తుపాను బాధిత రైతులకు అన్యాయం జరిగే ప్రమాదం
Published Sat, Oct 19 2013 3:35 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలోని పై-లీన్ తుపా ను బాధిత రైతులు, బాధిత కుటుంబాలకు సహా యాన్ని ఏ ప్రాతిపదకన, ఏ మేరకు ఇస్తారనేది ఇంతవరకు తేలలేదు. పైగా ప్రస్తుతం అధికారులు చేపట్టిన సర్వేల తీరు బాధితులకు అన్యాయం చేసేలా ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రైతులకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. రెండు రోజులుగా అధికారులు నష్టం అంచనాల తయారీలో ఉన్నా.. ఇంతవరకు 20 శాతం సర్వే కూడా పూర్తి కాలేదు. ఇళ్లు, ఇతర ఆస్తులకు జరిగిన నష్టాలను అంచనా వేసే పనిలో రెవెన్యూ, హౌసింగ్ శాఖలు ఉండగా, వాణిజ్య పంటలకు జరిగిన నష్టాలను ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టేకు చెట్లకు జరిగిన నష్టాన్ని అటవీశాఖ, ఆహార పంటల నష్టాలను వ్యవసాయశాఖ సిబ్బంది అంచనా వేస్తున్నారు.
కొబ్బరి రైతులకు తీవ్ర నష్టం
జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు సాగు చేస్తుండగా, ఒక్క ఉద్దానం ప్రాంతంలోనే 20 వేల హెక్టార్ల వరకు ఉంది. తుపాను వల్ల ఉద్దానం ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. సుమారు 15 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు పనికి రాకుండా పోయాయి. అధికారుల అంచనా ప్రకారం ఎకరా భూమిలో 60 చెట్ల వరకు పెంచుకోవచ్చు. అయితే రైతులు 80 వరకు చెట్లు పెంచుతున్నారు. దేశవాళీ చెట్టు పెరిగి కాపు రావాలంటే కనీసం 12 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం కొబ్బరి పూర్తిగా కాపులో ఉంది. తుపానుకు నూరుశాతం చెట్లు పనికి రాకుండా పోయాయి. ఒక ఎకరాలోని చెట్లు ఓ కుటుంబాన్ని జీవితకాలం పోషిస్తాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మూడు రకాలుగా విభజించి నష్టం అంచనాలు తయారు చేస్తున్నారు. ‘పూర్తిగా పడిపోయిన చెట్లు, మొవ్వ విరిగిన చెట్లు, మెలిపెట్టుకుపోయి ముద్దగా మారిన చెట్టు’ అంటూ మూడు రకాలుగా విభజించారు.
మొవ్వ విరిగిన చెట్టు తిరిగి కాపునకు రావాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది. మెలిపెట్టుకుపోయిన చెట్టు పనికి రాదు. పూర్తిగా విరిగిన చెట్టుగానే పరిగణనలోకి తీసుకుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ అధికారులకు పట్టడం లేదు. ఎకరాను యూనిట్‌గా కాకుండా చెట్లను లెక్కలోకి తీసుకొని పరిహారం ఇవ్వాలనే ఆలోచన పూర్తిస్థాయిలో నష్టం చేస్తుందని రైతులు చెబుతున్నారు. తోటల్లో పడిపోయిన కొబ్బరి చెట్టును వేళ్లతో పెకిలించి బయటకు చేర్చాలంటే కనీసం రూ. 500లు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. 1999లో వచ్చిన తుపాను సమయంలో పాక్షికంగా పాడైన చెట్టుకు రూ.వంద, పూర్తిగా పోయిన చెట్టుకు రూ. 250లు చొప్పున పరిహారం ఇచ్చారు. ఇప్పుడు ఎలా.. ఎంత పరిహారం ఇస్తారో తెలియటం లేదు. ప్రభుత్వం ఏ విధమైన ప్రకటన లేకుండా అంచనాలు ఎలా తయారు చేయమన్నదో, అధికారులు ఏమి చేయదలుచుకున్నారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక జీడితోటలు, మామిడి తోటల్లో ఏ స్థాయిలో నష్టం జరిగిందో అధికారులు చెప్పే పరిస్థితి లేదు. ఉద్యానవన శాఖ వద్ద కూడా సరైన లెక్కలు లేవు.
కొబ్బరి తోటల్లో అంతర పంటలుగా జీడి, మామిడి తోటలు వేసిన వారు ఉన్నారు. ఇందులో పూర్తిగా పడిపోయిన చెట్లనే పరిగణలోకి తీసుకుంటున్నారు. కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో పూర్తిస్థాయిలో కొబ్బరి, జీడి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అధికారుల అంచనాలు ఇందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. కంచిలి మండలంలో నాలుగు రోజులుగా పర్యటిస్తున్న అధికారులు నాలుగు పంచాయతీల్లో మాత్రమే సర్వేను పూర్తి చేయగలిగారు. తోటల్లో పడిపోయిన చెట్లను అలాగే ఉంచితే, పురుగులు వట్టి మిగిలిన చెట్లు కూడా పనికిరాకుండా పోయే అవకాశముందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆహార పంటల విషయంలోనూ అధికారులు సరైన పద్ధతులు పాటించడం లేదు. అనేక చోట్ల వరి పొలాలు నీట మునిగాయి. నాట్లు కుళ్లిపోయి పనికి రాకుండా పోయాయి. మిగతా పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి. అధికారులు ఒక పద్ధతి లేకుండా ఇష్టాను సారం నష్టం అంచనాలు తయారు చేస్తున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే..
కొన్ని మార్గదర్శకాల మేరకు అంచనాలు తయారు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు.. వీటి ప్రకారమే సర్వేలు చేస్తున్నాం.. అంతకు మించి ఏమీ చెప్పలేమని సర్వే అధికారులు చెబుతున్నారు. ఇక మత్స్యకారులు, ఇళ్లు కోల్పోయిన వారు నడిరోడ్డుపై నిలబడ్డారు. వారి పునరావాసం గురించి అధికారులు ఇంతవరకు పట్టించుకోలేదు. పదికేజీల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నంలో ఉన్నారు. మత్స్యకారులకు జరిగిన నష్టంపై ఫిషరీస్ అధికారుల అంచనాలు ఎప్పటికి పూర్తవుతాయో తెలియటం లేదు.
Advertisement