Bore motor
-
అడుగంటిపోతున్న భూగర్భ జలాలు.. భవిష్యత్తులో పరిస్థితి అంతే!
సాక్షి, రంగారెడ్డి: భూగర్భజలాలు పాతాళానికి పడిపోయాయి. పగటి ఉష్ణోగ్రతలకు తోడు కాలువల నుంచి నీటి ప్రవాహం లేకపోవడం, సామర్థ్యానికి మించి బోరు తవ్వకాలు జరుపుతుండటం, ఎడాపెడా తోడేస్తుండటంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. సాధారణంగా సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో జిల్లాలోని మెజార్టీ ప్రాంతాల్లో మూడు మీటర్ల లోతునే నీటి ఆనవాళ్లు ఉండగా.. ప్రస్తుతం పది మీటర్లు దాటినా కనిపించడం లేదు. భూ పొరల్లో నీరు లేకపోవడంతో వ్యవసాయ బోర్లు పని చేయడం లేదు. బావులు, చెరువుల కింద వరి, ఇతర పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వేగంగా.. జిల్లాలో 68 ఫిజో మీటర్లు ఉన్నాయి. 2022 మార్చిలో జిల్లా వ్యాప్తంగా సగటు భూగర్భ నీటి మట్టం స్థాయి 8.60 మీటర్లు ఉండగా, 2023 మార్చి నాటికి 8.89 మీటర్ల లోతుకు పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొత్తగా తొమ్మిది మండలాల్లో నీటి లభ్యత మెరుగుపడగా, మరో 18 మండలాల్లో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయింది. మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరానికి సమీపంలో ఉన్న పట్టణ ప్రాంతాల్లోనే భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. వీటికి సమీపంలో కొత్తగా అనేక కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. నిర్మాణ సమయంలోనే కాదు ఆ తర్వాత కూడా అపార్ట్‌మెంట్‌వాసులు, వాణిజ్య సముదాయాలు భూగర్భజాలాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి మండలాల పరిధిలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాల్లో వంద ఫీట్లలోపే నీరు సమృద్ధిగా లభిస్తుండగా, మరికొన్ని కొన్ని ప్రాంతాల్లో వెయ్యి ఫీట్లకుపైగా లోతు బోర్లు తవ్వుతున్నారు. అయినా చుక్క నీరు కూడా లభించని పరిస్థితి నెలకొంది. వేగంగా పడిపోతున్నాయి గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లోనే నీటి వాడకం అధికంగా ఉంది. చెరువులు, కుంటలు కూడా చాలా తక్కువ. దీంతో ఆయా ప్రాంతాల్లో వేగంగా నీటి మట్టాలు పడిపోతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం 350 నుంచి 400 ఫీట్ల లోతు వరకు బోరు తవ్వుకునేందుకు అనుమతి ఉంది. కానీ చాలామంది అనుమతి పొందకుండా నిపుణుల సూచనలు పాటించకుండా 1000 నుంచి 1,200 ఫీట్లు తవ్వుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో భూగర్భ నీటిమట్టం స్థాయి మరింత లోతుకు పడిపోతుండటానికి ఇదే ప్రధాన కారణం. నిర్మాణ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవడం, వ్యవసాయ బావుల వద్ద పొలాల్లో చెక్‌డ్యాంలు, వాన నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా భూగర్భ జలాలను కాపాడుకోవచ్చు. లేదంటే భవిష్యత్తులో నష్టాలు చవి చూడక తప్పని పరిస్థితి. -
బోరు నీరు తాగి.. బాలిక మృతి
మద్దూరు: బోరు మోటారు ద్వారా వచ్చే నీరు తాగి ఓ బాలిక మృతిచెందగా...మరో 8 మంది అస్వస్థతకు గురయ్యారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని మోమినాపూర్‌లో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రాకపోవడంతో బోయిన, జీడివీధిలో ఉన్న బోరు మోటారు నీటిని స్థానికులు తాగుతున్నారు. ఈ క్రమంలో సోమవారం బోరు మోటారు ద్వారా వచ్చే నీటిని తాగిన బొయిన అనిత(16)కు సాయంత్రం విరేచనాలు కావడంతో ఆశ కార్యకర్త దగ్గరకు వెళ్లగా ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చింది. రాత్రికి వాంతులు, విరేచనాలు తీవ్రమై అస్వస్థతకు గురవడంతో తండ్రి బోయిని కనకప్ప వెంటనే ద్విచక్రవాహనంపై నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. ఆ తర్వాత ఇదే వీధికి చెందిన వార్ల చంద్రప్ప, బండగొండ కనకప్ప, మంగమ్మ అస్వస్థతకు గురవడంతో మద్దూరు సీఎస్సీ సెంటర్‌కు, బసపోళ్ల శ్రీనివాస్, బసపోళ్ల రాములు, బోయిని కవితలు కూడా అస్వస్థతకు గురికాగా వారిని మహబూబ్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి, బసపోళ్ల హన్మమ్మ, అజయ్‌లను నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రఘుపతిరెడ్డి, డీఎంహెచ్ఓ రాంమోహన్‌రావు గ్రామానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. -
నాన్నతో నడచి వెళ్లి.. శవమై ఇంటికి
ఖానాపూర్: అప్పటివరకు ఆ చిన్నారి.. అక్క తమ్ముడితోపాటు స్థానిక పిల్లలతో సరదాగా ఆడుకుంది. అప్పుడే ఇంటికి వచ్చిన తండ్రికి ఇంట్లో నీళ్లు లేవని.. నల్లా రావడం లేదని ఇల్లాలు చెప్పింది. వెంటనే తండ్రి బోరు మోటార్ ఆన్ చేయడానికి బయల్దేరాడు. చిన్న కూతురు తానూ వస్తానని మారాం చేసింది. కాదనలేక.. చిన్నారిని వెంట తీసుకుని వెళ్లాడు. తండ్రి మోటార్ ఆన్ చేస్తుండగా, చిన్నారి అక్కడే ఉన్న విద్యుత్ తీగకు తగిలి షాక్‌కు గురైంది. తండ్రి కళ్లముందే గిలగిలా కొట్టు కుంటూ కూతురు చనిపోయిన ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం కొలాంగూడ పంచాయతీ పరిధిలోని దేవునిగూడెంలో శనివారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాడావి నాశిక్–విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. నాశిక్ ఉదయం కూలి పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చారు. స్నానం చేయడానికి నీళ్లు లేకపోవడంతో డైరెక్ట్ పంపింగ్ ద్వారా నీరు సరఫరా చేసే మోటార్ ఆన్ చేయడానికి వెళ్తుండగా చిన్న కూతురు మాలశ్రీ(5) తానూ వస్తానని మారాం చేసింది. కాదనలేక ఆమెను తీసుకుని వెళ్లాడు. అయితే అప్పటికే చీకటి పడడంతో కూతురును పక్కన నిలిపి నాశిక్ మోటార్ ఆన్ చేస్తుండగా, మాలశ్రీ సమీపంలో విద్యుత్ తీగకు తగిలింది. షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. కళ్ల ముందే కూతురు ప్రాణాలు పోతున్నా నాశిక్ ఏమీ చేయలేకపోయాడు. స్థానికులు వచ్చే సరికి బాలిక చనిపోయింది. కూతురును పట్టుకుని తండ్రి రోదించిన తీరు అందరినీ కలచివేసింది. -
పొలాల్లో ఇక విద్యుత్ షాక్ కొట్టదు
సాక్షి, అమరావతి: వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్ బోరు మోటార్లకు అమరుస్తున్న పాలీ కార్బన్ బాక్సులు విద్యుత్ షాక్‌ల నుంచి రైతులను రక్షిస్తున్నాయి. ఏడాది కాలంలో శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ మోటార్ల వద్ద ఈ విధానాన్ని అమలు చేయగా ఒక్క విద్యుత్ ప్రమాదం కూడా జరగలేదు. ఎర్త్ పనిచేయకుండా కరెంట్ షాక్ వచ్చినట్టు ఎక్కడా నమోదు కాలేదు. విద్యుత్ సబ్సిడీని రైతు ఖాతాల్లోకి నేరుగా జమ చేసే విధానాన్ని ప్రభుత్వం గత ఏడాది ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశపెట్టింది. ఇదే సందర్భంలో వ్యవసాయ క్షేత్రంలోనే బిగించే విద్యుత్ మీటర్ల భద్రతపైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ విధానాన్ని ఇటీవల అధికారులు సమీక్షించి ఎంతో ప్రతిభావంతంగా పని చేస్తోందని గుర్తించారు. ఇకపై ఇదే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ క్షేత్రాల్లో అమర్చే విద్యుత్ మీటర్లకూ దీనిని వర్తింపజేయాలని భావిస్తున్నారు. ఆ ఘోష ఇక ఉండదు 2014 నుంచి 2020 మార్చి వరకూ రాష్ట్రంలో 93 వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్ ప్రమాదాలు జరిగాయి. విద్యుదాఘాతాలకు గురై 77 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. 16 మంది క్షతగాత్రులయ్యారు. బోర్లు ఎక్కువగా ఉండే రాయలసీమ జిల్లాల్లో ఇలాంటి ప్రమాదాలు అధికంగా ఉంటున్నాయి. గత ప్రభుత్వం సకాలంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయకపోవడంతో రైతులు విధిలేని పరిస్థితుల్లో అనధికారికంగా విద్యుత్ వాడుకుంటున్నారు. ఇలాంటివి రాష్ట్రంలో 50 వేల వరకూ ఉన్నాయని అంచనా. ఈ క్రమంలో సరైన విద్యుత్ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. దీనివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రమాదాలకు కారణమవుతున్న ఎర్త్ విధానం సరిగా ఉండటం లేదని విద్యుత్ శాఖ పరిశీలనలో తేలింది. లోడ్‌ను బట్టి ఫ్యూజులు వేసుకోకపోవడం మరో కారణం. వ్యవసాయ విద్యుత్ ఉచితం కాబట్టి అధికారులూ అక్కడికి వెళ్లి పరిశీలించడం లేదు. ఫలితంగా విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ వైర్లు చేతికందేలా ఉంటున్నాయి. అనుమతి లేని విద్యుత్ కనెక్షన్ల వల్ల లోడ్ పెరుగుతోంది. దీంతో వైర్లు వేడెక్కి సాగిపోతున్నాయి. ఈ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 18 లక్షల పంపుసెట్లకు పాలీ కార్బన్ బాక్సులు రాష్ట్రంలో ప్రస్తుతం 18 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. వీటన్నింటికీ మీటర్‌తో పాటు ఫ్యూజ్ బాక్స్ కూడా అమర్చాలని నిర్ణయించారు. పాలీ కార్బన్ బాక్సులను వ్యవసాయ క్షేత్రంలో డిస్కమ్‌లు అమరుస్తాయి. 32 యాంప్స్ సామర్థ్యంతో మూడు వైర్లను తట్టుకునే రీతిలో ఈ బాక్స్ ఉంటుంది. ఇలా అమర్చడం వల్ల విద్యుత్ ప్రసరణ ఏ స్థాయిలో ఉన్నా ఫ్యూజ్, స్విచ్ ఉన్న ప్రాంతంలో విద్యుత్ బయటకు ప్రసరించదు. 30 మీటర్ల వైర్‌ను స్విచ్, మీటర్, ఫ్యూజులకు వాడతారు. ఇది ఎంత పెద్ద వర్షం వచ్చినా ఏ మాత్రం విద్యుత్ షాక్ ఇవ్వదని, అనేక సార్లు పరీక్షించిన తర్వాతే దీన్ని వాడుతున్నామని సీపీడీసీఎల్ సీఎండీ పద్మ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఎర్త్ కోసం వాడే జీఐ వైర్, పైప్ కూడా అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. వ్యవసాయ క్షేత్రాల్లో రైతుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి పేర్కొన్నారు. -
తరాలు మారినామారని తలరాత
మడికట్టు (చేవెళ్లరూరల్): తరాలు మారినా.. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. ఎంతమంది పాలకులు వచ్చినా ఆ గ్రామస్తుల తలరాత మాత్రం మారడం లేదు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా తమ రాత మారేనా అని ఎదురు చూస్తున్నారు. మండలంలోని తంగడపల్లికి మడికట్టు అనుబంధ గ్రామంగా ఉంది. ఇక్కడి జనాభా దాదాపు 500కుపైనే. 350 మంది ఓటర్లున్నారు. ఏళ్లతరబడి గ్రామంలో సమస్యలు తిష్టవేసుకొని ఉన్నాయి. ఎన్నికల సమయంలోనో, ఏదైనా ప్రారంభోత్సవాల సందర్భంలో మాత్రమే నాయకులు, అధికారులు దర్శనమిస్తారని.. స్థానిక సమస్యల గురించి పట్టించుకునేవారే లేరని గ్రామస్తులు వాపోతున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రధాన సమస్యలివీ.. గ్రామం మొత్తానికి ఒకేఒక బోరు మోటార్ ఉంది. దీంతోనే గ్రామానికి నీటి సరఫరా అవుతోంది. సింగిల్ ఫేజ్ మోటార్లు ఉన్నప్పటికీ నీళ్లు లేక పనిచేయటం లేదు. గ్రామానికి ఏడాది క్రితం బీటీ రోడ్డు వేశారు. ఆరునెలలు తిరక్కుండానే అది గుంతలమయంగా మారింది. వర్షం పడితే గుంతల్లో నీళ్లు నిలిచి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. గ్రామానికి వచ్చే ఒకేఒక బస్‌కు సైతం అంతరాయం తప్పడం లేదు. గుంతలను చూసి డ్రైవర్లు ఈ ఊరికి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. గ్రామంలో ఇళ్లను తాకే ఎత్తులో విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. గ్రామానికి విద్యుత్‌ను సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ వద్ద ఆన్ ఆఫ్ లేక సింగిల్‌ఫేజ్ కనెక్షన్‌తోనే సరఫరా అవుతోంది. ఏళ్ల కిత్రం ఒక్క మురుగు కాలువను నిర్మించారు. గ్రామంలో ఇళ్లు విస్తరిస్తున్నా వాటికి అనుగుణంగా మురుగు కాలువలను నిర్మించడం లేదు. ఉన్న ఒక్క కాలువను కూ డా శుభ్రం చేసేవారులేక పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఇళ్ల మధ్యే మురుగు నీరు నిలిచిపోయి తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. ఇక అంతర్గత రహదారులు లేవు. మట్టి రోడ్లతోనే కాలం వెళ్లదీస్తున్నారు. సర్పంచ్ తంగడ్‌పల్లిలో ఉండటంతో ఇక్కడి ప్రజల సమస్యలు తెలియటంలేదు. -
క‘న్నీటి’ కష్టాలు
సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్: నీటి కష్టాలను పట్టించుకునేవారు కరువవడంతో ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళనకు దిగారు. పాలకవర్గం దిగొచ్చి సమస్య పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సంఘటన సిద్దిపేట మండలం రావురూకుల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో ఎస్సీ కాలనీ సంబంధించిన బోరు మోటార్ పనిచేయడంలేదు. రెండు నెలలుగా దానికి ఎలాంటి మరమ్మతులు చేపట్టడంలేదు. అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినా పట్టించుకునే వారే కరవయ్యారు. అసలే ఎండలు మండుతున్నాయి. రెండు నెలలుగా నీటి కష్టాలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ పొలాల వద్దకు వెళ్తే రైతులు తమ పొలాలకే నీరందడంలేదని అభ్యంతరం చెబుతున్నారు. దీంతో ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో ఆదివారం గ్రామపంచాయతీ వద్ద ఆందోళనకు దిగారు. అధికారులు, పాలక వర్గం స్పందించి సమస్య పరిష్కరించకపోతే అందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూదవ్వ, రామవ్వ, మల్లవ్వ, ఎల్లవ్వ, బద్దవ్వ, లలిత, నర్సవ్వ, పర్శరాములు, విజయ్‌కుమార్, భాను తదితరులు పాల్గోన్నారు.