వర్ద విలయం | Warda cyclone in Chennai | Sakshi
Sakshi News home page

వర్ద విలయం

Published Tue, Dec 13 2016 1:59 AM | Last Updated on Wed, Sep 5 2018 4:10 PM

Warda cyclone in Chennai

ఊహించని రీతిలో వర్ద పెను ప్రళయ తాండవం చేసి వెళ్లింది. 192 కిమీ వేగంతో వీచిన గాలులు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో బీభత్సం సృష్టించాయి. ఎక్కడికక్కడ చెట్లు నేలకొరిగాయి. విద్యుత్‌ స్తంభాలు ఒరిగాయి. విద్యుత్‌ తీగలు తెగి పడ్డాయి. వర్ద తీరం దాటినా ఈదురు గాలుల ప్రభావం మరీ ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారాయి.

సాక్షి, చెన్నై : డిసెంబరు నెల అంటే చాలు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం వాసుల్ని వణికి పోతున్నారు. గత ఏడాది వర్షం ఈశాన్య రుతు పవనాలతో పెను ప్రళయాన్ని చవి చూస్తే, ఈ ఏడాది వర్దరూపంలో కొన్ని గంటల పాటుగా ఊపిరి బిగ పెట్టుకుని ఉత్కంఠగా కలాన్ని గడపాల్సిన పరిస్థితి.వర్ద్ద తుపాన్‌ రూపంలో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలకు ముప్పు తప్పదన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో అధికార వర్గాలు అప్రమత్తం అయ్యాయి. పెను ›ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా ముందస్తు చర్యలు తీసుకున్నారు. తీర వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సోమవారం వేకువ జాము నుంచి చిరుజల్లులతో మొదలైన వర్షం క్రమంగా తీవ్ర రూపం దాల్చడం మొదలెట్టింది. దీంతో సరిగ్గా పన్నెండున్నర  ఒంటి గంట సమయంలో ఎక్కడిక్కకడ వాహనాల రాకపోకల్ని నిలిపి వేశారు. జనం రోడ్ల మీదకు రాకుండా ఇళ్లకు పరిమితం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. చెన్నైలో ప్రధాన రోడ్లన్నీ మూత పడ్డట్టుగా నిర్మానుష్యం అయ్యాయి. ఎలక్ట్రిక్‌ రైళ్ల సేవల్ని నిలుపుదల చేశారు. చెన్నై నుంచి సూలూరు పేట వైపుగా వెళ్లే రైళ్లను రేణిగుంట వైపుగా దారి మళ్లించారు. క్రమంగా వర్షం తీవ్రత పెరగడంతో ఒంటి గంట సమయంలో చెన్నై విమానాశ్రయాన్ని సైతం మూసి వేస్తూ చర్యలు తీసుకున్నారు.

నాలుగు గంటల ప్రళయం
సరిగ్గా ఒంటి గంట సమయంలో వర్షం తీవ్రతతో పాటుగా ఈదురు గాలుల ప్రభావం పెరిగింది. ఎదురుగా ఎవ్వరున్నారో అన్నది కూడా తెలియని రీతిలో గాలుల బీభత్సం, వర్షం జోరు వెరసి జనం గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేశాయి. వర్ద చెన్నై హార్బర్‌ సమీపంలోకి దూసుకు వస్తున్న కొద్ది గాలుల తీవ్రత తాండవం చేసింది. ఎక్కడిక్కడ హోర్డింగ్‌లు, వృక్షాలు, చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు, తీగలు అనేక చోట్ల విరిగి పడ్డాయి. మూడు, నాలుగు అంతస్తుల్లోని డాబా లాంటి గృహాలకు వేసిన రేకులు గాల్లో ఎగిరాయి. ఇళ్ల మీదున్న ప్లాస్టిక్‌ వాటార్‌ ట్యాంక్‌లు గాల్లో ఎగిరాయి. అనేక చోట్ల హోర్డింగ్‌లు, పెట్రోల్‌ బంకుల షెడ్డులు గాలిలో తేలియాడాయి. మూడున్నర నాలుగు  గంటల సమయంలో అయితే, తీవ్రత మరింత జఠిలం కావడంతో అర చేతిలో ప్రాణాల్ని పెట్టుకుని జనం బిక్కు బిక్కు మంటూ ఇళ్లల్లో గడిపారు. ఏమి జరుగుతుందో, ఎలాంటి ప్రళయాన్ని మళ్లీ ఎదుర్కొనాలో, మళ్లీ వరదలు వస్తాయో అన్నంత ఉత్కంఠతో కాలం గడిపినా, ఐదున్నర , ఆరు గంటలకు గాలి భీబత్సం, వర్షం విలయం తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయినా, గాలి ప్రభావం ఎక్కువగా


ఉండటంతో మళ్లీ వర్షం వస్తుందేమోనన్న ఆంధోళన తప్పలేదు.ఏ రోడ్డు చూసినా : చెన్నై మహానగరంలో ఏరోడ్డులో చూసినా విరిగిన చెట్టు కొమ్మలు , నేల కొరిగిన చెట్లే, రోడ్డుకు ఇరు వైపులా అనేక చోట్ల ఉండే దుకాణాల బోర్డులు, వివిధ సంస్థల బోర్డులన్నీ రోడ్ల మీద వచ్చి పడ్డాయి. దుకాణాలన్నీ ముందుగానే మూత పడటంతో ప్రాణ, వ్యక్తిగత ఆస్తినష్టాల నుంచి ఆయా యజమానులు బయట పడ్డారు. సముద్ర తీరం వెంబడి ఉన్న ఎన్నూరు, తిరువొత్తియూరు, పట్టినంబాక్కం, హార్బర్‌ పరిసరాల్లో అయితే, అలల తాకిడికి  అడ్డుగా వేసిన రాళ్లు పెద్ద ఎత్తున రోడ్డ మీదకు వచ్చి పడ్డాయి. చెన్నై సైదా పేట నుంచి కోట్టూరు పురం వరకు రోడ్డుకు ఇరు వైపులా ఆహ్లాదకరంగా ఉ ండే చెట్లు ఇప్పుడు కానరాలేదు. అవన్నీ నేలకొరిగాయి. చెన్నైలో 224 రోడ్లను తాత్కాళికంగా మూసి వేశారు. దీన్ని బట్టి చూస్తే, ఇతర జిల్లాల్లో, శివారుల్లో పరిస్థితి ఏ మేరకు ఉంటుందో అన్న ఆందోళన తప్పదు.  ఏ రోడ్లులో చూసినా ఏదో ఒక కారు లేదా ఆటో, మోటారు సైకిల్‌ చెట్ల శిథిలాల కింద నుజ్జు నుజ్జు కాక తప్పలేదు. ఇక, సముద్ర తీరాల్లోని వందలాది రేకుల ఇళ్ల పైకప్పులు గాల్లోకి ఎగరడంతో అక్కడి బాధితులను అధికార వర్గాలు ఆగమేఘాలపై సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుడిసె వాసుల వేతలు వర్ణణాతీతం. అనేక చోట్ల అధికారులు హెచ్చరించినా, ఖాతరు చేయని వాళ్లు , చివరకు గాలి  వాన భీబత్సంలో చిక్కుకుని తల్లడిల్లక తప్పలేదు. యుద్ద ప్రాతిపదికన: ఆయా ప్రాంతాల్లో యువత, స్థానికులు స్వచ్చందంగా ముందుకు కదిలారు.

  రోడ్ల మీద పడ్డ కొమ్మల్ని తొలగించే పనిలో పడ్డారు. అయితే, అతి పెద్ద చెట్లను తొలగించేందుకు కష్టతరంగా మారాయి. అర్థరాత్రిలోపు వీటిని తొలగించేందుకు తగ్గట్టుగా ఇతర ప్రాంతాల నుంచి ఆగమేఘాలపై సిబ్బందిని రప్పించి ఉన్నారు. చెన్నై విమానాశ్రయం రన్‌ వేల్లోకి నీళ్లు చేరడం, కొన్ని చోట్ల దెబ్బ తినడం వెరసి విమానాల సేవలన్నీ అర్థరాత్రి వరకు రద్దు అయ్యాయి. అనేక లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరడంతో తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈదురుగాలులలకు, వర్షం తోడవడంతో ఆందోళన తప్పడం లేదు. వర్ష బీభత్సంలో నలుగురు మరణించినట్లు సమాచారం. ఆగమేఘాలపై పునరుద్ధరణ చర్యల అనంతరం అర్థరాత్రి తర్వాత సేవలను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఇక, చెన్నైలో తెగి పడ్డ విద్యుత్‌ తీగలను యుద్ద ప్రాతిపదికన సరి చేసే పనిలో సిబ్బంది నిమగ్నం అయ్యారు. అర్థరాత్రిలోపు చెన్నై నగరానికి, మంగళవారం సాయంత్రంలోపు చెన్నై శివారుల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్దరిస్తామని ఆ శాఖ మంత్రి తంగమణి తెలిపారు. అంత వరకు అందకారంలో మునగాల్సిన పరిíస్థితి.  ఇక, యుద్ద ప్రాతిపకన సాగుతున్న చర్యల్లో జాతీయ విపత్తుల నివారణ బందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

  ఏ మేరకు నష్టం తీవ్ర అన్నది ఉంటుందో మంగళారం నాటికి తేలే అవకాశాలు ఉన్నాయి. ఇక, అధికారుల్ని సీఎం పన్నీరు సెల్వం అప్రమత్తం చేస్తూ, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యల్లో సిబ్బంది ఉన్నారని ప్రజలు సహకరించాలని కోరారు. రాజ్‌నాథ్‌ ఆరా : చెన్నై తీరాన్ని వార్ధా సమీపించినానంతరం  కేంద్ర హోం శాఖ మంత్రి తమిళనాడు సీఎఎం పన్నీరు సెల్వంతో ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో కేంద్రం సహకారం అందిస్తుందని పన్నీరుకు ఆయన హామీ ఇచ్చారు. 22 ఏళ్ల అనంతరం : ప్రళయాలన్నీ చెన్నైను డిసెంబరు నెలలోనే వెంటాడుతున్నాయి. గతంలో అనేక తుఫాన్‌లు వచ్చినా, వాటి ప్రభావం తక్కువే. 1994లో వచ్చిన తుఫాన్‌ వంద కి.మీ వేగంతో చెన్నై వైపుగా దూసుకొచ్చి ప్రళయాన్ని సష్టించింది. తదుపరి గత ఏడాది వర్షాలతో వరద విలయం.  ఈ ఏడాది గతంలో ఎ న్నడూ లేని రీతిలో తాండవం. వర్షం తీవ్ర కన్నా, గాలి ప్రభావం మరీ ఎక్కువగా ఉండటంతో జనం విల విలలాడాల్సి వచ్చింది. 192 కి.మీ వేగంతో గాలులు దూసుకొచ్చినట్టుగా వాతావరణ కేంద్రం ప్రకటించడం గమనార్హం. ఇక, మీనంబాక్కంలో నాలుగు గంటల పాటుగా అత్యధికంగా 18 సె.మీ వర్షం పడింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement