పై-లీన్ తుపానుతో మత్స్యకారుల ఆవేదన
Published Sat, Oct 12 2013 3:56 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
బాపట్ల టౌన్/నిజాంపట్నం, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను జిల్లాలో 27,248 మంది మత్స్యకారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో వేట మాని ఇంటికి చేరిన మత్స్యకారులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. విపత్తుల సమయంలో కూడా కనీసం చేయూతనివ్వకపోవటంపై మత్స్యకారులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పై-లీన్ తుపాను హెచ్చరికలు విన్న మత్స్యకారులు రెండు రోజుల కిందటనే సముద్రపు వేటను నిలిపివేసి బోట్లను ఒడ్డుకు చేర్చుకున్నారు. తుపాను ప్రభావం మరో రెండు, మూడు రోజుల వరకు ఉంటుందని అప్పటి వరకు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఎలా బతకాలని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేటపైనే జీవనాధారం
జిల్లాలో లంకేవానిదిబ్బ నుంచి బాపట్ల వరకు 22 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. మొత్తం జిల్లాలో 6,812 మత్స్యకార కుటుంబాలు ఉండగా 27,248 మత్స్యకారులు ఉన్నారు. వీరిలో అధికశాతం వేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరిపై పై-లీన్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా చూపుతుంది. నిజాంపట్నం ఓడ రేవులోనే సుమారు 3వేలకు మందికిపైగా జీవిస్తుంటారు. అయితే వేట నిలిచిపోవటంతో ఉపాధి కోల్పోయారు. తీర ప్రాంతాల్లోని మత్స్యకారులకు ప్రతి ఏటా సెప్టెంబర్ నుంచి జనవరి వరకు నాలుగు నెలలు పాటు వేటలు బాగా సాగుతాయి.
ఈ సమయంలోనే మత్స్యసంపద సముద్రంలో నుంచి భూ ఉపరితలానికి వందల టన్నుల్లో బయటకు వస్తుంటుంది. పట్టిన చేపలు తీరానికి సమీపంలో ఉన్న ఫారెస్ట్‌భూమి పర్రలో రెండు, మూడు రోజులపాటు ఎండబెట్టి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఏ ఒక్కరికి కూడా ఒక్క చాప పడిన దాఖలాలు లేవు. గత రెండు, మూడు రోజుల నుంచే చేపలు కనిపిస్తుండగా, ఇంతలోనే ముంచుకొచ్చిన వాయుగుండం వారి జీవితాల్లో చీకట్లు నింపింది.
ఆందోళనలో మత్స్యకారులు ...
గత నాలుగు నెలల నుంచి వేటలు సాగక..అప్పోసప్పో తెచ్చుకుతింటున్న మత్స్యకారులను ఇటీవల కురిసిన భారీ వర్షాలు వేటలకు వెళ్లకుండా చేస్తే బుధవారం రాత్రి వాయుగుండం కారణంగా వచ్చిన భారీ వర్షం చేపలు ఎండబెట్టుకునే ప్రాంతాన్ని కూడా ముంచెత్తింది. ముఖ్యంగా సముద్రతీరప్రాంత గ్రామాలైన సూర్యలంక, అడవిపల్లిపాలెం, పాండురంగాపురం, కృపానగర్, రామచంద్రపురం, ఓడరేవు, దాన్వాయ్‌పేట, ముత్తాయపాలెం, రామానగర్, ఆదర్శనగర్ గ్రామాల్లోని మత్స్యకారులంతా సముద్రం మీద జీవిస్తుంటారు. పై-లీన్ తుపాను ప్రభావంతో వేట సాగకపోవడంతో ఎన్ని రోజలు పస్తులు ఉండాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది అన్నీ నష్టాలే... ఈ ఏడాది ఏ ఘడియలో వలలు తడిపామో కానీ.... అన్నీ నష్టాలే ఎదురవుతున్నాయి. మొన్నటి దాకా వేటకు వెళ్లినప్పటికీ చేపలు పడక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడిప్పుడే నాలుగు చేపలు పడుతున్నాయన్న ఆశతో వలలు వేద్దామనుకుంటుండగా వానదేవుడు మాపై పగపట్టాడు. వలలు, పడవలు, చేపలు ఎండపెట్టుకునే ప్రాంతం అంతా నీటితో ముంచెత్తాడు.
- పెసికం పెదసింగ్, మత్స్యకారుడు
పాలకులు స్పందించాలి
ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే వేటలు సాగుతాయి. అది కూడా వాతావరణం అంతా అనుకూలంగా ఉంటే నాలుగు రూపాయ లు మిగులుతాయి. లేకుంటే లేదు. దాంతో ఏడాదంతా తినాలి. ఈ ఏడాది ఇంత వరకు ఒక్కరోజు కూడా వేటకు వెళ్ళలేదు. వేటకు అయితే సెలవు పెట్టమంటున్నారు...కానీ ప్రభుత్వం తరఫున ఏ మాత్రం సాయం అందించడం లేదు.
- కొక్కిలిగడ్డ నారాయణ స్వామి, మత్స్యకారుడు
Advertisement