పెను తుపానుగా మారిన ‘పై-లీన్’
Published Sat, Oct 12 2013 3:47 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు: పై-లీన్ తుపాను శుక్రవారం మరింత బలపడి పెనుతుపానుగా మారింది. జిల్లా అధికార యంత్రాంగానికి నిద్ర లేకుండా చేస్తోంది. బంగాళాఖాతంలో 600 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉన్న తుపాను మరింత బలపడి శనివారం సాయంత్రానికి శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం, ఒడిశాలోని గోపాలపూర్ ప్రాంతాల్లో తీరం దాటే అవకాశాలున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా అధికారులు తీరంలో అప్రమత్తం అయ్యారు. నిజాంపట్నం ఓడరేవులో శుక్రవారం సాయంత్రం మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. సమ్మె నుంచి బయటకు వచ్చి తుపాను సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సురేశ్‌కుమార్ కోరడంతో జిల్లాలోని 80 శాతం మంది ఉద్యోగులు శుక్రవారం విధులకు హాజరయ్యారు.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో శుక్రవారం సాయంత్రం జిల్లా అంతటా భారీ వర్షాలు మొదలయ్యాయి. పై-లీన్ తుపాను తీరం దాటే సమయంలో జిల్లాలో 200 నుంచి 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో కలెక్టర్ సురేశ్‌కుమార్ మరింత అప్రమత్తమై శుక్రవారం తీరం వెంబడి ఉన్న ఆర్డీవోలు, తహశీల్దార్‌లు, ఎంపీడీవోలు, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. నిజాంపట్నం, నగరం, రేపల్లె, బాపట్ల, కర్లపాలెం మండలాల్లోని 116 గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తీరంలోని తుపాను పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు. అంతేకాకుండా తెనాలి, రేపల్లె, గుంటూరుల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూముల్లో 48 గంటల పాటు రాత్రింబవళ్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు పడితే పశ్చిమ డెల్టాలోని వరి, వేరుశెనగ, పసుపు పంటలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉన్నందున ప్రధాన పంటకాల్వల్లోని సాగునీటి విడుదల పరిమాణాన్ని తగ్గించాలని ఇరిగేషన్ అధికారుల్ని ఆదేశించారు. పొలాల్లోని మురుగునీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్..
కాగా జిల్లాకు జాతీయ విపత్తుల నివారణ బలగాలు (ఎన్‌డీఆర్‌ఎఫ్) పెద్ద సంఖ్యలో చేరుకున్నాయి. మంగళగిరి కేంద్రంగా పనిచేస్తున్న బలగాలను తూర్పు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు పంపారు. వీరితో పాటు అత్యవసర సర్వీసుల కోసం చెన్నై, ముంబాయిల నుంచి అదనంగా 200 మందిని జిల్లాకు రప్పించారు. వీరికి నాగార్జునా యూనివర్సిటీలో వసతి కల్పించారు. సముద్ర తీరంలోని మెరైన్ పోలీసుల్ని కూడా అప్రమత్తం చేశారు. స్పీడ్‌బోట్‌లను రంగంలోకి దించి సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇదిలావుంటే తుపాను కారణంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే పంటలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోవడం ఖాయమని పశ్చిమ డెల్టా రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
పరిస్థితిని సమీక్షిస్తున్నాం: కలెక్టర్
తుపాను వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సముద్రతీరంలోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నామని కలెక్టర్ సురేశ్‌కుమార్ వివరించారు. పై-లీన్ తుపాను బలపడి పెనుతుపానుగా మారిన నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉన్నట్లు వివరించారు. జిల్లాలో పరిస్థితిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్ నుంచి సమీక్షించారు. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని టెలీకాన్ఫరెన్స్‌లో ఆదేశించారు.
Advertisement