జిల్లాలో పై-లీన్ టెన్షన్: అధికారులు అప్రమత్తం
Published Sat, Oct 12 2013 2:47 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
జిల్లాను పై-లీన్ తుపాను టెన్షన్ ఆవరించింది. ఈ తుపాను శనివారం తీరం దాటవచ్చని భావిస్తున్నారు. ఆ సమయంలో బలమైన ఈదురుగాలులు వీయవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంతంలో 13 మండలాల అధికారులను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. తుపాను తీరం దాటాక కురవనున్న భారీ వర్షాలతో ఏపుగా ఎదిగిన ఖరీఫ్ పంట ముంపుబారిన పడుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : పై-లీన్ తుపాను జిల్లాలోని తీర ప్రాంత ప్రజల గుండెలపై కుంపటిగా మారింది. తుపాను ప్రభావంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ తుపాను శనివారం రాత్రి తీరం దాటే అవకాశం ఉందనే సమాచారంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను భయం జిల్లాను వీడాలంటే మరో 24 గంటలు ఆగాలని అధికారులు చెబుతున్నారు. 1996 నవంబరు ఆరున వచ్చిన తుపాను సృష్టించిన విలయతాండవం ఇంకా జిల్లావాసులను పీడకలగా వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు పొంచి ఉన్న పై-లీన్ తుపాను అప్పటి కంటే ఉగ్రరూపం దాల్చనుందనే సమాచారంతో తీర ప్రాంతంలో భయం వెంటాడుతోంది. కాకినాడ, ఉప్పాడ, అంతర్వేది, ఓడలరేవు తదితర తీర ప్రాంతాల్లో ఆరేడు మీటర్ల మేర సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. దీని ప్రభావంతో తీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తీరమంతా అల్లకల్లోలంగా మారింది.
ప్రస్తుతం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో నడుస్తోన్న తుపాను తీరం దాటే సమయానికి మరింత ఉధృతమయ్యే ప్రమాదం పొంచి ఉందన్న సమాచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 13 తీరప్రాంత మండలాల పరిధిలో అధికారులను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. రానున్న 72 గంటల్లో మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఆదేశించారు. కాకినాడ పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. పై-లీన్ కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 448 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో 210 నుంచి 235 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చునని వాతావరణ కేంద్రం శుక్రవారం రాత్రి విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది.
కృష్ణా జిల్లా చినగొల్లపాలెం నుంచి రెండు బోట్లలో వేటకు వచ్చిన 10 మంది మత్స్యకారులు సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద సముద్రంలో చిక్కుకున్నారనే సమాచారంతో జిల్లా యంత్రాంగం అక్కడి అధికారులను అప్రమత్తం చేసింది. అయితే, వేసిన వలలు తీయడం సాధ్యం కాకపోవడంతో వాటిని అక్కడే వదిలిపెట్టి వారు తిరిగి స్వస్థలానికి బయలుదేరినట్టు తెలిసింది. తీర ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇండియన్ కోస్ట్‌గార్డు విభాగాన్ని అప్రమత్తం చేశారు. అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్-1554 (కోస్ట్‌గార్డు), 1093 (మెరైన్)ను ఏర్పాటు చేశారు. కాకినాడ కలెక్టరేట్‌లో 0884-2365506 నంబర్‌తో తుపానుపై అప్రమత్తం చేసేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుపాను తీరం దాటిన తరువాత 48 గంటల పాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.
ఈ వర్షం మరింత ఉధృతమైతే పంటలు నీటమునిగిపోతాయనే బెంగ రైతులను వేధిస్తోంది. ఖరీఫ్ పంట ఈదురుగాలులు, వర్షాలతో నేలనంటుతుందనే దిగులు ఈస్ట్రన్, సెంట్రల్ డెల్టా రైతులను కలవరపెడుతోంది. భారీ వర్షాలకు రాజానగరం మండలం రావులచెరువుకు పడ్డ గండిని ఇంకా పూడ్చలేకపోయారు. కొత్తకాలనీ, సుబ్బారావు కాలనీలు ముంపుబారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. తుపాను భయంతో పంపా ఆయకట్టు రైతులు చందాలు వేసుకుని గట్టు ఎత్తును పెంచుకున్నారు. జిల్లా కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేశారు. తీర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా, సమ్మె కొనసాగిస్తూనే కలెక్టర్ సూచనల మేరకు పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఏపీఎన్‌జీఓ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు బూరిగ ఆశ్వీరాదం, పితాని త్రినాధ్ నిర్ణయించారు. తహశీల్దార్లు, వీఆర్వో, వీఆర్‌ఏలు గ్రామాల్లో మకాం వేశారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు.
నేడు ప్రత్యేకాధికారి సమీక్ష
ఈ పరిస్థితులను అంచనా వేసి అధికారులను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం తుపాను ప్రత్యేకాధిరిగా గతంలో ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీసీ ఎండీ ముద్దాడ రవిచంద్రను నియమించింది. ఆయన శనివారం జిల్లాకు వస్తున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి జిల్లాలో తుపాను పరిస్థితిని ఉదయం 11 గంటలకు కాకినాడ కలెక్టరేట్‌లో అన్ని శాఖల అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం తీర ప్రాంత మండలాల్లో పర్యటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
విద్యుత్తు శాఖ అత్యవసర కంట్రోల్ రూములు
సాక్షి, రాజమండ్రి : పై-లిన్ తుపాను వల్ల తలెత్తే విద్యుత్తు సంబంధ సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్టు ఈపీడీసీఎల్ ఎస్‌ఈ యలమంచిలి శ్రీమన్నారాయణ ప్రసాద్ తెలిపారు. జిల్లా కంట్రోల్ రూము ల్యాండ్ నెంబరు 0883 2463354, సెల్ 73822 99960.
డివిజన్= కంట్రోల్ రూం= డివిజనల్ ఇంజనీరు
రాజమండ్రి= 94910 45661= 94408 12585
కాకినాడ= 0884 2366265= 94408 12586
అమలాపురం= 08856 234828= 94408 12588
రామచంద్రపురం= 08857 243082= 94408 12587
జగ్గంపేట= 08852 233975 =94408 12589
Advertisement