ఖానాపూర్: అప్పటివరకు ఆ చిన్నారి.. అక్క తమ్ముడితోపాటు స్థానిక పిల్లలతో సరదాగా ఆడుకుంది. అప్పుడే ఇంటికి వచ్చిన తండ్రికి ఇంట్లో నీళ్లు లేవని.. నల్లా రావడం లేదని ఇల్లాలు చెప్పింది. వెంటనే తండ్రి బోరు మోటార్ ఆన్ చేయడానికి బయల్దేరాడు. చిన్న కూతురు తానూ వస్తానని మారాం చేసింది. కాదనలేక.. చిన్నారిని వెంట తీసుకుని వెళ్లాడు. తండ్రి మోటార్ ఆన్ చేస్తుండగా, చిన్నారి అక్కడే ఉన్న విద్యుత్ తీగకు తగిలి షాక్‌కు గురైంది.
తండ్రి కళ్లముందే గిలగిలా కొట్టు కుంటూ కూతురు చనిపోయిన ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం కొలాంగూడ పంచాయతీ పరిధిలోని దేవునిగూడెంలో శనివారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాడావి నాశిక్–విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. నాశిక్ ఉదయం కూలి పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చారు.
స్నానం చేయడానికి నీళ్లు లేకపోవడంతో డైరెక్ట్ పంపింగ్ ద్వారా నీరు సరఫరా చేసే మోటార్ ఆన్ చేయడానికి వెళ్తుండగా చిన్న కూతురు మాలశ్రీ(5) తానూ వస్తానని మారాం చేసింది. కాదనలేక ఆమెను తీసుకుని వెళ్లాడు. అయితే అప్పటికే చీకటి పడడంతో కూతురును పక్కన నిలిపి నాశిక్ మోటార్ ఆన్ చేస్తుండగా, మాలశ్రీ సమీపంలో విద్యుత్ తీగకు తగిలింది. షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. కళ్ల ముందే కూతురు ప్రాణాలు పోతున్నా నాశిక్ ఏమీ చేయలేకపోయాడు. స్థానికులు వచ్చే సరికి బాలిక చనిపోయింది. కూతురును పట్టుకుని తండ్రి రోదించిన తీరు అందరినీ కలచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment