పరిహారం అందేలా ఒత్తిడి తెస్తాం: వైఎస్‌ విజయమ్మ | Ensure pressure compensation as bring says YS Vijayamma | Sakshi
Sakshi News home page

పరిహారం అందేలా ఒత్తిడి తెస్తాం: వైఎస్‌ విజయమ్మ

Published Thu, Oct 17 2013 3:51 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

పరిహారం అందేలా ఒత్తిడి తెస్తాం:  వైఎస్‌ విజయమ్మ

పరిహారం అందేలా ఒత్తిడి తెస్తాం: వైఎస్‌ విజయమ్మ

ఉద్దానం ప్రాంత రైతుల క ష్ట నష్టాలు తెలుసుకుంటూ...బాధిత రైతులను పరామర్శిస్తూ... వలలు, బోట్లు, ఆస్తులు కోల్పోయిన మత్స్యకారులకు భరోసానిస్తూ... మిహ ళా రైతులకు అండగా ఉంటామని హామీనిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ తుపాను బాధిత ప్రాంతాల్లో బుధవారం పర్యటన సాగించారు. ఆమెకు వినతులు అందించేందుకు బాధితులు ఆరాటపడ్డారు. వృద్ధులు గోడు వినిపించారు. ఉద్యానవన రైతులు విజ్ఞాపనలు చేశారు. జగన్‌బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే కష్టాలు తీర్చుతామని, ప్రస్తుతం నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెబుతూ ఆమె ముందుకు సాగారు. 
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గ్రామం: చిన్నకొజ్జిరియా
 సమయం : 12.30 గంటలు
 కనుచూపు మేరలో చుట్టూ నేలకొరిగిన కొబ్బరిచెట్లు... మధ్యలో నేలకూలిన ఇళ్లు... అక్కడే నిల్చొని ఆతృతగా వైఎస్ విజయమ్మ కోసం ఎదురు చూస్తున్న తుపాను బాధిత ప్రజలు... నేరుగా కాన్వాయ్ అక్కడికి వెళ్లి ఆగగానే సాదర ఆహ్వానం. అక్కడ ఉన్న బాధితుల్లో ఒకరైన బొడ్డా నరసింహమూర్తి మైకు తీసుకొని తమ బాధలు చెప్పడం మొదలు పెట్టాడు... 
 
 అమ్మా నమస్కారం. మేము ఎక్కువగా కొబ్బరి పంట పండిస్తాం. తుపాను వచ్చి కొబ్బరి, జీడి పంటలను నాశనం చేసింది. పురుగు మందులు వాడినా ప్రయోజనం లేదు. మరి మీరొక్కరవ్వ మా తరఫున పోరాడి ఏదో కొంత వరకు సాయం అందించాలి. ప్రస్తుతానికి నాలుగైదు రోజులైంది. ఇంతవరకు పట్టించుకున్న వారు లేరు. ప్రస్తుతానికి మంచినీరు లేదు. కరెంటు లేదు. స్తంభాలు వేయడం లేదు. ఇక్కడ దించి పాతుకోమంటున్నారు. మీరు మా తరఫున పోరాడి... మా అయ్యగారు రాజశేర్‌రెడ్డిలా పోరాడి మాకు న్యాయం చేయాలి. ఇక్కడ 60 శాతం మంది కిడ్నీ జబ్బులు ఉన్నవారు ఉన్నారు. వైద్యం లేదు. జబ్బులతోనే సత్తున్నాం. మా బాధలు విన్నోళ్లూలేరు. ఆయన మాటలకు విజయమ్మ  స్పందిస్తూ...
 
 మిమ్మల్ని చూస్తే చాలా బాధనిపిస్తావుంది. రాజశేఖర్‌రెడ్డి ఆరోజు సునామీ వచ్చినప్పుడు ఆదుకున్నారు. ఇప్పుడు కూడా పూర్తిస్థాయిలో ఆదుకొనేవారు. ఇప్పుడు పథకాలు సక్రమంగా అమలు జరగడం లేదు. ఇవన్నీ జగన్‌బాబు నాయకత్వంలో మనం సంపాదించుకుందాం. ఇప్పుడైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జీడిమామిడి చెట్లకు, కొబ్బరి చెట్లకు ఎకరాను పరిగణలోకి తీసుకొని నష్ట పరిహారం ఇవ్వాలి. ఇళ్లు కూలి పోయిన చోట ఇందిరమ్మ ఇళ్లు కట్టించాలి. కొబ్బరి కొత్త మొక్కలు ఇవ్వాలి, ఏరియల్ స్ప్రే చేయించాలి. ఆదాయం రావాలంటే కనీసం ఆరు సంవత్సరాలు పడుతుంది. అందుకే ఆదాయం వచ్చే వనరులు కల్పించాలి. ఆరు నెలల్లో జగన్ నాయకత్వంలో ప్రభుత్వం వస్తుంది. మీరంతా ధైర్యంగా ఉండండి. మీకు ధైర్యం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. అన్ని రకాలుగా మీ పక్షాన పోరాటాలు చేస్తామంటూ మాట్లాడుతుంటే అక్కడి జనం విజయమ్మకు జై.. జగన్‌కు జై, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.  
 
    జిల్లాలోని కంచిలి, కవిటి, సోంపేట మండలాల్లోని జాడుపూడి, పెద్దకొజ్జిరియా, చిన్న కొజ్జిరియా, రాజపురం, జగతి, దొరివంక, ఇద్దివానిపాలెం, బి.గొనపపుట్టుగ, కుసుంపురం, కళింగపట్నం, బల్లిపుట్టుగ, రుషికుడ్డ, ఇసుకలపాలెం, రామాయపట్నం, గొలగండి, బారువ గ్రామాల్లో పర్యటించారు. ఈ గ్రామాల్లో బాధితులు పడుతున్న బాధలను కళ్లారా సూచిన విజయమ్మ పలు చోట్ల మాట్లాడారు. అనేక మంది తమ బాధలు వివరించారు. కన్నీటి పర్యంతమయ్యారు. బారువలో మత్స్యకారులు కన్నీరు పెట్టుకున్నారు. వలలు, ఇతర సామాన్లు పనికి రాకుండా పోయాయని వాపోయారు. కళింగపట్నంలో పార్వతి అనే మహిళ సీసా పట్టుకొని ట్యాంకర్ వస్తేనే మాకు మంచినీరు, లేకుంటే ఈ మురికినీరే తాగాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వంతునూరులో 270 ఇళ్లు ఉన్నాయి. ఈ ఊరికి చుట్టూ నీరు ఉంది. ఎటుపోవడానికి వీలు లేకుండా పోయింది. ఉద్దాన ప్రాంతంలో ఎక్కడైనా స్థలం ఇస్తే ఇళ్లు  కట్టుకుంటామంటూ విజ్ఞప్తిచేశారు.  ఇంకా పలువురు మహిళలు, విద్యార్థులు, వృద్ధులు విజయమ్మ వద్ద తన ఆవేదన వ్యక్తం చే శారు.
 
 రాజపురం గ్రామంలో కాముట ఆరుద్రమ్మ మాట్లాడుతూ తన ఇల్లు కూలిపోయింది. నాకు దిక్కులేదని కన్నీరు పెట్టింది. విజయమ్మ వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లి చూశారు. తప్పకుండా సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే జగన్‌బాబు ప్రభుత్వం వస్తుంది. మీకు మంచే జరుగుతుందని చెప్పారు. సనపల సరస్వతి అనే మహిళ మాట్లాడుతూ తనకు ఎనిమిది ఎకరాలు కొబ్బరితోట ఉంది. మొత్తం కూలిపోయింది. ఇక నేనేమి చేయాలి. నాకు పింక్ కార్డు ఇచ్చారు. కనీసం బియ్యం తీసుకునేందుకు కూడా నాకు అర్హతలేదంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇలా ప్రతి గ్రామంలోనూ వేదనలు, రోదనలు మిన్నంటాయి. రాబోయేది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమేనని, తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుందని, సాయం అందించేందుకు మీ పక్షాన పోరాడతామని విజయమ్మ వారికి భరోసా ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement