5 గంటలు.. ఒకటే టెన్షన్!
Published Fri, Oct 11 2013 2:49 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
బందరువానిపేట (గార), న్యూస్‌లైన్ : తుపాను హెచ్చరికలను బేఖాతరు చేసి సముద్రంలో వేటకువెళ్లిన బందరువానిపేట మత్స్యకారులు గురువారం అటు అధికారులను, ఇటు గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురిచేశారు. ఉదయం 9 గంటలకు మొదలైన టెన్షన్.. మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. ఎట్టకేలకు 15 పడవల్లో వేటకెళ్లిన 60 మంది విడతలవారీగా సురక్షితంగా ఒడ్డుకు చేరటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ జరిగింది..
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కళింగపట్నం-పారాదీప్‌ల మధ్య తీరం దాటే అవ కాశం ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా.. వేటకు వెళ్లవద్దని రెవెన్యూ సిబ్బంది బుధవారం సాయంత్రమే దండోరా వేయించినా బందరువానిపేటకు చెందిన 60 మంది మత్స్యకారులు పట్టించుకోలేదు. ఎప్పట్లాగే వేకువజామున 4 గంటలకు తీరానికి చేరుకున్నారు. సముద్రం ప్రశాంతంగా ఉండటంతో 15 పడవల్లో వేటకు బయలుదేరారు. అయితే 9 గంటలకల్లా గాలులు పెరిగి సముద్రం అల్లకల్లోలంగా మారటంతో ఆందోళన చెందిన గ్రామస్తులు తీరానికి చేరుకున్నారు. సాధారణంగా 10, 11 గంటల మధ్య మత్స్యకారులు వేట నుంచి తిరిగొస్తారు. కానీ ఆ సమయానికి ఒక్క పడవే రావటంతో టెన్షన్ ఎక్కువైంది.
మిగతావారి పరిస్థితేమిటని పడవలో వచ్చినవారిని ప్రశ్నిస్తే అంతా తిరుగుప్రయాణంలో ఉన్నారని చెప్పారు. ఈలోగా సమాచారం తెలిసి కళింగపట్నం మెరైన్ స్టేషన్ సీఐ పూరేటి నారాయణరావు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. పాత పద్ధతుల్లో తుపాను తీవ్రతను అంచనా కట్టడం మానుకోవాలని హితవు చెప్పారు. ఏమైనా జరిగితే మీ కుటుంబాలకు దిక్కెవరని ప్రశ్నించారు. ఆర్‌ఐ బి.వి.రాజు కూడా వచ్చి మత్స్యకారులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో 12 గంటలకు 12 పడవల్లో మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. 2 గంటలకు రెండు పడవల్లో మిగిలినవారు ఒడ్డుకు చేరుకోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బోట్లు లేని మెరైన్ పోలీసులు
మెరైన్ పోలీస్ స్టేషన్‌కు బోట్లు లేకపోవటంతో బందరువానిపేట తీరానికి చేరుకున్న సిబ్బంది కేవలం మత్స్యకారులతో మాట్లాడ టానికే పరిమితమయ్యారు. వేటకు వెళ్లినవారికి ప్రమాదం జరిగితే మెరైన్ సిబ్బంది ఎలాంటి సహాయం అందించలేని పరిస్థితి. కళింగపట్నం మెరైన్ స్టేషన్ సిబ్బంది గార, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లోని తీరాన్ని పర్యవే క్షిస్తారు. ఈ స్టేషన్‌కు 12 టన్నుల సామర్ధ్యం గల బోట్లు రెండు, 5 టన్నుల బోటు ఒకటి అవసరం. కానీ ఇంతవరకు ప్రభుత్వం వాటిని సమకూర్చలేదు.
Advertisement