పునరావాస చర్యలు వేగవంతం
Published Sat, Oct 19 2013 3:42 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలను వేగవంతం చేస్తామని, 38 మండలాల్లోనూ వరి, ఇతర పంటలకు జరిగిన న ష్టంపై సర్వేలు చేసి బాధితులకు పరిహారం చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ చెప్పారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుపాను కారణంగా జిల్లాలోని రైతులు, మత్స్యకారులకు అపార నష్టం జరిగిందన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరగకుండా నిరోధించగలిగామని తెలిపారు. పశువులను కూడా చాలావరకు రక్షించగలిగామన్నారు. ప్రస్తుతం పునరావాస కార్యక్రమాలపై దృష్టి పెట్టామని, ఇవి వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
మంగళవారం నాటికి అన్ని శాఖల సర్వేలు పూర్తిచేసి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని అన్నారు. వైద్య బృందాలు తీర ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్నాయని, తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయిస్తున్నామని వెల్లడించారు. రోడ్లు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, తాగునీటి సౌక ర్యం కల్పనకు ప్రత్యేక బృందాలు యుద్ధప్రాతిపదకన పనిచేస్తున్నాయని తెలిపారు. ఇళ్లు నష్టపోయినవారికి పరిహారం శనివారం నుంచి చెల్లిస్తామన్నారు. పలు మండలాల్లో మత్స్యకారులకు బియ్యాన్ని ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. కూలిన ఇళ్ల శిథిలాలు, పడిపోయిన చెట్ల తొలగింపు పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపడతామని వెల్లడించారు.
కొబ్బరి రైతులకు చెట్ల లెక్కన పరిహారం
నష్టపోయిన కొబ్బరి రైతులకు చెట్ల లెక్కన పరిహారం చెల్లిస్తామని చెప్పారు. 1996లో ఇచ్చిన ప్యాకేజీని సవరించి పరిహారం పెంచనున్నారని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం సమీక్షిస్తోందని తెలిపారు. ఇప్పటికీ 78 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదని, 9 తాగునీటి ప్రాజెక్టులు పనిచేయటం లేదని వెల్లడించారు. తుపాను ముందస్తు చర్యల కోసం రూ.80 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. ఉద్యాన పంటల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను రైతులకు తెలియజేసేందుకు, నష్టాన్ని అంచనా వేసేందుకు శాస్త్రవేత్తల బృందం పర్యటిస్తోందని తెలిపారు.
కంట్రోల్ రూం కొనసాగింపు
బాధితులను ఆదుకునేందుకు కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమును కొనసాగిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. సర్వే బృందాలు రాకపోయినా, పరిహారం చెల్లింపులో తేడాలు.. ఇతర ఇబ్బందులు ఉన్నా.. 08948-240557, 96528 38191 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో ఏజేసీ ఆర్.ఎస్.రాజ్‌కుమార్, డీఆర్‌ఓ నూర్‌బాషా ఖాసీం, డ్వామా పీడీ కల్యాణచక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement