తుపాను బాధితులను నిరాశ పరిచిన సీఎం టూర్ | CM Storm victims had a disappointing Tour | Sakshi
Sakshi News home page

తుపాను బాధితులను నిరాశ పరిచిన సీఎం టూర్

Published Mon, Oct 21 2013 4:06 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

CM Storm victims had a disappointing Tour

లేటుగా వచ్చినా లేటెస్టుగా స్పందిస్తారని ఆశించారు.. ఏదో సాయం ప్రకటించకపోతారా!.. అని ఎదురు చూశారు. కానీ చివరికి నిరాశే మిగిలింది. గాలి దుమారం తప్ప.. గట్టి హామీ ఏదీ లభించలేదు. గాలిలో చక్కర్లు కొట్టి.. మత్స్యకారులు, రైతులకు నాలుగు గాలి కబర్లు చెప్పి తుపాను ప్రాంతాల పర్యటన అయ్యిందనిపించారు.. ముఖ్యమంత్రిగారు!. తుపాను బీభత్సం సృష్టించిన వారం తర్వాత ఆ ప్రాంత పర్యటనకు వచ్చిన ఆయన ఏదో ఉద్ధరిస్తారన్న రైతుల ఆశలు ఆయన హెలికాప్టర్ సృష్టించిన గాలిలో కలిసిపోయాయి.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆదివారం జరిపిన పర్యటన బాధితులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చకపోగా.. మరింత కుంగిపోయేలా చేసింది. మత్స్యకారులకు రూ.40 కోట్లతో సహాయ కార్యక్రమాలు చేపడతామన్న ప్రకటన తప్ప.. ఇతరత్రా ఏ ఒక్క డిమాండునూ ముఖ్యమంత్రి అంగీకరించలేదు. తక్షణ సాయం గురించి కూడా మాట మాత్రంగానైనా ప్రస్తావించకపోవడం రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది. తుపాను ప్రాంతాల్లో ఏరియల్ సర్వేతోపాటు ఇచ్ఛాపురం మండలం డొంకూరు, కవిటిల్లో మత్స్యకారులు, రైతులతో ముఖాముఖి కార్యక్రమాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం ముందుగా డొంకూరు చేరుకున్న సీఎం మత్స్యకారులతో మాట్లాడారు. 
 
 తమ కష్టాలను విడమరచి చెప్పారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి మృతి చెందిన వారికి ప్రస్తుతం ఆపద్బంధు పథకం కింద రూ.50 వేలు ఇస్తున్నారు. దాన్ని పెంచి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని వారు కోరగా ముఖ్యమంత్రి స్పందించ లేదు. జిల్లాలోని మత్స్యకారుల కోసం రూ. 40 కోట్లతో వివిధ సహాయ కార్యక్రమాలు చేపడతామని మాత్రం హామీ ఇచ్చారు. చేపల నిల్వ కోసం రూ.కోటితో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తామన్నారు. డొంకూరు మహిళా సంఘానికి చేపల అమ్మకానికి రెండు వాహనాలు కొనుగోలు చేసుకునేందుకు రుణం ఇస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి కవిటికి చేరుకున్న ఆయన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కొబ్బరి రైతులు పూర్తిగా నష్టపోయారని, అదే విధంగా జీడి, మామిడి తోటలు వేసిన రైతులదీ అదే దుస్థితి అంటూ చెట్టుకు రూ.2 వేలు చొప్పన వెంటనే పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా పలువురు రైతులు కోరారు. వారి విజ్ఞప్తిని సీఎం మన్నించలేదు.
 
  నష్టంపై సర్వేకు ఆదేశించినందున పూర్తి వివరాలు వ చ్చిన తర్వాతే పరిహారం నిర్ణయిస్తామని తేల్చి చెప్పారు.  సర్వే ఎలా జరుగుతుందనే సందేహాలు రైతుల్లో ఉన్నాయంటూ దాని గురించి వివరించాలని ఉద్యానవన శాఖ కమిషన ర్‌ను ఆదేశించగా.. ఆయన సర్వే తీరును వివరించారు. నష్టపోయిన చె ట్ల స్థానంలో కొత్తగా కొబ్బరి మొక్కలు నాటేందుకు, కూలిన చెట్టు తొలగించి, భూమి బాగుచేసుకునేందుకు ఉపాధి హామీ పథకం కింద ఎకరాకు రూ.5 వేలు ఖర్చు చేసేలా వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి.. దాని సాధ్యాసాధ్యాలను మాత్రం వివరించలేదు. ఈ ప్రాంతంలో వాణిజ్య పంటలు తప్ప ఆహార పంటలు కనిపించడం లేదని, ఈ రైతులను ఎలా ఆదుకోవాలనే విషయంలో అధికారుల సూచనలు పాటిస్తామని చెప్పారు. అంతకుమించి ఇంకేమీ హామీలు ఇవ్వలేదు.
 
 కవిటిలో సమైక్య నినాదాలు
 కవిటిలోకి రాగానే రోడ్డుపై కాన్వాయ్ దిగిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైపు చూస్తూ జై సమైక్యాంధ్ర అంటూ కొందరు నినాదాలు చేశారు. వారి వద్దకు వచ్చిన సీఎం నేను కూడా సమైక్యవాదినేనని చెప్పారు. రైతులతో మాట్లాడుతున్నప్పుడు కూడా విభజన తుపానును అడ్డుకుంటామని చెప్పారు. దానికి మీ సహాయ సహకారాలు కోరుకుంటున్నామని అన్నారు.  ఇచ్ఛాపురంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కూడా ఉద్యాన రైతుల గురించి సీఎం పెద్దగా మాట్లాడలేదు. త్వరగా నివేదిక ఇస్తే ఏ విధ మైన పరిహారం ఇవ్వాలనే విషయాన్ని పరిశీలిస్తానని మాత్రమే చెప్పారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రి కృపారాణి, రాష్ట్ర మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, కోండ్రు మురళి, గంటా శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 
 
 ఫీజులు రద్దు చేయాలి
 ఇంటర్, డిగ్రీ, పీజీ పరీక్ష ఫీజులు రద్దు చేయాలని కవిటి ముఖాముఖీలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సీఎంను కోరారు. ఈనెల 23వ తేదీలోగా ఫీజు కాట్టాలని కళాశాలల వారు ఒత్తిడి తెస్తున్నారని, తుపానులో పూర్తిగా నష్టపోయిన తాము ఫీజులు చెల్లించలేని ఉన్నందున తమ పిల్లలకు పరీక్ష ఫీజులు రద్దు చేయాలని కోరారు. అయితే సీఎం వారికి ఎటువంటి హామీ ఇవ్వలేదు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement