సాక్షి, రంగారెడ్డి: భూగర్భజలాలు పాతాళానికి పడిపోయాయి. పగటి ఉష్ణోగ్రతలకు తోడు కాలువల నుంచి నీటి ప్రవాహం లేకపోవడం, సామర్థ్యానికి మించి బోరు తవ్వకాలు జరుపుతుండటం, ఎడాపెడా తోడేస్తుండటంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. సాధారణంగా సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో జిల్లాలోని మెజార్టీ ప్రాంతాల్లో మూడు మీటర్ల లోతునే నీటి ఆనవాళ్లు ఉండగా.. ప్రస్తుతం పది మీటర్లు దాటినా కనిపించడం లేదు. భూ పొరల్లో నీరు లేకపోవడంతో వ్యవసాయ బోర్లు పని చేయడం లేదు. బావులు, చెరువుల కింద వరి, ఇతర పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి.
పట్టణ ప్రాంతాల్లో వేగంగా..
జిల్లాలో 68 ఫిజో మీటర్లు ఉన్నాయి. 2022 మార్చిలో జిల్లా వ్యాప్తంగా సగటు భూగర్భ నీటి మట్టం స్థాయి 8.60 మీటర్లు ఉండగా, 2023 మార్చి నాటికి 8.89 మీటర్ల లోతుకు పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొత్తగా తొమ్మిది మండలాల్లో నీటి లభ్యత మెరుగుపడగా, మరో 18 మండలాల్లో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయింది. మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరానికి సమీపంలో ఉన్న పట్టణ ప్రాంతాల్లోనే భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. వీటికి సమీపంలో కొత్తగా అనేక కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి.
నిర్మాణ సమయంలోనే కాదు ఆ తర్వాత కూడా అపార్ట్‌మెంట్‌వాసులు, వాణిజ్య సముదాయాలు భూగర్భజాలాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి మండలాల పరిధిలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాల్లో వంద ఫీట్లలోపే నీరు సమృద్ధిగా లభిస్తుండగా, మరికొన్ని కొన్ని ప్రాంతాల్లో వెయ్యి ఫీట్లకుపైగా లోతు బోర్లు తవ్వుతున్నారు. అయినా చుక్క నీరు కూడా లభించని పరిస్థితి నెలకొంది.
వేగంగా పడిపోతున్నాయి
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లోనే నీటి వాడకం అధికంగా ఉంది. చెరువులు, కుంటలు కూడా చాలా తక్కువ. దీంతో ఆయా ప్రాంతాల్లో వేగంగా నీటి మట్టాలు పడిపోతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం 350 నుంచి 400 ఫీట్ల లోతు వరకు బోరు తవ్వుకునేందుకు అనుమతి ఉంది. కానీ చాలామంది అనుమతి పొందకుండా నిపుణుల సూచనలు పాటించకుండా 1000 నుంచి 1,200 ఫీట్లు తవ్వుతున్నారు.
పట్టణ ప్రాంతాల్లో భూగర్భ నీటిమట్టం స్థాయి మరింత లోతుకు పడిపోతుండటానికి ఇదే ప్రధాన కారణం. నిర్మాణ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవడం, వ్యవసాయ బావుల వద్ద పొలాల్లో చెక్‌డ్యాంలు, వాన నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా భూగర్భ జలాలను కాపాడుకోవచ్చు. లేదంటే భవిష్యత్తులో నష్టాలు చవి చూడక తప్పని పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment