కరెంటోళ్ల మూడు రోజుల సమ్మె అటు పాలకులు, ఇటు ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె తీవ్ర కలకలమే రేపింది.
సాక్షి, మచిలీపట్నం : కరెంటోళ్ల మూడు రోజుల సమ్మె అటు పాలకులు, ఇటు ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె తీవ్ర కలకలమే రేపింది. ప్రజలు, పరిశ్రమలపై తక్షణ ప్రభావం చూపిన ఈ సమ్మెతో పాలకుల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయింది. గురువారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన విద్యుత్ ఉద్యోగుల మూడు రోజుల సమ్మె ప్రభావం వల్ల జిల్లాలో 120కి పైగా బ్రేక్‌డౌన్స్ (కరెంట్ సరఫరాలో అంతరాయాలు) ఏర్పడినట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో ప్రైవేటు, కాంట్రాక్ట్ సిబ్బందితో సరిచేయించి సరఫరాను పునరుద్ధరించే ప్రయత్నం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఆదివారం ఉదయం ఆరు గంటలతో సమ్మె విరమించే అవకాశం ఉండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
సమ్మెలో మూడు వేల మంది..
జిల్లాలోని ప్రతి సబ్‌స్టేషన్‌లో ఒక కాంట్రాక్ట్ ఎన్‌ఎంఆర్ మినహా అంతా విధులను బహిష్కరించి సమ్మెబాట పట్టారు. గురువారం నుంచి 72 గంటలపాటు సమ్మెకు దిగారు. కృష్ణా జిల్లా సర్కిల్ (ఏపీఎస్‌పీడీసీఎల్)లోని విజయవాడ నగరంతోపాటు జిల్లాలోని 176 సబ్‌స్టేషన్లలో సుమారు మూడు వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. డివిజనల్ ఇంజనీర్ నుంచి గ్రామంలో సిబ్బంది వరకు అన్ని స్థాయిల్లోను విధులను బహిష్కరించడంతో మెరుపు సమ్మె విజయవంతమైంది.
90 గ్రామాల్లో ఎఫెక్ట్..
సమ్మె కారణంగా దాదాపు 90 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విజయవాడతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తొలి రోజున సుమారు 30 ప్రాంతాల్లో బ్రేక్‌డౌన్స్ వచ్చాయి. రెండో రోజు శుక్రవారం మరో 50 బ్రేక్‌డౌన్స్ ఏర్పడ్డాయి. మూడో రోజు శనివారం మరో 40కి పైగా బ్రేక్‌డౌన్స్ వచ్చినట్టు సమాచారం. ఏపీఎస్‌పీడీసీఎల్ కృష్ణా జిల్లా సర్కిల్ పరిధిలో శనివారం సాయంత్రం నాటికి 120 బ్రేక్‌డౌన్స్ వచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నారు. ఇంకా లెక్కల్లోకి రానివి మరిన్నో ఉంటాయని అంచనా. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో బ్రేక్‌డౌన్స్ ఏర్పడినప్పుడు సరఫరా పునరుద్ధరణలో జాప్యం కారణంగా 90 గ్రామాల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురైనట్టు సమాచారం.
సానుకూలంగా స్పందించకుంటే నిరవధిక సమ్మె
రాష్ట్ర విభజన యోచన విరమించుకోవాలనే ప్రధాన డిమాండ్‌తో తాము సమ్మెకు దిగామని, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే భవిష్యత్తులో నిరవధిక సమ్మెకు దిగుతామని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వైస్ చైర్మన్ సత్యానందం శనివారం సాక్షికి చెప్పారు. ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతోనే తమ నిర్ణయాన్ని మార్చుకుని కేవలం మూడు రోజులే సమ్మె చేశామన్నారు. తమకు బాసటగా నిలిచిన జిల్లా ప్రజలకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ కె.రామచంద్రరావు, కన్వీనర్ ఎం.వెంకటేశ్వరరావుతోపాటు జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.