ఆందోళన చేస్తున్న ఆత్మకూర్ గ్రామస్తులు
మామడ/నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): పొలాలకు అమర్చిన విద్యుత్ తీగలే వారిపాలిట మృత్యుపాశమయ్యాయి. పశువులు మేపేందుకు అడవికి వెళ్లిన ఓ పశువుల కాపరి, పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతు పంటలకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలకు తగిలి మృతిచెందారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ విషాద ఘటనలు నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో చోటు చేసుకున్నాయి.
మృతుల్లో ఇద్దరు ఒకే గ్రామానికి చెందినవారు కావడం గమనార్హం. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన పశువుల కాపరి మద్దిపడగ మల్లయ్య(64) రోజు మాదిరిగానే సోమవారం ఉదయం తనకున్న గొర్రెలను మేత కోసం అటవీప్రాంతానికి తీసుకువెళ్లాడు. రాత్రి అయినా మల్లయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా గ్రామానికి చెందిన పారెడి చంద్రమౌళి పొలం వద్ద విగత జీవిగా కనిపించాడు. సమీపంలో విద్యుత్ కంచె ఉండడంతో కరెంటుషాక్‌తో మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు, విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
పొన్కల్ గ్రామానికే చెందిన ద్యాగల బొర్రన్న(55) కూడా మంగళవారం మరోచోట విద్యుత్ కంచెకు తగిలి మృతి చెందాడు. బొర్రన్న ఉదయం తన పొలం వద్దకు వెళ్లాడు. పొరుగు రైతుకు చెందిన పొలం వద్ద పశువుల కోసం గడ్డి కోస్తుండగా కానక విద్యుత్ కంచెకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కరోజు వ్యవధిలో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు విద్యుత్ కంచెకు బలవడంతో పొన్కల్‌లో విషాదం నెలకొంది.
నిజాంసాగర్‌లో శవమై...: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూర్‌కి చెందిన రైతు కుమ్మరి నల్ల పోశెట్టి(43) సోమవారం వేకువజామున పొలానికి వెళ్లాడు. దారిలో స్థానిక ఎంపీటీసీ మోతె శ్రీనివాస్‌కు చెందిన పొలానికి ఉన్న విద్యుత్ కంచె ప్రమాదవశాత్తు తగలడంతో పోశెట్టి మృత్యువాతపడ్డాడు. అయితే ఆయన మంగళవారం గ్రామశివారులోని నిజాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో శవమై తేలడంపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎంపీటీసీ కుటుంబసభ్యులే పోశెట్టి మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించి సమీపంలోని బ్యాక్‌వాటర్‌లో పడేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పోశెట్టి మృతికి కారణమైనవారు తమకు లొంగిపోయారని, మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment