్చారు. రైతు బాగుంటేనే ప్రభుత్వాలు బాగుంటాయని వైఎస్ రాజశేఖరరెడ్డి భావించేవారని.. ఆ దిశగానే వారికి మేలు చేకూర్చేవారని తెలిపారు. కానీ గడచిన నాలుగేళ్ల నుంచి రైతులు ఏదో ఒక రూపంలో నష్టపోతున్నారని, ఈ ప్రభుత్వం అన్నదాతలను పట్టించుకున్న పాపానపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు జిల్లాలో నీట మునిగి దెబ్బతిన్న పంట పొలాలను సోమవా రం ఆమె పరిశీలించారు. పలుచోట్ల రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాల కారణంగా జిల్లాలో నలుగురు చనిపోయారని వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని, రైతులను సత్వరమే ఆదుకునే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రంపైనా ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం ఇంకా ఆరు నెలలు అధికారంలో ఉంటుందని, ఈలోపు రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కొద్దికాలం ఓపిక పడితే త్వరలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తారని స్పష్టం చేశారు. అప్పుడు అందరికీ న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి శాశ్వత పరిష్కారాలు చూపిస్తారని హామీ ఇచ్చారు. రైతులు ధైర్యం కోల్పోకుండా నిబ్బరంగా ఉండాలని అన్నారు. ఉదయం 11గంటలకు కృష్ణాజిల్లా సరిహద్దున గల అప్పనవీడు వద్ద ఆమె జిల్లాలోకి ప్రవేశిం చారు. అక్కడి నుంచి ఉంగుటూరు మండలం నారాయణపురం చేరుకున్న విజయమ్మ నీటిలో నడుచుకుంటూ వెళ్లి మునిగిన వరి చేలను చూశారు. రైతులతో మాట్లాడి ఎంత నష్టం వచ్చింది, ఎంత పెట్టుబడి పెట్టారు వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారి పక్కన దెబ్బతిన్న పొలాలను చూసి రైతులతో మాట్లాడారు. అక్కడి నుంచి నేరుగా నందమూరు అక్విడెక్టు వద్దకు వెళ్లి పరిశీలించారు. ఎర్రకాలువ పొంగినప్పుడల్లా తమ పొలాలు ముని గిపోతున్నాయని అక్కడి రైతులు ఆమెకు తమ బాధలను చెప్పారు. ఎగువ రైతులు, దిగువ రైతుల సమస్యల విన్న తర్వాత విజయమ్మ ఇరువురికీ నష్టం కలగకుండా పరిష్కారం చూపడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. అనంతరం తణుకు మండలం దువ్వలో నేలకొరిగిన పంటచేలను పరిశీలించి నష్టం వివరాలను తెలుసుకున్నారు. దువ్వలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోరుతూ చేపట్టిన రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలి పారు. ఆ తర్వాత తణుకు మీదుగా ఇరగవరం మండలం గోటేరు, కంతేరు గ్రామాల్లో పర్యటించి నేలకొరిగిన పంటచేలను పరిశీలించారు. నష్టపరిహారం అందేవరకూ రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కత్తవపాడు వద్ద ఆచంట నియోజకవర్గ నాయకులు విజయమ్మకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బయలుదేరి ఆలమూరు చేరుకున్న ఆమె అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మార్టేరు మీదుగా కవిటం సెంటర్‌కు చేరుకున్నారు. పోడూరు నుంచి మినిమించిలిపాడు వరకూ పూర్తిగా మునిగిన పంట చేలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆచంట వేమవరంలో చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే ప్రాంతంలో పంట పొలాలను పరిశీలించారు. సాయంత్రం 6 గంటలకు పెనుగొండ మండలం సిద్ధాంతం మీదుగా తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లారు. విజయమ్మ వెంట వైసీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాల రాజేష్, ముదునూరి ప్రసాదరాజు, తానేటి వనిత, పాతపాటి సర్రాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు చీర్ల రాధయ్య, కర్రా రాజారావు, చలుమోలు అశోక్‌గౌడ్, పుప్పాల వాసు, కండిబోయిన శ్రీనివాసు, తలారి వెంకట్రావు, డి.సువర్ణరాజు, నాయకులు వగ్వాల అచ్యుత రామారావు, ఊదరగొండి చంద్రమౌళి, కౌరు సర్వేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
తుపాను బాధితులను నిరాశ పరిచిన సీఎం టూర్
లేటుగా వచ్చినా లేటెస్టుగా స్పందిస్తారని ఆశించారు.. ఏదో సాయం ప్రకటించకపోతారా!.. అని ఎదురు చూశారు. కానీ చివరికి నిరాశే మిగిలింది. గాలి దుమారం తప్ప.. గట్టి హామీ ఏదీ లభించలేదు. గాలిలో చక్కర్లు కొట్టి.. మత్స్యకారులు, రైతులకు నాలుగు గాలి కబర్లు చెప్పి తుపాను ప్రాంతాల పర్యటన అయ్యిందనిపించారు.. ముఖ్యమంత్రిగారు!. తుపాను బీభత్సం సృష్టించిన వారం తర్వాత ఆ ప్రాంత పర్యటనకు వచ్చిన ఆయన ఏదో ఉద్ధరిస్తారన్న రైతుల ఆశలు ఆయన హెలికాప్టర్ సృష్టించిన గాలిలో కలిసిపోయాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆదివారం జరిపిన పర్యటన బాధితులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చకపోగా.. మరింత కుంగిపోయేలా చేసింది. మత్స్యకారులకు రూ.40 కోట్లతో సహాయ కార్యక్రమాలు చేపడతామన్న ప్రకటన తప్ప.. ఇతరత్రా ఏ ఒక్క డిమాండునూ ముఖ్యమంత్రి అంగీకరించలేదు. తక్షణ సాయం గురించి కూడా మాట మాత్రంగానైనా ప్రస్తావించకపోవడం రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది. తుపాను ప్రాంతాల్లో ఏరియల్ సర్వేతోపాటు ఇచ్ఛాపురం మండలం డొంకూరు, కవిటిల్లో మత్స్యకారులు, రైతులతో ముఖాముఖి కార్యక్రమాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం ముందుగా డొంకూరు చేరుకున్న సీఎం మత్స్యకారులతో మాట్లాడారు. తమ కష్టాలను విడమరచి చెప్పారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి మృతి చెందిన వారికి ప్రస్తుతం ఆపద్బంధు పథకం కింద రూ.50 వేలు ఇస్తున్నారు. దాన్ని పెంచి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని వారు కోరగా ముఖ్యమంత్రి స్పందించ లేదు. జిల్లాలోని మత్స్యకారుల కోసం రూ. 40 కోట్లతో వివిధ సహాయ కార్యక్రమాలు చేపడతామని మాత్రం హామీ ఇచ్చారు. చేపల నిల్వ కోసం రూ.కోటితో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తామన్నారు. డొంకూరు మహిళా సంఘానికి చేపల అమ్మకానికి రెండు వాహనాలు కొనుగోలు చేసుకునేందుకు రుణం ఇస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి కవిటికి చేరుకున్న ఆయన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కొబ్బరి రైతులు పూర్తిగా నష్టపోయారని, అదే విధంగా జీడి, మామిడి తోటలు వేసిన రైతులదీ అదే దుస్థితి అంటూ చెట్టుకు రూ.2 వేలు చొప్పన వెంటనే పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా పలువురు రైతులు కోరారు. వారి విజ్ఞప్తిని సీఎం మన్నించలేదు. నష్టంపై సర్వేకు ఆదేశించినందున పూర్తి వివరాలు వ చ్చిన తర్వాతే పరిహారం నిర్ణయిస్తామని తేల్చి చెప్పారు. సర్వే ఎలా జరుగుతుందనే సందేహాలు రైతుల్లో ఉన్నాయంటూ దాని గురించి వివరించాలని ఉద్యానవన శాఖ కమిషన ర్ను ఆదేశించగా.. ఆయన సర్వే తీరును వివరించారు. నష్టపోయిన చె ట్ల స్థానంలో కొత్తగా కొబ్బరి మొక్కలు నాటేందుకు, కూలిన చెట్టు తొలగించి, భూమి బాగుచేసుకునేందుకు ఉపాధి హామీ పథకం కింద ఎకరాకు రూ.5 వేలు ఖర్చు చేసేలా వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి.. దాని సాధ్యాసాధ్యాలను మాత్రం వివరించలేదు. ఈ ప్రాంతంలో వాణిజ్య పంటలు తప్ప ఆహార పంటలు కనిపించడం లేదని, ఈ రైతులను ఎలా ఆదుకోవాలనే విషయంలో అధికారుల సూచనలు పాటిస్తామని చెప్పారు. అంతకుమించి ఇంకేమీ హామీలు ఇవ్వలేదు. కవిటిలో సమైక్య నినాదాలు కవిటిలోకి రాగానే రోడ్డుపై కాన్వాయ్ దిగిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైపు చూస్తూ జై సమైక్యాంధ్ర అంటూ కొందరు నినాదాలు చేశారు. వారి వద్దకు వచ్చిన సీఎం నేను కూడా సమైక్యవాదినేనని చెప్పారు. రైతులతో మాట్లాడుతున్నప్పుడు కూడా విభజన తుపానును అడ్డుకుంటామని చెప్పారు. దానికి మీ సహాయ సహకారాలు కోరుకుంటున్నామని అన్నారు. ఇచ్ఛాపురంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కూడా ఉద్యాన రైతుల గురించి సీఎం పెద్దగా మాట్లాడలేదు. త్వరగా నివేదిక ఇస్తే ఏ విధ మైన పరిహారం ఇవ్వాలనే విషయాన్ని పరిశీలిస్తానని మాత్రమే చెప్పారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రి కృపారాణి, రాష్ట్ర మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, కోండ్రు మురళి, గంటా శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఫీజులు రద్దు చేయాలి ఇంటర్, డిగ్రీ, పీజీ పరీక్ష ఫీజులు రద్దు చేయాలని కవిటి ముఖాముఖీలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సీఎంను కోరారు. ఈనెల 23వ తేదీలోగా ఫీజు కాట్టాలని కళాశాలల వారు ఒత్తిడి తెస్తున్నారని, తుపానులో పూర్తిగా నష్టపోయిన తాము ఫీజులు చెల్లించలేని ఉన్నందున తమ పిల్లలకు పరీక్ష ఫీజులు రద్దు చేయాలని కోరారు. అయితే సీఎం వారికి ఎటువంటి హామీ ఇవ్వలేదు. -
పునరావాస చర్యలు వేగవంతం
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలను వేగవంతం చేస్తామని, 38 మండలాల్లోనూ వరి, ఇతర పంటలకు జరిగిన న ష్టంపై సర్వేలు చేసి బాధితులకు పరిహారం చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ చెప్పారు. కలెక్టరేట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుపాను కారణంగా జిల్లాలోని రైతులు, మత్స్యకారులకు అపార నష్టం జరిగిందన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరగకుండా నిరోధించగలిగామని తెలిపారు. పశువులను కూడా చాలావరకు రక్షించగలిగామన్నారు. ప్రస్తుతం పునరావాస కార్యక్రమాలపై దృష్టి పెట్టామని, ఇవి వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మంగళవారం నాటికి అన్ని శాఖల సర్వేలు పూర్తిచేసి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని అన్నారు. వైద్య బృందాలు తీర ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్నాయని, తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయిస్తున్నామని వెల్లడించారు. రోడ్లు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, తాగునీటి సౌక ర్యం కల్పనకు ప్రత్యేక బృందాలు యుద్ధప్రాతిపదకన పనిచేస్తున్నాయని తెలిపారు. ఇళ్లు నష్టపోయినవారికి పరిహారం శనివారం నుంచి చెల్లిస్తామన్నారు. పలు మండలాల్లో మత్స్యకారులకు బియ్యాన్ని ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. కూలిన ఇళ్ల శిథిలాలు, పడిపోయిన చెట్ల తొలగింపు పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపడతామని వెల్లడించారు. కొబ్బరి రైతులకు చెట్ల లెక్కన పరిహారం నష్టపోయిన కొబ్బరి రైతులకు చెట్ల లెక్కన పరిహారం చెల్లిస్తామని చెప్పారు. 1996లో ఇచ్చిన ప్యాకేజీని సవరించి పరిహారం పెంచనున్నారని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం సమీక్షిస్తోందని తెలిపారు. ఇప్పటికీ 78 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదని, 9 తాగునీటి ప్రాజెక్టులు పనిచేయటం లేదని వెల్లడించారు. తుపాను ముందస్తు చర్యల కోసం రూ.80 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. ఉద్యాన పంటల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను రైతులకు తెలియజేసేందుకు, నష్టాన్ని అంచనా వేసేందుకు శాస్త్రవేత్తల బృందం పర్యటిస్తోందని తెలిపారు. కంట్రోల్ రూం కొనసాగింపు బాధితులను ఆదుకునేందుకు కలెక్టరేట్లోని కంట్రోల్ రూమును కొనసాగిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. సర్వే బృందాలు రాకపోయినా, పరిహారం చెల్లింపులో తేడాలు.. ఇతర ఇబ్బందులు ఉన్నా.. 08948-240557, 96528 38191 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో ఏజేసీ ఆర్.ఎస్.రాజ్‌కుమార్, డీఆర్ఓ నూర్‌బాషా ఖాసీం, డ్వామా పీడీ కల్యాణచక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
తుపాను బాధిత రైతులకు అన్యాయం జరిగే ప్రమాదం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలోని పై-లీన్ తుపా ను బాధిత రైతులు, బాధిత కుటుంబాలకు సహా యాన్ని ఏ ప్రాతిపదకన, ఏ మేరకు ఇస్తారనేది ఇంతవరకు తేలలేదు. పైగా ప్రస్తుతం అధికారులు చేపట్టిన సర్వేల తీరు బాధితులకు అన్యాయం చేసేలా ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రైతులకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. రెండు రోజులుగా అధికారులు నష్టం అంచనాల తయారీలో ఉన్నా.. ఇంతవరకు 20 శాతం సర్వే కూడా పూర్తి కాలేదు. ఇళ్లు, ఇతర ఆస్తులకు జరిగిన నష్టాలను అంచనా వేసే పనిలో రెవెన్యూ, హౌసింగ్ శాఖలు ఉండగా, వాణిజ్య పంటలకు జరిగిన నష్టాలను ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టేకు చెట్లకు జరిగిన నష్టాన్ని అటవీశాఖ, ఆహార పంటల నష్టాలను వ్యవసాయశాఖ సిబ్బంది అంచనా వేస్తున్నారు. కొబ్బరి రైతులకు తీవ్ర నష్టం జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు సాగు చేస్తుండగా, ఒక్క ఉద్దానం ప్రాంతంలోనే 20 వేల హెక్టార్ల వరకు ఉంది. తుపాను వల్ల ఉద్దానం ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. సుమారు 15 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు పనికి రాకుండా పోయాయి. అధికారుల అంచనా ప్రకారం ఎకరా భూమిలో 60 చెట్ల వరకు పెంచుకోవచ్చు. అయితే రైతులు 80 వరకు చెట్లు పెంచుతున్నారు. దేశవాళీ చెట్టు పెరిగి కాపు రావాలంటే కనీసం 12 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం కొబ్బరి పూర్తిగా కాపులో ఉంది. తుపానుకు నూరుశాతం చెట్లు పనికి రాకుండా పోయాయి. ఒక ఎకరాలోని చెట్లు ఓ కుటుంబాన్ని జీవితకాలం పోషిస్తాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మూడు రకాలుగా విభజించి నష్టం అంచనాలు తయారు చేస్తున్నారు. ‘పూర్తిగా పడిపోయిన చెట్లు, మొవ్వ విరిగిన చెట్లు, మెలిపెట్టుకుపోయి ముద్దగా మారిన చెట్టు’ అంటూ మూడు రకాలుగా విభజించారు. మొవ్వ విరిగిన చెట్టు తిరిగి కాపునకు రావాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది. మెలిపెట్టుకుపోయిన చెట్టు పనికి రాదు. పూర్తిగా విరిగిన చెట్టుగానే పరిగణనలోకి తీసుకుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ అధికారులకు పట్టడం లేదు. ఎకరాను యూనిట్‌గా కాకుండా చెట్లను లెక్కలోకి తీసుకొని పరిహారం ఇవ్వాలనే ఆలోచన పూర్తిస్థాయిలో నష్టం చేస్తుందని రైతులు చెబుతున్నారు. తోటల్లో పడిపోయిన కొబ్బరి చెట్టును వేళ్లతో పెకిలించి బయటకు చేర్చాలంటే కనీసం రూ. 500లు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. 1999లో వచ్చిన తుపాను సమయంలో పాక్షికంగా పాడైన చెట్టుకు రూ.వంద, పూర్తిగా పోయిన చెట్టుకు రూ. 250లు చొప్పున పరిహారం ఇచ్చారు. ఇప్పుడు ఎలా.. ఎంత పరిహారం ఇస్తారో తెలియటం లేదు. ప్రభుత్వం ఏ విధమైన ప్రకటన లేకుండా అంచనాలు ఎలా తయారు చేయమన్నదో, అధికారులు ఏమి చేయదలుచుకున్నారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక జీడితోటలు, మామిడి తోటల్లో ఏ స్థాయిలో నష్టం జరిగిందో అధికారులు చెప్పే పరిస్థితి లేదు. ఉద్యానవన శాఖ వద్ద కూడా సరైన లెక్కలు లేవు. కొబ్బరి తోటల్లో అంతర పంటలుగా జీడి, మామిడి తోటలు వేసిన వారు ఉన్నారు. ఇందులో పూర్తిగా పడిపోయిన చెట్లనే పరిగణలోకి తీసుకుంటున్నారు. కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో పూర్తిస్థాయిలో కొబ్బరి, జీడి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అధికారుల అంచనాలు ఇందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. కంచిలి మండలంలో నాలుగు రోజులుగా పర్యటిస్తున్న అధికారులు నాలుగు పంచాయతీల్లో మాత్రమే సర్వేను పూర్తి చేయగలిగారు. తోటల్లో పడిపోయిన చెట్లను అలాగే ఉంచితే, పురుగులు వట్టి మిగిలిన చెట్లు కూడా పనికిరాకుండా పోయే అవకాశముందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆహార పంటల విషయంలోనూ అధికారులు సరైన పద్ధతులు పాటించడం లేదు. అనేక చోట్ల వరి పొలాలు నీట మునిగాయి. నాట్లు కుళ్లిపోయి పనికి రాకుండా పోయాయి. మిగతా పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి. అధికారులు ఒక పద్ధతి లేకుండా ఇష్టాను సారం నష్టం అంచనాలు తయారు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. కొన్ని మార్గదర్శకాల మేరకు అంచనాలు తయారు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు.. వీటి ప్రకారమే సర్వేలు చేస్తున్నాం.. అంతకు మించి ఏమీ చెప్పలేమని సర్వే అధికారులు చెబుతున్నారు. ఇక మత్స్యకారులు, ఇళ్లు కోల్పోయిన వారు నడిరోడ్డుపై నిలబడ్డారు. వారి పునరావాసం గురించి అధికారులు ఇంతవరకు పట్టించుకోలేదు. పదికేజీల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నంలో ఉన్నారు. మత్స్యకారులకు జరిగిన నష్టంపై ఫిషరీస్ అధికారుల అంచనాలు ఎప్పటికి పూర్తవుతాయో తెలియటం లేదు. -
పరిహారం అందేలా ఒత్తిడి తెస్తాం: వైఎస్ విజయమ్మ
ఉద్దానం ప్రాంత రైతుల క ష్ట నష్టాలు తెలుసుకుంటూ...బాధిత రైతులను పరామర్శిస్తూ... వలలు, బోట్లు, ఆస్తులు కోల్పోయిన మత్స్యకారులకు భరోసానిస్తూ... మిహ ళా రైతులకు అండగా ఉంటామని హామీనిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ తుపాను బాధిత ప్రాంతాల్లో బుధవారం పర్యటన సాగించారు. ఆమెకు వినతులు అందించేందుకు బాధితులు ఆరాటపడ్డారు. వృద్ధులు గోడు వినిపించారు. ఉద్యానవన రైతులు విజ్ఞాపనలు చేశారు. జగన్‌బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే కష్టాలు తీర్చుతామని, ప్రస్తుతం నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెబుతూ ఆమె ముందుకు సాగారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గ్రామం: చిన్నకొజ్జిరియా సమయం : 12.30 గంటలు కనుచూపు మేరలో చుట్టూ నేలకొరిగిన కొబ్బరిచెట్లు... మధ్యలో నేలకూలిన ఇళ్లు... అక్కడే నిల్చొని ఆతృతగా వైఎస్ విజయమ్మ కోసం ఎదురు చూస్తున్న తుపాను బాధిత ప్రజలు... నేరుగా కాన్వాయ్ అక్కడికి వెళ్లి ఆగగానే సాదర ఆహ్వానం. అక్కడ ఉన్న బాధితుల్లో ఒకరైన బొడ్డా నరసింహమూర్తి మైకు తీసుకొని తమ బాధలు చెప్పడం మొదలు పెట్టాడు... అమ్మా నమస్కారం. మేము ఎక్కువగా కొబ్బరి పంట పండిస్తాం. తుపాను వచ్చి కొబ్బరి, జీడి పంటలను నాశనం చేసింది. పురుగు మందులు వాడినా ప్రయోజనం లేదు. మరి మీరొక్కరవ్వ మా తరఫున పోరాడి ఏదో కొంత వరకు సాయం అందించాలి. ప్రస్తుతానికి నాలుగైదు రోజులైంది. ఇంతవరకు పట్టించుకున్న వారు లేరు. ప్రస్తుతానికి మంచినీరు లేదు. కరెంటు లేదు. స్తంభాలు వేయడం లేదు. ఇక్కడ దించి పాతుకోమంటున్నారు. మీరు మా తరఫున పోరాడి... మా అయ్యగారు రాజశేర్‌రెడ్డిలా పోరాడి మాకు న్యాయం చేయాలి. ఇక్కడ 60 శాతం మంది కిడ్నీ జబ్బులు ఉన్నవారు ఉన్నారు. వైద్యం లేదు. జబ్బులతోనే సత్తున్నాం. మా బాధలు విన్నోళ్లూలేరు. ఆయన మాటలకు విజయమ్మ స్పందిస్తూ... మిమ్మల్ని చూస్తే చాలా బాధనిపిస్తావుంది. రాజశేఖర్‌రెడ్డి ఆరోజు సునామీ వచ్చినప్పుడు ఆదుకున్నారు. ఇప్పుడు కూడా పూర్తిస్థాయిలో ఆదుకొనేవారు. ఇప్పుడు పథకాలు సక్రమంగా అమలు జరగడం లేదు. ఇవన్నీ జగన్‌బాబు నాయకత్వంలో మనం సంపాదించుకుందాం. ఇప్పుడైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జీడిమామిడి చెట్లకు, కొబ్బరి చెట్లకు ఎకరాను పరిగణలోకి తీసుకొని నష్ట పరిహారం ఇవ్వాలి. ఇళ్లు కూలి పోయిన చోట ఇందిరమ్మ ఇళ్లు కట్టించాలి. కొబ్బరి కొత్త మొక్కలు ఇవ్వాలి, ఏరియల్ స్ప్రే చేయించాలి. ఆదాయం రావాలంటే కనీసం ఆరు సంవత్సరాలు పడుతుంది. అందుకే ఆదాయం వచ్చే వనరులు కల్పించాలి. ఆరు నెలల్లో జగన్ నాయకత్వంలో ప్రభుత్వం వస్తుంది. మీరంతా ధైర్యంగా ఉండండి. మీకు ధైర్యం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. అన్ని రకాలుగా మీ పక్షాన పోరాటాలు చేస్తామంటూ మాట్లాడుతుంటే అక్కడి జనం విజయమ్మకు జై.. జగన్‌కు జై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. జిల్లాలోని కంచిలి, కవిటి, సోంపేట మండలాల్లోని జాడుపూడి, పెద్దకొజ్జిరియా, చిన్న కొజ్జిరియా, రాజపురం, జగతి, దొరివంక, ఇద్దివానిపాలెం, బి.గొనపపుట్టుగ, కుసుంపురం, కళింగపట్నం, బల్లిపుట్టుగ, రుషికుడ్డ, ఇసుకలపాలెం, రామాయపట్నం, గొలగండి, బారువ గ్రామాల్లో పర్యటించారు. ఈ గ్రామాల్లో బాధితులు పడుతున్న బాధలను కళ్లారా సూచిన విజయమ్మ పలు చోట్ల మాట్లాడారు. అనేక మంది తమ బాధలు వివరించారు. కన్నీటి పర్యంతమయ్యారు. బారువలో మత్స్యకారులు కన్నీరు పెట్టుకున్నారు. వలలు, ఇతర సామాన్లు పనికి రాకుండా పోయాయని వాపోయారు. కళింగపట్నంలో పార్వతి అనే మహిళ సీసా పట్టుకొని ట్యాంకర్ వస్తేనే మాకు మంచినీరు, లేకుంటే ఈ మురికినీరే తాగాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వంతునూరులో 270 ఇళ్లు ఉన్నాయి. ఈ ఊరికి చుట్టూ నీరు ఉంది. ఎటుపోవడానికి వీలు లేకుండా పోయింది. ఉద్దాన ప్రాంతంలో ఎక్కడైనా స్థలం ఇస్తే ఇళ్లు కట్టుకుంటామంటూ విజ్ఞప్తిచేశారు. ఇంకా పలువురు మహిళలు, విద్యార్థులు, వృద్ధులు విజయమ్మ వద్ద తన ఆవేదన వ్యక్తం చే శారు. రాజపురం గ్రామంలో కాముట ఆరుద్రమ్మ మాట్లాడుతూ తన ఇల్లు కూలిపోయింది. నాకు దిక్కులేదని కన్నీరు పెట్టింది. విజయమ్మ వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లి చూశారు. తప్పకుండా సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే జగన్‌బాబు ప్రభుత్వం వస్తుంది. మీకు మంచే జరుగుతుందని చెప్పారు. సనపల సరస్వతి అనే మహిళ మాట్లాడుతూ తనకు ఎనిమిది ఎకరాలు కొబ్బరితోట ఉంది. మొత్తం కూలిపోయింది. ఇక నేనేమి చేయాలి. నాకు పింక్ కార్డు ఇచ్చారు. కనీసం బియ్యం తీసుకునేందుకు కూడా నాకు అర్హతలేదంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇలా ప్రతి గ్రామంలోనూ వేదనలు, రోదనలు మిన్నంటాయి. రాబోయేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని, తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుందని, సాయం అందించేందుకు మీ పక్షాన పోరాడతామని విజయమ్మ వారికి భరోసా ఇచ్చారు. -
పై-లీన్ తుపాను బాధితులకు విజయమ్మ మనోధైర్యం
సాక్షి, శ్రీకాకుళం: ఇరవయ్యేళ్ల కష్టం.. మరో ఇరవయ్యేళ్ల జీవితం.. ఓ తరానికి సరిపోయే జీవనోపాధి. కళ్లముందే నేల కొరిగింది. పై-లీన్ తుపాను తాకిడికి వేల సంఖ్యలో కొబ్బ రి, జీడి మామిడి, పనస తదితర ఉద్యాన పంటలు నాశనమయ్యాయి. ఇళ్లు శిథిలమయ్యాయి. మత్స్యకారులకు కూడు పెట్టే పడవ లు, వలలు అలలకు కొట్టుకుపోయాయి. బతుకు తెరువు పోయిందన్న బాధ ఓ వైపు. ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఏసీ కార్లలో వస్తున్న నేతలు.. నేల మీద అడుగు పెట్టకుండానే.. వెళ్లిపోతున్నారన్న ఆవేదన మరో వైపు. ఇలాంటి బాధాతప్త హృదయాల్ని అక్కున చేర్చుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ జిల్లాలోని తుపాను బాధిత ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు పర్యటించారు. రైతులు, మత్స్యకారుల గోడు స్వయంగా విన్నారు. తమ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న భరోసా ఇచ్చారు. మరికొద్ది నెలల్లో జగన్ బాబు ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అందరి బాధలూ తీరిపోతాయన్న ఆశలు నిం పారు. కొండంత ధైర్యాన్నిచ్చారు. ‘20 ఏళ్లపాటు ఫలసాయమిచ్చే కొబ్బరి, జీడి తోటలు నాశనమయ్యాయి. కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు మంత్రులు ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు. కార్లు దిగకుండానే.. ఇక్కడేం నష్టం జరగలేదంటూ తేల్చి చెప్పేశారు’.. - పలికల భాస్కర్, జాడుపూడి ‘అధికార బృందం రాలేదు. నష్టాన్ని అంచనా వేసేవాళ్లు లేరు. ఏం జరిగిందని అడిగే నాథుడే లేడు. చాలా కుటుం బాలు రోడ్డునపడ్డాయి. ఊరంతా అంధకారంలోనే ఉంది. జనరేటర్ల సాయంతో ట్యాంకర్లకు నీటిని నింపి సరఫరా చేసుకుంటున్నాం. వీఆర్వోను అడిగితే.. సమ్మెలో ఉన్నట్టు చెప్పారు. ఒక్కో చెట్టుకు పరిహారంగా రూ.10 వేలిచ్చినా సరిపోదు’.. - బొడ్డ రామ్‌కుమార్, సర్పంచ్, పెద్దకొజ్జిరియా ‘ఉన్న ఎనిమిదెకరాల్లోని కొబ్బరి పంట నాశనమైంది. ఆ పొలం ఉందని సెప్పి తెల్లకార్డు ఇవ్వలేదు. పెన్షన్‌కు దూరం చేశారు. ఇపుడు నా పంటంతా పోయినాది. నాకు దిక్కేటి’.. - సనపల సరస్వతి, రాజపురం ‘మారాజు. దేవుడిలాంటి వైఎస్సార్ ఇల్లు కట్టుకోడానికి భూమిచ్చారు. పేదలం. ఇల్లు కట్టుకునేందుకు సొమ్మేదీ..! దయచేసి మాకు ఒక రూమ్‌తో ఇల్లు కట్టిత్తే ఆ నాయన పేరు సెప్పుకుని బతికేత్తాం’.. - రట్టి శేషమ్మ, ఇద్దివానిపాలెం ‘మా ఊళ్లో 270 వరకు ఇళ్లున్నాయి. ఎటేపు నుంచీ దారి లేదు. చుట్టూ ఏరే. ట్యాంక్ నీరొస్తే ఫర్వాలేదు. లేదంటే.. మురికినీరే గతి. ఉదానం వైపు మాకు భూమిస్తే ఊరంతా ఎల్లి ఇళ్లు కట్టుకుంటాం’.. - పార్వతి, ఒంటూరు ఒకరేంటి.. ఒక్కో ఊళ్లో ఒక్కో రకమైన ఆవేదన. కిడ్నీ వ్యాధుల నుంచి తమను రక్షించాలని, ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత పెంచాలంటూ కుసుంపురం వాసులు, బీల నీటి ముంపుతో వరి పొలాలు పాడైపోయాయని రుషికుడ్డ ప్రజలు, థర్మల్ విద్యుత్‌ప్లాంట్ అనుమతులు రద్దు చేయాలని బారువ ప్రజలు.. జగన్ వస్తేనే తమ సమస్యలు తీరుతాయన్న నమ్మకంతో.. ఆయన తరఫున తమ బాధలు తెలుసుకునేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ముందు గోడు వెల్లబోసుకున్నారు. కన్నీరు పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరి బాధనూ ఆమె సాంతం విన్నారు. పలు విషయాలు అడిగి మరీ తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘జిల్లాలో తుపాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మిమ్మల్ని పరామర్శించి ధైర్యం నింపడానికే నన్ను జగన్ బాబు ఇక్కడికి పం పించాడు. కొబ్బరి, జీడి తోటలు, బోట్లు, వల లు, ఇళ్లు పాడయ్యాయి. చూస్తే చాలా బాధగా ఉంది. రాజశేఖరరెడ్డిగారున్నపుడు సునామీ వస్తే ఎంతగానో ఆదుకున్నారు. చివరి నిమిషం వరకు మీ కోసమే తపించారు. ఇపుడు ఆ సంక్షేమ పథకాలు అందే పరిస్థితి లేదు. మీ తరఫున మా ఎమ్మెల్యేలంతా కలిసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అసెంబ్లీ పెడితే.. అక్కడా చర్చిస్తాం. చెట్టుగా కాకుండా ఎకరానికి లెక్కిం చి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరుతాం. ఐదారు నెలల్లో జగన్ నాయకత్వంలో మంచి రోజులు వస్తాయి. వేటకెళ్లి గల్లంతైన మత్స్యకారులకు వెంటనే రూ.50 వేలు, ఆరు మాసాల వరకు జాడ కానరాకపోతే మిగిలిన రూ.4.50 లక్షలు పరిహారం ఇస్తాం. మీ నుంచి ఒకర్ని ఎమ్మెల్యేగా శాసనసభకు పంపిస్తానంటూ జగన్ ఎప్పుడో మాటిచ్చారు. మీరంతా ధైర్యం గా ఉండండి. రాజశేఖరరెడ్డి పథకాలన్నింటినీ అమలు చేస్తారంటూ భరోసా ఇచ్చారు. -
కరువు మేఘాలు
అలో లక్ష్మణా అంటూ అన్నదాత వాపోతున్నాడు. ఆరుగాలం కష్టించినా నాలుగువేళ్లు నోటికి వెళ్లే దారిలేక, బతికేందుకు వేరే మార్గం కానరాక కుంగిపోతూ... తన దురదృష్టానికి తిట్టుకుంటూ కన్నీరుకారుస్తున్నాడు. తుఫాన్ వచ్చినా కనీస స్థాయిలో కూడా వర్షాలు పడలేదు. పై-లీన్ ముప్పు తప్పడంతో కలిగిన ఆనందం... కనీస స్థాయిలో కూడా వర్షాలు కురవకపోవడంతో ఆవిరైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా నెర్రెలు వారిన నేలకు తుఫాన్ తీరం దాటిన సమయంలో పడే వర్షాలకు జీవం వస్తుందని ఆశించిన రైతులకు, అధికారులకు నిరాశేమిగిలింది. విజయనగరం వ్యవసాయం, న్యూస్‌లైన్: ఈ ఏడాది కూడా రైతులకు కష్టాలు తప్పేటట్టు లేవు. వర్షాభావ పరిస్థితులతో జిల్లాపై కరువు మేఘాలు కమ్ముకున్నాయి. తుఫాన్ సమయంలోనైనా తగిన స్థాయిలో వర్షాలు పడలేదు. శని,ఆదివారాల్లో అంతంత మాత్రం గానే కురిశాయి. అదికూడా కొమరాడ, గుమ్మ లక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, బలిజి పేట,చీపురుపల్లి, పూసపాటిరేగ, భోగా పురం మండలాల్లో కొద్దిపాటి వర్షం పడిం ది. ఖరీఫ్ సీజన్లో(జూన్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు నాటికి) జిల్లాలో 692.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావలసి ఉండగా 574.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. డెం కాడ, జామి, భోగాపురం, మెరకముడిదాం మండలాల్లో 40 శాతం కంటే తక్కువ వర్షపా తం నమోదైంది. విజయనగరం, పూసపాటిరేగ, చీపురుపల్లి, బొండపల్లి, గుర్ల, కొమరాడ, ఎల్.కోట, ఎస్.కోట, గంట్యాడ మండలాల్లో 50 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. 30 వేల హెక్టార్లలో నాట్లు లేవు వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలా ప్రాం తాల్లో నాట్లు వేయని పరి స్థితి నెలకొంది. గత ఏడా ది ఖరీఫ్ సీజన్లో 1,20,475 హెక్టార్లలో వరి పంట సాగవగా ఈ ఏడా ది కేవలం 90 వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. 30,475 హెక్టార్ల లో నాట్లు వేయలేదు. గుండె చెరువు... గ్రామాల్లోని చెరువులను చూస్తుంటే రైతులకు గుండె చెరువవుతోంది. వర్షాలు కురవకపోవడంతో వాటిలో చుక్కనీరు చేరలేదు. దీంతో చాలా చెరువులు ఆనవాళ్లు కోల్పోయాయి. కనీసం చెరువుల్లో నీరున్నా ఆయిల్ ఇంజిన్లతో నీటిని తోడైనా నాట్లు వేసుకునే పరిస్థితి ఉండే ది. నీరు లేక పొలాలు బీటలు వారుతున్నాయి. దీంతో ఏమి చేయాలో తెలియక రైతులు భగవంతునిపై భారం వేసి మిన్నుకుంటున్నారు. ప్రత్యామ్నాయానికి అదునులేదు సాధారణంగా ఖరీఫ్ సీజన్లో వరిపంటను జూల్, ఆగస్టు నెలలో వేస్తారు. వర్షాలు ఆలస్యంగా కురిసినట్లయితే సెప్టెంబర్ మొదటి వారంతో ముగిస్తారు. సెప్టెంబర్ మొదటి వారం తర్వాత ఇంకా నాట్లు వేయని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయ పంటలు కోసం వ్యవసాయశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించి, అమలుచేస్తుంది. అయితే సెప్టెంబర్ నెలకూడా ముగియడంతో ఇప్పుడు ప్రభుత్వం రాయితీపై విత్తనాలు, ఎరువులు ఇచ్చినా ఉపయోగించుకులేని పరిస్థితి. అపరాలు, చోడి పంట మేలు: ప్రస్తుత పరిస్థితుల్లో అపరాలైన పెసర, మినుము పంటలు లేదా, చోడి పంట వేసుకుంటే మేలని ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ పి.గురుమూర్తి తెలిపారు. పెసర, మినుము పంటలయితే 70 నుంచి 80 రోజుల్లో చేతికి అందివస్తాయన్నారు. చోడి పంటయితే 100 నుంచి 110 రోజుల్లో చేతికి వస్తుందని తెలిపారు. ఇప్పుడు వర్షాలు కురిసినట్టయితే స్వల్పకాలిక వరి రకాలైన 1010, పుష్కల విత్తనాలను డ్రమ్ సీడర్ పద్ధతిలో వెదజల్లుకోవాలని సూచించారు. ఈ రకాలు 100 రోజుల్లో పండుతాయని తెలిపారు. పంట ఎండిపోతోంది నాకున్న రెండు ఎకరాల్లో వరి వేశాను. రూ.20 వేల వర కు పెట్టుబడి పెట్టాను. నా ట్లు వేసినప్పటి నుంచి ఇప్పటివరకు వర్షాలు పడకపోవడంతో పంట ఎం డిపోయింది. గత ఏడాది పంట చేతికి అందివస్తుందనుకునే సమయంలో భారీ వర్షాలకు నీట మునిగింది. ఈ ఏడాది ఇలా అయింది. తిండి గింజలు కూడా దొరకని పరిస్థితి. ఇలా అయితే సాగు చేయడం చాలా కష్టం - వి.సింహాద్రి, పెదవేమలి గ్రామం, గంట్యాడ మండలం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగైన పంట వివరాలు పంటరకం= సాధారణం= సాగైంది వరి= 1,20,475= 90,000 జొన్న= 475= 83 గంటెలు= 663= 107 మొక్కజొన్న= 8805= 11,116 చోడి= 2528= 1457 సామ= 680= 25 కొర్ర= 330= 130 ఊద= 124= 0 చిరుధాన్యాలు= 177= 0 కంది= 1884= 1634 మినుము= 1698= 423 పెసర= 1611= 472 వేరుశనగ= 22,644= 8911 నువ్వులు= 11956= 7012 చెరుకు= 15078= 15602 పత్తి= 10691= 13903 గోగు= 18965= 4680 పొగాకు= 269= 3 -
పై-లీన్ తుపానుతో మత్స్యకారుల ఆవేదన
బాపట్ల టౌన్/నిజాంపట్నం, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను జిల్లాలో 27,248 మంది మత్స్యకారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో వేట మాని ఇంటికి చేరిన మత్స్యకారులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. విపత్తుల సమయంలో కూడా కనీసం చేయూతనివ్వకపోవటంపై మత్స్యకారులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పై-లీన్ తుపాను హెచ్చరికలు విన్న మత్స్యకారులు రెండు రోజుల కిందటనే సముద్రపు వేటను నిలిపివేసి బోట్లను ఒడ్డుకు చేర్చుకున్నారు. తుపాను ప్రభావం మరో రెండు, మూడు రోజుల వరకు ఉంటుందని అప్పటి వరకు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఎలా బతకాలని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేటపైనే జీవనాధారం జిల్లాలో లంకేవానిదిబ్బ నుంచి బాపట్ల వరకు 22 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. మొత్తం జిల్లాలో 6,812 మత్స్యకార కుటుంబాలు ఉండగా 27,248 మత్స్యకారులు ఉన్నారు. వీరిలో అధికశాతం వేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరిపై పై-లీన్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా చూపుతుంది. నిజాంపట్నం ఓడ రేవులోనే సుమారు 3వేలకు మందికిపైగా జీవిస్తుంటారు. అయితే వేట నిలిచిపోవటంతో ఉపాధి కోల్పోయారు. తీర ప్రాంతాల్లోని మత్స్యకారులకు ప్రతి ఏటా సెప్టెంబర్ నుంచి జనవరి వరకు నాలుగు నెలలు పాటు వేటలు బాగా సాగుతాయి. ఈ సమయంలోనే మత్స్యసంపద సముద్రంలో నుంచి భూ ఉపరితలానికి వందల టన్నుల్లో బయటకు వస్తుంటుంది. పట్టిన చేపలు తీరానికి సమీపంలో ఉన్న ఫారెస్ట్భూమి పర్రలో రెండు, మూడు రోజులపాటు ఎండబెట్టి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఏ ఒక్కరికి కూడా ఒక్క చాప పడిన దాఖలాలు లేవు. గత రెండు, మూడు రోజుల నుంచే చేపలు కనిపిస్తుండగా, ఇంతలోనే ముంచుకొచ్చిన వాయుగుండం వారి జీవితాల్లో చీకట్లు నింపింది. ఆందోళనలో మత్స్యకారులు ... గత నాలుగు నెలల నుంచి వేటలు సాగక..అప్పోసప్పో తెచ్చుకుతింటున్న మత్స్యకారులను ఇటీవల కురిసిన భారీ వర్షాలు వేటలకు వెళ్లకుండా చేస్తే బుధవారం రాత్రి వాయుగుండం కారణంగా వచ్చిన భారీ వర్షం చేపలు ఎండబెట్టుకునే ప్రాంతాన్ని కూడా ముంచెత్తింది. ముఖ్యంగా సముద్రతీరప్రాంత గ్రామాలైన సూర్యలంక, అడవిపల్లిపాలెం, పాండురంగాపురం, కృపానగర్, రామచంద్రపురం, ఓడరేవు, దాన్వాయ్‌పేట, ముత్తాయపాలెం, రామానగర్, ఆదర్శనగర్ గ్రామాల్లోని మత్స్యకారులంతా సముద్రం మీద జీవిస్తుంటారు. పై-లీన్ తుపాను ప్రభావంతో వేట సాగకపోవడంతో ఎన్ని రోజలు పస్తులు ఉండాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది అన్నీ నష్టాలే... ఈ ఏడాది ఏ ఘడియలో వలలు తడిపామో కానీ.... అన్నీ నష్టాలే ఎదురవుతున్నాయి. మొన్నటి దాకా వేటకు వెళ్లినప్పటికీ చేపలు పడక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడిప్పుడే నాలుగు చేపలు పడుతున్నాయన్న ఆశతో వలలు వేద్దామనుకుంటుండగా వానదేవుడు మాపై పగపట్టాడు. వలలు, పడవలు, చేపలు ఎండపెట్టుకునే ప్రాంతం అంతా నీటితో ముంచెత్తాడు. - పెసికం పెదసింగ్, మత్స్యకారుడు పాలకులు స్పందించాలి ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే వేటలు సాగుతాయి. అది కూడా వాతావరణం అంతా అనుకూలంగా ఉంటే నాలుగు రూపాయ లు మిగులుతాయి. లేకుంటే లేదు. దాంతో ఏడాదంతా తినాలి. ఈ ఏడాది ఇంత వరకు ఒక్కరోజు కూడా వేటకు వెళ్ళలేదు. వేటకు అయితే సెలవు పెట్టమంటున్నారు...కానీ ప్రభుత్వం తరఫున ఏ మాత్రం సాయం అందించడం లేదు. - కొక్కిలిగడ్డ నారాయణ స్వామి, మత్స్యకారుడు -
పెను తుపానుగా మారిన ‘పై-లీన్’
సాక్షి, గుంటూరు: పై-లీన్ తుపాను శుక్రవారం మరింత బలపడి పెనుతుపానుగా మారింది. జిల్లా అధికార యంత్రాంగానికి నిద్ర లేకుండా చేస్తోంది. బంగాళాఖాతంలో 600 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉన్న తుపాను మరింత బలపడి శనివారం సాయంత్రానికి శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం, ఒడిశాలోని గోపాలపూర్ ప్రాంతాల్లో తీరం దాటే అవకాశాలున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా అధికారులు తీరంలో అప్రమత్తం అయ్యారు. నిజాంపట్నం ఓడరేవులో శుక్రవారం సాయంత్రం మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. సమ్మె నుంచి బయటకు వచ్చి తుపాను సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సురేశ్‌కుమార్ కోరడంతో జిల్లాలోని 80 శాతం మంది ఉద్యోగులు శుక్రవారం విధులకు హాజరయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో శుక్రవారం సాయంత్రం జిల్లా అంతటా భారీ వర్షాలు మొదలయ్యాయి. పై-లీన్ తుపాను తీరం దాటే సమయంలో జిల్లాలో 200 నుంచి 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో కలెక్టర్ సురేశ్‌కుమార్ మరింత అప్రమత్తమై శుక్రవారం తీరం వెంబడి ఉన్న ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. నిజాంపట్నం, నగరం, రేపల్లె, బాపట్ల, కర్లపాలెం మండలాల్లోని 116 గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తీరంలోని తుపాను పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు. అంతేకాకుండా తెనాలి, రేపల్లె, గుంటూరుల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూముల్లో 48 గంటల పాటు రాత్రింబవళ్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు పడితే పశ్చిమ డెల్టాలోని వరి, వేరుశెనగ, పసుపు పంటలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉన్నందున ప్రధాన పంటకాల్వల్లోని సాగునీటి విడుదల పరిమాణాన్ని తగ్గించాలని ఇరిగేషన్ అధికారుల్ని ఆదేశించారు. పొలాల్లోని మురుగునీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్.. కాగా జిల్లాకు జాతీయ విపత్తుల నివారణ బలగాలు (ఎన్డీఆర్ఎఫ్) పెద్ద సంఖ్యలో చేరుకున్నాయి. మంగళగిరి కేంద్రంగా పనిచేస్తున్న బలగాలను తూర్పు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు పంపారు. వీరితో పాటు అత్యవసర సర్వీసుల కోసం చెన్నై, ముంబాయిల నుంచి అదనంగా 200 మందిని జిల్లాకు రప్పించారు. వీరికి నాగార్జునా యూనివర్సిటీలో వసతి కల్పించారు. సముద్ర తీరంలోని మెరైన్ పోలీసుల్ని కూడా అప్రమత్తం చేశారు. స్పీడ్‌బోట్లను రంగంలోకి దించి సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇదిలావుంటే తుపాను కారణంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే పంటలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోవడం ఖాయమని పశ్చిమ డెల్టా రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరిస్థితిని సమీక్షిస్తున్నాం: కలెక్టర్ తుపాను వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సముద్రతీరంలోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నామని కలెక్టర్ సురేశ్‌కుమార్ వివరించారు. పై-లీన్ తుపాను బలపడి పెనుతుపానుగా మారిన నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉన్నట్లు వివరించారు. జిల్లాలో పరిస్థితిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్ నుంచి సమీక్షించారు. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని టెలీకాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. -
‘పై-లిన్’ గండం: మోస్తరు నుంచి భారీ వర్షాలు
పై-లిన్ తుపాను శనివారం ఆంధ్రా-ఒడిశా వద్ద తీరం దాటే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. హార్బర్లలో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సహాయక చర్యలపై అధికారులు దృష్టి సారించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. దీనికి ఫైలిన్గా నామకరణం చేశారు. నాగపట్నం, చెన్నై, కడలూరు హార్బర్లలో 3వ నెంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. ఫైలిన్ తుపాను నేరుగా తమిళనాడుపై ప్రభావం చూపకపోవచ్చని అధికారులు తెలిపారు. అయితే తీరం దాటే సమయంలో వర్షాలు పడగలవని పేర్కొన్నారు. సముద్రతీర ప్రాంతాలు, జాలర్ల గ్రామాలు భారీ వర్షాలను, ఈదురు గాలులను ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రకటించారు. మళ్లీ అధికారికంగా ప్రకటించే వరకు జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఫైలిన్ తుపాన్ నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సముద్ర తీరంలోని జాలర్ల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక బ్యాగులు, ఆహార, తాగునీటి పొట్లాలను అందుబాటులో ఉంచుకోవాలని మండలస్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షం-రైతన్నకు నష్టం గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని డెల్టా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రైతన్నకు భారీనష్టం వాటిల్లింది. అదిరామ్పట్టిలోని 3 వేల ఎకరాల్లో పంటపొలాలు ఉప్పునీటి వరదతో మునిగిపోయాయి. అక్కరపట్టి, కల్లూరు ప్రాంతాల్లో 20 విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు నేలకూలాయి. కల్లూరులో జాలర్ల బోట్లు గాలి ఉద్ధృతికి ఎగిరిపడ్డాయి. తిరుచ్చి, కరూర్, పెంబలూరు జిల్లాలు సైతం భారీ వర్షాలు, ఈదురు గాలులతో వణికిపోయాయి. -
వణుకుతున్న తీరం: భయం గుప్పిట ఉప్పాడ
పిఠాపురం/కొత్తపల్లి, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను ప్రభావంతో జిల్లాలోని తీర ప్రాంతం వణికిపోతోంది. కొత్తపల్లి మండలంలో అనేక గ్రామాలు భయంగుప్పెట గడుపుతున్నాయి. మండలంలోని ఉప్పాడ, కోనపాపపేట, మూలపేట, మాయాపట్నం, అమీనాబాద తదితర గ్రామాల్లో తీరప్రాంతం సముద్ర కోతకు గురవుతోంది. రెండు రోజులుగా కెరటాల ఉధృతి పెరగ్గా, శుక్రవారం మరింత తీవ్ర రూపం దాల్చింది. సుమారు 10 మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతుండడంతో తీరం కోత ఎక్కువైంది. ఉప్పాడతో పాటు కోనపాపపేటపై సముద్ర కెరటాలు విరుచుకుపడ్డాయి. ఈదురు గాలులకు గృహాలు ధ్వంసమవుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలో లంగరు వేసిన బోట్లు, ఇతర సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు. కెరటాల ఉధృతి అంతకంతకూ పెరుగుతుండడంతో తీరం వెంబడి నివసిస్తున్న మత్స్యకారులు తమ గృహాలను కాపాడుకునేందుకు ఇసుక బస్తాలతో రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉప్పాడ రక్షణకు ప్రభుత్వం జియోట్యూబ్ టెక్నాలజీ ద్వారా రక్షణ గోడ నిర్మించడంతో ఈ ప్రాంతంలో సముద్ర కోత తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో కోత ప్రభావం కోనపాపపేటపై చూపుతోంది. ప్రమాదభరితంగా బీచ్ రోడ్డు సముద్ర కెరటాల ఉధృతి ప్రమాదకరంగా మారడంతో ఉప్పాడ నుంచి కాకినాడ వరకున్న బీచ్‌రోడ్డు ప్రమాదభరితంగా మారింది. సముద్ర కోత నుంచి రక్షణగా వేసిన రాళ్లు కెరటాల ఉధృతికి లేచిపడడంతో బీచ్ రోడ్డు ఛిద్రంగా మారింది. కెరటాల ధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో బీచ్ రోడ్డుపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఉప్పాడ సమీపంలో ఎస్పీజీఎల్ వద్ద చిన వంతెన ప్రమాద స్థితికి చేరుకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సముద్రంలో మత్స్యకారులు? సముద్రంలోకి వేటకు వెళ్లిన కొందరు మత్స్యకారులు తిరిగి రాలేదని తెలిసింది. ఐదు రోజుల క్రితం చేపల వేటకు వెళ్లిన ఉప్పాడ, కోనపాపపేట తదితర గ్రామాలకు చెందిన కొం దరు ఇంకా సముద్రంలోనే ఉన్నట్టు స్థానికులు చెబుతున్నా రు. వారు తిరుగు ప్రయాణంలో ఉండడంతో స్థానిక మత్స్యకారులు వారి వివరాలు వెల్లడించడం లేదు. శుక్రవారం రాత్రికి వారు తీరానికి చేరుకుంటారని భావిస్తున్నారు. సుద్దగెడ్డకు భారీ వరద గొల్లప్రోలు, న్యూస్‌లైన్ : పై-లీన్ ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గొల్లప్రోలు జలమయమైంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో భారీఎత్తున వరద నీరు పట్టణాన్ని ముంచెత్తుతోంది. పీబీసీ, సుద్దగెడ్డ, ఏలేరు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరోవైపు నీరు కిందకు ప్రవహించకపోవడంతో అంతకంతకూ పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. భయంగుప్పిట కాలనీ వాసులు గొల్లప్రోలులోని ఎస్సీ కాలనీ, సూరంపేట, ఈబీసీ కాలనీ వాసులు భయంగుప్పిట కాలం వెళ్లదీస్తున్నారు. సుద్దగెడ్డ నుంచి గంటగంటకూ నీటి ప్రవాహం పెరుగుతుండడంతో కాలనీలోకి ముంపునీరు చేరుతోంది. ఇప్పటికే ఈబీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, సూరంపేట, శివాలయ మాన్యం, దేవీనగర్‌లోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూరంపేటకు రాకపోకలు స్తంభించాయి. భయపెడుతున్న కాలువలు నీటి ఉధృతి పెరుగుతుండడంతో కాలువలు కలిసిపోయి ప్రవహిస్తున్నాయి. దీంతో ఎక్కడ గండ్లు పడతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పీబీసీ, సుద్దగెడ్డ ఉధృతికి సూరంపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. సుద్దగెడ్డ ముంపుతో కాలనీ నీట మునగడంతో స్థానికులకు ఏమీ తెలియని పరిస్థితి ఏర్పడింది. తాటిపర్తి పుంత రోడ్డుపై పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. తాటిపర్తి-రాయవరం రోడ్డుపై సుద్దగెడ్డ నాలుగు అడుగుల మేర నీరు ప్రవ హిస్తోంది. వారం వ్యవధిలో ఆయా కాలనీలు రెండుసార్లు ముంపునకు గురయ్యాయి. -
జిల్లాలో పై-లీన్ టెన్షన్: అధికారులు అప్రమత్తం
జిల్లాను పై-లీన్ తుపాను టెన్షన్ ఆవరించింది. ఈ తుపాను శనివారం తీరం దాటవచ్చని భావిస్తున్నారు. ఆ సమయంలో బలమైన ఈదురుగాలులు వీయవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంతంలో 13 మండలాల అధికారులను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. తుపాను తీరం దాటాక కురవనున్న భారీ వర్షాలతో ఏపుగా ఎదిగిన ఖరీఫ్ పంట ముంపుబారిన పడుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : పై-లీన్ తుపాను జిల్లాలోని తీర ప్రాంత ప్రజల గుండెలపై కుంపటిగా మారింది. తుపాను ప్రభావంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ తుపాను శనివారం రాత్రి తీరం దాటే అవకాశం ఉందనే సమాచారంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను భయం జిల్లాను వీడాలంటే మరో 24 గంటలు ఆగాలని అధికారులు చెబుతున్నారు. 1996 నవంబరు ఆరున వచ్చిన తుపాను సృష్టించిన విలయతాండవం ఇంకా జిల్లావాసులను పీడకలగా వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు పొంచి ఉన్న పై-లీన్ తుపాను అప్పటి కంటే ఉగ్రరూపం దాల్చనుందనే సమాచారంతో తీర ప్రాంతంలో భయం వెంటాడుతోంది. కాకినాడ, ఉప్పాడ, అంతర్వేది, ఓడలరేవు తదితర తీర ప్రాంతాల్లో ఆరేడు మీటర్ల మేర సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. దీని ప్రభావంతో తీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తీరమంతా అల్లకల్లోలంగా మారింది. ప్రస్తుతం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో నడుస్తోన్న తుపాను తీరం దాటే సమయానికి మరింత ఉధృతమయ్యే ప్రమాదం పొంచి ఉందన్న సమాచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 13 తీరప్రాంత మండలాల పరిధిలో అధికారులను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. రానున్న 72 గంటల్లో మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఆదేశించారు. కాకినాడ పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. పై-లీన్ కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 448 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో 210 నుంచి 235 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చునని వాతావరణ కేంద్రం శుక్రవారం రాత్రి విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. కృష్ణా జిల్లా చినగొల్లపాలెం నుంచి రెండు బోట్లలో వేటకు వచ్చిన 10 మంది మత్స్యకారులు సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద సముద్రంలో చిక్కుకున్నారనే సమాచారంతో జిల్లా యంత్రాంగం అక్కడి అధికారులను అప్రమత్తం చేసింది. అయితే, వేసిన వలలు తీయడం సాధ్యం కాకపోవడంతో వాటిని అక్కడే వదిలిపెట్టి వారు తిరిగి స్వస్థలానికి బయలుదేరినట్టు తెలిసింది. తీర ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇండియన్ కోస్ట్‌గార్డు విభాగాన్ని అప్రమత్తం చేశారు. అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్-1554 (కోస్ట్‌గార్డు), 1093 (మెరైన్)ను ఏర్పాటు చేశారు. కాకినాడ కలెక్టరేట్లో 0884-2365506 నంబర్‌తో తుపానుపై అప్రమత్తం చేసేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుపాను తీరం దాటిన తరువాత 48 గంటల పాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఈ వర్షం మరింత ఉధృతమైతే పంటలు నీటమునిగిపోతాయనే బెంగ రైతులను వేధిస్తోంది. ఖరీఫ్ పంట ఈదురుగాలులు, వర్షాలతో నేలనంటుతుందనే దిగులు ఈస్ట్రన్, సెంట్రల్ డెల్టా రైతులను కలవరపెడుతోంది. భారీ వర్షాలకు రాజానగరం మండలం రావులచెరువుకు పడ్డ గండిని ఇంకా పూడ్చలేకపోయారు. కొత్తకాలనీ, సుబ్బారావు కాలనీలు ముంపుబారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. తుపాను భయంతో పంపా ఆయకట్టు రైతులు చందాలు వేసుకుని గట్టు ఎత్తును పెంచుకున్నారు. జిల్లా కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేశారు. తీర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా, సమ్మె కొనసాగిస్తూనే కలెక్టర్ సూచనల మేరకు పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఏపీఎన్జీఓ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు బూరిగ ఆశ్వీరాదం, పితాని త్రినాధ్ నిర్ణయించారు. తహశీల్దార్లు, వీఆర్వో, వీఆర్ఏలు గ్రామాల్లో మకాం వేశారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. నేడు ప్రత్యేకాధికారి సమీక్ష ఈ పరిస్థితులను అంచనా వేసి అధికారులను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం తుపాను ప్రత్యేకాధిరిగా గతంలో ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీసీ ఎండీ ముద్దాడ రవిచంద్రను నియమించింది. ఆయన శనివారం జిల్లాకు వస్తున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి జిల్లాలో తుపాను పరిస్థితిని ఉదయం 11 గంటలకు కాకినాడ కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం తీర ప్రాంత మండలాల్లో పర్యటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యుత్తు శాఖ అత్యవసర కంట్రోల్ రూములు సాక్షి, రాజమండ్రి : పై-లిన్ తుపాను వల్ల తలెత్తే విద్యుత్తు సంబంధ సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్టు ఈపీడీసీఎల్ ఎస్ఈ యలమంచిలి శ్రీమన్నారాయణ ప్రసాద్ తెలిపారు. జిల్లా కంట్రోల్ రూము ల్యాండ్ నెంబరు 0883 2463354, సెల్ 73822 99960. డివిజన్= కంట్రోల్ రూం= డివిజనల్ ఇంజనీరు రాజమండ్రి= 94910 45661= 94408 12585 కాకినాడ= 0884 2366265= 94408 12586 అమలాపురం= 08856 234828= 94408 12588 రామచంద్రపురం= 08857 243082= 94408 12587 జగ్గంపేట= 08852 233975 =94408 12589 -
తీరంలో పై-లీన్ అలజడి: ఆక్వాకు పొంచివున్న ముప్పు
భీమవరం, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను డెల్టా రైతుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. పంట చేతికొస్తుందనుకుంటున్న సమయంలో తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు, వీస్తున్న ఈదురుగాలులు బెంబేలెత్తి స్తున్నాయి. తుపాను ప్రభావం అధికంగా ఉండే తీర ప్రాంతంలోని నరసాపురం, మొగల్తూరు, భీమవరం, యలమంచిలి, ఆచంట మండలాల్లో సుమారు 35 వేల హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. 1.30 లక్షల ఎకరాల్లో చేపలు, రొయ్యలు సాగు చేస్తుండగా, అందులో సుమారు 24వేల ఎకరాల్లో వనామి రొయ్యల సాగు ఉంది. మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆక్వా రైతులు బెంబేలెత్తుతున్నారు. వర్షాలు మరో రెండు మూడు రోజులు కురిస్తే ఆక్సిజన్ సమస్యలు తలెత్తి రొయ్యలు, చేపలు మృత్యువాత పడే అవకాశం ఉందని గగ్గోలు పెడుతున్నారు. ఉద్యాన రైతులు కూడా వర్షాలు, తుపాను వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. మొగల్తూరు, నరసాపురం మండలాల్లోని తీరప్రాంత మత్స్యకారులు మూడు రోజులుగా వేటకు వెళ్లకపోవడంతో జీవనాధారం లేక ఇబ్బందులు పడుతున్నారు. రానున్న 24 గంటల్లో తుపాను తీరం దాటుతుందని అధికారులు చెబుతుండగా ఎటువంటి నష్టాన్ని చేకూరుస్తుందోనని రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఎగిసిపడుతున్న అలలు మొగల్తూరు, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాన్ ప్రభావంతో పేరుపాలెం వద్ద సముద్రం అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం ఉగ్రరూపం చూసి స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. సముద్రం నుంచి వస్తున్న హోరు మరింత భయపెడుతోంది. శుక్రవారం ఉదయం ఒక పెద్ద అల సుమారు రెండు వందల మీటర్ల దూరం తోసుకువచ్చిందని స్థానికులు చెప్పారు. సముద్రంలో చేపల వేటను అధికారులు నిషేధించారు. పేరుపాలెం బీచ్ పర్యాటక ప్రదేశం కావడంతో సముద్ర స్నానానికి పలువురు వస్తుంటారు. సముద్రం ఎగసిపడుతుండడంతో స్నానానికి ఎవరూ సముద్రంలోకి వెళ్లకుండా మొగల్తూరు ఎస్ఐ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పై-లీన్ ప్రభావం: భయం గుప్పిట్లో పశ్చిమ
సాక్షి, ఏలూరు : పై-లీన్ తుపాను పొంచి ఉందన్న వార్త లు పశ్చిమ వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల పేరు చెబితేనే జనం వణికిపోయేలా గతేడాది నీలం కన్నీరు మిగిల్చితే, ఈ ఏడాది పైలీన్ విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంది. శుక్రవారం జిల్లా సగటు వర్షపాతం 16.8 మిల్లీ మీటర్లుగా కాగా కామవరపుకోట మండలంలో అత్యధికంగా 72.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది సమ్మె చేస్తున్నారు. ప్రజలను పై-లీన్ బారినుంచి కాపాడేందుకు విద్యుత్ ఉద్యోగులు సమ్మెను విరమిస్తే పంచాయతీరాజ్ సహా పలు విభాగాల ఉద్యోగులు సమ్మెను కొనసాగిస్తూనే తుపానులో సేవలందించేందుకు విధుల్లో పాలుపంచుకోవాలని నిర్ణయించారు. అధికారులు అప్రమత్తం ప్రభుత్వం జిల్లాకు నియమించిన ప్రత్యేకాధికారి, ఐటీ కమిషనర్ సంజయ్‌జాజు, జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ శుక్రవారం నరసాపురం, ఆచంట, మొగల్తూరు, భీమవరం మండలంలోని నాగిడిపాలెం, లోసరి, దొంగపిండి గ్రామాలను అధికారులతో కలిసి పర్యటించారు. 9 మండలాల్లో తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆయా మండలాల్లో నియమించిన ప్రత్యేక పర్యవేక్షక అధికారులు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించా రు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు. నీటిపారుదల, రెవెన్యూ, విద్యుత్, పౌరసరఫరాలు, వైద్యారోగ్యశాఖ, అగ్నిమాపక, వ్యవసాయ, పశుసంవర్థక శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ అప్రమత్తం చేశారు. జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వీడీవీ కృపాదాస్ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. రాష్ట్ర సాంఘి క సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ హైదరాబాద్ నుంచి శుక్రవారం రాత్రి బయలుదేరి శనివారం ఉదయం నేరుగా జిల్లాకు రానున్నారు. జిల్లా అధికారులతో ఏలూరులోని జెడ్పీ అతిథి గృహంలో తుపాన్ పరిస్థితిపై సమీక్షించనున్నారు. డీఆర్డీఏ పీడీ వై.రామకృష్ణ కలెక్టర్‌తో పాటు పర్యటించారు. ప్రత్యేక ఏర్పాట్లు లోతట్టుప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి మౌలిక సదుపాయాలు కల్పిం చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. నిత్యావసరాలు, కిరోసిన్ అందించేందుకు పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లు చేస్తోంది. డెల్టా ప్రాం తంలోని కాలువల గట్ల పరిస్థితిని అంచనా వేస్తూ బలహీనంగా ఉన్నవాటిని వెంటనే పటిష్టం చేసేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇసుక బస్తాలను పెద్ద ఎత్తు న సిద్ధం చేస్తున్నారు. సమ్మెలో ఉన్నప్పటికీ పారి శుద్ధ్య పనులు నిర్వహించనున్నట్టు పురపాలకశాఖ ఉద్యోగులు ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. మంచినీటి సరఫరాకు ట్యాంకర్లు ఏర్పాటు చేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు, జనరేటర్ల సాయం తీసుకుని లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. ఏలూరుకు తమ్మిలేరు ముప్పు నీలం తుపాను సమయంలో తమ్మిలేరుకు భారీ గా వరదలు వచ్చి ఏలూరు నగరాన్ని ముంచెత్తింది. ఈసారి కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల తమ్మిలేరుకు భారీగా వరదనీరు వచ్చి చేరనుంది. దీంతో నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు. డ్రయినేజీ వ్యవస్థను క్రమబద్ధీకరించి వరదనీరు సక్రమంగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా ప్రత్యేకాధికారులు స్పందించాలని లేదంటే వారిపై కఠిన చర్య తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. -
‘ఫైలిన్’పెనుతుపానుతో రైతులు ఆందోళన
అమలాపురం, న్యూస్‌లైన్ : ‘ఫైలిన్’ పేరుకు అర్థం ఏమో గానీ- అది తమకు ఎలాంటి అనర్థం తెచ్చి పెడుతుందోనని రైతులు భీతిల్లుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పెను తుపానుగా మారిందన్న సమాచారంతో వారి గుండె లు గుబగుబలాడుతున్నాయి. నేలను నమ్ముకుని పెట్టిన పెట్టుబడి, పడ్డ కష్టం ఎక్కడ గంగ పాలవుతాయోనని దిగాలు పడుతున్నారు. ఇప్పటి వరకు నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో సరైన వర్షం లేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు గత వారం రోజుల నుంచి ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల కురుస్తున్న వర్షాలతో ఊరట పొందుతున్నారు. ఈ సమయంలో తుపాను హెచ్చరిక వారి కంటికి కునుకు కరువు చేసింది. గత ఐదేళ్లలో ఒక్క 2011లో మినహా మిగిలిన నాలుగేళ్లు జిల్లాలో ఖరీఫ్ పంట తుపానులకు, భారీ వర్షాలకు తుడిచిపెట్టుకుపోవడం ఆనవాయితీగా మారింది. ఖైముకి, జల్, నీలం తుపానుల వల్ల రైతులు ఖరీఫ్ సాగులో తీవ్ర నష్టాలను చవి చూశారు. గత ఏడాది నీలం తుపానువల్ల జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో వరిసాగు సర్వ నాశనం కావడంతోపాటు లంక గ్రామాల్లో పైరులు, కూరగాయల పంటలను రైతులు కోల్పోయారు. ఏడాది గడుస్తున్నా ఆ తుపాను పరిహారం రూ.167 కోట్లు రైతులకు ఇప్పటికీ అందలేదు. ఈ ఖరీఫ్‌లో సైతం వాతావరణం అనుకూలించక, పెట్టుబడులకు చేతుల్లో సొమ్ములు లేకున్నా అన్నదాతలు అష్టకష్టాలు పడి సాగు మొదలుపెట్టారు. వర్షాభావ పరిస్థితుల వల్ల మెట్టలో సుమారు 50 వేల ఎకరాల్లో వరినాట్లు పడలేదు. ఇదే సమయంలో గోదావరి వరదల వల్ల డెల్టాలోని 5 వేల ఎకరాల్లో వరిసాగు తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడిప్పుడే అడపాదడపా వర్షాలు పడుతూ, ఎండలు కాస్తూ వాతావరణం సానుకూలంగా మారి పైర్ల ఎదుగుదలకు సహకరిస్తోందని, మంచి దిగుబడులు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. తూర్పుడెల్టా పరిధిలోని ఆలమూరు, రామచంద్రపురం, అనపర్తి, పెద్దాపురం సబ్ డివిజన్ల పరిధిలో వరిచేలు ఈనికదశలో ఉండి కంకులు బయటకు వస్తున్నాయి. మధ్యడెల్టాలోని ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, తూర్పు డెల్టాలోని కరప, కాకినాడ రూరల్, పిఠాపురం సబ్ డివిజన్ల పరిధిలో వరిచేలు ఇప్పుడిప్పుడే పాలు పోసుకుంటున్నాయి. ఈ సమయంలో బంగాళాఖాతంలో తీవ్రవాయుగండం ‘ఫైలిన్’ తుపానుగా మారడం రైతులకు పెనుగండంగా తోస్తోంది. ఉత్తరాంధ్రతోపాటు కోస్తా జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో రైతులకు నీలం తుపాను నష్టం కళ్లముందు కదలాడుతోంది. డెల్టాలో ముఖ్యంగా కోనసీమలో మురుగునీటి కాలువలు అధ్వానస్థితిలో ఉండి కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదు. ఈ ఏడాది సుమారు రూ.23 కోట్లతో చేపట్టాల్సిన డ్రైన్ల ఆధునికీకరణ టెండర్ల ప్రక్రియ సమ్మె వల్ల నిలిచిపోయింది. కనీసం పూడికతీత పనులకు సైతం నిధులు కేటాయించలేదు. కొద్ది వర్షం కురిసినా చేలు ముంపుబారిన పడే అవకాశం ఉండగా ఫైలిన్ ఏ ముప్పు తెస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఫైలిన్ పెనుతుపాను: పలుచోట్ల కుండపోత వర్షం
కడలి కల్లోలానికి వేదికైంది. జిల్లాకు పలుమార్లు చేదు అనుభవాలను చవి చూపిన బంగాళాఖాతం ‘ఫైలిన్’ తుపాను రూపంలో మరోసారి భయపెడుతోంది. తుపాను ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా కాగా ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మెను విరమించి పునరావాస చర్యల్లో పాల్గొనడానికి ఉద్యుక్తులయ్యారు. కాగా ఖరీఫ్‌లో వరుస నష్టాలతో కుదేలవుతున్న అన్నదాతలు ‘గోరుచుట్టుపై రోకలి పోటు’లా ఫైలిన్ ఎక్కడ తమ పుట్టి ముంచుతుందోనని కలవరపడుతున్నారు. సాక్షి, కాకినాడ : విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 950 కిలోమీటర్లదూరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ‘ఫైలిన్’ పెనుతుపానుగా మారడంతో గురువారం జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రిలో మధ్యాహ్నం, అమలాపురంలో సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. కాకినాడలో రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తీరమండలాలతో పాటు దాదాపు అన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 18.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. తీరమండలాల్లో గురువారం ఉదయం నుంచి వీస్తున్న ఈదురుగాలుల వేగం సాయం త్రానికి మరింత పెరిగింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఓడలరేవు, ఉప్పాడ తదితర తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. కొన్ని చోట్ల తీరం మీదకు చొచ్చుకొస్తున్నాయి. కాగా ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంది. సమ్మెలో కొనసాగుతూనే రెవెన్యూ సిబ్బంది తుపాను పునరావాస చర్యల్లో పాల్గొంటున్నారు. మరోపక్క విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెను తాత్కాలికంగా విరమించడంతో సహాయ పునరావాస చర్యలను ముమ్మరం చేసేందుకు వెసులుబాటు కలిగింది. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేశారు. తీర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలోకి వేటకు వెళ్లవద్దంటూ టాంటాంలు వేయిస్తున్నారు. తహశీల్దార్లు మండల కేంద్రాల్లో మకాం వేయగా, వీఆర్వో, వీఆర్ఏలు గ్రామాల్లో మకాం వేశారు. గత వారం రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లి ఇంకా రాని వారి వివరాలను తెలుసుకొని వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. పరిస్థితిని బట్టి లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో తీర ప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటూ కాలక్షేపం చేస్తున్నారు. భారీ వర్షాలకు రాజానగరం మండలం రావులచెరువుకు గండిపడడంతో కొత్తకాలనీ, సుబ్బారావు కాలనీ ముంపుబారినపడ్డాయి. చక్రద్వారబంధం, రాధేయపాలెం తదితర ప్రాంతాల నుంచి వస్తున్న ముంపునీరు సూర్యారావుపేట జంక్షన్ వద్ద జాతీయ రహదారి-16ను ముంచెత్తుతోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జాతీయ రహదారి విస్తరణ సమయంలో పాతరహదారిపై తూరలు తొలగించి కల్వర్టులు నిర్మించాల్సి ఉండగా, వాటి స్థానంలో మళ్లీ తూరలే వేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందంటూ ముంపునకు గురైన రహదారిని పరిశీలించిన వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశా తీరంలోని కళింగపట్నం - పరదీప్ల మధ్య ఈనెల 12న అర్ధరాత్రి ఫైలిన్తీరం దాటే అవకాశం ఉందని, తీరం దాటిన తర్వాత కూడా 48 గంటల పాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించడంతో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కలెక్టర్ నీతూప్రసాద్ చెప్పారు. రానున్న 72 గంటలు మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు. అవసరమైతే తీరప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇండియన్ కోస్ట్‌గార్డు విభాగాన్ని అప్రమత్తం చేశారు. అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ హెల్ప్లైన్లు 1554 (కోస్ట్‌గార్డు), 1093 (మెరైన్)ను ఏర్పాటు చేశారు. మరో పక్క సమ్మె కొనసాగిస్తూనే కలెక్టర్ సూచనల మేరకు ఫైలిన్ తుపాను పునరావాస చర్యల్లో పాల్గొంటామని ఏపీ ఎంపీడీఓల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఎన్ మూర్తి, కేసీహెచ్ అప్పారావు, కోశాధికారి సీహెచ్‌కే విశ్వనాథరెడ్డి గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని చర్యలూ తీసుకోండి.. ఫైలిన్ తుపానును ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి గురువారం ఆయన జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి అప్రమత్తం చేశామన్నారు. జిల్లాకు ఒక జాతీయ విపత్తు రక్షక దళాన్ని పంపాలని కోరారు. కాన్ఫరెన్స్‌లో జేసీ ఆర్.ముత్యాలరాజు, ట్రైనీ కలెక్టర్ కన్నన్, సబ్ కలెక్టర్ గంధం చంద్రుడు, డీఆర్వో బి.యాదగిరి, ఆర్డీఓలు పి.సంపత్‌కుమార్, జవహర్లాల్ నెహ్రూ, ఇరిగేషన్ ఎస్ఈ కాశీ విశ్వేశ్వరరావు, ఇతర జిల్లాఅధికారులు పాల్గొన్నారు. గంగవరం మండలంలో అత్యధిక వర్షపాతం సాక్షి, కాకినాడ : జిల్లాలో గడిచిన 24 గంటల్లో 18.4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గంగవరం మండలంలో 108.4 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, అత్యల్పంగా రామచంద్రపురం మండలంలో ఒక మి.మీ. వర్షపాతం నమోదైంది. మండలాల వారీ వర్షపాతం (మిల్లీ మీటర్లలో) వై.రామవరం 20, కోటనందూరు 95.6, తుని 5.4, తొండంగి 4, ప్రత్తిపాడు 7.4, గంగవరం 108.4, సీతానగరం 5, కోరుకొండ 2, గోకవరం 12.4, కొత్తపల్లి 2.4, కాకినాడ రూరల్ 2.4, కాకినాడ అర్బన్ 2.4, రంగంపేట 19.4, రాజానగరం 82.4, రాజమండ్రి రూరల్ 1.4, రాజమండ్రి అర్బన్ 10.6, కడియం 7.6, మండపేట 8, అనపర్తి 2.2, పెదపూడి 18.2, కరప 8.2, రామచంద్రపురం 1, కపిలేశ్వరపురం 14.4, ఆలమూరు 15.8, ఆత్రేయపురం 59.2, పామర్రు 8.4, కొత్తపేట 74.2, పి.గన్నవరం 19.6, అంబాజీపేట 25.8, అయినవిల్లి 2.2, ముమ్మిడివరం 15.2, ఐ.పోలవరం 15.4, కాట్రేనికోన 16.8, ఉప్పలగుప్తం 32.4, అమలాపురం 18.2, అల్లవరం 24.2, మామిడికుదురు 48.2, రాజోలు 44.2, మలికిపురం 42.8, సఖినేటిపల్లి 17.8 నమోదైంది. తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ రాజమండ్రి రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలోని సముద్ర తీర ప్రాంత ప్రజలంతా 48 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ సూచించారు. గురువారం లాలాచెరువులో పోలీస్ పాసింగ్ అవుట్ పెరేడ్ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. సముద్రంలోకి 2000 మంది మత్య్సకారులు వేటకు వెళ్ళగా, 1800 మంది వెనక్కు వచ్చేశారన్నారు. మిగతా 200 మందిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అవసరమైతే కోస్టుగార్డుల సహకారం తీసుకుంటామన్నారు. ఎటువంటి ఉపద్రవం వచ్చినా తట్టుకోవడానికి అధికారులను అప్రమత్తం చేశామన్నారు. జిల్లాలో అన్ని శాఖల ఉద్యోగులూ తుపాను కారణంగా తాత్కాలికంగా సమ్మెను విరమించి విధుల్లో చేరినట్టు చెప్పారు. జిల్లా కేంద్రంలో, ఆర్డీఓ, తహశీల్దార్ల కార్యాలయాల్లో కంట్రోలు రూంలను ఏర్పాటు చేశామన్నారు. -
వణికిస్తున్న తుఫాన్
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫైలిన్ తుఫాన్‌ను సమర్ధంగా ఎదుర్కోడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమెంది. తుఫాన్ ప్రభావంతో ఉద్ధృతంగా ఈదురు గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది.తీరప్రాంత జిల్లాల్లో ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. తీరానికి 500 కిలో మీటర్ల లోపు కేంద్రీకృతమై ఉంటే ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయగలరు. ఇప్పుడు విశాఖ తీరానికి 850 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఫైలిన్ ఏ మేరకు విరుచుకుపడుతుంతో తెలియక ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. అత్యవసర సేవలందించడానికి రెవెన్యూ, ఇతర శాఖల ఉద్యోగులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ చేసిన విజ్ఞప్తి మేరకు పలువురు ఉద్యోగులు గురువారం విధులకు హాజరయ్యారు. తొమ్మిది మంది డిప్యూటీ కలెక్టర్లు, పూసపాటిరేగ, భోగాపురం, కొమరాడ, పార్వతీపురం మండలాలకు చెందిన ఎంపీడీఓలు, తహశీల్దార్ విధుల్లో పాల్గొన్నారు. మండలానికి ఒకరు చొప్పున ఉండే స్పెషల్ ఆఫీసర్లు కూడా రేపటి నుంచి విధులకు హాజరుకానున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 170 నుంచి 185 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో భారీ నష్టం జరిగే ప్రమాదం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈదురు గాలుల వల్ల పూరిపాకలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఇళ్ల పైకప్పుగా ఉండే రేకులు ఎగిరి పడవచ్చని,అందువల్ల జిల్లా వాసులు తుఫాన్ సమయంలో ఇళ్లలో నే ఉండాలని, బయట సంచరించకూడదని అధికారులు సూచించారు. లోతట్టు గ్రామాల ప్రజలు ఎప్పటికప్పుడు తుఫాన్ సమాచారాన్ని తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రచారం చేస్తున్నారు. అందుబాటులో 13 తుఫాన్ సెంటర్లు జిల్లాలో 33 తుఫాన్ షెల్టర్లు ఉండగా వాటిలో కేవలం 13 మాత్రమే విని యోగానికి పనికి వస్తాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు వైపు దృష్టి సారించారు. అవసరమైన మేర గుడారాలు ఏర్పాటు చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని తీరప్రాంత మండలాలైన భోగాపురం, పూసపాటిరేగ మండలాలతో పాటు అధిక వర్షాలు, ఒడిశా నుంచి వచ్చే వరదలకు ముంపునకు గురయ్యే పార్వతీపురం, కొమరాడ మండలాల్లో కూడా పునరాసవాస ఏ ర్పాట్లకు అధికారులు సన్నద్ధమయ్యారు. జి ల్లాలో 28 కిలోమీటర్ల మేర తీరప్రాంతానికి ఆనుకుని ఉన్న 23 గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గురువారం నాటికి జిల్లావ్యాప్తంగా 2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల తీవ్రత మ రింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు బులిటెన్ విడుదల చేశారు. మండలాల ప్రత్యేకాధికారులు తమ మండలాలకు వె ళ్లాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వస్తే బాధితులకు ఆహారం సమకూర్చడానికి అవసరమైన బియ్యం, కందిపప్పు, పామోలివ్ ఆయిల్‌ను సిద్ధం చేశారు. తాగునీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు, గాలుల బీభత్సానికి చెట్లు విరిగి పడితే వాటిని వెంటనే తొలగించడానికి సిద్ధంగా ఉండాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. అలాగే మత్య్స శాఖ, వ్యవసాయ, పశుసంవర్థక శాఖ, అ గ్నిమాపక శాఖల అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకాధికారుల నియామకం... గతంలో ఇక్కడ కలెక్టర్‌గా పని చేసిన రజిత్కుమార్ను ప్రభుత్వం ప్రత్యేకాధిగారిగా నియమించింది. జిల్లాలోని తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురంలోని 23 గ్రామాల్లో ఆరు లోతట్టు గ్రామాలను అధికారులు గుర్తించారు. వీటికి ఆరుగురు జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. భోగాపురం మండలంలోని చేపలకంచే రు గ్రామానికి జెడ్పీ సీఈఓ మోహనరావును, కొంగవానిపాలెం గ్రామానికి డ్వామా పీడీ ఎస్.అప్పలనాయుడులను నియమించారు. పూసపాటిరేగ మండలంలోని కోనాడ గ్రామానికి డీఆర్డీఏ పీడీ జ్యోతి, చింతపల్లికి జిల్లాపంచాయతీ అధికారి సత్యసాయిశ్రీనివాస్, కొల్లాయి వలస గ్రా మానికి ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావులను నియమించారు. జిల్లాకు రెస్క్యూ బృందం ప్రత్యేక శిక్షణ పొందిన రెస్క్యూ బృందాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి రానుంది. ఈ బృందంలో 16 మంది సభ్యులుంటారు. వీరితో జిల్లా స్థాయిలో అగ్నిమాపక సిబ్బంది, మత్స్యశాఖ గుర్తించిన ఈతగాళ్లను సిద్ధం చేస్తున్నారు. అవసరం మేరకు హెలికాఫ్టర్ సేవలను కూడా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కంట్రోల్ రూం నంబర్లు ఇవే... కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 1077 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటూ 08922-236947 అందుబాటులోకి తెచ్చారు. అలాగే విజయనగరం ఆర్డీఓ కార్యాలయంలో 0822-276888, పార్వతీపురంలో 08963-221006 నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. -
తమిళనాడుకు ‘ఫైలిన్’భయం లేదు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫైలిన్ తుపానుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగే అవకాశాలు లేవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సరిహద్దు దాటే క్రమంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: అండమాన్ దీవులకు ఉత్తరాన కేంద్రీకృతమై ఉన్న ఫైలిన్ తుపాను శనివారం కళింగపట్టణం-పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. మంగళవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలపడింది. దీని ప్రభావం వల్ల ఈ నెల 12వ తేదీన తమిళనాడులోని ఉత్తర జిల్లాలు, పుదుచ్చేరిలోని సముద్రతీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలో గంటకు 50 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెన్నై శివారు తిరువత్తియూరు వద్ద ఉన్న సముద్రంలో బుధవారం అర్ధరాత్రి రాక్షస అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని, ఇప్పకికే వెళ్లిన వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని వాతా వరణశాఖ అధికారులు ప్రకటించారు. చెన్నై, కడలూరు, నాగపట్నంలో 6వ నెంబరు, పుదుచ్చేరి, ఎన్నూరు, కాట్టుపల్లి, పాంబన్, తూత్తుకుడి హార్బర్లలో 1వ నెంబరు తుపాను హెచ్చరికలు ఎగురవేశారు. రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలతోపాటు చెన్నైనగరంలో శనివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నాలుగు నెలలుగా ఎండకు నోచుకోని ఊటీ ప్రజలు వారం క్రితం సూర్యుడు తొంగిచూడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలో రెండు రోజులుగా అక్కడ వర్షాలు ప్రారంభమై సూర్యుడు మళ్లీ కనుమరుగయ్యాడు. ఈ భారీ వర్షాలకు ఊటీలో వంద ఎకరాల్లో సాగు చేసిన బంగాళాదుంపలు, క్యారెట్, క్యాబేజీ తదితర పంటలు దెబ్బతిన్నాయి. -
వణికిస్తున్న ఫైలిన్: జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం
సాక్షి/న్యూస్‌లైన్, ఏలూరు : ఫైలిన్ తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం 8.30 గం టల సమయూనికే జిల్లాలో 32.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. రోడ్లు జలమయయ్యాయి. కోతకు వచ్చిన వరిచేలు నేలకొరిగాయి. జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ యంత్రాంగానికి తగిన సూచనలు ఇస్తున్నారు. నష్టనివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై వివిధ శాఖల అధికారులు, ప్రత్యేక అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. తుపాను ప్రభావిత మండలాల్లో ప్రత్యేకాధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెట్ట, డెల్టా ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీకిస్తూ అవసర మైన ముందస్తు చర్యలు తీసుకునే విషయంలో నీటిపారుదల శాఖ అధికారులు చురుకైన పాత్ర పోషించాలని ఎస్ఈ వైఎస్ సుధాకర్‌ను కలెక్టర్ ఆదేశించారు. బలహీనంగా ఉన్న చెరువు గట్లను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల ఇసుక బస్తాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. దొంగరావిపాలెం, సిద్ధాంతం ఏటిగట్లు, రాజులంక, నక్కల డ్రెయిన్, నందమూరు ఆక్విడెక్టు, కడెమ్మ స్లూయిజ్, కాజ డ్రెయిన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థకు చెందిన 40 మంది బృందాన్ని జిల్లాకు రప్పిస్తున్నామని, వీరిలో సగం మందిని నరసాపురం, మరో సగం మందిని పోలవరం ప్రాంతానికి పంపుతామని కలెక్టర్ చెప్పారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో ఎస్ఈ టీవీ సూర్యప్రకాష్‌కు ఆదేశాలిచ్చారు. కూలిపోయే అవకాశం ఉన్న చెట్లను ముందుగానే తొలగించాలని ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లోని నీటిని తొలగించేందుకు ఫైర్ ఇంజిన్లు, మోటార్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రెండు, మూడు రోజుల్లో కాన్పు అయ్యే అవకాశం ఉన్న గర్భిణులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట్ల వెంటనే వైద్యం అందించేందుకు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, అంగన్ వాడీ కేంద్రాల్లో బియ్యం, పప్పు దినుసుల నిల్వలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని, లోత ట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు బోట్లను, గజ ఈతగాళ్లను సిద్ధం చేయూలన్నారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో కళ్లాలపై ఉన్న పంటను కాపాడేందుకు వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పొగాకు నర్సరీలకు నష్టం వాటిల్లకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు రాజమండ్రిలోని సీటీఆర్ఐ అధికారులతో సంప్రదింపులు జరపాలని వ్యవసాయ శాఖ జేడీ కృపాదాస్‌ను ఆదేశించారు. సమావేశంలో జేసీ టి.బాబూరావునాయుడు, డీఆర్వో ఎం.ప్రభాకరరావు, ఆర్డీవోలు శ్రీనివాస్, గోవిందు, నాన్‌రాజు, జె.వసంతరావు, వివిధ శాఖల ఎస్ఈలు సూర్యప్రకాష్, పి.శ్రీమన్నారాయణ, బి.రమణ, జెడ్పీ సీఈవో వి.నాగార్జున సాగర్ పాల్గొన్నారు. వ్యవసాయ, విద్యుత్ శాఖలు అప్రమత్తం తుపాను నేపథ్యంలో వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. వ్యవసాయ అధికారులంతా రైతులకు అందుబాటులో ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పంటల్ని కాపాడుకునే విషయంలో వారికి తగిన సూచనలు ఇవ్వాలని ఆ శాఖ సంయుక్త సంచాలకులు కృపాదాస్ ఆదేశించారు. తుపాను నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యూరు. సమ్మెను తాత్కాలికంగా విరమించి పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : తుపాను నేపథ్యంలో జిల్లాలోని అన్ని డివిజన్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. ప్రజ లు విలువైన వస్తువులను ప్లాస్టిక్ కాగితం లో సురక్షిత ప్రాంతాల్లో భద్రపర్చుకోవాలని సూచించారు. విత్తనం, ఎరువు లు, ధాన్యం బస్తాలు, ఎండు చేపలు వంటి వాటిని ఎత్తై అటకలపై ఉంచాలని, పడవలు, వలలు, మగ్గాలు, పంపుసెట్లు వంటివి పాడవకుండా జాగ్రత్త వహించాలన్నారు. పశువులను మెట్ట ప్రాంతాలకు తరలించి, తగినంత మేత ఉండేలా చూడాలన్నారు. కంట్రోల్ రూమ్ నంబర్లు కలెక్టరేట్ - 08812-230617 ఆర్డీవో- ఏలూరు- 08812-232044 ఆర్డీవో- నరసాపురం- 08812-276699 ఆర్డీవో- కొవ్వూరు- 08813-231488 ఆర్డీవో- జంగారెడ్డిగూడెం- 08821-223660 ప్రత్యేక అధికారుల నియూమకం ఏలూరు, న్యూస్‌లైన్ : తుపాను ప్రభావిత మండలాలకు జిల్లాస్థారుు అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆచంటకు పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సలీంఖాన్ (77020 03552), ఆకివీడుకు ఎస్ఈ కార్పొరేషన్ ఈడీ ఎన్వీవీ సత్యనారాయణ (80083 01168), యలమంచిలికి డ్వామా పీడీ ఎన్.రామచంద్రరెడ్డి (98665 52678), కొవ్వూరుకు జె డ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్ (94937 42399), మొగల్తూరుకు డీఆర్డీఏ పీడీ వై.రామకృష్ణ (97049 79777), నరసాపురానికి డీఈవో నరసింహరావు (98499 09105), పోడూరుకు గృహ నిర్మాణ సంస్థ పీడీ జి.సత్యనారాయణ (77997 21148), పోలవరానికి కేఆర్‌పురం గిరిజన సంక్షేమ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఝాన్సీరాణి (94406 64161), భీమవరం మండలానికి పశుసంవర్థక శాఖ జేడీ కె.జ్ఞానేశ్వరావు (99899 32844) నియమించారు. -
ముందుకొచ్చిన సముద్రం
ఫైలిన్ తుపాను ప్రభావంతో వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట వద్ద సముద్రం 60 మీటర్లు ముందుకు వ చ్చింది. దీంతో సుమారు రూ.2 లక్షలు విలువైన ఫైబర్ బోటు ధ్వంసమైంది. గార మండలం కళింగపట్నం, బందరువానిపేట గ్రామాల వద్ద సముద్రం 50 అడుగుల మేర ముందుకు రావడంతో మత్స్యకారులు అప్రమత్తమై పడవ లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇచ్ఛాపురం మండలం డొంకూరు వద్ద అలలు ఎగసి పడడంతో పడవతోపాటు వలలు కొట్టుకుపోయి లక్ష రూపాయలు, కవిటి మండలం కపాసుకుద్ది మత్స్యకారుల వలలు ధ్వంసమవటంతో 6 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లింది. పూండి, న్యూస్‌లైన్: బంగాళా ఖాతంలో పైలిన్ తుపాను ప్రభావంతో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం ముందుకు రావడంతో తీరప్రాంత మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తమవడంతో నష్టం తగ్గింది. వజ్రపుకొత్తూరు మండలంలోని తీర ప్రాంతంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండడంతో అలల కల్లోలం తీవ్రమైంది. తుపాను హెచ్చరికలతో మత్స్యకారులు వేటకు వెళలేదు. దేవునల్తాడ తీరం నుంచి గుణుపల్లి వరకు బుధవారం రాత్రి బలమైన గాలులు వీయడంతో మంచినీళ్లపేట తీరం వద్ద సముద్రం 60 మీటర్లు ముందుకు వ చ్చింది. తీరంలో చోడిపల్లి ఎరకయ్యకు చెందిన సుమారు రూ.2 లక్షలు విలువ చేసే లంగరు వేసి ఫైబర్ బోటు ధ్వంసమైంది. సుమారు రూ.1.50 లక్షల నష్టం జరిగిందని మత్స్యకారుల తెలిపారు. రాత్రివేళల్లో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందన్నారు. గ్రామానికి అధికారులు వచ్చి ఏ విధమైన సూచనలు ఇవ్వలేదన్నారు. బావనపాడు మెరైన్ పోలీసులు మంచినీళ్లపేట చేరుకుని ఫైబర్ బోటుకు జరిగిన నష్టాన్ని అంచనావేశారు. మత్స్యశాఖ నుంచి క్షేత్ర పర్యవేక్షకుడు పి.విజయ్‌కుమార్ ధ్వంసమైన తెప్పను పరిశీలించి అధికారులు దృష్టికి తీసుకెళతామని చెప్పారు. తీరం వెంట ఉన్న మత్స్యకారులను అప్రమత్తంగా ఉండాలని మెరైన్ పోలీసులు గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావులు చెబుతున్నారు. ఫైబర్ బోటు ద్వంసమైన విషయాన్ని భావనపాడు మెరైన్ సీఐ ఎం. సన్యాసి నాయుడు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. తుపానువల్ల నష్టానికి గురైన బోటు యజమాని చోడిపల్లి ఎరకయ్యను మత్స్యశాఖ ద్వారా ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు సర్పంచ్ గుళ్ల చిన్నారావు, ఎ.భాస్కరరావు, కె.సింహాచలం, వంక రాజు కోరారు. అప్రమత్తమైన మత్స్యకారులు గార: పైలిన్ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. గురువారం ఉదయం కళింగపట్నం, బందరువానిపేట గ్రామాల వద్ద సముద్రం సుమారు 50 అడుగుల మేర ముందుకు వచ్చింది. అలలు ఎగసిపడడంతో అప్రమత్తమైన మత్స్యకారులు వలలు సముద్రంలోకి కొట్టుకుపోకుండా దూరంగా తరలించారు. ఉదయం వరకు సముద్రం ప్రశాంతంగానే ఉందని, ఒక్కసారిగా ఇలా మారిందని మత్స్యకారులు రాయితీ రాజారావు, మైలపల్లి సూర్యనారాయణ తెలిపారు. మూడురోజుల పాటు వేటకు వెళ్లవద్దని సర్పంచ్ గనగళ్ల లక్ష్మమ్మ, గ్రామ పెద్దలకు రెవెన్యూ అధికారులు సూచించారు. పడవ ధ్వంసం డొంకూరు (ఇచ్ఛాపురం రూరల్): బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణం బాగాలేదని, వేటకు వెళ్లవద్దని బుధవారం ప్రసార మాధ్యమాల ద్వారా అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో మండలంలోని డొంకూరు ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లలేదు. పడవలను, వలలను సముద్ర తీరానికి దూరంగా ఉంచారు. గ్రామానికి బడే జగ్గారావు అనే మత్స్యకారుడు ఊళ్లో లేకపోవడంతో అతని పడవ సముద్రపు ఒడ్డునే ఉంది. గురువారం వేకువజామున తుపాను ప్రభావంతో అలలు ఎగసిపడి కొన్ని మీటర్ల దూరం ముందుకు రావడంతో పడవతో పాటు అందులోని వలలు కొట్టుకుపోయాయి. అలల తాకిడికి పడవ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని మత్స్యకారుడు జగ్గారావు తెలిపారు. అప్పులు చేసి కొన్న వలలు, పడవ ఇంజిన్ నీటి పాలవడంతో తన జీవనాధారం పోయిందని, ఆదుకోవాలని ప్రభుత్వానిక కోరారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తలదాచుకునేందుకు నిర్మించిన తుపాను షెల్టర్ శిథిలమైనా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక మత్స్యకారులు తెలిపారు. రూ.6 లక్షల నష్టం కపాసుకుద్ధి(కవిటి): సముద్రంలో వేటకు వెళ్లిన కపాసుకుద్ధికి చెందిన మత్స్యకారులు అలల ఉద్ధృతికి సుమారు 6 లక్షల విలువైన చేపలవల, ఇతర సామగ్రి నష్టపోయారు. మంగళవారం రాత్రి కపాసుకుద్ధి తీరం నంచి వల యజమానుదారులైన బడే దాలయ్య, తాతయ్య, జగదీష్, సోమయ్య, ఎర్రన్న, ఢిల్లేశు, పురుషోత్తం, వల్లయ్య తదితరులు 18 మంది వేటకు వె ళ్లారు. బుధవారం తుపాను ప్రకటనల నేపథ్యంలో స్థానికులు సెల్ఫోన్లో ఇచ్చిన సమాచారం మేరకు వారు వెనక్కు వచ్చేందుకు సిద్ధమయ్యారు. సముద్రంలో అలల ధాటికి వేట కోసం వినియోగించిన వల అడుగు భాగంలో రాళ్లు పైకి తేలడంతో వల చిరిగిపోయింది. సగంపైగా వల చిరిగిపోయిందని మత్స్యకారులు తెలిపారు. అప్పుచేసి ఇటీవల వల సమకూర్చుకున్నామన్నారు. మత్స్యశాఖ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
5 గంటలు.. ఒకటే టెన్షన్!
బందరువానిపేట (గార), న్యూస్‌లైన్ : తుపాను హెచ్చరికలను బేఖాతరు చేసి సముద్రంలో వేటకువెళ్లిన బందరువానిపేట మత్స్యకారులు గురువారం అటు అధికారులను, ఇటు గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురిచేశారు. ఉదయం 9 గంటలకు మొదలైన టెన్షన్.. మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. ఎట్టకేలకు 15 పడవల్లో వేటకెళ్లిన 60 మంది విడతలవారీగా సురక్షితంగా ఒడ్డుకు చేరటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదీ జరిగింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కళింగపట్నం-పారాదీప్‌ల మధ్య తీరం దాటే అవ కాశం ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా.. వేటకు వెళ్లవద్దని రెవెన్యూ సిబ్బంది బుధవారం సాయంత్రమే దండోరా వేయించినా బందరువానిపేటకు చెందిన 60 మంది మత్స్యకారులు పట్టించుకోలేదు. ఎప్పట్లాగే వేకువజామున 4 గంటలకు తీరానికి చేరుకున్నారు. సముద్రం ప్రశాంతంగా ఉండటంతో 15 పడవల్లో వేటకు బయలుదేరారు. అయితే 9 గంటలకల్లా గాలులు పెరిగి సముద్రం అల్లకల్లోలంగా మారటంతో ఆందోళన చెందిన గ్రామస్తులు తీరానికి చేరుకున్నారు. సాధారణంగా 10, 11 గంటల మధ్య మత్స్యకారులు వేట నుంచి తిరిగొస్తారు. కానీ ఆ సమయానికి ఒక్క పడవే రావటంతో టెన్షన్ ఎక్కువైంది. మిగతావారి పరిస్థితేమిటని పడవలో వచ్చినవారిని ప్రశ్నిస్తే అంతా తిరుగుప్రయాణంలో ఉన్నారని చెప్పారు. ఈలోగా సమాచారం తెలిసి కళింగపట్నం మెరైన్ స్టేషన్ సీఐ పూరేటి నారాయణరావు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. పాత పద్ధతుల్లో తుపాను తీవ్రతను అంచనా కట్టడం మానుకోవాలని హితవు చెప్పారు. ఏమైనా జరిగితే మీ కుటుంబాలకు దిక్కెవరని ప్రశ్నించారు. ఆర్ఐ బి.వి.రాజు కూడా వచ్చి మత్స్యకారులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో 12 గంటలకు 12 పడవల్లో మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. 2 గంటలకు రెండు పడవల్లో మిగిలినవారు ఒడ్డుకు చేరుకోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బోట్లు లేని మెరైన్ పోలీసులు మెరైన్ పోలీస్ స్టేషన్‌కు బోట్లు లేకపోవటంతో బందరువానిపేట తీరానికి చేరుకున్న సిబ్బంది కేవలం మత్స్యకారులతో మాట్లాడ టానికే పరిమితమయ్యారు. వేటకు వెళ్లినవారికి ప్రమాదం జరిగితే మెరైన్ సిబ్బంది ఎలాంటి సహాయం అందించలేని పరిస్థితి. కళింగపట్నం మెరైన్ స్టేషన్ సిబ్బంది గార, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లోని తీరాన్ని పర్యవే క్షిస్తారు. ఈ స్టేషన్‌కు 12 టన్నుల సామర్ధ్యం గల బోట్లు రెండు, 5 టన్నుల బోటు ఒకటి అవసరం. కానీ ఇంతవరకు ప్రభుత్వం వాటిని సమకూర్చలేదు.