‘పై-లిన్’ గండం: మోస్తరు నుంచి భారీ వర్షాలు
Published Sat, Oct 12 2013 3:29 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
పై-లిన్ తుపాను శనివారం ఆంధ్రా-ఒడిశా వద్ద తీరం దాటే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. హార్బర్లలో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సహాయక చర్యలపై అధికారులు దృష్టి సారించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. దీనికి ఫైలిన్‌గా నామకరణం చేశారు. నాగపట్నం, చెన్నై, కడలూరు హార్బర్లలో 3వ నెంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. ఫైలిన్ తుపాను నేరుగా తమిళనాడుపై ప్రభావం చూపకపోవచ్చని అధికారులు తెలిపారు. అయితే తీరం దాటే సమయంలో వర్షాలు పడగలవని పేర్కొన్నారు. సముద్రతీర ప్రాంతాలు, జాలర్ల గ్రామాలు భారీ వర్షాలను, ఈదురు గాలులను ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రకటించారు.
మళ్లీ అధికారికంగా ప్రకటించే వరకు జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఫైలిన్ తుపాన్ నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సముద్ర తీరంలోని జాలర్ల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక బ్యాగులు, ఆహార, తాగునీటి పొట్లాలను అందుబాటులో ఉంచుకోవాలని మండలస్థాయి అధికారులను అప్రమత్తం చేశారు.
భారీ వర్షం-రైతన్నకు నష్టం
గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని డెల్టా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రైతన్నకు భారీనష్టం వాటిల్లింది. అదిరామ్‌పట్టిలోని 3 వేల ఎకరాల్లో పంటపొలాలు ఉప్పునీటి వరదతో మునిగిపోయాయి. అక్కరపట్టి, కల్లూరు ప్రాంతాల్లో 20 విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు నేలకూలాయి. కల్లూరులో జాలర్ల బోట్లు గాలి ఉద్ధృతికి ఎగిరిపడ్డాయి. తిరుచ్చి, కరూర్, పెంబలూరు జిల్లాలు సైతం భారీ వర్షాలు, ఈదురు గాలులతో వణికిపోయాయి.
Advertisement