ముందుకొచ్చిన సముద్రం
Published Fri, Oct 11 2013 2:55 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
ఫైలిన్ తుపాను ప్రభావంతో వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట వద్ద సముద్రం 60 మీటర్లు ముందుకు వ చ్చింది. దీంతో సుమారు రూ.2 లక్షలు విలువైన ఫైబర్ బోటు ధ్వంసమైంది. గార మండలం కళింగపట్నం, బందరువానిపేట గ్రామాల వద్ద సముద్రం 50 అడుగుల మేర ముందుకు రావడంతో మత్స్యకారులు అప్రమత్తమై పడవ లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇచ్ఛాపురం మండలం డొంకూరు వద్ద అలలు ఎగసి పడడంతో పడవతోపాటు వలలు కొట్టుకుపోయి లక్ష రూపాయలు, కవిటి మండలం కపాసుకుద్ది మత్స్యకారుల వలలు ధ్వంసమవటంతో 6 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లింది.
పూండి, న్యూస్‌లైన్: బంగాళా ఖాతంలో పైలిన్ తుపాను ప్రభావంతో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం ముందుకు రావడంతో తీరప్రాంత మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తమవడంతో నష్టం తగ్గింది.
వజ్రపుకొత్తూరు మండలంలోని తీర ప్రాంతంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండడంతో అలల కల్లోలం తీవ్రమైంది. తుపాను హెచ్చరికలతో మత్స్యకారులు వేటకు వెళలేదు. దేవునల్తాడ తీరం నుంచి గుణుపల్లి వరకు బుధవారం రాత్రి బలమైన గాలులు వీయడంతో మంచినీళ్లపేట తీరం వద్ద సముద్రం 60 మీటర్లు ముందుకు వ చ్చింది. తీరంలో చోడిపల్లి ఎరకయ్యకు చెందిన సుమారు రూ.2 లక్షలు విలువ చేసే లంగరు వేసి ఫైబర్ బోటు ధ్వంసమైంది. సుమారు రూ.1.50 లక్షల నష్టం జరిగిందని మత్స్యకారుల తెలిపారు. రాత్రివేళల్లో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందన్నారు. గ్రామానికి అధికారులు వచ్చి ఏ విధమైన సూచనలు ఇవ్వలేదన్నారు.
బావనపాడు మెరైన్ పోలీసులు మంచినీళ్లపేట చేరుకుని ఫైబర్ బోటుకు జరిగిన నష్టాన్ని అంచనావేశారు. మత్స్యశాఖ నుంచి క్షేత్ర పర్యవేక్షకుడు పి.విజయ్‌కుమార్ ధ్వంసమైన తెప్పను పరిశీలించి అధికారులు దృష్టికి తీసుకెళతామని చెప్పారు. తీరం వెంట ఉన్న మత్స్యకారులను అప్రమత్తంగా ఉండాలని మెరైన్ పోలీసులు గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావులు చెబుతున్నారు. ఫైబర్ బోటు ద్వంసమైన విషయాన్ని భావనపాడు మెరైన్ సీఐ ఎం. సన్యాసి నాయుడు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. తుపానువల్ల నష్టానికి గురైన బోటు యజమాని చోడిపల్లి ఎరకయ్యను మత్స్యశాఖ ద్వారా ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు సర్పంచ్ గుళ్ల చిన్నారావు, ఎ.భాస్కరరావు, కె.సింహాచలం, వంక రాజు కోరారు.
అప్రమత్తమైన మత్స్యకారులు
గార: పైలిన్ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. గురువారం ఉదయం కళింగపట్నం, బందరువానిపేట గ్రామాల వద్ద సముద్రం సుమారు 50 అడుగుల మేర ముందుకు వచ్చింది. అలలు ఎగసిపడడంతో అప్రమత్తమైన మత్స్యకారులు వలలు సముద్రంలోకి కొట్టుకుపోకుండా దూరంగా తరలించారు. ఉదయం వరకు సముద్రం ప్రశాంతంగానే ఉందని, ఒక్కసారిగా ఇలా మారిందని మత్స్యకారులు రాయితీ రాజారావు, మైలపల్లి సూర్యనారాయణ తెలిపారు. మూడురోజుల పాటు వేటకు వెళ్లవద్దని సర్పంచ్ గనగళ్ల లక్ష్మమ్మ, గ్రామ పెద్దలకు రెవెన్యూ అధికారులు సూచించారు.
పడవ ధ్వంసం
డొంకూరు (ఇచ్ఛాపురం రూరల్): బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణం బాగాలేదని, వేటకు వెళ్లవద్దని బుధవారం ప్రసార మాధ్యమాల ద్వారా అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో మండలంలోని డొంకూరు ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లలేదు. పడవలను, వలలను సముద్ర తీరానికి దూరంగా ఉంచారు. గ్రామానికి బడే జగ్గారావు అనే మత్స్యకారుడు ఊళ్లో లేకపోవడంతో అతని పడవ సముద్రపు ఒడ్డునే ఉంది. గురువారం వేకువజామున తుపాను ప్రభావంతో అలలు ఎగసిపడి కొన్ని మీటర్ల దూరం ముందుకు రావడంతో పడవతో పాటు అందులోని వలలు కొట్టుకుపోయాయి. అలల తాకిడికి పడవ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని మత్స్యకారుడు జగ్గారావు తెలిపారు. అప్పులు చేసి కొన్న వలలు, పడవ ఇంజిన్ నీటి పాలవడంతో తన జీవనాధారం పోయిందని, ఆదుకోవాలని ప్రభుత్వానిక కోరారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తలదాచుకునేందుకు నిర్మించిన తుపాను షెల్టర్ శిథిలమైనా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక మత్స్యకారులు తెలిపారు.
రూ.6 లక్షల నష్టం
కపాసుకుద్ధి(కవిటి): సముద్రంలో వేటకు వెళ్లిన కపాసుకుద్ధికి చెందిన మత్స్యకారులు అలల ఉద్ధృతికి సుమారు 6 లక్షల విలువైన చేపలవల, ఇతర సామగ్రి నష్టపోయారు. మంగళవారం రాత్రి కపాసుకుద్ధి తీరం నంచి వల యజమానుదారులైన బడే దాలయ్య, తాతయ్య, జగదీష్, సోమయ్య, ఎర్రన్న, ఢిల్లేశు, పురుషోత్తం, వల్లయ్య తదితరులు 18 మంది వేటకు వె ళ్లారు. బుధవారం తుపాను ప్రకటనల నేపథ్యంలో స్థానికులు సెల్‌ఫోన్‌లో ఇచ్చిన సమాచారం మేరకు వారు వెనక్కు వచ్చేందుకు సిద్ధమయ్యారు. సముద్రంలో అలల ధాటికి వేట కోసం వినియోగించిన వల అడుగు భాగంలో రాళ్లు పైకి తేలడంతో వల చిరిగిపోయింది. సగంపైగా వల చిరిగిపోయిందని మత్స్యకారులు తెలిపారు. అప్పుచేసి ఇటీవల వల సమకూర్చుకున్నామన్నారు. మత్స్యశాఖ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.
Advertisement
Advertisement