తమిళనాడుకు ‘ఫైలిన్’భయం లేదు
Published Fri, Oct 11 2013 3:34 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫైలిన్ తుపానుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగే అవకాశాలు లేవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సరిహద్దు దాటే క్రమంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: అండమాన్ దీవులకు ఉత్తరాన కేంద్రీకృతమై ఉన్న ఫైలిన్ తుపాను శనివారం కళింగపట్టణం-పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. మంగళవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలపడింది. దీని ప్రభావం వల్ల ఈ నెల 12వ తేదీన తమిళనాడులోని ఉత్తర జిల్లాలు, పుదుచ్చేరిలోని సముద్రతీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలో గంటకు 50 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
చెన్నై శివారు తిరువత్తియూరు వద్ద ఉన్న సముద్రంలో బుధవారం అర్ధరాత్రి రాక్షస అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని, ఇప్పకికే వెళ్లిన వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని వాతా వరణశాఖ అధికారులు ప్రకటించారు. చెన్నై, కడలూరు, నాగపట్నంలో 6వ నెంబరు, పుదుచ్చేరి, ఎన్నూరు, కాట్టుపల్లి, పాంబన్, తూత్తుకుడి హార్బర్లలో 1వ నెంబరు తుపాను హెచ్చరికలు ఎగురవేశారు.
రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలతోపాటు చెన్నైనగరంలో శనివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నాలుగు నెలలుగా ఎండకు నోచుకోని ఊటీ ప్రజలు వారం క్రితం సూర్యుడు తొంగిచూడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలో రెండు రోజులుగా అక్కడ వర్షాలు ప్రారంభమై సూర్యుడు మళ్లీ కనుమరుగయ్యాడు. ఈ భారీ వర్షాలకు ఊటీలో వంద ఎకరాల్లో సాగు చేసిన బంగాళాదుంపలు, క్యారెట్, క్యాబేజీ తదితర పంటలు దెబ్బతిన్నాయి.
Advertisement