రైతులకు ధైర్యాన్నిచ్చిన విజయమ్మ
Published Tue, Oct 29 2013 3:34 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
దొంగరావిపాలెం (పెనుగొండ రూరల్), న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి పంట నష్టపోయిన రైతుల్లో ఆత్మస్థైరాన్ని నింపారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. విజయమ్మ జిల్లా పర్యటన ముగిసిన అనంతరం దొంగరావిపాలెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో విజయమ్మ నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించారని, అడుగడుగునా రైతులు ఆమె వద్ద గోడు వెళ్లబోసుకున్నారని చెప్పారు. పెట్టుబడులు నష్టపోయి నిండా మునిగి పోయామని ఆమె వద్ద రైతులు ఆవేదన చెందినట్టు తెలిపారు. రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
తూతూమంత్రం చర్యలతో ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని ఆరోపించారు. వారం రోజులుగా చేలల్లో నీరు నిలిచి పనలు కుళ్లిపోతున్నా.. అధికారులు నష్టం అంచనాలకు సమాయత్తం కాకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు అధిక నష్టపరిహారం ఇప్పించేందుకు, రుణమాఫీ చేసేందుకు విజయమ్మ పోరాటం చేస్తానని చెప్పారన్నారు. కౌలు రైతులకు రుణాలను రీషెడ్యూల్ చేయాలని, సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలని, ఇన్‌పుట్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని బాలరాజు డిమాండ్ చేశారు. డెల్టా ఆధునికీకరణను వేగవంతం చేయాలని విజయమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారన్నారు. మహానేత వైఎస్సార్ హయాంలో రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు.
పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రైతులకు పూర్తిన్యాయం జరుగుతుందని బాలరాజు పేర్కొన్నారు. వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, ఆచంట, చింతలపూడి సమన్వయకర్తలు కండిబోయిన శ్రీనివాసు, కర్రా రాజారావు, జిల్లా అధికార ప్రతినిధి ఊదరగొండి చంద్రమౌళి, పెనుగొండ సర్పంచ్ యాదాల ఆశాజ్యోతి, ఆచంట మాజీ జెడ్పీటీసీ సభ్యు డు ముప్పాళ వెంకటేశ్వరరావు, వైసీపీ ఆచంట, పెనుగొండ మండల కన్వీనర్లు గుడాల విజయబాబు, యాదాల రవిచంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు పిల్లి వెంకట సత్తిరాజు, యాదాల నాగరాజు, ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ మీడియా కార్యదర్శి గుత్తుల సాల్మన్ దొర, మాజీ ఎంపీపీ మట్టా ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement