‘ఫైలిన్’పెనుతుపానుతో రైతులు ఆందోళన
Published Fri, Oct 11 2013 4:22 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
అమలాపురం, న్యూస్‌లైన్ : ‘ఫైలిన్’ పేరుకు అర్థం ఏమో గానీ- అది తమకు ఎలాంటి అనర్థం తెచ్చి పెడుతుందోనని రైతులు భీతిల్లుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పెను తుపానుగా మారిందన్న సమాచారంతో వారి గుండె లు గుబగుబలాడుతున్నాయి. నేలను నమ్ముకుని పెట్టిన పెట్టుబడి, పడ్డ కష్టం ఎక్కడ గంగ పాలవుతాయోనని దిగాలు పడుతున్నారు. ఇప్పటి వరకు నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో సరైన వర్షం లేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు గత వారం రోజుల నుంచి ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల కురుస్తున్న వర్షాలతో ఊరట పొందుతున్నారు. ఈ సమయంలో తుపాను హెచ్చరిక వారి కంటికి కునుకు కరువు చేసింది.
గత ఐదేళ్లలో ఒక్క 2011లో మినహా మిగిలిన నాలుగేళ్లు జిల్లాలో ఖరీఫ్ పంట తుపానులకు, భారీ వర్షాలకు తుడిచిపెట్టుకుపోవడం ఆనవాయితీగా మారింది. ఖైముకి, జల్, నీలం తుపానుల వల్ల రైతులు ఖరీఫ్ సాగులో తీవ్ర నష్టాలను చవి చూశారు. గత ఏడాది నీలం తుపానువల్ల జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో వరిసాగు సర్వ నాశనం కావడంతోపాటు లంక గ్రామాల్లో పైరులు, కూరగాయల పంటలను రైతులు కోల్పోయారు. ఏడాది గడుస్తున్నా ఆ తుపాను పరిహారం రూ.167 కోట్లు రైతులకు ఇప్పటికీ అందలేదు. ఈ ఖరీఫ్‌లో సైతం వాతావరణం అనుకూలించక, పెట్టుబడులకు చేతుల్లో సొమ్ములు లేకున్నా అన్నదాతలు అష్టకష్టాలు పడి సాగు మొదలుపెట్టారు. వర్షాభావ పరిస్థితుల వల్ల మెట్టలో సుమారు 50 వేల ఎకరాల్లో వరినాట్లు పడలేదు.
ఇదే సమయంలో గోదావరి వరదల వల్ల డెల్టాలోని 5 వేల ఎకరాల్లో వరిసాగు తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడిప్పుడే అడపాదడపా వర్షాలు పడుతూ, ఎండలు కాస్తూ వాతావరణం సానుకూలంగా మారి పైర్ల ఎదుగుదలకు సహకరిస్తోందని, మంచి దిగుబడులు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. తూర్పుడెల్టా పరిధిలోని ఆలమూరు, రామచంద్రపురం, అనపర్తి, పెద్దాపురం సబ్ డివిజన్ల పరిధిలో వరిచేలు ఈనికదశలో ఉండి కంకులు బయటకు వస్తున్నాయి. మధ్యడెల్టాలోని ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, తూర్పు డెల్టాలోని కరప, కాకినాడ రూరల్, పిఠాపురం సబ్ డివిజన్ల పరిధిలో వరిచేలు ఇప్పుడిప్పుడే పాలు పోసుకుంటున్నాయి. ఈ సమయంలో బంగాళాఖాతంలో తీవ్రవాయుగండం ‘ఫైలిన్’ తుపానుగా మారడం రైతులకు పెనుగండంగా తోస్తోంది.
ఉత్తరాంధ్రతోపాటు కోస్తా జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో రైతులకు నీలం తుపాను నష్టం కళ్లముందు కదలాడుతోంది. డెల్టాలో ముఖ్యంగా కోనసీమలో మురుగునీటి కాలువలు అధ్వానస్థితిలో ఉండి కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదు. ఈ ఏడాది సుమారు రూ.23 కోట్లతో చేపట్టాల్సిన డ్రైన్ల ఆధునికీకరణ టెండర్ల ప్రక్రియ సమ్మె వల్ల నిలిచిపోయింది. కనీసం పూడికతీత పనులకు సైతం నిధులు కేటాయించలేదు. కొద్ది వర్షం కురిసినా చేలు ముంపుబారిన పడే అవకాశం ఉండగా ఫైలిన్ ఏ ముప్పు తెస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement