ధైర్యంగా ఉండండి | ys vijayamma visits flood affected regions | Sakshi
Sakshi News home page

ధైర్యంగా ఉండండి

Published Tue, Oct 29 2013 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM

ys vijayamma visits flood affected regions

‘అమ్మా.. ఈ పాలకులకు కనికరం లేదు. నష్టాల్లో కూరుపోయి.. కష్టాల్లో చిక్కుకున్న మమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడు. ఓటేసి గెలిపించిన ప్రజాప్రతినిధులెవరూ వచ్చింది లేదు. మాటమాత్రంగానైనా మమ్మల్ని పలకరించింది లేదు. రైతు ఏమైపోతున్నాడోనన్న ఆలోచన వాళ్లెవరికీ లేదు. ఇదిగోండమ్మా మేం పండించిన పంట. ఇదిగో ఇలా నీటిపాలైంది. అక్కడ చూడండి ధాన్యం మొలకొచ్చేస్తోంది. దీన్ని చూడండమ్మా.. ఈ చేను పొట్ట దశలో ఉంది. నీళ్లల్లో మునిగిపోవడంతో గింజలు దక్కే పరిస్థితి లేదు. ఇదేదో మా ఊరోళ్ల కష్టం మాత్రమే కాదమ్మా.. జిల్లాలో అన్ని పంటలూ మునిగిపోయూయి. రైతులంతా పుట్టెడు దుఃఖంలో ఉన్నారు.
 
 మమ్మల్ని ఆదుకోమని ఈ ప్రభుత్వమోళ్లకు మా ఆత్మబంధువైన మీరు గట్టిగా చెప్పండమ్మా...’ అంటూ వైఎస్ విజయమ్మ ఎదుట రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలను స్వయంగా చూసిన ఆ తల్లి గుండె చలించిపోయింది. ‘మీ రాజన్నే ఉంటే మీకు ఈ కష్టాలు వచ్చేవి కాదు. వ్యవసాయం పండగలా మారి ఉండేది. అధైర్యపడకండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మీకొచ్చిన కష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి మిమ్మల్ని ఆదుకోమని గట్టిగా నిలదీస్తాం. ఆరు నెలలు ఓపిక పట్టండి. జగన్‌బాబు అధికారంలోకి వస్తాడు. మీ కష్టాలను కడతేరుస్తాడు’ అంటూ రైతన్నలకు విజయమ్మ భరోసా ఇచ్చారు.
 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు : భారీ వర్షాలు రైతులను మరోసారి తీవ్రంగా కుంగదీశాయని.. వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ భరోసా ఇచ్చారు. రైతు బాగుంటేనే ప్రభుత్వాలు బాగుంటాయని వైఎస్ రాజశేఖరరెడ్డి భావించేవారని.. ఆ దిశగానే వారికి మేలు చేకూర్చేవారని తెలిపారు. కానీ గడచిన నాలుగేళ్ల నుంచి రైతులు ఏదో ఒక రూపంలో నష్టపోతున్నారని, ఈ ప్రభుత్వం అన్నదాతలను పట్టించుకున్న పాపానపోవడం లేదని ఆవేదన  వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు జిల్లాలో నీట మునిగి దెబ్బతిన్న పంట పొలాలను సోమవా రం ఆమె పరిశీలించారు. పలుచోట్ల రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
 
 ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాల కారణంగా జిల్లాలో నలుగురు చనిపోయారని వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని, రైతులను సత్వరమే ఆదుకునే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రంపైనా ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం ఇంకా ఆరు నెలలు అధికారంలో ఉంటుందని, ఈలోపు రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కొద్దికాలం ఓపిక పడితే త్వరలోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తారని స్పష్టం చేశారు. అప్పుడు అందరికీ న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాశ్వత పరిష్కారాలు చూపిస్తారని హామీ ఇచ్చారు. రైతులు ధైర్యం కోల్పోకుండా నిబ్బరంగా ఉండాలని అన్నారు. ఉదయం 11గంటలకు కృష్ణాజిల్లా సరిహద్దున గల అప్పనవీడు వద్ద ఆమె జిల్లాలోకి ప్రవేశిం చారు.
 
 అక్కడి నుంచి ఉంగుటూరు మండలం నారాయణపురం చేరుకున్న విజయమ్మ నీటిలో నడుచుకుంటూ వెళ్లి మునిగిన వరి చేలను చూశారు. రైతులతో మాట్లాడి ఎంత నష్టం వచ్చింది, ఎంత పెట్టుబడి పెట్టారు వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారి పక్కన దెబ్బతిన్న పొలాలను చూసి రైతులతో మాట్లాడారు. అక్కడి నుంచి నేరుగా నందమూరు అక్విడెక్టు వద్దకు వెళ్లి పరిశీలించారు. ఎర్రకాలువ పొంగినప్పుడల్లా తమ పొలాలు ముని గిపోతున్నాయని అక్కడి రైతులు ఆమెకు తమ బాధలను చెప్పారు. ఎగువ రైతులు, దిగువ రైతుల సమస్యల విన్న తర్వాత విజయమ్మ ఇరువురికీ నష్టం కలగకుండా పరిష్కారం చూపడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు.
 
 అనంతరం తణుకు మండలం దువ్వలో నేలకొరిగిన పంటచేలను పరిశీలించి నష్టం వివరాలను తెలుసుకున్నారు. దువ్వలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోరుతూ చేపట్టిన రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలి పారు. ఆ తర్వాత తణుకు మీదుగా ఇరగవరం మండలం గోటేరు, కంతేరు గ్రామాల్లో పర్యటించి నేలకొరిగిన పంటచేలను పరిశీలించారు. నష్టపరిహారం అందేవరకూ రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కత్తవపాడు వద్ద ఆచంట నియోజకవర్గ నాయకులు విజయమ్మకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బయలుదేరి ఆలమూరు చేరుకున్న ఆమె అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మార్టేరు మీదుగా కవిటం సెంటర్‌కు చేరుకున్నారు. పోడూరు నుంచి మినిమించిలిపాడు వరకూ పూర్తిగా మునిగిన పంట చేలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. 
 
 ఆచంట వేమవరంలో చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే ప్రాంతంలో పంట పొలాలను పరిశీలించారు. సాయంత్రం 6 గంటలకు పెనుగొండ మండలం సిద్ధాంతం మీదుగా తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లారు. విజయమ్మ వెంట వైసీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాల రాజేష్, ముదునూరి ప్రసాదరాజు, తానేటి వనిత, పాతపాటి సర్రాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు చీర్ల రాధయ్య, కర్రా రాజారావు, చలుమోలు అశోక్‌గౌడ్, పుప్పాల వాసు, కండిబోయిన శ్రీనివాసు, తలారి వెంకట్రావు, డి.సువర్ణరాజు, నాయకులు వగ్వాల అచ్యుత రామారావు, ఊదరగొండి చంద్రమౌళి, కౌరు సర్వేశ్వరరావు తదితరులు ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement