జిల్లా యంత్రాంగంఅప్రమత్తం
Published Fri, Oct 11 2013 2:45 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఫైలిన్ తుపాను ముంచుకొస్తుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని కళింగపట్నం వద్ద తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటకు 140 నుంచి 200 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించటంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. సహాయ చర్యలకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. జిల్లాలోని 11 తీరప్రాంత మండలాల్లో ఉన్న 237 గ్రామాలపై తీవ్రప్రభావం ఉంటుందని గుర్తించి ఆ మేరకు ముందస్తు చర్యలు తీసుకుంది. పరిస్థితిపై జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ మండల స్థాయి అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావం నాలుగు రోజులపాటు కొనసాగే అవకాశం ఉన్నందున.. తీసుకోవల్సిన ముందస్తు చర్యలు, ఏర్పాట్లపై ఆదేశాలిచ్చారు.
సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని తీర ప్రాంత గ్రామాల్లో ఇప్పటికే దండోరా వేయించారు.
జిల్లాలోని 110 తుపాను రక్షిత భవనాలు, 24 పునరావాస కేంద్రాలను బాధితుల కోసం సిద్ధం చేశారు. మరికొన్ని చోట్ల పాఠశాలలు, వివిధ పారిశ్రామిక సంస్థలను కూడా వినియోగించేందుకు ఏర్పాట్లు చేశారు.
పునరావాస కేంద్రాలకోసం ఇచ్ఛాపురం మండలం డొంకూరు, ఈదుపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలు, కవిటి మండలం మాణిక్యపురం జెడ్పీ ఉన్నత పాఠశాల, కవిటి ప్రభుత్వ జూనియర్ కళాశాల, మందస మండలం హరిపురం, అంబుగాం జెడ్పీ ఉన్నత పాఠశాలలు, వజ్రపుకొత్తూరు మండలం పాత టెక్కలి, వజ్రపు కొత్తూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలు, సంతబొమ్మాళి మండలం నౌపడ ప్రభుత్వ జూనియర్ కళాశాల, బోరుభద్ర జెడ్పీ ఉన్నత పాఠశాల, సోంపేట మండలం బారువ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నడుమూరు జెడ్పీ ఉన్నత పాఠశాల, శ్రీకాకుళం మండలం కుందువానిపేట ఎంపీయుపీ పాఠశాల, పెద్ద గనగళ్లవలస జెడ్పీ ఉన్నత పాఠశాల, నరసన్నపేట మండలం మడపాం జెడ్పీ ఉన్నత పాఠశాల, మబగాం ఎంపీయూపీ పాఠశాల, గార మండలం మందురువానిపేట ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల, వత్సవలస ట్రైమెక్స్ పాఠశాల, రణస్థలం మండలం మెంటాడ ఎంపీయూపీ పాఠశాల, నారువ జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం జెడ్పీ ఉన్నత పాఠశాల, బందరువానిపేట ఎంపీయూపీ పాఠశాలలను సిద్ధం చేశారు. వీటితోపాటు సురక్షితంగా ఉన్న భవనాలను గుర్తించేందుకు మండల ప్రత్యేకాధికారులు ఆయా గ్రామాలను గురువారం సందర్శించారు.
= తుపాన్ ప్రభావిత గ్రామాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రతి మండలంలో 5 నుంచి 6 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. అవసరమైతే ప్రైవేట్ బస్సులను కూడా వినియోగిస్తారు.
= పునరావాస కేంద్రాలకు అవసరమైన పాలు, నీరు, కిరోసిన్, గ్యాస్, పెట్రోల్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ బాధ్యతను మండలాలవారీగా ఒక్కో డీలరుకు అప్పగించారు. తీరప్రాంత మండలాల్లోని పరిశ్రమల్లో ఉన్న మెస్‌లను పరిశీలించారు. వీటి నుంచి బాధితులకు ఆహారాన్ని అందించే విషయమై పరిశ్రమల అధికారులతో చర్చించారు.
= బాధితుల కోసం అత్యవసర మందులను అందుబాటులో ఉంచారు. విశాఖపట్నంలోని కోస్టుగార్డు, నావికాదళ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.
= పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన చర్యలు తీసుకునేందుకు మండలాలకు ప్రత్యేకాధికారులను.. రెండు మూడు మండలాలకు పర్యవేక్షణ అధికారులను నియమించారు. వీరందరినీ జిల్లా కేంద్రం నుంచి ఏజేసీ సమన్వయపరుస్తారు.
= తుపాను సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్రం నుంచి రెండు విపత్తు నివారణ బృందాలు జిల్లాకు చేరాయి. ఈ బృందాలు కళింగపట్నం, బారువ, భావనపాడు తీరాల్లో ఉండి సహాయ చర్యలు చేపడతాయి.
= మెరైన్ పోలీస్ స్టేషన్ల వద్ద 12 బోట్లు, 175 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
భారీ వాహనాల రాకపోకలపై నిషేధం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలను శుక్రవారం నుంచి తుపాను ముప్పు తొలగేవరకు నిషేధించారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వాహనాలు తిరగడం వల్ల తుపాను సహాయ చర్యలకు ఆటంకం కలగవచ్చన్న ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నారు. తుపాను సమయంలో నదులు, వాగులను దాటవద్దని, ఈతకు వెళ్లవద్దని జిల్లా యంత్రాంగం ప్రజలకు పిలుపునిచ్చింది.
24 గంటల కంట్రోల్ రూం సిద్ధం
పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు కలెక్టరేట్‌లో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ఫోన్ నంబర్లు 08942-240557, 9652838191. మండల తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
పండుగ ముందు ప్రమాదం
దసరా పండుగ ముందు ఇలాంటి విపత్తు ముంచుకొస్తుండటం జిల్లా ప్రజలకు, ముఖ్యంగా రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఖరీఫ్ పంటలకు ముప్పు వాటిల్లుతుందేమోనని భయపడుతున్నారు.
Advertisement
Advertisement