ఫైలిన్ పెనుతుపాను: పలుచోట్ల కుండపోత వర్షం
Published Fri, Oct 11 2013 4:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
కడలి కల్లోలానికి వేదికైంది. జిల్లాకు పలుమార్లు చేదు అనుభవాలను చవి చూపిన బంగాళాఖాతం ‘ఫైలిన్’ తుపాను రూపంలో మరోసారి భయపెడుతోంది. తుపాను ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా కాగా ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మెను విరమించి పునరావాస చర్యల్లో పాల్గొనడానికి ఉద్యుక్తులయ్యారు. కాగా ఖరీఫ్‌లో వరుస నష్టాలతో కుదేలవుతున్న అన్నదాతలు ‘గోరుచుట్టుపై రోకలి పోటు’లా ఫైలిన్ ఎక్కడ తమ పుట్టి ముంచుతుందోనని కలవరపడుతున్నారు.
సాక్షి, కాకినాడ : విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 950 కిలోమీటర్లదూరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ‘ఫైలిన్’ పెనుతుపానుగా మారడంతో గురువారం జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రిలో మధ్యాహ్నం, అమలాపురంలో సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. కాకినాడలో రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తీరమండలాలతో పాటు దాదాపు అన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 18.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. తీరమండలాల్లో గురువారం ఉదయం నుంచి వీస్తున్న ఈదురుగాలుల వేగం సాయం త్రానికి మరింత పెరిగింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఓడలరేవు, ఉప్పాడ తదితర తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. కొన్ని చోట్ల తీరం మీదకు చొచ్చుకొస్తున్నాయి.
కాగా ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంది. సమ్మెలో కొనసాగుతూనే రెవెన్యూ సిబ్బంది తుపాను పునరావాస చర్యల్లో పాల్గొంటున్నారు. మరోపక్క విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెను తాత్కాలికంగా విరమించడంతో సహాయ పునరావాస చర్యలను ముమ్మరం చేసేందుకు వెసులుబాటు కలిగింది. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేశారు. తీర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలోకి వేటకు వెళ్లవద్దంటూ టాంటాంలు వేయిస్తున్నారు. తహశీల్దార్లు మండల కేంద్రాల్లో మకాం వేయగా, వీఆర్వో, వీఆర్‌ఏలు గ్రామాల్లో మకాం వేశారు. గత వారం రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లి ఇంకా రాని వారి వివరాలను తెలుసుకొని వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. పరిస్థితిని బట్టి లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
జిల్లాలో తీర ప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటూ కాలక్షేపం చేస్తున్నారు. భారీ వర్షాలకు రాజానగరం మండలం రావులచెరువుకు గండిపడడంతో కొత్తకాలనీ, సుబ్బారావు కాలనీ ముంపుబారినపడ్డాయి. చక్రద్వారబంధం, రాధేయపాలెం తదితర ప్రాంతాల నుంచి వస్తున్న ముంపునీరు సూర్యారావుపేట జంక్షన్ వద్ద జాతీయ రహదారి-16ను ముంచెత్తుతోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జాతీయ రహదారి విస్తరణ సమయంలో పాతరహదారిపై తూరలు తొలగించి కల్వర్టులు నిర్మించాల్సి ఉండగా, వాటి స్థానంలో మళ్లీ తూరలే వేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందంటూ ముంపునకు గురైన రహదారిని పరిశీలించిన వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు.
ఒడిశా తీరంలోని కళింగపట్నం - పరదీప్‌ల మధ్య ఈనెల 12న అర్ధరాత్రి ఫైలిన్‌తీరం దాటే అవకాశం ఉందని, తీరం దాటిన తర్వాత కూడా 48 గంటల పాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించడంతో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కలెక్టర్ నీతూప్రసాద్ చెప్పారు. రానున్న 72 గంటలు మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు. అవసరమైతే తీరప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇండియన్ కోస్ట్‌గార్డు విభాగాన్ని అప్రమత్తం చేశారు. అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌లు 1554 (కోస్ట్‌గార్డు), 1093 (మెరైన్)ను ఏర్పాటు చేశారు. మరో పక్క సమ్మె కొనసాగిస్తూనే కలెక్టర్ సూచనల మేరకు ఫైలిన్ తుపాను పునరావాస చర్యల్లో పాల్గొంటామని ఏపీ ఎంపీడీఓల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఎన్ మూర్తి, కేసీహెచ్ అప్పారావు, కోశాధికారి సీహెచ్‌కే విశ్వనాథరెడ్డి గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
అన్ని చర్యలూ తీసుకోండి.. ఫైలిన్ తుపానును ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి గురువారం ఆయన జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి అప్రమత్తం చేశామన్నారు. జిల్లాకు ఒక జాతీయ విపత్తు రక్షక దళాన్ని పంపాలని కోరారు. కాన్ఫరెన్స్‌లో జేసీ ఆర్.ముత్యాలరాజు, ట్రైనీ కలెక్టర్ కన్నన్, సబ్ కలెక్టర్ గంధం చంద్రుడు, డీఆర్వో బి.యాదగిరి, ఆర్డీఓలు పి.సంపత్‌కుమార్, జవహర్‌లాల్ నెహ్రూ, ఇరిగేషన్ ఎస్‌ఈ కాశీ విశ్వేశ్వరరావు, ఇతర జిల్లాఅధికారులు పాల్గొన్నారు.
గంగవరం మండలంలో అత్యధిక వర్షపాతం
సాక్షి, కాకినాడ : జిల్లాలో గడిచిన 24 గంటల్లో 18.4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గంగవరం మండలంలో 108.4 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, అత్యల్పంగా రామచంద్రపురం మండలంలో ఒక మి.మీ. వర్షపాతం నమోదైంది. మండలాల వారీ వర్షపాతం (మిల్లీ మీటర్లలో) వై.రామవరం 20, కోటనందూరు 95.6, తుని 5.4, తొండంగి 4, ప్రత్తిపాడు 7.4, గంగవరం 108.4, సీతానగరం 5, కోరుకొండ 2, గోకవరం 12.4, కొత్తపల్లి 2.4, కాకినాడ రూరల్ 2.4, కాకినాడ అర్బన్ 2.4, రంగంపేట 19.4, రాజానగరం 82.4, రాజమండ్రి రూరల్ 1.4, రాజమండ్రి అర్బన్ 10.6, కడియం 7.6, మండపేట 8, అనపర్తి 2.2, పెదపూడి 18.2, కరప 8.2, రామచంద్రపురం 1, కపిలేశ్వరపురం 14.4, ఆలమూరు 15.8, ఆత్రేయపురం 59.2, పామర్రు 8.4, కొత్తపేట 74.2, పి.గన్నవరం 19.6, అంబాజీపేట 25.8, అయినవిల్లి 2.2, ముమ్మిడివరం 15.2, ఐ.పోలవరం 15.4, కాట్రేనికోన 16.8, ఉప్పలగుప్తం 32.4, అమలాపురం 18.2, అల్లవరం 24.2, మామిడికుదురు 48.2, రాజోలు 44.2, మలికిపురం 42.8, సఖినేటిపల్లి 17.8 నమోదైంది.
తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
రాజమండ్రి రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలోని సముద్ర తీర ప్రాంత ప్రజలంతా 48 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ సూచించారు. గురువారం లాలాచెరువులో పోలీస్ పాసింగ్ అవుట్ పెరేడ్ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. సముద్రంలోకి 2000 మంది మత్య్సకారులు వేటకు వెళ్ళగా, 1800 మంది వెనక్కు వచ్చేశారన్నారు. మిగతా 200 మందిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అవసరమైతే కోస్టుగార్డుల సహకారం తీసుకుంటామన్నారు. ఎటువంటి ఉపద్రవం వచ్చినా తట్టుకోవడానికి అధికారులను అప్రమత్తం చేశామన్నారు. జిల్లాలో అన్ని శాఖల ఉద్యోగులూ తుపాను కారణంగా తాత్కాలికంగా సమ్మెను విరమించి విధుల్లో చేరినట్టు చెప్పారు. జిల్లా కేంద్రంలో, ఆర్డీఓ, తహశీల్దార్ల కార్యాలయాల్లో కంట్రోలు రూంలను ఏర్పాటు చేశామన్నారు.
Advertisement