పై-లీన్ ప్రభావం: భయం గుప్పిట్లో పశ్చిమ
Published Sat, Oct 12 2013 2:29 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
సాక్షి, ఏలూరు : పై-లీన్ తుపాను పొంచి ఉందన్న వార్త లు పశ్చిమ వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల పేరు చెబితేనే జనం వణికిపోయేలా గతేడాది నీలం కన్నీరు మిగిల్చితే, ఈ ఏడాది పైలీన్ విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంది. శుక్రవారం జిల్లా సగటు వర్షపాతం 16.8 మిల్లీ మీటర్లుగా కాగా కామవరపుకోట మండలంలో అత్యధికంగా 72.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది సమ్మె చేస్తున్నారు. ప్రజలను పై-లీన్ బారినుంచి కాపాడేందుకు విద్యుత్ ఉద్యోగులు సమ్మెను విరమిస్తే పంచాయతీరాజ్ సహా పలు విభాగాల ఉద్యోగులు సమ్మెను కొనసాగిస్తూనే తుపానులో సేవలందించేందుకు విధుల్లో పాలుపంచుకోవాలని నిర్ణయించారు.
అధికారులు అప్రమత్తం
ప్రభుత్వం జిల్లాకు నియమించిన ప్రత్యేకాధికారి, ఐటీ కమిషనర్ సంజయ్‌జాజు, జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ శుక్రవారం నరసాపురం, ఆచంట, మొగల్తూరు, భీమవరం మండలంలోని నాగిడిపాలెం, లోసరి, దొంగపిండి గ్రామాలను అధికారులతో కలిసి పర్యటించారు. 9 మండలాల్లో తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆయా మండలాల్లో నియమించిన ప్రత్యేక పర్యవేక్షక అధికారులు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించా రు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు.
నీటిపారుదల, రెవెన్యూ, విద్యుత్, పౌరసరఫరాలు, వైద్యారోగ్యశాఖ, అగ్నిమాపక, వ్యవసాయ, పశుసంవర్థక శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ అప్రమత్తం చేశారు. జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వీడీవీ కృపాదాస్ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. రాష్ట్ర సాంఘి క సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ హైదరాబాద్ నుంచి శుక్రవారం రాత్రి బయలుదేరి శనివారం ఉదయం నేరుగా జిల్లాకు రానున్నారు. జిల్లా అధికారులతో ఏలూరులోని జెడ్పీ అతిథి గృహంలో తుపాన్ పరిస్థితిపై సమీక్షించనున్నారు. డీఆర్‌డీఏ పీడీ వై.రామకృష్ణ కలెక్టర్‌తో పాటు పర్యటించారు.
ప్రత్యేక ఏర్పాట్లు
లోతట్టుప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి మౌలిక సదుపాయాలు కల్పిం చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. నిత్యావసరాలు, కిరోసిన్ అందించేందుకు పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లు చేస్తోంది. డెల్టా ప్రాం తంలోని కాలువల గట్ల పరిస్థితిని అంచనా వేస్తూ బలహీనంగా ఉన్నవాటిని వెంటనే పటిష్టం చేసేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇసుక బస్తాలను పెద్ద ఎత్తు న సిద్ధం చేస్తున్నారు. సమ్మెలో ఉన్నప్పటికీ పారి శుద్ధ్య పనులు నిర్వహించనున్నట్టు పురపాలకశాఖ ఉద్యోగులు ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. మంచినీటి సరఫరాకు ట్యాంకర్లు ఏర్పాటు చేసేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు, జనరేటర్ల సాయం తీసుకుని లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు.
ఏలూరుకు తమ్మిలేరు ముప్పు
నీలం తుపాను సమయంలో తమ్మిలేరుకు భారీ గా వరదలు వచ్చి ఏలూరు నగరాన్ని ముంచెత్తింది. ఈసారి కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల తమ్మిలేరుకు భారీగా వరదనీరు వచ్చి చేరనుంది. దీంతో నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు. డ్రయినేజీ వ్యవస్థను క్రమబద్ధీకరించి వరదనీరు సక్రమంగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా ప్రత్యేకాధికారులు స్పందించాలని లేదంటే వారిపై కఠిన చర్య తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
Advertisement