వణికిస్తున్న తుఫాన్
Published Fri, Oct 11 2013 3:53 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫైలిన్ తుఫాన్‌ను సమర్ధంగా ఎదుర్కోడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమెంది. తుఫాన్ ప్రభావంతో ఉద్ధృతంగా ఈదురు గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది.తీరప్రాంత జిల్లాల్లో ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. తీరానికి 500 కిలో మీటర్ల లోపు కేంద్రీకృతమై ఉంటే ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయగలరు. ఇప్పుడు విశాఖ తీరానికి 850 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఫైలిన్ ఏ మేరకు విరుచుకుపడుతుంతో తెలియక ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు.
అత్యవసర సేవలందించడానికి రెవెన్యూ, ఇతర శాఖల ఉద్యోగులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ చేసిన విజ్ఞప్తి మేరకు పలువురు ఉద్యోగులు గురువారం విధులకు హాజరయ్యారు. తొమ్మిది మంది డిప్యూటీ కలెక్టర్లు, పూసపాటిరేగ, భోగాపురం, కొమరాడ, పార్వతీపురం మండలాలకు చెందిన ఎంపీడీఓలు, తహశీల్దార్ విధుల్లో పాల్గొన్నారు. మండలానికి ఒకరు చొప్పున ఉండే స్పెషల్ ఆఫీసర్లు కూడా రేపటి నుంచి విధులకు హాజరుకానున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 170 నుంచి 185 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో భారీ నష్టం జరిగే ప్రమాదం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈదురు గాలుల వల్ల పూరిపాకలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఇళ్ల పైకప్పుగా ఉండే రేకులు ఎగిరి పడవచ్చని,అందువల్ల జిల్లా వాసులు తుఫాన్ సమయంలో ఇళ్లలో నే ఉండాలని, బయట సంచరించకూడదని అధికారులు సూచించారు. లోతట్టు గ్రామాల ప్రజలు ఎప్పటికప్పుడు తుఫాన్ సమాచారాన్ని తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రచారం చేస్తున్నారు.
అందుబాటులో 13 తుఫాన్ సెంటర్లు
జిల్లాలో 33 తుఫాన్ షెల్టర్లు ఉండగా వాటిలో కేవలం 13 మాత్రమే విని యోగానికి పనికి వస్తాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు వైపు దృష్టి సారించారు. అవసరమైన మేర గుడారాలు ఏర్పాటు చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని తీరప్రాంత మండలాలైన భోగాపురం, పూసపాటిరేగ మండలాలతో పాటు అధిక వర్షాలు, ఒడిశా నుంచి వచ్చే వరదలకు ముంపునకు గురయ్యే పార్వతీపురం, కొమరాడ మండలాల్లో కూడా పునరాసవాస ఏ ర్పాట్లకు అధికారులు సన్నద్ధమయ్యారు. జి ల్లాలో 28 కిలోమీటర్ల మేర తీరప్రాంతానికి ఆనుకుని ఉన్న 23 గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గురువారం నాటికి జిల్లావ్యాప్తంగా 2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈ వర్షాల తీవ్రత మ రింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు బులిటెన్ విడుదల చేశారు. మండలాల ప్రత్యేకాధికారులు తమ మండలాలకు వె ళ్లాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వస్తే బాధితులకు ఆహారం సమకూర్చడానికి అవసరమైన బియ్యం, కందిపప్పు, పామోలివ్ ఆయిల్‌ను సిద్ధం చేశారు. తాగునీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు, గాలుల బీభత్సానికి చెట్లు విరిగి పడితే వాటిని వెంటనే తొలగించడానికి సిద్ధంగా ఉండాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. అలాగే మత్య్స శాఖ, వ్యవసాయ, పశుసంవర్థక శాఖ, అ గ్నిమాపక శాఖల అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు.
ప్రత్యేకాధికారుల నియామకం...
గతంలో ఇక్కడ కలెక్టర్‌గా పని చేసిన రజిత్‌కుమార్‌ను ప్రభుత్వం ప్రత్యేకాధిగారిగా నియమించింది. జిల్లాలోని తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురంలోని 23 గ్రామాల్లో ఆరు లోతట్టు గ్రామాలను అధికారులు గుర్తించారు. వీటికి ఆరుగురు జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. భోగాపురం మండలంలోని చేపలకంచే రు గ్రామానికి జెడ్పీ సీఈఓ మోహనరావును, కొంగవానిపాలెం గ్రామానికి డ్వామా పీడీ ఎస్.అప్పలనాయుడులను నియమించారు. పూసపాటిరేగ మండలంలోని కోనాడ గ్రామానికి డీఆర్‌డీఏ పీడీ జ్యోతి, చింతపల్లికి జిల్లాపంచాయతీ అధికారి సత్యసాయిశ్రీనివాస్, కొల్లాయి వలస గ్రా మానికి ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావులను నియమించారు.
జిల్లాకు రెస్క్యూ బృందం
ప్రత్యేక శిక్షణ పొందిన రెస్క్యూ బృందాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి రానుంది. ఈ బృందంలో 16 మంది సభ్యులుంటారు. వీరితో జిల్లా స్థాయిలో అగ్నిమాపక సిబ్బంది, మత్స్యశాఖ గుర్తించిన ఈతగాళ్లను సిద్ధం చేస్తున్నారు. అవసరం మేరకు హెలికాఫ్టర్ సేవలను కూడా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
కంట్రోల్ రూం నంబర్లు ఇవే...
కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 1077 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటూ 08922-236947 అందుబాటులోకి తెచ్చారు. అలాగే విజయనగరం ఆర్డీఓ కార్యాలయంలో 0822-276888, పార్వతీపురంలో 08963-221006 నంబర్లను అందుబాటులోకి తెచ్చారు.
Advertisement