తీరంలో పై-లీన్ అలజడి: ఆక్వాకు పొంచివున్న ముప్పు
Published Sat, Oct 12 2013 2:39 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
భీమవరం, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను డెల్టా రైతుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. పంట చేతికొస్తుందనుకుంటున్న సమయంలో తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు, వీస్తున్న ఈదురుగాలులు బెంబేలెత్తి స్తున్నాయి. తుపాను ప్రభావం అధికంగా ఉండే తీర ప్రాంతంలోని నరసాపురం, మొగల్తూరు, భీమవరం, యలమంచిలి, ఆచంట మండలాల్లో సుమారు 35 వేల హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. 1.30 లక్షల ఎకరాల్లో చేపలు, రొయ్యలు సాగు చేస్తుండగా, అందులో సుమారు 24వేల ఎకరాల్లో వనామి రొయ్యల సాగు ఉంది.
మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆక్వా రైతులు బెంబేలెత్తుతున్నారు. వర్షాలు మరో రెండు మూడు రోజులు కురిస్తే ఆక్సిజన్ సమస్యలు తలెత్తి రొయ్యలు, చేపలు మృత్యువాత పడే అవకాశం ఉందని గగ్గోలు పెడుతున్నారు. ఉద్యాన రైతులు కూడా వర్షాలు, తుపాను వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. మొగల్తూరు, నరసాపురం మండలాల్లోని తీరప్రాంత మత్స్యకారులు మూడు రోజులుగా వేటకు వెళ్లకపోవడంతో జీవనాధారం లేక ఇబ్బందులు పడుతున్నారు. రానున్న 24 గంటల్లో తుపాను తీరం దాటుతుందని అధికారులు చెబుతుండగా ఎటువంటి నష్టాన్ని చేకూరుస్తుందోనని రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
ఎగిసిపడుతున్న అలలు
మొగల్తూరు, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాన్ ప్రభావంతో పేరుపాలెం వద్ద సముద్రం అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం ఉగ్రరూపం చూసి స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. సముద్రం నుంచి వస్తున్న హోరు మరింత భయపెడుతోంది. శుక్రవారం ఉదయం ఒక పెద్ద అల సుమారు రెండు వందల మీటర్ల దూరం తోసుకువచ్చిందని స్థానికులు చెప్పారు. సముద్రంలో చేపల వేటను అధికారులు నిషేధించారు. పేరుపాలెం బీచ్ పర్యాటక ప్రదేశం కావడంతో సముద్ర స్నానానికి పలువురు వస్తుంటారు. సముద్రం ఎగసిపడుతుండడంతో స్నానానికి ఎవరూ సముద్రంలోకి వెళ్లకుండా మొగల్తూరు ఎస్‌ఐ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Advertisement