గుంటూరు జిల్లాలో ఫైలిన్ కలకలం
Published Fri, Oct 11 2013 2:15 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు/ న్యూస్‌లైన్,బాపట్లటౌన్ : ‘ఫైలిన్’ తుపాను జిల్లాలో కలకలం రేపుతోంది. గురువారం రాత్రికి తీరప్రాంతంలో సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. పరదీప్, కళింగపట్నం మధ్య 12వ తేదీ సాయంత్రానికి తుపాను తీరాన్ని దాటవచ్చని దీంతో జిల్లాలో భారీవర్షాలతో పాటు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. నిజాంపట్నం హార్బర్‌లో రెండోనంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. అధికారుల ఆదేశాల మేరకు హార్బర్ నుంచి వేటకు వెళ్లిన బోట్లన్నీ గురువారం తిరిగి ఒడ్డుకు చేరాయి. కాకినాడకు చెందిన ఐదు బోట్లు, కృష్ణపట్నంకు చెందిన ఒక బోటు నిజాంపట్నం హార్బర్ కు చేరాయి. జిల్లా కలెక్టర్ ఎస్ సురేశ్‌కుమార్ ఆదేశాల మేరకు తుపాను ప్రభావిత మండలాలకు ప్రత్యేకంగా నియమించిన అధికారులు స్థానికంగా ఉంటూ ‘ఫైలిన్’ ప్రభావాన్ని గమనిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.
మత్స్యకారుల ఆందోళన... కిందటి ఓగ్ని, జల్, నీలం తుపానులను గుర్తుచేసుకుంటూ మత్స్యకారులు తమ బోట్ల భద్రతపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జెట్ట్టీలోని బోట్లను రేవు మార్గం ద్వారా తరలించి గ్రామాలకు సమీపంలో భద్రపరుచుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సముద్రంలోకి వెళ్లిన 150 మెకనైజ్డ్ బోట్లు, 150 మోటరైజ్డ్ బోట్లన్నీ హర్బర్‌కు చేరినట్లు అధికారులు ధృవీకరిస్తున్నారు. నిజాంపట్నం మండల తీరప్రాంత గ్రామలైన నక్షత్రనగర్, సంజీవనగర్, కొత్తపాలెం, తాళ్లతిప్ప, రేపల్లె మండలంలోని మోళ్లగుంట, లంకెవాని దిబ్బ, లక్ష్మీపురం గ్రామాల పరిధిలోని ఉన్న సుమారు 600 మోటరైజ్డ్ బోట్లు ఒడ్డుకు చేరాయి.
కంట్రోల్‌రూమ్‌ల ఏర్పాటు ... తుపానుకు సంబంధించి అప్రమత్తచర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్ సురేశ్‌కుమార్ గురువారం అన్ని ప్రభుత్వశాఖల అధికారులతో సమీక్షించారు. అధికారయంత్రాంగం ప్రతీక్షణం అప్రమత్తంగా వ్యవహరించి రానున్న విపత్తును సమర్థంగా ఎదుర్కోవాలని ఆదేశాలిచ్చారు. గుంటూరు, తెనాలి ఆర్డీవో కార్యాలయాలతో పాటు కలెక్టర్ కార్యాలయంలోనూ ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.
ఆరు ప్రభావిత మండలాలు... జిల్లాలో ముఖ్యంగా బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, నిజాంపట్నం, నగరం, రేపల్లెను ఫైలిన్ తుపాను ప్రభావిత మండలాలుగా అధికారులు గుర్తించారు. ఆయా మండలాల్లోని తహశీల్దార్లు అప్రమత్తంగా ఉంటూ వీఆర్వోల సాయంతో తీరప్రాంతం వెంబడి పహారా నిర్వహించాలని కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలిచ్చారు. బాపట్ల మండలంలోని సూర్యలంక, అడవిపల్లిపాలెం, కొత్త ఓడరేవు, దాన్వాయ్‌పేట గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బంది వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. భారీ వర్షాలకు ఇప్పటికే బాపట్ల నియోజకవర్గంలో సుమారు 12 వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు స్థానిక అధికారులు అంచనా వేశారు.
తీరప్రాంతాన్ని పరిశీలించిన అధికార యంత్రాంగం
బాపట్లటౌన్: బాపట్ల డీఎస్పీ తన సిబ్బందితో కలసి గురువారం సూర్యలంక సముద్రతీరాన్ని పరిశీలించారు.మత్స్యకారులన బోట్లు, వలలు, సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచించారు. రాత్రి సమయంలో వేటకు వెళ్లొద్దన్నారు. బాపట్ల డివిజన్ పరిధిలోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, రేపల్లె, నిజాంపట్నం, నగరం మండలాల పరిధిలో 28 తీరప్రాంత గ్రామాల్లో ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందన్నారు. కంట్రోల్ రూమ్ 08643-224310 నంబర్, డయల్ 100 లకు సమాచారం అందిస్తే తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా బాపట్ల మండలం సూర్యలంక, అడవిపల్లిపాలెం, కృపానగర్, దాన్వాయ్‌పేట, రామచంద్రాపురం, రేపల్లెలో లంకెవానిదిబ్బ, పెసర్లంక, నిజాంపట్నంలలో ప్రత్యేక టీమ్‌లను కూడా నియమించామన్నారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడైనా డ్రెయిన్లు, కాలువలకు గండ్లు పడినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. డిఎస్పీ వెంట సీఐ మల్లికార్జునరావు, రూరల్ ఎస్‌ఐ కోటేశ్వరరావు తదితరులున్నారు.
అప్రమత్తమైన వైద్యాధికారులు ... అవసరమైతే తీరప్రాంత గ్రామాల్లో వైద్య సేవలు అందించేందుకు అప్పికట్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారి డాక్టర్ కర్రెద్దుల అరవింద బాబు సమ్మె విరమించి విధుల్లో చేరారు. సూపర్‌వైజర్ వెంకటేశ్వరరావు, సిబ్బందితో కలిసి స్థానిక ముత్తాయపాలెం సబ్‌సెంటర్‌లో మందులను అందుబాటులో ఉంచారు. తుఫాన్ ప్రభావం తగ్గేంత వరకు 24 గంటల పాటు మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.
రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ
నిజాంపట్నం: ఫైలిన్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నిజాంపట్నం హార్బర్‌లో రెండో నం బర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లు గురువారం సాయ ంత్రం ఒడ్డుకు చేరుతున్నాయి. దాదాపు బోట్లన్నీ హార్బర్ ఒడ్డుకు చేరాయని ఒకటో, రెండో బోట్లు రావాల్సి ఉన్నాయని అవి అర్ధరాత్రికి వస్తాయని మత్య్సకారులు తెలుపుతున్నారు.
కంట్రోల్‌రూమ్ నంబర్లు
కలెక్టర్ కార్యాలయం: 0863-2234990
గుంటూరు ఆర్డీవో : 98499 04006
తెనాలి ఆర్డీవో : 08644-223800
నరసరావుపేట ఆర్డీవో: 08647-222039
గురజాల ఆర్డీవో : 89859 20005
Advertisement