పాడేరు, న్యూస్‌లైన్:
విద్యుత్ పంపిణీ సంస్థ, ఏపీ అటవీ అభివృద్ధి సంస్థలు ఆదివాసీ గిరిజనుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలపై ఈ రెండు శాఖలకు కనీసం కనీకరం లేకుండా పోయింది. రెండేళ్లుగా మూడు గ్రామాల ప్రజల్ని చీకట్లోకి నెట్టేశాయి. కాఫీ తోటల వెంబడి రోడ్డులో విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడమే ఇక్కడి గిరిజనులకు శాపమైంది. మోదాపల్లి పంచాయతీలోని కాంగెడ్డ, కారిబంద, వనుగుపల్లి పంచాయతీలోని తియ్యగెడ్డ గ్రామాలకు 12 ఏళ్ల క్రితం విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఘాట్ రోడ్డులోని మందులపాక జంక్షన్ నుంచి అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన కాఫీ తోటల మీదుగా విద్యుత్ లైన్‌ను ఏర్పాటు చేసి ఈ గ్రామాలకు విద్యుత్ వెలుగులు అందించారు. చీకటి పడితే బయటకురాలేని పరిస్థితిలో ఉండే ఆ గ్రామాల ప్రజలకు విద్యుత్ సరఫరా ఎంతో మేలు చేసింది.
తమ కాఫీ తోటల మీదుగా విద్యుత్ లైన్ వేశారని, తద్వారా కాఫీ తోటలకు తీవ్ర నష్టం జరుగుతోందని అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేతకు అనేక ప్రయత్నాలు చేశారు. ఎప్పటికప్పుడు విద్యుత్‌లైన్‌లో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాల్సిన విద్యుత్ సంస్థ కూడా తీవ్ర నిర్లక్ష్యం వహించింది. దీంతో నాలుగేళ్ల క్రితం అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన కాఫీ తోటల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో ఆదివాసీలకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ అటవీ అభివృద్ధి సంస్థ ఈ విద్యుత్ లైన్‌పై కన్నెర్ర చేసింది. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఈ లైన్‌లోని విద్యుత్ తీగలను గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడికక్కడ కట్ చేసి పట్టుకుపోవడంతో ఈ మూడు గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఈ విద్యుత్ వైర్లను అటవీ అభివృద్ధి సంస్థ అధికారులే కట్ చేయించి ఉంటారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా కరెంట్ సరఫరా నిలిచిపోయినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
ఈ రెండు శాఖల అధికారులు కావాలనే తమ గ్రామాలకు విద్యుత్ సరఫరా అడ్డుకుంటున్నారని గిరిజనులు వాపోతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో రాత్రి వేళల్లో అడవి జంతువులు, విషసర్పాల సంచారం అధికంగా ఉంది. తామంతా అనేక సార్లు విద్యుత్ సంస్థ అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకపోయిందని గిరిజను లు వాపోతున్నారు. ఐటీడీఏ పీవో స్పందించి తమ మూడు గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని ఆదివాసీలు వేడుకుంటున్నారు.
రెండేళ్లుగా అంధకారం
Published Mon, Jan 20 2014 3:19 AM | Last Updated on Wed, Sep 5 2018 4:22 PM
Advertisement