
అనిత (ఫైల్)
మద్దూరు: బోరు మోటారు ద్వారా వచ్చే నీరు తాగి ఓ బాలిక మృతిచెందగా...మరో 8 మంది అస్వస్థతకు గురయ్యారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని మోమినాపూర్‌లో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రాకపోవడంతో బోయిన, జీడివీధిలో ఉన్న బోరు మోటారు నీటిని స్థానికులు తాగుతున్నారు.
ఈ క్రమంలో సోమవారం బోరు మోటారు ద్వారా వచ్చే నీటిని తాగిన బొయిన అనిత(16)కు సాయంత్రం విరేచనాలు కావడంతో ఆశ కార్యకర్త దగ్గరకు వెళ్లగా ఓఆర్‌ఎస్ ప్యాకెట్ ఇచ్చింది. రాత్రికి వాంతులు, విరేచనాలు తీవ్రమై అస్వస్థతకు గురవడంతో తండ్రి బోయిని కనకప్ప వెంటనే ద్విచక్రవాహనంపై నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు.
ఆ తర్వాత ఇదే వీధికి చెందిన వార్ల చంద్రప్ప, బండగొండ కనకప్ప, మంగమ్మ అస్వస్థతకు గురవడంతో మద్దూరు సీఎస్‌సీ సెంటర్‌కు, బసపోళ్ల శ్రీనివాస్, బసపోళ్ల రాములు, బోయిని కవితలు కూడా అస్వస్థతకు గురికాగా వారిని మహబూబ్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి, బసపోళ్ల హన్మమ్మ, అజయ్‌లను నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రఘుపతిరెడ్డి, డీఎంహెచ్‌ఓ రాంమోహన్‌రావు గ్రామానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.