వణుకుతున్న తీరం: భయం గుప్పిట ఉప్పాడ
Published Sat, Oct 12 2013 2:58 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
పిఠాపురం/కొత్తపల్లి, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను ప్రభావంతో జిల్లాలోని తీర ప్రాంతం వణికిపోతోంది. కొత్తపల్లి మండలంలో అనేక గ్రామాలు భయంగుప్పెట గడుపుతున్నాయి. మండలంలోని ఉప్పాడ, కోనపాపపేట, మూలపేట, మాయాపట్నం, అమీనాబాద తదితర గ్రామాల్లో తీరప్రాంతం సముద్ర కోతకు గురవుతోంది. రెండు రోజులుగా కెరటాల ఉధృతి పెరగ్గా, శుక్రవారం మరింత తీవ్ర రూపం దాల్చింది. సుమారు 10 మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతుండడంతో తీరం కోత ఎక్కువైంది. ఉప్పాడతో పాటు కోనపాపపేటపై సముద్ర కెరటాలు విరుచుకుపడ్డాయి.
ఈదురు గాలులకు గృహాలు ధ్వంసమవుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలో లంగరు వేసిన బోట్లు, ఇతర సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు. కెరటాల ఉధృతి అంతకంతకూ పెరుగుతుండడంతో తీరం వెంబడి నివసిస్తున్న మత్స్యకారులు తమ గృహాలను కాపాడుకునేందుకు ఇసుక బస్తాలతో రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉప్పాడ రక్షణకు ప్రభుత్వం జియోట్యూబ్ టెక్నాలజీ ద్వారా రక్షణ గోడ నిర్మించడంతో ఈ ప్రాంతంలో సముద్ర కోత తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో కోత ప్రభావం కోనపాపపేటపై చూపుతోంది.
ప్రమాదభరితంగా బీచ్ రోడ్డు
సముద్ర కెరటాల ఉధృతి ప్రమాదకరంగా మారడంతో ఉప్పాడ నుంచి కాకినాడ వరకున్న బీచ్‌రోడ్డు ప్రమాదభరితంగా మారింది. సముద్ర కోత నుంచి రక్షణగా వేసిన రాళ్లు కెరటాల ఉధృతికి లేచిపడడంతో బీచ్ రోడ్డు ఛిద్రంగా మారింది. కెరటాల ధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో బీచ్ రోడ్డుపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఉప్పాడ సమీపంలో ఎస్‌పీజీఎల్ వద్ద చిన వంతెన ప్రమాద స్థితికి చేరుకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సముద్రంలో మత్స్యకారులు?
సముద్రంలోకి వేటకు వెళ్లిన కొందరు మత్స్యకారులు తిరిగి రాలేదని తెలిసింది. ఐదు రోజుల క్రితం చేపల వేటకు వెళ్లిన ఉప్పాడ, కోనపాపపేట తదితర గ్రామాలకు చెందిన కొం దరు ఇంకా సముద్రంలోనే ఉన్నట్టు స్థానికులు చెబుతున్నా రు. వారు తిరుగు ప్రయాణంలో ఉండడంతో స్థానిక మత్స్యకారులు వారి వివరాలు వెల్లడించడం లేదు. శుక్రవారం రాత్రికి వారు తీరానికి చేరుకుంటారని భావిస్తున్నారు.
సుద్దగెడ్డకు భారీ వరద
గొల్లప్రోలు, న్యూస్‌లైన్ : పై-లీన్ ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గొల్లప్రోలు జలమయమైంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో భారీఎత్తున వరద నీరు పట్టణాన్ని ముంచెత్తుతోంది. పీబీసీ, సుద్దగెడ్డ, ఏలేరు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరోవైపు నీరు కిందకు ప్రవహించకపోవడంతో అంతకంతకూ పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది.
భయంగుప్పిట కాలనీ వాసులు
గొల్లప్రోలులోని ఎస్సీ కాలనీ, సూరంపేట, ఈబీసీ కాలనీ వాసులు భయంగుప్పిట కాలం వెళ్లదీస్తున్నారు. సుద్దగెడ్డ నుంచి గంటగంటకూ నీటి ప్రవాహం పెరుగుతుండడంతో కాలనీలోకి ముంపునీరు చేరుతోంది. ఇప్పటికే ఈబీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, సూరంపేట, శివాలయ మాన్యం, దేవీనగర్‌లోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూరంపేటకు రాకపోకలు స్తంభించాయి.
భయపెడుతున్న కాలువలు
నీటి ఉధృతి పెరుగుతుండడంతో కాలువలు కలిసిపోయి ప్రవహిస్తున్నాయి. దీంతో ఎక్కడ గండ్లు పడతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పీబీసీ, సుద్దగెడ్డ ఉధృతికి సూరంపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. సుద్దగెడ్డ ముంపుతో కాలనీ నీట మునగడంతో స్థానికులకు ఏమీ తెలియని పరిస్థితి ఏర్పడింది. తాటిపర్తి పుంత రోడ్డుపై పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. తాటిపర్తి-రాయవరం రోడ్డుపై సుద్దగెడ్డ నాలుగు అడుగుల మేర నీరు ప్రవ హిస్తోంది. వారం వ్యవధిలో ఆయా కాలనీలు రెండుసార్లు ముంపునకు గురయ్యాయి.
Advertisement