మొదలైన కోతలు
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం మరింత జఠిలం కానుంది. రోజుకు మూడు వేల మెగావాట్ల మేరకు కొరత ఏర్పడుతున్నది. దీన్ని అధిగమించలేని పరిస్థితి నెలకొనడంతో విద్యుత్ బోర్డు వర్గాలు కలవరంలో పడ్డాయి. కోతల మోతకు సిద్ధమయ్యాయి. పవన విద్యుత్ మళ్లీ పుంజుకుంటుండడంతో చేయూతనిచ్చేనా అన్న ఉత్కంఠ నెలకొంది.
సాక్షి, చెన్నై:రాష్ట్రంలో అవసరాలకు భిన్నంగా విద్యుత్ ఉత్పత్తి ఉన్న విషయం తెలిసిందే. రోజుకు 13 వేల మెగావాట్ల వరకు విద్యుత్ అవసరం ఉండడంతో కొరతను అధిగమించేందుకు విద్యుత్ బోర్డు, ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నారుు. ప్రైవేటు సంస్థల నుంచి మూడు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు లక్ష్యంగా ఒప్పందాలు కుదిరినా, పవర్ గ్రిడ్ల ఏర్పాటులో నెలకొన్న జాప్యంతో ఆ విద్యుత్ రాష్ట్రానికి చేరడానికి మరికొంత కాలం పట్టే అవకాశాలున్నాయి. గత నెలాఖరు నుంచి విద్యుత్ సంక్షోభం క్రమంగా పెరుగుతోంది. దీంతో పరిశ్రమలకు 20 శాతం మేరకు కోతల ఆంక్షలు విధించారు. గ్రామాల్లో నాలుగు గంటలు, పట్టణాలు, నగరాల్లో రెండు గంటల అధికారిక, అనధికారిక కోతలు అమల్లోకి వచ్చారుు. ఈ నేపథ్యంలో జయలలితకు శిక్ష నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ పాలన గాడితప్పింది.
ఆ ప్రభావం విద్యుత్ బోర్డు మీద కూడా పడింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా సగానికి సగం తగ్గడం, రాష్ర్ట ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో నెలకొన్న సాంకేతిక లోపాలు వెరసి సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఎన్‌ఎల్‌సీ నుంచి 1,120 మెగావాట్లు, వళ్లూరు నుంచి 715 మెగావాట్లు, కల్పాకం నుంచి 330, కైకా నుంచి 230, రామగుండం నుంచి 640, సింహాద్రి నుంచి 270, తాల్సర్ నుంచి 500 చొప్పున 3,800 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి అందాల్సి ఉంది. పాలనను పక్కన పెట్టి అమ్మ (జయలలిత)కు బెయిల్ ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నం కావడంతో ఈ వాటాలో కోత ఏర్పడిందని చెప్పవచ్చు. ఎన్‌ఎల్‌సీ సమ్మెతో అక్కడి నుంచి విద్యుత్ సక్రమంగా సరఫరా కావడం లేదు.
మూడు వేల మెగావాట్ల కొరత:
కేంద్రం వాటాలో కొత పడడం, రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలు వెరసి రాష్ట్రంలో మూడు వేల మెగావాట్ల వరకు కొరత ఏర్పడింది. కేంద్ర వాటాగా ప్రస్తుతం రామగుండం నుంచి 500, వళ్లూరు నుంచి 1000, కల్పాకం నుంచి 200, ఎన్‌ఎల్‌సీ నుంచి 200 మెగావాట్లు మాత్రమే రాష్ట్రానికి అందుతోంది. మిగిలిన 1900 మెగావాట్ల సరఫరా ఆగడంతో విద్యుత్ బోర్డు వర్గాల్లో కలవరం బయలుదేరింది. దీనికితోడు రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో తలెత్తిన సాంకేతిక లోపంతో 1000 మెగావాట్లకు పైగా ఉత్పత్తి ఆగింది. రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 4060 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఉత్పత్తి మూడు వేల మెగావాట్ల మాత్రమే అవుతోంది. తూత్తుకుడి, ఉత్తర చెన్నై ఉత్పత్తి కేంద్రాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండడంతో అధికారుల్లో కలవరం రెట్టింపు అవుతోంది. ఇక కూడంకులం నుంచి రాష్ట్రానికి వాటాగా అందాల్సిన 500 మెగావాట్ల విద్యుత్ రాలేదు. దీంతో చెన్నై మినహా ఇతర నగరాలు, పట్టణాల్లోనూ కోత మోతకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. చెన్నైలో మాత్రం గంట పాటు కోతల్ని విధించే పనిలో పడ్డారు.
పవన విద్యుత్ ఆదుకునేనా
కేంద్రం, థర్మల్ విద్యుత్ కేంద్రాల రూపంలో మూడు వేల మెగావాట్ల మేరకు కొరత ఏర్పడ్డా, పవన విద్యుత్ ఆదుకునేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. మూడు రోజుల క్రితం వరకు పవన విద్యుత్ ఉత్పత్తి సున్న శాతంగా నమోదైంది. రాష్ట్రంలోని కన్యాకుమారి, తిరునల్వేలి, విరుదునగర్, తేని, కోయంబత్తూరు జిల్లాల్లోని పవన విద్యుత్ కేంద్రాల ద్వారా రోజుకు ఏడు వేల మెగావాట్ల వరకు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. గాలుల ప్రభావం అంతంత మాత్రంగానే ఉండడంతో ఉత్పత్తి తగ్గింది. నైరుతి రుతు పవనాల సీజన్ ముగిసిన నాటి నుంచి ఇరవై రోజులుగా పవన విద్యుత్ చతికిలబడింది. సున్న శాతంగా ఉన్న పవన విద్యుత్ శుక్రవారం పుంజుకుని 1700 మెగావాట్ల ఉత్పత్తి జరగడం కాస్త ఊరటనిచ్చింది. గాలుల ప్రభావం మరింత పెరిగిన పక్షంలో ఉత్పత్తి ఆశాజనకంగా ఉంటుందన్న భావనలో అధికార వర్గాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ద్రోణి ప్రభావంతో గాలుల తీవ్ర అధికంగా ఉన్నా ఏ మేరకు పవన విద్యుత్ ఆదుకుంటుందోనన్న దానిపై వేచి చూడాల్సిందే.