తరాలు మారినామారని తలరాత
మడికట్టు (చేవెళ్లరూరల్): తరాలు మారినా.. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. ఎంతమంది పాలకులు వచ్చినా ఆ గ్రామస్తుల తలరాత మాత్రం మారడం లేదు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా తమ రాత మారేనా అని ఎదురు చూస్తున్నారు. మండలంలోని తంగడపల్లికి మడికట్టు అనుబంధ గ్రామంగా ఉంది.
ఇక్కడి జనాభా దాదాపు 500కుపైనే. 350 మంది ఓటర్లున్నారు. ఏళ్లతరబడి గ్రామంలో సమస్యలు తిష్టవేసుకొని ఉన్నాయి. ఎన్నికల సమయంలోనో, ఏదైనా ప్రారంభోత్సవాల సందర్భంలో మాత్రమే నాయకులు, అధికారులు దర్శనమిస్తారని.. స్థానిక సమస్యల గురించి పట్టించుకునేవారే లేరని గ్రామస్తులు వాపోతున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
ప్రధాన సమస్యలివీ..
గ్రామం మొత్తానికి ఒకేఒక బోరు మోటార్ ఉంది. దీంతోనే గ్రామానికి నీటి సరఫరా అవుతోంది. సింగిల్ ఫేజ్ మోటార్లు ఉన్నప్పటికీ నీళ్లు లేక పనిచేయటం లేదు.
గ్రామానికి ఏడాది క్రితం బీటీ రోడ్డు వేశారు. ఆరునెలలు తిరక్కుండానే అది గుంతలమయంగా మారింది. వర్షం పడితే గుంతల్లో నీళ్లు నిలిచి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. గ్రామానికి వచ్చే ఒకేఒక బస్‌కు సైతం అంతరాయం తప్పడం లేదు. గుంతలను చూసి డ్రైవర్లు ఈ ఊరికి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు.
గ్రామంలో ఇళ్లను తాకే ఎత్తులో విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు.
గ్రామానికి విద్యుత్‌ను సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఆన్ ఆఫ్ లేక సింగిల్‌ఫేజ్ కనెక్షన్‌తోనే సరఫరా అవుతోంది.
ఏళ్ల కిత్రం ఒక్క మురుగు కాలువను నిర్మించారు. గ్రామంలో ఇళ్లు విస్తరిస్తున్నా వాటికి అనుగుణంగా మురుగు కాలువలను నిర్మించడం లేదు. ఉన్న ఒక్క కాలువను కూ డా శుభ్రం చేసేవారులేక పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఇళ్ల మధ్యే మురుగు నీరు నిలిచిపోయి తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. ఇక అంతర్గత రహదారులు లేవు. మట్టి రోడ్లతోనే కాలం వెళ్లదీస్తున్నారు.
సర్పంచ్ తంగడ్‌పల్లిలో ఉండటంతో ఇక్కడి ప్రజల సమస్యలు తెలియటంలేదు.