సాక్షి, నిర్మల్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్నాటును నిలిపివేయాలని మహిళలు రాస్తారోకో చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్ వద్ద భారీ సంఖ్యలో మహిళలు జాతీయ రహదారిపైకి వచ్చి రాస్తారోకో చేపట్టారు. దిలావర్‌పూర్‌లో నిర్మించే ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మహిళలు వందల సంఖ్యలో కుటుంబ సమేతంగా జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలిపారు.
ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేతలు కనిపించడంలేదని ప్లకార్డులు ప్రదర్శించారు. పరిశ్రమ ఏర్పాటు విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు.. ఎనిమిది గంటల పాటు రాస్తారోకోలోనే ఉన్నారు. నిరసనలు తెలుపుతున్న సమయంలోనే ఆర్డీవో రత్న కళ్యాణి అటువైపు రావడంతో ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో రత్న కళ్యాణి వాహనాన్ని దాదాపు మూడు గంటల పాటు అక్కడే నిలిపివేశారు. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. అక్కడే రోడ్డుపైనే వారంతా వంట చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment